Koo App In Brazil : ట్విట్టర్‌కు పోటీగా దేశీయంగా రూపొందించిన సోషల్ మీడియా 'కూ' యాప్‌నకు అంతర్జాతీయంగా ఆదరణ పెరుగుతోంది. రెండ్రోజుల క్రితం ఈ యాప్‌ను బ్రెజిల్‌లో విడుదల చేయగా ఒక మిలియన్ డౌన్‌లోడ్స్ అయినట్లు తెలిపింది. త్వరలోనే ఈ యాప్‌ను మరిన్ని దేశాల్లోని యూజర్లకు అందుబాటులోకి తీసుకొస్తామని కంపెనీ తెలిపింది. ప్రస్తుతం దేశీయంగా 'కూ' యాప్‌కు 50 మిలియన్ డౌన్‌లోడ్స్ ఉన్నాయి. మరోవైపు ఎలాన్ మస్క్ ట్విట్టర్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఉద్యోగుల తొలగింపు, బ్లూ టిక్ సబ్‌స్క్రిప్షన్ వంటి నిర్ణయాలతో యూజర్లు 'కూ' వంటి ప్రత్యామ్నాయ యాప్‌లపై దృష్టి సారిస్తున్నారు. ఈ నేపథ్యంలో 'కూ' యాప్‌కు డౌన్‌లోడ్స్ పెరుగుతున్నట్లు సమాచారం. ఇటీవలే బ్లూ టిక్ వెరిఫికేషన్‌కు ఎలాంటి రుసుము వసూలు చేయమని కూ తెలిపింది.
"దేశీయ మైక్రోబ్లాగింగ్ సామాజిక మాధ్యమం 'కూ' యాప్‌ను బ్రెజిల్‌లో విడుదల చేశాం. పోర్చుగీస్ భాషలో అక్కడి యూజర్లకు అందుబాటులో ఉంది. యాప్‌ను విడుదల చేసిన 48 గంటల వ్యవధిలోనే సుమారు ఒక మిలియన్ డౌన్‌లోడ్స్‌తో రికార్డు సృష్టించింది. ప్రస్తుతం బ్రెజిల్‌లో ఈ యాప్‌కు రెండు మిలియన్ డౌన్‌లోడ్స్‌తోపాటు 10 మిలియన్ లైక్స్ వచ్చాయి" అని కంపెనీ వెల్లడించింది. ఈ ఆదరణ తమకెంతో ఆనందాన్ని కలిగించిందని 'కూ' సీఈవో, సహ-వ్యవస్థాపకుడు అప్రమేయ రాధాకృష్ణ తెలిపారు. స్థానిక భాషలో మాట్లాడే వారి కోసం ఓ సోషల్ మీడియా వేదిక ఉండాలనే ఉద్దేశంతో ఈ యాప్‌ను రూపొందించామని అన్నారు. ప్రస్తుతం దేశీయంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా స్థానిక భాషలు మాట్లాడే వారికి సేవలు అందించేందుకు యాప్‌ను సిద్ధం చేస్తున్నామని అప్రమేయ తెలిపారు.