ఆఫీస్‌కి వెళ్లాక రిజిస్టర్‌లో సంతకాలు పెట్టడం మొదలుకుని.. బయోమెట్రిక్ యంత్రాలపై వేలిముద్రలతో హాజరుని తెలిపే స్థితికి వచ్చేశాం. కానీ, కరోనా వల్ల ఏడాది కాలంగా ఆఫీస్ లాగిన్, లాగౌట్‌లు ఇంట్లోనే చేయాల్సిన పరిస్థితి కొందరి ఉద్యోగులది. దీంట్లో కొత్తేముందీ.. వర్క్ ఫ్రం హోం కొన్ని రంగాల్లో ఎప్పుడూ ఉండేదేగా? అనుకుంటే పొరపాటే. ఎందుకంటే.. రిమోట్ వర్కింగ్‌పై నిఘా వ్యవస్థని పెంచుతున్నాయి కొన్ని కంపెనీలు. ఉద్యోగులు కనెక్ట్ అయిన సిస్టమ్‌లకు ట్రాకింగ్ టూల్స్‌ని జత చేసి పని తీరుని ట్రాక్ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి. ఈ క్రమంలో పని మధ్యలో ఉద్యోగులెంత విరామం తీసుకున్నారు.. ఎంత సమయం పాటు సోషల్ మీడియాలో విహరించారు.. లాంటి వివరాల్ని సంస్థ తెలుసుకోగలుగుతున్నాయి. అంతేకాదు.. అధికారికంగా వర్చువల్ ప్రైవేట్ నెట్‌వర్క్‌లను వాడేలా జాగ్రత్త పడుతూ కంపెనీ డేటాని సురక్షితం చేసుకుంటున్నాయి.
హెల్మెట్‌లో సెన్సర్లు..
మీరో సివిల్ ఇంజినీర్ అనుకుంటే.. సైట్‌లో ఉన్నప్పుడు కచ్చితంగా హెల్మెట్ పెట్టుకోవాల్సిందే.. లేదా మీరేదైనా ల్యాబ్, ఫ్యాక్టరీలలో పని చేస్తున్నట్లయితే ప్రత్యేక సూట్ ధరించాల్సిందే.. దీంతో కంపెనీలు హెల్మెట్‌లు, సూట్‌లను ఆధారం చేసుకుని ట్రాక్ చేస్తున్నాయి. ప్రత్యేక సెన్సర్లని నిక్షిప్తం చేసి రోజు మొత్తం ఎలా పని చేస్తున్నారు.. ఫిట్‌నెస్ లెవల్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుంటున్నాయి. రోజంతా శరీర ఉష్ణోగ్రతలు, రక్తపోటు వంటి వివరాలను ట్రాక్ చేస్తున్నాయి. ఈ సమాచారాన్ని విశ్లేషించడం ద్వారా పనిలో ఉన్నప్పుడు ఎవరెంత అలర్ట్‌గా ఉంటున్నారు.. ఏయే సమయాల్లో ఎలాంటి నిర్ణయాలు తీసుకోగలుగుతున్నారో తెలుసుకోవడం బాస్ లేదా మేనేజర్లకు సాధ్యమవుతోంది.
ఆన్‌లైన్ షాపింగుల్లోనూ..
సంప్రదాయ పద్ధతుల్లో ఏళ్ల తరబడి సాగిన షాపింగ్‌ని ఆన్‌లైన్ అంగళ్లు పూర్తిగా మార్చేశాయి. గత కొన్నేళ్లుగా ఈ-కామర్స్ సందడి అంతా ఇంతా కాదు. యాప్‌లలో సభ్యులైపోయి మునివేళ్లతోనే సరుకుల్ని సెలెక్ట్ చేసుకోవడం.. ఆర్డర్ చేయడం.. ఈ క్రమంలో యాప్‌ల నిఘా ఎక్కువే అయ్యింది. షాపింగ్‌ని నిత్యం ట్రాక్ చేస్తూ.. అవసరమైన వాటిని ముందు వరుసలో పెట్టి చూపించడం చూస్తున్నాం. వెబ్‌సైట్‌లు అయితే కుకీస్‌తో ట్రాక్ చేయడం తెలిసిందే. ఇకపై మరిన్ని భిన్నమైన విధానాలతో ఆన్‌లైన్ షాపర్లు నిఘా వేయనున్నారు. ఫోన్ జీపీఎస్ లొకేషన్‌ని వాడుకుంటున్నారు. మీరెప్పుడైనా ఆఫ్‌లైన్ మాల్ దగ్గర్లోకి వెళ్తే చాలు. అమ్మకాలు, ప్రమోషన్స్‌కి సంబంధించిన అప్‌డేట్స్ వచ్చేస్తాయి. మాల్‌లోకి ఎంటర్ అవ్వగానే డిస్కౌంట్‌ల నోటిఫికేషన్లు వచ్చేస్తాయి. సైబర్ సెక్యూరిటీ నిపుణులు చెబుతున్న దాని ప్రకారం.. యాప్‌ల వాడకంలో లొకేషన్ యాక్సెస్‌ని పరిమితం చేయాలి. అవసరమైతేనే జీపీఎస్ యాక్సెస్ ఇవ్వాలి.
ప్రత్యేక టూల్స్ ఉన్నాయ్
సిస్టమ్‌లో మీరేం చేస్తున్నారో మీ బాస్ లేదా మేనేజర్ మీకు తెలియకుండానే చూడొచ్చు. రోజులో మీరు ఎలాంటి వాటిని గురించి టైప్ చేశారో (కీస్ట్రోక్స్) తెలుసుకుంటున్నారు. ఎలా సాధ్యమంటే.. అందుకు ప్రత్యేక ట్రాకింగ్ టూల్స్ ఉన్నాయి. ‘బాస్‌వేర్, యాక్టివ్‌ట్రాక్, టైమ్ డాక్టర్..’ లాంటి అప్లికేషన్లే అందుకు ఉదాహరణ. వీటిని వాడడం ద్వారా చాలా రకాలుగా ఉద్యోగుల్ని మానిటర్ చేయొచ్చు. డెస్క్‌టాప్‌పై ఏం చేస్తున్నారో తెలుసుకునేందుకు స్క్రీన్‌షాట్స్ తీయొచ్చు. లాగిన్, లాగౌట్ సమయాల్ని, కీస్ట్రోక్స్‌ని ట్రాక్ చేయవచ్చు.
చివరికి ఇంట్లో ఉన్నప్పటికీ..
ఇప్పుడు నివసించేవి స్మార్ట్ ఇళ్లే చాలా వరకూ. చుట్టూ హోం గ్యాడ్జెట్‌లు, స్పీకర్లే ఉంటున్నాయి. పిలిస్తే పలుకుతున్నాయ్. ఉన్న చోటునే కూర్చుని అన్నింటినీ ఆపరేట్ చేస్తున్నాం. రిలాక్స్ అవుతున్నాం. కానీ, ఇక్కడ మీకు తెలియకుండా జరిగే తంతేంటి అంటే.. చుట్టూ ఉన్న స్మార్ట్ డివైజ్‌లు మీ మాటలు వింటున్నాయ్. ఓ నివేదిక ప్రకారం.. రోజుకు 19 సార్లు వాటంతట అవే యాక్టివేట్ అవుతూ మాటల్ని రికార్డు చేస్తున్నాయట. కనీసం 43 సెకన్ల నిడివితో ఆడియో రికార్డు అవుతుంది. అందుకే.. హలో గూగుల్.. హే సిరీ.. అలెక్సా.. ఇలా ఏ పేరుతో పిలిచినా పలుకుతున్న అసిస్టెంట్‌లతో కాస్త జాగ్రత్త.. ప్రైవసీని కాపాడుకునేలా ఎప్పటికప్పుడు వాయిస్ రికార్డింగ్స్‌ని తొలగించండి.
మాల్స్‌లో మీ వెంటే..
షాపింగ్ మాల్స్.. సూపర్ మార్కెట్‌లలో సెక్యూరిటీ కెమెరాల్ని ఎప్పటి నుంచో చూస్తున్నాం. ఇప్పుడు వాటికి అదనపు శక్తుల్ని జోడిస్తున్నారు. అవే ‘వీడియో ఎనలిటిక్స్ టూల్స్’. వీటితో కెమెరా కళ్లు మిమ్మల్ని చూడడమే కాదు. విశ్లేషిస్తాయి.. మీరెన్ని సార్లు షాపింగ్‌కి వచ్చారు.. ఎక్కువగా ఎలాంటివి కొంటున్నారు. ఏయే జోన్లలో ఎక్కువ సమయాన్ని వెచ్చిస్తున్నారు.. లాంటి వివరాల్ని ట్రాక్ చేసి చెబుతాయి. అంతేకాదు.. బిల్లింగ్ కౌంటర్ వద్ద లైన్‌లో ఎంత మంది ఉన్నారు.. మీ వంతు వచ్చేటప్పటికీ ఎంత సమయం పడుతుందో చెబుతుంది. ఫేస్‌రికగ్నిషన్ ద్వారా ముఖాల్ని గుర్తుపడతాయి. మార్కెట్‌లో ఎవరైనా దొంగిలించడానికి చూస్తే.. వెంటనే అప్రమత్తం చేస్తాయి కూడా!
ఇవీ చదవండి: