స్టాక్ మార్కెట్లు వారాంతంలో భారీ నష్టాలతో ముగిశాయి. శుక్రవారం సెషన్లో బీఎస్ఈ-సెన్సెక్స్ 549 పాయింట్లు కోల్పోయి 49,034 వద్దకు చేరింది. ఎన్ఎస్ఈ- నిఫ్టీ 162 పాయింట్లు తగ్గి 14,433 వద్ద స్థిరపడింది. దాదాపు అన్ని రంగాలు అమ్మకాల ఒత్తిడి ఎదుర్కొన్నాయి. ఐటీ షేర్లు భారీగా నష్టపోయాయి.
ఐరోపా దేశాల్లో కరోనా నియంత్రణకు కఠిన లాక్డౌన్ అమలు చేస్తుండటం, చైనాలోనూ ఆంక్షలు విధిస్తున్న నేపథ్యంలో ప్రపంచ వృద్ధిపై మరోసారి ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ కారణాలతో ఐరోపా సూచీలు భారీగా పతనమవగా.. ఆ ప్రభావం దేశీయంగానూ కనిపించినట్లు విశ్లేషకులు చెబుతున్నారు.
ఇంట్రాడే సాగిందిలా..
సెన్సెక్స్ 49,656 పాయింట్ల అత్యధిక స్థాయి, 48,795 పాయింట్ల అత్యల్ప స్థాయిలను నమోదు చేసింది.
నిఫ్టీ 14,617 పాయింట్ల గరిష్ఠ స్థాయి, 14,357 పాయింట్ల కనిష్ఠ స్థాయిల మధ్య కదలాడింది.
లాభనష్టాల్లోనివి ఇవే..
భారతీ ఎయిర్టెల్, ఐటీసీ, బజాజ్ ఆటో, బజాజ్ ఫినాన్స్ షేర్లు లాభాలను నమోదు చేశాయి.
టెక్ మహీంద్రా, హెచ్‌సీఎల్‌టెక్, ఓఎన్జీసీ, ఏషియన్ పెయింట్స్, అల్ట్రాటెక్ సిమెంట్, ఇన్ఫోసిస్ భారీగా నష్టపోయాయి.
ఇతర మార్కెట్లు
ఆసియాలో ఇతర ప్రధాన స్టాక్ మార్కెట్లు అయిన షాంఘై, సియోల్, హాంకాంగ్ సూచీలు శుక్రవారం లాభపడ్డాయి. టోక్యో సూచీ నష్టాన్ని నమోదు చేసింది.
ఇదీ చూడండి:'కరోనాపై పోరులో భారత్ చర్యలు ప్రశంసనీయం'