కొందరు సాధించే విజయాలు అందించే స్ఫూర్తి... కేవలం వాళ్ల రంగానికే పరిమితం కాదు. ప్రపంచంలో ఏ రంగంలో ఉన్నవాళ్లైనా వాటితో ప్రేరణ పొందొచ్చు! దర్శక-నటుడు సముద్రఖని అందుకున్న విజయాలు అలాంటివే. తెలుగు పరిశ్రమకు మొదట్లో దర్శకుడిగానే పరిచయమైన ఆయన... గత ఏడాది 'అలవైకుంఠపురములో' సినిమాలో, ఇప్పుడు 'క్రాక్'లోనూ విలన్‌గా అలరించారు. 'ఆర్‌ఆర్‌ఆర్'లోనూ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ఈ జాతీయ ఉత్తమ నటుడు ఏ స్థాయి నుంచి ఇక్కడిదాకా వచ్చారో చూడండి.
నాతెలుగు కాస్త తేడాగా ఉన్నా నేను తెలుగువాణ్ణే. కొన్ని శతాబ్దాలకు ముందు తెలుగుగడ్డ నుంచి వెళ్లి దక్షిణ తమిళనాడులో స్థిరపడ్డవాళ్లం మేము. అక్కడి చవిటి నేలల్ని సస్యశ్యామలంగా మార్చిన రైతు కుటుంబాలవాళ్లం. మధురైకు ఆవల రాజపాళెం పట్టణానికి దగ్గర్లో సేత్తూరు అన్న గ్రామం మాది. ఎందుకో తెలియదుకానీ సాగంటే ప్రాణంపెట్టే నాన్న... సినిమాలంటే మండిపడేవాడు. అందువల్లనేమో ఎనిమిదో తరగతిదాకా నేను సినిమా థియేటర్‌లే కాదు... టీవీ కూడా చూసిందిలేదు. ఓ రోజు నా స్నేహితుడొకడు... నేను వద్దంటున్నా సినిమా థియేటర్‌కు తీసుకెళ్లాడు. శివాజీ గణేశన్ 'ముదల్ మరియాదై'(తెలుగులో ‘ఆత్మబంధువు’) చిత్రం అది. నేను తొలిసారిగా చూసిన ఆ రంగుల ప్రపంచం కళ్లనే కాదు... బుర్రనీ నింపేసింది. అప్పటి నుంచీ సమయం చిక్కినప్పుడల్లా థియేటర్‌లకు చెక్కేసేవాణ్ణి. ఓ రోజు ఈ విషయాన్ని కనిపెట్టి నాన్న చితకబాదాడు. నాకెవ్వరూ పైసా ఇవ్వకూడదని హుకుం జారీచేశాడు. డబ్బుల్లేకుంటేనేం... రాత్రుళ్లు నిద్రపోవడానికని డాబామీదికెళ్లేవాణ్ణి. అట్నుంచటు కిందికి దూకి, థియేటర్‌కు వెళ్లి అక్కడ గోడపక్కనే పడుకుని సినిమా చూడకున్నా డైలాగులు విని సంతోషించేవాణ్ణి. అలా వింటూనే నేను రజినీకాంత్‌కు పెద్ద ఫ్యాన్ అయిపోయాను. ఓసారి ఆయన సినిమా ఒకటి కొత్తగా రిలీజైతే ఎలాగైనా చూడాలనుకున్నాను. నాన్న నా చేతికి చిల్లిగవ్వ రానివ్వకపోవడం వల్ల ఆ థియేటర్‌లోనే జంతికలమ్మడం మొదలుపెట్టాను. అలా అమ్ముతూనే ఆ సినిమా ప్రదర్శించిన 16 రోజులూ నాలుగు ఆటలూ కలిపి మొత్తం 64 షోలు చూశాను! అక్కడితో ఆగలేదు. అప్పట్లో కొన్ని సినిమా పత్రికల వెనకాల సినీప్రముఖుల అడ్రెస్సులు ఇస్తుండేవారు. వాటన్నింటినీ సేకరించి పెట్టుకున్నాను. పదో తరగతి పరీక్షలు రాసిందే తడవుగా నాన్న జేబులోని 138 రూపాయలు దొంగిలించి చెన్నై బస్సెక్కేశాను! అక్కడ ఏ అడ్రెస్సులూ కనుక్కోలేక గోడక్కొట్టిన బంతిలా వెనక్కివచ్చాను. రాగానే నాన్న చితకబాదుతాడని అనుకున్నా కానీ... ఆయన మొహంలో అదివరకెన్నడూ చూడని దిగులు కనిపించింది. నన్ను దగ్గరకి తీసుకుని ‘నువ్వు సినిమాల్లోకి వెళ్లు కానీ ఇప్పుడు కాదు. ముందు బాగా చదువుకో..!’ అని చెప్పాడు. అనుకోకుండా మరో నెలకి గుండెపోటుతో చనిపోయాడు!
ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా...
నాన్న చనిపోయాక అమ్మ రైతయింది. ఎంతో ప్రయాసతో నన్ను బీఎస్సీదాకా చదివించింది. పరీక్షలు అవుతూనే, ‘డిగ్రీ పూర్తయింది కదా, ఇక నేను సినిమాల్లోకి వెళ్తానమ్మా..!’ అన్నాను. ఎంతైనా నాన్న ఇచ్చిన మాటకదా, అమ్మ రెండువేల రూపాయలు అప్పుతెచ్చి చేతిలో పెట్టి వెళ్లిరమ్మంది! నాలాగే సినిమా కలలతో చెన్నైకొచ్చిన మరో ముగ్గురితో కలిసి తలదాచుకున్నాను. నేను పరిశ్రమలోకి వచ్చింది నటుణ్ణి కావాలనే. అందుకని రకరకాల భంగిమల్లో ఫొటోలు తీయించుకున్నాను. వాటిని తీసుకుని ఓ దర్శకుడి ఆఫీసుకెళితే ‘తుమ్మ మొద్దులా ఉన్నావ్! అసలు నీ మొహాన్ని ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావా’ అన్నారు. ఆ మాటలకి గుండె పగిలినా ‘గొప్పోళ్లందరికీ మొదట ఇలాంటి అనుభవాలే ఎదురయ్యాయట!’ అనుకుని నాకు నేను సర్దిచెప్పుకున్నాను. ఓ చోట ఆడిషన్‌దాకా వెళ్లాను. చిట్టచివర్లో అక్కడే ఉన్న సహాయ దర్శకుడొకడు ‘మీకు బుద్ధుందా! ఈ మొహానికెందుకు ఆడిషన్, టైం వేస్ట్ కాకపోతే!’ అని మెడపట్టి గెంటేశాడు. ఇలాంటి అవమానాలతోనే ఏడాది గడిచింది. అమ్మ ఇచ్చిన డబ్బు మొత్తం అయిపోయింది. మరో ఆరునెలల తర్వాత నా స్థితి మరింతగా దిగజారింది. చెబితే నమ్మరు... నా చెప్పులు తెగిపోయి కొత్తవి కొనుక్కోవడానికీ డబ్బుల్లేవు. ఒట్టికాళ్లతో నడిచి అరికాళ్లూ పుండ్లయ్యాయి. పాతబట్టలు చించి కాళ్లకి చుట్టుకుని నడిచేవాణ్ణి. అవి గాయాలకి అతుక్కుపోయి సలపడం మొదలుపెడితే... ఓ రోజు మా పక్క రూమతను బాత్రూమ్‌కి వెళ్లడానికి వాడే స్లిప్పర్స్ వేసుకుని బజారుకెళ్లాను. అతను పరుగెత్తుకుంటూ నా వెనకే వచ్చి ‘చెప్పులిస్తావా... ఇవ్వవా!’ అని గొడవపడ్డాడు. నలుగురికి అన్నం పెట్టే రైతు కుటుంబంలో పుట్టినవాణ్ణి... డిగ్రీ ఫస్ట్‌క్లాసులో పాసైనవాణ్ణి... నన్ను వాడలా చెప్పుల కోసం నలుగురిలో తిట్టడం తట్టుకోలేకపోయాను. ఆ క్షణమే ఆత్మహత్య చేసుకుందామని రైల్వే పట్టాల వైపు వెళ్తున్నాను. అప్పుడో వ్యక్తి బైకుమీద వెళుతూ... చెప్పుల్లేని నన్ను చూసి ‘ఎక్కడికెళ్లాలి... నేను డ్రాప్ చేస్తాను... రండి!’ అన్నాడు. వెనక కూర్చున్న నాకు కన్నీళ్లు ఆగడంలేదు. అది గమనించాడేమో ‘మీరు ఎందుకోసం ఏడుస్తున్నారో నాకు తెలియదు. కానీ ఏడ్చేకొద్దీ ప్రపంచం మనల్ని మరింతగా ఏడిపిస్తుంది... నిబ్బరంగా ఉండండి. ధైర్యంగా ముందుకెళ్లండి!’ అని చెప్పి వెళ్లిపోయాడు. అనామకుడే కావొచ్చుకానీ అతని మాటలు నాపైన మంత్రంలా పని చేశాయి. రూమ్‌కి వచ్చి... ‘ఇంకెవరిలాగో నటించడం కాదు. మనమే కొన్ని సీన్‌లు క్రియేట్ చేసి వాటి ప్రకారం నటించి చూపుదాం!’ అనుకున్నాను. అలా కొన్ని సీన్‌లు రాసుకుని సుందర్ కె.విజయన్ అనే టీవీ సీరియళ్ల డైరెక్టర్ దగ్గరకు వెళ్లాను. ఆయన చేతికి స్క్రిప్టు ఇచ్చి నటించి చూపిస్తుంటే మధ్యలోనే ఆపి... ‘నీ రాత బావుంది. నటుడిగాకాకన్నా నువ్వు మంచి రచయితవీ... కాస్త శ్రమిస్తే దర్శకుడివీ అవుతావు. నాకు అసిస్టెంట్‌గా చేరిపోరాదూ...!’ అన్నాడు. అన్ని సంవత్సరాలు నేను చేసిన తప్పేమిటో అప్పుడు అర్థమైంది. నాలోని అసలు శక్తిని గుర్తించలేక నటుణ్ణి కావాలని ఎటో కొట్టుకు పోతున్నానన్నమాట! ఆ విషయం
అర్థంకాగానే...
నటించాలనే ఆలోచన కూడా మరెప్పుడూ రాకూడదని నేను తీయించుకున్న ఫొటోలన్నీ చించిపడేశాను. ఆ తర్వాతి రోజు సహాయ దర్శకుడిగా చేరాను. నెలకు వందరూపాయలు జీతం. తొలి వంద రూపాయలతో మూడు జతల చెప్పులు కొన్నాను. అప్పటి నుంచీ చేతిలో డబ్బులున్నప్పుడల్లా చెప్పులూ, బూట్లూ కొనడం మొదలు పెట్టాను. ఆ అలవాటు ఇప్పటికీ పోలేదు!
నేను లేకుండానే... చెల్లి పెళ్లి!
చెన్నైలో నా బాధలు ఇలా ఉంటే... మా ఊళ్ళో నేను చనిపోయానని నిర్ణయానికొచ్చారట! తప్పు నాదే. ఏదో గొప్పగా సాధించేదాకా ఊరి ముఖం చూడకూడదని భీష్మించుకుని అటువైపు వెళ్లలేదు. రోజూ పడే అవమానాలు దాచి అబద్ధాలేం రాస్తామని అమ్మకి ఉత్తరాలూ రాయలేదు. చెన్నై దాకా వచ్చి నాకోసం వెతికేపాటి లోకజ్ఞానం బంధువులెవరికీ లేకపోవడం వల్ల నేనేమయ్యానో కూడా ఎవరికీ తెలియదు. ఈలోపు మా చెల్లెలికి మంచి సంబంధం వచ్చిందట. అమ్మ ఊళ్లోవాళ్లను నా ఆచూకీ కనుక్కోమని చెబితే ‘రెండేళ్లుగా ఏ సమాచారమూ లేదంటే... చచ్చే ఉంటాడు!’ అన్నారట. అమ్మ ఏమనుకుందో తెలియదుకానీ... ఒంటిచేత్తో మా చెల్లెలికి పెళ్ళి చేసేసింది. ఆ తర్వాత ఏడాదికికానీ నేను ఊరెళ్లలేదు. అప్పటికి టీవీ రంగంలో సహాయకుడిగా దాదాపు కుదురుకున్నాను. చేతిలో ఎంతోకొంత డబ్బుంది. ఆ ఉత్సాహంతో ఊళ్లోకి అడుగుపెడితే... మా చెల్లి చంటిపాపతో ఎదురైంది! నన్ను చూడగానే కాళ్లపైన పడిపోయి బావురుమంది. అమ్మయితే పిచ్చిదానిలా నన్ను పట్టుకుని ‘నాకొడుకు చావలేదు... చూడండి!’ అంటూ ఇంటింటికీ తీసుకెళ్లి చూపింది. అక్కడే నెలరోజులుండి అమ్మ చూపిన అమ్మాయిని పెళ్ళి చేసుకుని చెన్నైకి వచ్చాను. అప్పటిదాకా సహాయ దర్శకుడిగా ఉన్నవాణ్ణి ఆ తర్వాతే అసోసియేట్‌గా ఎదిగాను.
విలువలున్నవారు...
ప్రసిద్ధ దర్శకుడు కె.బాలచందర్ 90లలో కొన్ని టీవీ సీరియళ్లు తీశారు. అప్పుడు నేను ఆయన దృష్టిలో పడ్డాను. ఆయన దగ్గర అసోసియేట్‌గా పనిచేస్తున్నప్పుడు దర్శకుడిగా తన పక్కన నా పేరూ వేయించేవారు! అంతపెద్ద దర్శకుడి సరసన నా పేరు రావడమేంటని నేనే ఆశ్చర్యపోయేవాణ్ణి. అప్పట్లో ఓ సీరియల్ ద్వారా ఎస్పీబీగారబ్బాయి చరణ్‌ని పరిచయం చేశాం. ఆ షూటింగ్ స్పాట్‌లో అతనితో మాట్లాడుతున్నప్పుడే ఓ పెద్ద హీరో కోసం రాసుకున్న కథ చెప్పాను. ఆ సినిమాని తానే నిర్మిస్తానన్నాడు చరణ్. ఎస్పీబీగారికీ కథ నచ్చింది. ఆ హీరోకీ కథ నచ్చిందికానీ... దర్శకుడిగా మాత్రం నన్ను వద్దన్నాడు. నాకు అందులో పెద్ద సమస్య లేకున్నా... ఎస్పీబీ, చరణ్‌లు ఇద్దరూ ‘నువ్వు దర్శకుడివి కాకుంటే... మాకు ఆ హీరో కాల్షీట్లు కూడా వద్దు!’ అనేశారు. అంత ఉన్నత విలువలున్నవాళ్లు ఆ తండ్రీ కొడుకులు! ఆ తర్వాత ఎస్పీచరణ్‌నే హీరోగా పెట్టి ఓ సినిమా తీశాను. గొప్ప సినిమాగా పేరొచ్చిందికానీ... వాణిజ్యరీత్యా యావరేజ్‌గా మిగిలిపోయింది. ఆ తర్వాత విజయ్‌కాంత్ హీరోగా ఓ చిత్రం, పృథ్వీరాజ్ హీరోగా తెలుగులో ‘నాలో’ అనే సినిమాలు చేశాను. రెండూ దెబ్బకొట్టాయి. దాంతో నా కెరీర్ అయిపోయిందనుకున్నాను. దర్శకుడు అమీర్, కార్తి హీరోగా చేసిన తొలి సినిమా ‘పరుత్తివీరన్’(మల్లిగాడు)కి సహాయకుడిగా వెళ్లాను. అప్పటికే మూడు సినిమాలకి పనిచేసినవాణ్ని సహాయకుడిగా చూస్తే బావుండదని నన్ను అసోసియేట్‌గా చేర్చుకున్నాడు అమీర్. ఆ సినిమా జాతీయ స్థాయిలో గుర్తింపు సాధించింది. అమీర్ దగ్గర సహాయకుడిగా పనిచేస్తూ వచ్చిన శశికుమార్ ‘సుబ్రహ్మణ్యపురం’(అనంతపురం) సినిమా తీస్తూ ఓ కీలక పాత్ర కోసం నన్ను పూర్తిస్థాయి నటుణ్ణి చేశాడు. దాంతో నటుడిగా నాకు మరిన్ని అవకాశాలొచ్చాయి. ఆ దన్నుతోనే ‘నాడోడిగల్’ అనే సినిమా తీశాను. తమిళంలో పెద్ద హిట్టది! దాన్నే తెలుగులో రవితేజ హీరోగా ‘శంభో శివశంభో’ పేరుతో తీశాం. తర్వాత నానితో ‘జెండాపై కపిరాజు’ చిత్రం చేశాను. ఈ సినిమాలతోపాటూ దక్షిణాది భాషలన్నింటిలోనూ నటించే అవకాశాలు వచ్చాయి. అలా ‘విచారణై’ అనే తమిళ సినిమాకి 2016లో జాతీయ ఉత్తమ సహాయ నటుడిగా అవార్డు అందుకున్నాను! ధనుష్ నటించిన ‘రఘువరన్ బీటెక్’ కారణంగా తెలుగులోనూ అవకాశాలు రావడం మొదలయ్యాయి కానీ... మంచి ఆరంభం కోసం ఎదురుచూస్తూ వచ్చాను. ఆ ఎదురుచూపులు ఫలించే 'అల వైకుంఠపురములో' చిత్రంలో అప్పల్నాయుడు పాత్ర దక్కింది. ఆ చిత్రం తర్వాత గోపీచంద్ మలినేని క్రాక్ సినిమాలోని ‘కటారి కృష్ణ’ పాత్రకోసం అడిగారు. అది నిజజీవిత పాత్రకాబట్టి వాస్తవానికి దగ్గరగా నటించాను. ఈ రెండు చిత్రాలు ఏడాది గ్యాప్‌లో సంక్రాంతి రోజునే రిలీజయ్యాయి. ఆ రెండు సంక్రాంతులూ... నా కెరీర్‌లో కొత్త వెలుగుల్ని నింపాయి.
నాలాంటివాళ్ల కోసం...
వాడి పేరు గురు... చెన్నైకు వచ్చిన కొత్తల్లో నాకు ఆశ్రయమిచ్చిన మిత్రుడు. సినిమాల్లో ఎదగాలని ఎన్నో కలలు కనేవాడు. ఓసారి రోడ్డుపైన మాతో మాట్లాడుతున్న వాడల్లా వస్తూ ఉన్న ఓ బస్సు ముందుకెళ్లి ఓ దర్శకుడిలా షాట్ చూస్తున్నట్టు చేతులు పైకెత్తి నిల్చున్నాడు! బస్సు డ్రైవర్ సడన్‌బ్రేక్ వేయడంతో సరిపోయిందికానీ లేకపోతే ప్రాణాలు పోయేవే. మతిభ్రమించినట్లు శూన్యంలోకి చూస్తూ ఏవేవో మాట్లాడు తున్నాడు. వాణ్ణి అతికష్టంపైన రూముకు తెచ్చాం. అర్ధగంట తర్వాత ‘నాకేమైంది!’ అనడం మొదలుపెట్టాడు. మిత్రులందరం తలాకొంత వేసుకుని వాణ్ణి వాళ్ళూరెళ్లే బస్సెక్కించాం. ‘ఇంటికెళ్లాడు కదా, బాగానే ఉంటాడులే!’ అనుకున్నాం తప్ప క్షేమసమాచారాలు కనుక్కునే ప్రయత్నం చేయలేదు. సినిమాల్లో నాకంటూ గుర్తింపు వచ్చాక వాణ్ణి కలవాలనిపించింది. వాడు ఎప్పుడో చెప్పిన గుర్తుల్ని పట్టుకుని ఊరెళ్లాను. వెళ్లాకే తెలిసింది... పిచ్చిముదిరి చానాళ్ల క్రితమే చనిపోయాడని! అప్పటి నుంచీ ఆ తల్లిదండ్రులకి నేనే కొడుకుగా అన్నీ చూస్తున్నాను. వాళ్లన్నయ్య పాపని డిగ్రీ చదివించి పెళ్ళిచేశాను. బాబును చెన్నైకు తీసుకొచ్చి సివిల్స్ కోచింగ్‌లో చేర్పించాను. అంతేకాదు... ఒకప్పుడు సహాయదర్శకులుగా ఉండి ఇప్పుడు ఉపాధి కోల్పోయిన వాళ్ల పిల్లల చదువుల బాధ్యతా తీసుకుంటున్నాను. ఇప్పటిదాకా పాతికమంది ఉన్నత చదువులు ముగించి మంచి ఉద్యోగాల్లో ఉన్నారు!