ETV Bharat / science-and-technology

స్పేస్​లో పెట్రోల్ పంపులు.. రోదసిలోనే రాకెట్లకు ఇంధనం.. త్వరలోనే సాకారం! - రోదసిలో పెట్రోల్ పంపులు

మన కారుకో బండికో ఫుల్‌ ట్యాంక్‌ కొట్టించాలంటే నిమిషాల పని.. మరి అంతరిక్షంలో అదే పనిగా భ్రమించే ఉపగ్రహాలకు ఇంధనం మాటేమిటి? ఇప్పుడు ఎలా అయితే ప్రపంచంలో ఒక చోట నుంచి మరో చోటుకి ఇంధనాన్ని రవాణా చేస్తున్నామో. అలా అంతరిక్షంలో ఇంధనాన్ని సరఫరా చేయడానికి చమురు ట్యాంక్‌లుగా పని చేసే వ్యోమనౌకలు భవిష్యత్తులో రాబోతున్నాయంటున్నారు ప్రొఫెసర్‌ కె.విష్ణురెడ్డి. గ్రహశకలాలపై పరిశోధనల గురించి 'ఈనాడు'తో ఆయన తాజాగా పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

PETROL PUMPS IN SPACE
PETROL PUMPS IN SPACE
author img

By

Published : Sep 26, 2022, 11:17 AM IST

  • ఎంఏ చదివినా..
  • కొన్నాళ్లు చలనచిత్ర పరిశ్రమలో పనిచేసినా...
  • దిల్లీలో పాత్రికేయుడి అవతారమెత్తినా...

చిన్నప్పుడు సొంతూరు నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలో చూసిన నీలాకాశం.. నిండు చందమామ, నింగిలోని నక్షత్రాలు, శ్రీహరికోట నుంచి దూసుకెళ్లిన రాకెట్లు.. విష్ణును నిద్రపోనివ్వలేదు. ఖగోళంపై ఆసక్తి తగ్గనివ్వలేదు. ఏ వృత్తిలో ఉన్నా ధ్యాస దానిపైనే ఉండేది. ఒక ఇంటర్వ్యూ కోసం అమెరికా ఖగోళ శాస్త్రవేత్త టామ్‌ గెరెల్స్‌ను దిల్లీలో కలవడం ఆయన జీవితగమనాన్ని మార్చేసింది. 'నువ్వు గ్రహశకలాన్ని కనుగొనలేవు' అంటూ ఆ సైంటిస్టు విసిరిన సవాల్‌ను స్వీకరించారు. ఈ క్రమంలో అష్టకష్టాలు పడి అమెరికా చేరి.. స్నేహితుడి టెలిస్కోపుతో '78118 భారత్‌' అనే కొత్త గ్రహశకలాన్ని కనుగొన్న విష్ణు ఇక వెనుదిరిగి చూడలేదు. అమెరికాలో ఉన్నత చదువులు చదివి.. పీహెచ్‌డీ పూర్తి చేసి.. గ్రహశకల శాస్త్రవేత్త అయ్యారు. తనకు సవాల్‌ విసిరిన టామ్‌ చనిపోయాక ఆయన స్థానంలో అరిజోనా విశ్వవిద్యాలయ ఆచార్యుడిగా నియమితులై సత్తా చాటారు.

PETROL PUMPS IN SPACE
.

డార్ట్‌ ప్రయోగం కోసం ప్రత్యేకంగా డిడిమోస్‌, డైమార్ఫస్‌ జంట శకలాలనే ఎందుకు ఎంచుకున్నారు?
డైమార్ఫస్‌ గ్రహశకలం చాలా చిన్నగా ఉంది. అందుకే దాన్ని ఎంచుకున్నారు. డార్ట్‌ ఢీ కొట్టాక దీని కక్ష్యలో వచ్చే స్వల్ప మార్పును స్పష్టంగా పసిగట్టొచ్చు. ఒకవేళ గ్రహశకలం పెద్దగా ఉంటే.. ఢీ అనంతరం దాని కక్ష్యలో మార్పును నిర్దిష్టంగా కొలవలేం. ఎందుకంటే అంత భారీ ప్రభావాన్ని కలిగించే శక్తి ఆ వ్యోమనౌకకు ఉండదు. దీనికితోడు జంట గ్రహశకలాల వద్దకు ఎప్పుడూ వ్యోమనౌకలను పంపలేదు. వాటిపై పరిశోధనలు చేసేందుకూ ఇది మంచి అవకాశం.

డార్ట్‌ ప్రయోగం వల్ల డైమార్ఫస్‌ కక్ష్య భారీగా మారి భూమి దిశగా వస్తే...?
అలాంటి అవకాశం ఏమాత్రం లేదు. డైమార్ఫస్‌ కక్ష్యను భారీగా మార్చే శక్తి 'డార్ట్‌'కు లేదు.

గ్రహశకలాలపైనే మీరు ఎందుకు ఆసక్తి ప్రదర్శిస్తున్నారు?
గ్రహశకలాలు భూమిపై జీవాన్ని ప్రభావితం చేశాయి. భవిష్యత్‌లోనూ ఆ ఒరవడి కొనసాగుతుంది. అందువల్ల ఆ రంగానికి సంబంధించిన శాస్త్రం.. మానవాళి, భూమిపై జీవం మనుగడకు దోహదపడుతుంది. ఖగోళశాస్త్రంలో అతికొద్ది విభాగాలు మాత్రమే ఇలాంటి సాయం అందిస్తున్నాయి. సౌరభౌతిక శాస్త్రం కూడా భూమిపై జీవాన్ని నేరుగా ప్రభావితం చేస్తుంది.

PETROL PUMPS IN SPACE
.

6.6 కోట్ల ఏళ్ల కిందట ఒక భారీ ఆస్ట్రాయిడ్‌ భూమిని ఢీ కొట్టిన అనంతరం జరిగిన వరుస పరిణామాల్లో.. రాకాసి బల్లులు సహా భూమిపై జీవజాలం చాలావరకూ తుడిచిపెట్టుకుపోయింది. ఆ తర్వాత కూడా అనేకసార్లు గ్రహశకలాలు పుడమికి చేరువగా వచ్చి వెళ్లాయి. సమీప భవిష్యత్‌లో ఒక భారీ లేదా మధ్యతరహా గ్రహశకలం భూమిని ఢీ కొట్టే ప్రమాదం ఎంతవరకు ఉంది?

గ్రహశకలాలు పుడమిని ఢీ కొడతాయని నిత్యం ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అయితే ఒక చిన్నపాటి అంతరిక్ష శిల.. భూమిపై ఎక్కడో ఒకచోట పడటం లేదా భూ వాతావరణంలో పేలిపోవడం వంటి ఘటనలు వందేళ్లకోసారి జరిగే వీలుంది. గ్రహశకలాల్లోని పదార్థాల గురించి పరిశోధించడమంటే నాకు అమితాసక్తి. ఒకవేళ.. అలాంటి మూలకాలు కలిగిన ఖగోళవస్తువు భూమి దిశగా వస్తే స్పందించాల్సిన తీరుపై ఒక నిర్ణయానికి రావడానికి ఇది వీలు కల్పిస్తుంది.

2013లో రష్యాలోని చెల్యాబిన్స్క్‌పై ఉల్క పడింది. అది శాస్త్రవేత్తల దృష్టిని ఎలా తప్పించుకోగలిగింది? ఇలాంటివాటిని నివారించడంఎలా?
చెల్యాబిన్స్క్‌ శిల.. సూర్యుడి దిశ నుంచి వచ్చింది. అందువల్ల దాన్ని టెలిస్కోపులతో చూడలేకపోయాం. గ్రహశకలాలను తప్పించుకునే విషయంలో ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్న అత్యుత్తమ రక్షణ సాధనం.. సమయమే. భూమిని ఢీ కొట్టే అవకాశమున్న గ్రహశకలాలను ఏళ్లు, దశాబ్దాల ముందే కనుగొనడం ఉత్తమం. దీనివల్ల తగు రీతిలో స్పందించడానికి వీలవుతుంది.

PETROL PUMPS IN SPACE
.

రాకెట్‌, ఉపగ్రహ ప్రయోగాల వల్ల భూ కక్ష్యలో వ్యర్థాలు నానాటికీ పెరిగిపోతున్నాయి. వాటివల్ల అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం, క్రియాశీల ఉపగ్రహాలకు ముప్పు పొంచి ఉంటుంది. ఈ సమస్యకు విరుగుడేంటి?
ఈ శకలాల నిర్వహణ విషయంలో మనకు నియంత్రణలు, యంత్రాంగాలు అవసరం. నిబంధనలను ఉల్లంఘించినవారికి జరిమానాలు విధించాలి. దురదృష్టవశాత్తు.. చేతులు కాలేవరకూ ఇవేవీ అమల్లోకి రావు. మనం భూమి చుట్టూ ఉన్న ప్రాంతాన్ని కలుషితం చేస్తూనే ఉన్నాం.

ప్రస్తుత పరిస్థితుల్లో భూ కక్ష్యలో కొత్తగా వ్యర్థాలు పోగుపడకుండా చూసుకోవాలి. ఉపగ్రహాలను నిర్దేశిత కక్ష్యలోకి ప్రవేశపెట్టాక వృథాగా మిగిలిపోయే రాకెట్‌ భాగాలు అక్కడే ఉండిపోతాయి. తర్వాత అవి పేలిపోతే.. భారీగా శకలాలు ఉత్పన్నమవుతాయి. పనిచేయని పాత ఉపగ్రహాలకూ ఇదే వర్తిస్తుంది. ఇంధనం నిండుకోవడం వల్ల అవి వ్యర్థాలుగా మారిపోతున్నాయి. అనంతరం అవి పరస్పరం ఢీ కొని, మరిన్ని శకలాలను సృష్టిస్తాయి. రాకెట్ వ్యర్థాలను భూ వాతావరణంలోకి మళ్లించి, మండించగలిగితే ప్రయోజనం ఉంటుంది. ఇందుకోసం అదనంగా కొంత ఇంధనాన్ని మొదటే వాటితో పంపితే సరిపోతుంది.

అంతరిక్ష వ్యర్థాల సమస్య పరిష్కారానికి భవిష్యత్తులో ఇంకా ఏవైనా వినూత్న విధానాలు అందుబాటులోకి వచ్చే అవకాశాలున్నాయా?
చాలా సందర్భాల్లో ఉపగ్రహాలు పనిచేసే స్థితిలోనే ఉన్నప్పటికీ వాటిలో ఇంధనం ఖాళీ కావడం వల్ల అవి నిష్ప్రయోజనంగా మారిపోతున్నాయి. ఇంధనం లేకపోతే వాటిని స్థిరంగా ఒక కక్ష్యలో ఉంచడం (స్టేషన్‌ కీపింగ్‌) సాధ్యం కాదు. ఎందుకంటే.. భూ గురుత్వాకర్షణ శక్తి అంతటా సమానంగా ఉండదు. హెచ్చుతగ్గులు ఉంటాయి. ఫలితంగా ఉపగ్రహ కక్ష్యలోనూ మార్పులు జరుగుతుంటాయి. అందువల్ల అప్పుడప్పుడు ఆ శాటిలైట్‌లోని ఇంధనాన్ని మండించడం ద్వారా దాన్ని తిరిగి నిర్దేశిత ప్రదేశంలోకి పంపుతారు. ఉపగ్రహంలో ఇంధనం నిండుకుంటే ఈ ప్రక్రియను చేపట్టడం సాధ్యం కాదు. అలాంటి పరిస్థితుల్లో ఉపగ్రహాన్ని వదులుకోవడం మినహా చేయగలిగిందేమీ లేదు. దీన్ని అధిగమించడానికి కొత్త టెక్నాలజీలు అందుబాటులోకి వస్తున్నాయి.

ఉదాహరణకు అమెరికాలో ఒక కంపెనీ.. రెండు ఉపగ్రహాలను పంపింది. అవి కక్ష్యలోని పాత ఉపగ్రహాల వద్దకు చేరుకొని, వాటితో అనుసంధానమై, ఇంధనాన్ని అందిస్తుంటాయి. వీటిని మిషన్‌ ఎక్స్‌టెన్షన్‌ వెహికిల్స్‌ (ఎంఈవీ) అని పిలుస్తున్నారు. ఇవి పాత ఉపగ్రహంలోకి ఇంధనాన్ని బదిలీ చేయవు. దానికి అనుసంధానమై, సొంత ఇంజిన్ల సాయంతో స్టేషన్‌ కీపింగ్‌ విధులు నిర్వర్తిస్తుంటాయి. తద్వారా పాత ఉపగ్రహం మరో పదేళ్ల పాటు సేవలు అందించగలుగుతుంది. వచ్చే దశాబ్దంలో ఇదో పెద్ద వ్యాపారమవుతుంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఏటా వెయ్యికి పైగా ఉపగ్రహాలను ప్రయోగిస్తున్నారు. ఇలా బోలెడు డబ్బు ఖర్చుపెట్టి కొత్త ఉపగ్రహాలను నిర్మించడం కన్నా.. సంబంధిత సంస్థలకు కొంత చెల్లించి, ఎంఈవీలను పంపితే ఉపగ్రహ ఆయుష్షు కనీసం మరో 10 ఏళ్లు పెరుగుతుంది.

భవిష్యత్‌లో పాత ఉపగ్రహాల వద్దకు వెళ్లి.. వాటిలోకి నేరుగా ఇంధనాన్ని పంప్‌ చేసే వ్యోమనౌకలూ వస్తాయి. ఇవి అయిల్‌ ట్యాంకర్లలా పనిచేస్తాయి. తర్వాతి కాలంలో గ్రహశకల మైనింగ్‌ ద్వారా వచ్చే ఇంధనంతో రోదసిలోనే ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటవుతాయి. ఈ విధానంలో మొదట.. గ్రహశకలాల్లో ఉత్పత్తి చేసిన ఇంధనాన్ని వ్యోమనౌకల ద్వారా ఈ కేంద్రాలకు తరలిస్తారు. అక్కడి నుంచి ఎంఈవీల సాయంతో ఉపగ్రహాలకు చేరవేయవచ్చు. ఈ వ్యవస్థ సాకారమైతే భూమి నుంచి ఇంధనాన్ని తరలించాల్సిన అవసరం ఉండదు. అంతిమంగా ఇలాంటి ప్రయత్నాల ద్వారా అంతరిక్ష వ్యర్థాలను తగ్గించొచ్చు.

రోదసిలోని '16 సైకీ' అనే గ్రహశకలంపై ఎనలేని ఆసక్తి వ్యక్తమవుతోంది. అందులో ఇనుము, బంగారం, ప్లాటినం, నికెల్‌ వంటి ఖనిజాలు ఉన్నట్లు విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఆ గ్రహశకలం విలువ 10వేల క్వాడ్రిలియన్‌ డాలర్లు ఉండొచ్చని చెబుతున్నారు. దానివల్ల భూమి మీదున్న ప్రతిఒక్కరూ మిలియనీర్‌గా మారొచ్చని కూడా విశ్లేషిస్తున్నారు. దీనిపై పరిశోధనలకు ఒక ఆర్బిటర్‌ను నాసా పంపనుంది. ఆ గ్రహశకలంపై మైనింగ్‌కు అవకాశం ఉందా?

PETROL PUMPS IN SPACE
.

సైన్స్‌ కోణంలో '16 సైకీ' చాలా ఆసక్తికరమైన ఖగోళవస్తువు. దానిపై అత్యధిక స్థాయిలో సైన్స్‌ పరిశోధన పత్రాలను వెలువరించింది నేనే. అంగారకుడు, గురుడు మధ్య గ్రహశకల వలయంలోని అనేక బుల్లి గ్రహాలు (ప్లానెటెసిమల్స్‌) ధ్వంసమయ్యాయి. కొన్నింటి కోర్‌ భాగాలు మనుగడ సాగిస్తున్నట్లు అర్థమవుతోంది. వాటిలో '16 సైకీ' ఒకటి.

భూమి కోర్‌ భాగంపై మనం నేరుగా పరిశోధనలు చేయలేం. అందుకు చాలా లోతుగా తవ్వకాలు చేపట్టాల్సి ఉంటుంది. దానికన్నా.. ఎలాంటి ఆచ్ఛాదన లేకుండా వెలుపలికి కనిపిస్తున్న ఒక కోర్‌ వద్దకు వెళ్లి మనం అధ్యయనం చేయడం ప్రయోజనకరం. '16 సైకీ' కూడా తెరిచి ఉన్న కోర్‌ భాగమే. ఎలాంటి తవ్వకాలు చేపట్టకుండానే దాన్ని అధ్యయనం చేయవచ్చు. ఆ గ్రహశకలంపై శాస్త్రవేత్తల్లో ఆసక్తి వ్యక్తం కావడానికి కారణం అదే. అక్కడ విలువైన లోహాలు ఉన్న మాట నిజమే. వాటివల్ల ఎవరైనా ధనవంతులవుతారా అంటే.. సమాధానం చెప్పలేం. ఎవరైనా ధనికులు కావాలంటే వస్తువుల క్రయ విక్రయం జరగాలి. సరఫరా కన్నా డిమాండ్‌ అధికంగా ఉంటే ఆ వస్తువు ధర పెరిగిపోతుంది. అలాగే సరఫరా అధికంగా ఉండి, దాన్ని ఎవరూ కొనకుంటే ధర తగ్గిపోతుంది. అందువల్ల ప్లాటినంను టన్నుల్లో మైనింగ్‌ చేయడం మంచిదే. అయితే ఆ మైనింగ్‌ ఖర్చులు, లోహాన్ని భూమికి తీసుకురావడానికి అయ్యే వ్యయం సంగతి చూడాలి. ఒకవేళ దాన్ని వెనక్కి తీసుకొచ్చినా.. ప్లాటినం సరఫరా చాలా ఎక్కువగా ఉండటం వల్ల దానికి విలువ ఉండదు. ధర పడిపోతుంది. ఉదాహరణకు ప్లాస్టిక్‌ తరహాలో విరివిగా లభ్యమైతే.. బంగారానికి ఇప్పుడున్నంత విలువ ఎందుకు ఉంటుంది? అలాంటి పరిస్థితుల్లో బంగారు ఆభరణాలు ధరించినా.. ప్లాస్టిక్‌ నగలు ధరించినట్లే ఉంటుంది కదా!

భూమి మీద రేర్‌ ఎర్త్‌ మెటీరియల్స్‌ మరో 50-60 ఏళ్లలో నిండుకుంటాయని కొందరు పరిశోధకులు చెబుతున్నారు. ఆ సమయానికల్లా వాటిని విశ్వంలో మరెక్కడైనా గుర్తించి, మైనింగ్‌ చేయాలంటున్నారు. దీనిపై మీ అభిప్రాయమేంటి?
వారు చెబుతున్నట్లు 50-60 ఏళ్లు అనేది కొంత సహేతుక కాలావధిలానే కనిపిస్తోంది. ఆ సమయానికల్లా గ్రహాంతర మైనింగ్‌పై ఆసక్తి పెరగొచ్చు. నేను ఇంతకుముందు చెప్పినట్లు అంగారకుడు లేదా విశ్వంలో ఇంకెక్కడికైనా చేపట్టే యాత్రల ఉద్దేశం గ్రహశకలాలను మైనింగ్‌ చేసి, ఇంధనాన్ని తీసుకురావడం కాకపోవచ్చు. అది అవసరమని మనం అప్పటికి భావించకపోవచ్చు. ఆ తర్వాత ఖర్చుల దృష్ట్యా దాని గురించే ఆలోచించే పరిస్థితి వస్తుంది. రేర్‌ ఎర్త్‌ మెటీరియల్స్‌కూ ఇది వర్తిస్తుంది. భూమిపై ఈ లోహాలు ఖాళీ అయితే.. మన ముందు రెండు మార్గాలు ఉంటాయి. ఒకటి.. అంతరిక్షంలోకి వెళ్లి మైనింగ్‌ నిర్వహించడం. రెండు.. ఇలాంటి పదార్థాలు అవసరంలేని సాంకేతిక పరిజ్ఞానాలను అభివృద్ధి చేయడం. ఈ రెండూ సాధ్యమేనన్న విషయాన్ని మనం గమనించాలి.

రేర్‌ ఎర్త్‌ మెటీరియల్స్‌ అవసరంలేని సాంకేతికతలను అభివృద్ధి చేయడం సాధ్యమేనా? ఆధునిక ఎలక్ట్రానిక్‌ పరికరాలకు అవి చాలా అవసరం కదా?
ఇది సాధ్యమే. ఏదైనా ఇబ్బంది తలెత్తినప్పుడు దాన్ని అధిగమించడానికి మానవాళి సర్వశక్తులూ ఒడ్డుతుంది. చమురు లేకుండా మనం జీవించలేమని చాలాకాలం భావించాం. ఇప్పుడు.. సౌర, పవన విద్యుత్‌ రూపంలో ప్రత్యామ్నాయాలను సాధించి చూపాం. ప్రయాణాలు అవసరం లేకుండా జూమ్‌ మీటింగ్‌లు నిర్వహించుకుంటున్నాం. మానవులకు శోధన శక్తి చాలా ఎక్కువ. అందువల్ల కచ్చితంగా ప్రత్యామ్నాయాలను తెరపైకి తెస్తారు. అందులో అంతరిక్ష మైనింగ్‌ కూడా ఒక ఆప్షన్‌. అయితే దానికే ఎక్కువ ప్రాధాన్యమిచ్చి, అంతరిక్షంలో అన్వేషణలు సాగిస్తారా అన్నది ఇప్పుడే చెప్పడం కష్టం. ఎందుకంటే రేర్‌ ఎర్త్‌ మెటీరియల్స్‌ అవసరంలేని టెక్నాలజీలను అభివృద్ధి చేయడమే అంతిమంగా చౌకైన అంశమవుతుంది. ఎలక్ట్రానిక్స్‌ మనకు అవసరమే. కానీ 20-30 ఏళ్ల కిందట పెద్దగా ఎలక్ట్రానిక్స్‌ అవసరం లేకుండానే సైన్స్‌ పరిశోధనలు జరిగాయి. అదే రీతిలో మనం ప్రత్యామ్నాయాలను వెతికిపట్టుకుంటామన్న నమ్మకం నాకుంది.

ఆకాశాన్ని విస్మయంతో వీక్షించిన ఒక చిన్నారి నుంచి విలేకరిగా ఎదగడం.. గ్రహశకలాన్ని కనుగొనడం.. అంతిమంగా ఆరిజోనా విశ్వవిద్యాలయంలో టామ్‌ స్థానంలో పదవిని చేపట్టడం.. ఇలా మీ జీవితంలో ఎన్నో అనూహ్య మలుపులు ఉన్నాయి. ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఇదంతా మీకు ఎలా అనిపిస్తోంది? భారత్‌లో యువతకు మీరిచ్చే సందేశమేమిటి?

పాఠశాలలో చదువుకునే రోజుల్లో మాకు తెలుగు పాఠ్యపుస్తకంలో పొట్టి శ్రీరాములుపై పాఠం ఉండేది. లక్ష్యసాధన కోసం ఆయన ప్రదర్శించిన పట్టుదల.. నా మనసుపై బలమైన ముద్ర వేసింది. సవాళ్లతో కూడుకున్న ఏదైనా లక్ష్యాన్ని సాధించాలనుకున్నప్పుడు నేను ఆయన్నే గుర్తుచేసుకుంటా. మా అక్కలిద్దరూ అమెరికాలో వైద్యులుగా పనిచేస్తున్నారు. అయితే వృత్తిపరంగా వారికంటే నాకే ఎక్కువ 'ఫన్‌' ఉంది. ఆ విషయంలో మా అక్కలు నన్ను చూసి ఈర్ష్య పడుతుంటారు. ఏం చేస్తున్నావురా అని వారు ప్రశ్నించినప్పుడల్లా.. హాబీని ఆస్వాదిస్తున్నా అని చెప్పడానికి గర్వపడుతుంటా. ఖగోళశాస్త్రం నా అభిరుచి కావడమే ఇందుకు కారణం.

ప్రతిరోజూ నిద్రలేచాక నన్ను నేను గిల్లుకొని ''నా ఇష్టాన్ని నేను ఆస్వాదించడం కోసం నాకు వేతనం చెల్లిస్తున్నారా'' అని ఆశ్చర్యపోతుంటా. ప్రతి చిన్నారి విషయంలోనూ ఇలా జరిగితే అత్యద్భుతంగా ఉంటుంది. దురదృష్టవశాత్తు ఆధునిక విద్యా వ్యవస్థ అలా లేదు. చిన్నారుల ఇష్టానికి అనుగుణంగా వారికి ప్రత్యేకమైన (కస్టమైజ్డ్‌) విద్యను అందించడం లేదు. దాదాపు 50 మంది విద్యార్థులను ఒకే తరగతి గదిలో ఉంచి, ఒకే రకమైన బోధన సాగిస్తున్నాం. ప్రామాణిక పరీక్షలు పాసవ్వాలని.. అలాగైతేనే పెద్ద విశ్వవిద్యాలయాల్లో అడ్మిషన్లు సాధించగలరని వారికి నూరిపోస్తుంటారు.

ఇంకో విషయమేంటంటే.. చేతివృత్తుల వారూ మనకు కావాలి. స్థిరమైన కెరీర్‌తో డబ్బు సంపాదించాలన్న కోరిక చాలామందిలో ఉండటం సహజమే. తల్లిదండ్రుల ఆకాంక్షలు కూడా ఇలానే ఉంటాయి. అయితే ఇష్టంలేని రంగాన్ని ఎంచుకుంటే.. ఒకదశ దాటాక ఆ జీవితం చాలా నిరాసక్తంగా అనిపించొచ్చు. అప్పటికి మీరు తిరుగులేని ఇంజినీరుగా ఉన్నా.. గొప్ప వైద్యుడిగా ఉన్నా.. ఇష్టమైన రంగంలో లేనని లోలోపల కుమిలిపోతారు. అందువల్ల మీరు ఏం కావాలనుకుంటున్నారో అదే అవ్వండి అని నా విద్యార్థులకు సూచిస్తుంటా. మీకు అత్యంత ఇష్టమైన రంగాన్ని వృత్తిగా ఎంచుకుంటే.. జీవితంలో అత్యద్భుతంగా రాణిస్తారని చెబుతుంటా. నైపుణ్యాలను సముపార్జించుకోవాలి. విజ్ఞానంతోపాటు నైపుణ్యాలూ చాలా ముఖ్యం.

భూమి వైపు దూసుకొస్తున్న గ్రహశకలాలను దారి మళ్లించేందుకు అందుబాటులో ఉన్న మార్గాలేంటి?
ఢీ కొట్టడానికి ముందు ఎంత సమయం మిగిలి ఉందన్నది ఇక్కడ కీలకం. దశాబ్దాల సమయం ఉంటే.. గ్రావిటీ ట్రాక్టర్‌ లేదా కైనెటిక్‌ ఇంపాక్టర్‌ విధానాన్ని వాడొచ్చు. ఉదాహరణకు ఒక గ్రహశకలం వందేళ్లలో భూమిని ఢీ కొడుతుందనుకుందాం. అలాంటి పరిస్థితుల్లో సన్నద్ధం కావడానికి మనకు బాగా సమయం ఉన్నట్టే. అంతేకాదు.. దాన్ని దారి మళ్లించడానికి మనకు చాలా తక్కువ శక్తి సరిపోతుంది. ఆ గ్రహశకల ప్రస్తుత గమనంలో మనం కొద్దిగా మార్పు చేస్తే, దాని భవిష్యత్‌ ప్రయాణ మార్గంలో పెద్ద వైరుధ్యం వస్తుంది. తద్వారా అది 100 ఏళ్ల తర్వాత భూమి వైపు రాకుండా దూరంగా వెళ్లిపోతుంది. ఈ అంశంపైనే ఎక్కువగా దృష్టిసారిస్తున్నాం.

వందేళ్లలో భూమిని ఢీ కొట్టే అవకాశమున్న గ్రహశకలాలను గుర్తించేందుకు కసరత్తు చేస్తున్నాం. దీనివల్ల మనకు ప్రతిస్పందన సమయం ఎక్కువగా ఉంటుంది. అయితే పదుల సంవత్సరాల్లో అంటే.. 20.. 30 ఏళ్లలో గ్రహశకలం ఢీ కొట్టే అవకాశం ఉంటే.. అప్పుడు దాని పరిమాణాన్ని బట్టి 'కైనటిక్‌ ఇంపాక్టర్‌' సాయంతో విస్ఫోటం సృష్టించి, దాన్ని దారి మళ్లించొచ్చు. ఇందుకోసం సాధారణ పేలుడు పదార్థం లేదా అణుబాంబును ఉపయోగించొచ్చు. దీనివల్ల గ్రహశకల గమనాన్ని మార్చవచ్చు. ఇంకా ఎక్కువ సమయం ఉంటే గ్రావిటీ ట్రాక్టర్‌ను ప్రయోగించి ఆ మార్పు చేయవచ్చు. ఇదంతా గ్రహశకల పరిమాణం, ప్రతిస్పందనకు ఉన్న సమయం.. వంటి అంశాలపై ఆధారపడి ఉంటుంది. దారిమళ్లింపునకు సమయం లేకుంటే.. భూమిపై ఆ అంతరిక్ష శిల పడే అవకాశమన్న ప్రాంతాలను గుర్తించి, అక్కడి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడమే మార్గం.

అణు విస్ఫోటం వల్ల గ్రహశకలం ముక్కలై, దాని శకలాలు భూమి దిశగా రావా? ఇది కూడా ప్రమాదకరమే కదా..?
ఔను! దీనిపై ఆందోళన ఉంది. నేరుగా గ్రహశకలంపై పేలుడు సృష్టించకుండా, భద్రంగా దానికి సమీపంలో విస్ఫోటం కలిగించాలి. ఈ క్రమంలో వెలువడే ప్రకంపనలు (షాక్‌ వేవ్స్‌).. గ్రహశకలాన్ని స్వల్పంగా పక్కకు మళ్లిస్తాయి. ఒకవేళ పేల్చేయాలనుకుంటే దాని ఆనవాళ్లు లేకుండా మొత్తం నుగ్గునుగ్గు చేయాలి. ఇది చాలా కష్టం. ఎందుకంటే ఆ గ్రహశకలం లోపల ఏముందో మనకు తెలియదు. వెలుపలి పరిశీలనల ద్వారా లోపలి పదార్థ దృఢత్వాన్ని నిర్దిష్టంగా అంచనావేయలేం. షాక్‌వేవ్‌ వల్ల గ్రహశకలం దారి మళ్లకపోతే.. చివరి అస్త్రంగా దాన్ని నేరుగా పేల్చివేసేందుకు ప్రయత్నించాలి.

మైనింగ్‌ నిర్వహించడానికి, కాలనీ ఏర్పాటు చేసుకోవడానికి అనువైన ఖగోళ వస్తువు ఏదైనా ఉందా?
చందమామ, అంగారకుడు అందుకు బాగా ఉపయోగపడతాయి. గ్రహశకల వలయంలో సీరీస్‌ అనే ఖగోళవస్తువు అత్యంత పెద్దది. దానిమీద మంచుగడ్డల రూపంలో నీరు ఉన్నట్లు వెల్లడైంది. అందువల్ల దానికి దగ్గర్లోకి వెళ్లడం ఉత్తమం. అది చాలా పెద్ద గ్రహశకలం. దానిపై నిర్మాణాలు చేపట్టవచ్చు. ఇంకా అనేక రకాల వనరులు అందులో ఉన్నాయి. అక్కడికి మనుషులు వెళ్లి తవ్వకాలు చేయడం కష్టమే. ఆ బాధ్యతను రోబోలకు అప్పగించొచ్చు.

తన ప్రతిరూపాలను తయారుచేసుకోగల రోబోలను గ్రహశకలాల వద్దకు పంపి, అక్కడ వాటి సంఖ్య పెంచి, మైనింగ్‌ నిర్వహించాలన్న ప్రతిపాదన ఉంది. ఇది సైన్స్‌ కాల్పనిక సాహిత్యానికే పరిమితమైన అంశమా? ఆచరణసాధ్యమేనా?
ప్రస్తుతం ఆ తరహా రోబోల రూపకల్పనకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అవి.. అచ్చంగా తమలాంటి మరో రోబోను తయారుచేసుకుంటాయి. వాటిని గ్రహశకలాల మైనింగ్‌కు ఉపయోగిస్తారా లేదా అన్నది భిన్నమైన అంశం. భూమి మీద మనం ఖనిజాలను వెలికి తీసేందుకు ఉపయోగించే పరిజ్ఞానాలనే గ్రహశకలాల మైనింగ్‌కూ వాడే అవకాశం ఉంది. అంతిమంగా.. గ్రహశకలాల మైనింగ్‌లో రోబోల పాత్ర చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే స్వీయ ప్రతిరూపాలను తయారుచేసుకోగల మరమనుషుల రూపకల్పనకు ఇది అనువైన సమయమా కాదా అన్నది విశ్లేషించుకోవాలి.

గ్రహశకలాలపై మైనింగ్‌ ప్రయత్నాలు ఫలిస్తాయా? ఒక భారీ డ్రిల్లింగ్‌ యంత్రం ఆస్ట్రాయిడ్‌ వద్దకు వెళ్లి తవ్వకాలు నిర్వహించే పరిస్థితి ఉంటుందా?
మొదట చిన్నస్థాయి పరికరాలతోనే కంపెనీలు తమ కార్యకలాపాలు మొదలుపెడతాయని భావిస్తున్నా. గ్రహశకలాల మైనింగ్‌కున్న అవరోధాలను అధిగమించాలంటే చౌకలో అంతరిక్ష యాత్రలు చేసే పరిస్థితి రావాలి. తక్కువ ఖర్చులో భూ గురుత్వాకర్షణ శక్తిని తప్పించుకోగలగాలి. కొంతవరకైనా పునర్‌వినియోగించగలిగే రాకెట్లు కావాలి. తద్వారా ఖర్చులు తగ్గుతాయి. వ్యాపార ప్రయోజనాల దృష్ట్యా అంతరిక్ష కంపెనీలు అంతరిక్ష ప్రయోగాల వ్యయాన్ని తగ్గించాలనుకుంటున్నాయి. ఇది సానుకూల పరిణామం.

ఇక రెండోది.. మైనింగ్‌ ఆవశ్యకతను గుర్తించడం. అంగారకుడి వద్దకు వెళ్లాలంటే నెలలు పడుతుంది. భారీగా ఇంధనం అవసరమవుతుంది. ఆ వ్యోమనౌకలకు మార్గమధ్యంలో భూ కక్ష్యలో గానీ అంగారకుడి కక్ష్యలో గానీ దశలవారీగా ఇంధనాన్ని నింపాల్సి ఉంటుంది. తిరిగొచ్చేటప్పుడూ దార్లో 'ఆయిల్‌ కొట్టించాల్సి' ఉంటుంది. ఇందుకోసం మొదట ఇంధనంతో కూడిన రాకెట్లను రోదసిలోకి పంపాలి. అవి మానవసహిత వ్యోమనౌకలు వచ్చేవరకూ నిర్దేశిత ప్రదేశంలో పెట్రోల్‌ బంకులా నిరీక్షించాల్సి ఉంటుంది. మొదటితరం గ్రహాంతర యాత్రల్లో జరిగేది ఇదే. ఈ ప్రక్రియతో ముడిపడిన భారీ ఖర్చుల దృష్ట్యా.. క్రమంగా ఈ విధానం కూడా భారమనిపిస్తుంది. వ్యయ ప్రయాసలతో భూమి నుంచి ఇంధనాన్ని మోసుకెళ్లడం కాకుండా.. రోదసిలో దగ్గర్లో అందుబాటులో ఉన్న వనరుల నుంచి ఇంధనాన్ని సేకరించి, వాడటం ఉత్తమమనే భావన వస్తుంది. అప్పుడు గ్రహశకల మైనింగ్‌ తెరపైకి వస్తుంది.

అంగారకుడి వద్దకు వెళుతుంటే.. ఆ గ్రహానికి ఉన్న రెండు చందమామల నుంచి గానీ సమీపంలోని గ్రహశకలాల నుంచి గానీ నీటిని సేకరించి, ఇంధనాన్ని తయారుచేసుకోవాల్సి ఉంటుంది. ఈ లెక్కన చూస్తే గ్రహశకలాల్లో మనం చేసే మొదటి మైనింగ్‌.. నీటి కోసమే అవుతుంది. మైనింగ్‌ చేసిన ఖనిజాలను భూమికి తీసుకురావడానికి గానీ రోదసిలో కార్యకలాపాలు సాగిస్తున్న ఇతర కంపెనీలకు చేరవేయడానికి గానీ మనకు ఇంధనం అవసరం. మానవులు ఏదైనా కొత్త దేశానికి వెళ్లినప్పుడు.. మొదట్లో తమకు అవసరమైన సరకులను వెంట తెచ్చుకుంటారు. తర్వాతి దశలో వాటిని తామున్న ప్రాంతంలోనే తయారుచేసుకోవడానికి ప్రయత్నిస్తారు. గ్రహాంతర యాత్రలకూ ఇదే వర్తిస్తుంది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.