సైబర్ నేరగాళ్ల ఆగడాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఆండ్రాయిడ్ ఓఎస్ లక్ష్యంగా 'బ్లాక్‌రాక్' అనే కొత్త మాల్వేర్ దాడులు చేస్తున్నట్లు సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
'బ్లాక్‌రాక్'ను మొదట మొబైల్ సెక్యూరిటీ సంస్థ 'థ్రెట్ఫాబ్రిక్' మేలో గుర్తించింది.
ఎలా చొరబడుతుంది?
మీ ఆండ్రాయిడ్ ఫోన్లో గూగుల్ యాప్స్ అప్డేట్ చేసుకోమని తప్పుడు సందేశాలు పంపిస్తుంటారు సైబర్ నేరగాళ్లు. ఆ సందేశంలో ఉండే లింక్ క్లిక్ చేస్తే.. మాల్వేర్ ఫోన్లోకి ప్రవేశిస్తుంది.
ఈ మాల్వేర్ ఫోన్లోకి ఒక్కసారి ఇన్స్టాల్ అయ్యిందంటే డేటాను తస్కరించగలదని నిపుణులు అంటున్నారు. ఈ మాల్వేర్ ఆండ్రాయిడ్ సిస్టమ్‌లోకి ప్రవేశించాక.. దానంతట అదే కావల్సిన అనుమతులు తీసుకుంటుంది. దీనితో ఆయా డివైజ్‌లలోని సున్నితమైన డేటాను సులభంగా యాక్సెస్ చేయగలుగుతుందని తెలిపారు.
వేటికి ముప్పు..
బ్లాక్‌రాక్ మాల్వేర్ క్రెడిట్ కార్డుల వివరాలతో పాటు సామాజిక మధ్యమాలైన ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, స్కైప్, స్నాప్‌చాట్, ట్విట్టర్ వంటి వాటి యాప్‌లపై దాడి చేస్తున్నట్లు గుర్తించారు నిపుణులు. మొత్తం 337 వేరువేరు యాప్‌లను ఈ మాల్వేర్ లక్ష్యంగా చేసుకున్నట్లు గుర్తించారు. ఇంకా చాలా యాప్‌లు ఈ మాల్వేర్ లక్ష్యంగా చేసుకున్నట్లు గుర్తించలేదని కూడా అనుమానం వ్యక్తం చేసుతున్నారు.
బ్లాక్‌రాక్ నుంచి రక్షణ ఎలా?
ఎప్పటికప్పుడు ఆండ్రాయిడ్ ఓఎస్‌ను, యాప్స్‌ను అప్డేట్ చేసుకోవాలి. మొబైల్ ఫోన్లలో గుర్తింపు పొందిన యాంటీవైరస్ టూల్స్ మాత్రమే వినియోగించాలి. యాప్‌లకు అనవసర అనుమతులు ఇవ్వొద్దు. రక్షణ లేని థర్డ్ పార్టీ యాప్స్‌ను డౌన్లోడ్ చేసుకోవద్దని సైబర్ సెక్యూరిటీ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఛైర్మన్ ప్రొఫెసర్ ఎన్.కె.గోయల్ సూచిస్తున్నారు.
మాల్వేర్లు చూపించే మాయలో పడి భద్రత లేని యాప్‌లు డౌన్లోడ్ చేసుకుంటే భారీ మూల్యం చెల్లిచుకోక తప్పదని హెచ్చరిస్తున్నారు.
ఇదీ చూడండి:'కేవైసీ అప్డేట్ అంటూ ఫోన్.. నిజమో కాదో తెలుసుకోండి'