దేశంలో కరోనా రెండోదశ విజృంభిస్తున్న నేపథ్యంలో సాయం చేసేందుకు పలువురు సినీ ప్రముఖులు ముందుకొస్తున్నారు. ఈ సంక్షోభంలో కరోనా బాధితులకు అండగా నిలిచేందుకు దిల్లీలో ఆక్సిజన్ సరఫరా కలిగిన 100 పడకల తాత్కాలిక ఆస్పత్రిని నిర్మించనున్నారు బాలీవుడ్ నటి హ్యూమా ఖురేషి. అందుకోసం 'సేవ్ ది చిల్డ్రన్' అనే బాలల హక్కుల సంస్థతో ఆమె చేయి కలిపారు. ఈ విషయాన్ని తన ఇన్స్టాగ్రామ్ వీడియో ద్వారా వెల్లడించారు.
"కరోనా సంక్షోభం నేపథ్యంలో భారత్‌లోని కరోనా బాధితులకు అండగా నిలిచేందుకు 'సేవ్ ది చిల్డ్రన్' అనే బాలల హక్కుల సంస్థతో చేతులు కలుపుతున్నాను. ఇలాంటి సమయంలో కొవిడ్‌పై పోరాటం చేస్తున్న వారికి మన అవసరం ఎంతగానో ఉంది."
- హ్యూమా ఖురేషి, బాలీవుడ్ నటి
దీని కోసం దిల్లీలో ఆక్సిజన్ సదుపాయం కలిగిన 100 పడకల తాత్కాలిక ఆస్పత్రిని నిర్మించే దిశగా హ్యూమా అడుగులు వేశారు. అంతేకాకుండా ఇంట్లో చికిత్స తీసుకుంటున్న కరోనా బాధితులకు అవసరమైన మెడికల్ కిట్లు అందించమే లక్ష్యంగా ఆమె ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. తాను చేపట్టిన ఈ కార్యక్రమానికి విరాళాలు ఇవ్వాలని అభిమానులను కోరారు.

హ్యూమా ఖురేషి.. ప్రస్తుతం హాలీవుడ్ అరంగేట్ర చిత్రం 'ఆర్మీ ఆఫ్ ది డెడ్'తో బిజీగా ఉన్నారు. దీంతో పాటు అక్షయ్ కుమార్ సరసన 'బెల్ బాటమ్' సినిమాలోనూ నటిస్తున్నారు.

ఇదీ చూడండి: ఆక్సిజన్ అందక వీల్‌ఛైర్‌లోనే గాయకుడు మృతి