కరోనా కారణంగా థియేటర్లు మూతపడటం వల్ల ఇటీవలి కాలంలో ఓటీటీల డిమాండ్ భారీగా పెరిగింది. అయితే, కమర్షియల్ నిర్మాతలకు ఓటీటీల వల్ల అంత మేలు కలగదని.. సినిమాపై ఉన్న కాపీరైట్స్ మొత్తం డిజిటల్ తెరల వారికే సొంతం అవుతాయని ప్రముఖ నిర్మాత ఆదిశేషగిరి రావు అభిప్రాయపడ్డారు. సూపర్‌స్టార్ కృష్ణ కథానాయకుడిగా ఆయన నిర్మించిన చిత్రం 'మోసగాళ్లకు మోసగాడు'. ఇప్పటికి యాభై ఏళ్లు పూర్తి చేసుకుంది.
ఈ సందర్భంగా హైదరాబాద్‌లో మీడియాతో ముచ్చటించారు ఆదిశేషగిరి రావు. ఆ సినిమా విశేషాల గురించి మాట్లాడుతూ... "ఇప్పుడందరూ పాన్ ఇండియా చిత్రాలు అని మాట్లాడుతున్నారు. 'మోసగాళ్లకు మోసగాడు' సినిమాను ఆ రోజుల్లోనే ఆరు భారతీయ భాషల్లో నిర్మించాం.ఆంగ్లం, స్పానిష్, రష్యన్ భాషల్లోకి డబ్ అయ్యింది. ఈ సినిమా కోసం కృష్ణ, విజయ నిర్మల, నటీనటులు ఎంతో కష్టపడ్డారు" అంటూ చెప్పుకొచ్చారు.
భవిష్యత్తు ప్రాజెక్టుల గురించి చెబుతూ... "పద్మాలయ స్టూడియోస్ పతాకంపై వచ్చే సంవత్సరం విభిన్న భాషల్లో ఎనిమిది సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రానున్నాం. ఇవన్నీ స్క్రిప్ట్ దశలోనే ఉన్నాయి. కరోనా వల్ల వాటి పనులు నెమ్మదించాయి" అని వివరించారు.