UPI Lite Wallet: ఇటీవల రిజర్వ్ బ్యాంకు.. ఫీచర్ ఫోన్ల కోసం యూపీఐ చెల్లింపులు అందుబాటులోకి తెచ్చింది. ఇంటర్నెట్ కనెక్షన్ లేకుండానే లావాదేవీలు జరుపుకునేందుకు వీలుగా దీనిని తయారు చేశారు. తాజాగా మరో యూపీఐ ఫీచర్‌ను ప్రవేశపెట్టనుంది నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ). అన్ని ఫోన్లలో యూపీఐ లైట్ పేరుతో అందుబాటులోకి తేనున్న ఈ ఫీచర్‌తో చిరు లావాదేవీలను ఇంటర్నెట్ లేకుండానే చేసుకోవచ్చు.
యూపీఐ లైట్ వ్యాలెట్
పేటీఎం, మొబీక్విక్ వంటి ఆన్డివైజ్ వ్యాలెట్ల తరహాలోనే యూపీఐ లైట్ వ్యాలెట్‌ను ప్రవేశపెట్టనున్నట్లు ఎన్పీసీఐ ప్రకటించింది. ఈ వ్యాలెట్.. ఇటీవల ప్రవేశపెట్టిన ఆఫ్‌లైన్ యూపీఐ సేవల్లానే పనిచేస్తుంది. దీని ద్వారా యూజర్లు చిన్న మొత్తంలో ట్రాన్సాక్షన్స్ చేసుకోవచ్చు. ఈ వ్యాలెట్‌లో ఫండ్స్‌ను కూడా స్టోర్ చేసుకునే సదుపాయాన్ని ఎన్పీసీఐ కల్పిస్తోంది.
ఇది ఎలా పనిచేస్తుండంటే..
యూపీఐ లైట్ వ్యాలెట్.. అందుబాటులోకి వచ్చిన తొలినాళ్లలో 'నియర్ ఆఫ్‌లైన్ మోడ్'లో పనిచేస్తుందని ఎన్పీసీఐ వెల్లడించింది. డెబిట్ పేమెంట్స్ ఆఫ్‌లైన్‌లో, క్రెడిట్ పేమెంట్స్ ఆన్లైన్లో జరుగుతాయి. యూజర్ ఆన్‌లైన్‌లోకి వచ్చాక క్రెడిట్ పేమెంట్స్ అప్డేట్ అవుతాయి. అయితే క్రమంగా అన్ని రకాల చెల్లింపులూ ఆఫ్‌లైన్‌కు వచ్చేలా కృషి చేస్తామని ఎన్పీసీఐ పేర్కొంది.
యూపీఐ లైట్ సాయంతో వినియోగదారులు రూ.200లోపు లావాదేవీలు జరుపుకోవచ్చని.. అయితే వ్యాలెట్ లిమిట్ గరిష్ఠంగా రూ.2000 అని ఎన్పీసీఐ తెలిపింది. ఈ యూపీఐ లైట్ వ్యాలెట్‌లో ఉండే నగదుకు ఎలాంటి ఛార్జీలు వసూలు చేయటం లేదని స్పష్టం చేసింది. యూపీఐ లైట్ ఖాతాల సంఖ్య యూజర్లు వాడే యూపీఐ యాప్‌ల సంఖ్యపై ఆధారపడి ఉంటుందని తెలిపింది.
అలా చేయాలంటే ఆన్‌లైన్‌కు రావాల్సిందే..
యూజర్లు యూపీఐ లైట్లో ఫండ్స్‌ను యాడ్ చేయాలంటే ఇంటర్నెట్ ఉండాల్సిందే. ఇందుకు అదనంగా వెరిఫికేషన్ చేయాల్సి ఉంటుంది. ఇందులో ఆటోమేటిక్‌గా ఫండ్స్ యాడ్ చేసుకునే అవకాశం కూడా ఉంది.
ఎప్పుడు అందుబాటులోకి వస్తుందంటే?
ఈ యూపీఐ లైట్ వ్యాలెట్ అందుబాటులోకి రావడంపై ఇంకా ఎలాంటి స్పష్టత లేదు. మొదట పైలట్‌గా ప్రవేశపెట్టనున్న ఈ యూపీఐ త్వరలోనే అందుబాటులోకి రానున్నట్లు వెల్లడించారు.
ఇదీ చూడండి : దరి చేరనున్న 5జీ సాంకేతికత- అధిగమించాల్సిన సవాళ్లెన్నో..