ఐఫోన్ 11 మోడల్‌కు సంబంధించి కొన్ని ఫోన్ల డిస్‌ప్లేల్లో సమస్యలు వస్తున్నందున, వాటిని ఉచితంగా మారుస్తున్నట్లు తయారీ సంస్థ యాపిల్ తెలిపింది.
"2019 నవంబరు నుంచి 2020 మే మధ్య తయారైన ఐఫోన్ 11 తెరను టచ్ చేసినప్పుడు అది సరిగ్గా స్పందించడం లేదని గుర్తించాం. ఒకవేళ మీ ఫోనులోనూ ఇటువంటి సమస్య ఉంటే.. యాపిల్ వెబ్‌సైట్‌లో ఆ ఫోన్ సీరియల్ నంబర్ చెకర్ సాయంతో మీరు డిస్ప్లే మార్చుకునే సదుపాయానికి అర్హులో కాదో తెలుసుకోండి. మీరు అర్హులైతే యాపిల్ లేదా యాపిల్ అథీకృత సేవా కేంద్రాలు డిస్ప్లేను ఉచితంగా మారుస్తాయ"ని యాపిల్ తెలిపింది.
రిఫండ్
డిస్ప్లే సమస్యను ముందుగానే గుర్తించి ఎవరైనా దానిని బాగు చేసుకుని ఉండి ఉంటే.. ఇందుకు చెల్లించిన డబ్బులను రిఫండ్ చేస్తామని పేర్కొంది. ఈ డిస్ప్లే మార్పిడి సదుపాయం కేవలం ఐఫోన్ 11 మోడల్‌కు మాత్రమేనని.. ఐఫోన్ 11 ప్రో, ఐఫోన్ 11 ప్రో మ్యాక్స్ మోడళ్లకు వర్తించదని స్పష్టం చేసింది.
ఇదీ చూడండి:'పవర్'ఫుల్‌గా రానున్న మోటో జీ9