Common charger for all phones : ఎలక్ట్రానిక్ పరికరాలన్నీ ఒకటే ఛార్జర్‌తో పనిచేసే విధానం అమలు దిశగా కేంద్రప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఒక్కో డివైజ్‌కు ఒక్కో రకం ఛార్జర్ కాకుండా.. అన్నింటికీ కామన్ ఛార్జర్ తీసుకొచ్చే అంశంపై చర్చించేందుకు ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలోని సంబంధిత వర్గాలతో ఈనెల 17న సమావేశం ఏర్పాటు చేసింది. ఈ భేటీ అనంతరం కామన్ ఛార్జర్ విధానాన్ని తప్పనిసరి చేయడంపై ప్రభుత్వం ఓ నిర్ణయానికి వచ్చే అవకాశముందని సమాచారం.
ఇప్పుడు అందుబాటులో ఉన్న ఫోన్స్, ట్యాబ్స్‌కు.. వేర్వేరు రకాల ఛార్జర్లు ఉన్నాయి. యాపిల్ ప్రత్యేకంగా రూపొందించిన లైట్నింగ్ పోర్ట్ ఛార్జర్లు మాత్రమే ఐఫోన్‌కు పనిచేస్తాయి. ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లు యూఎస్బీ సీ-పోర్ట్ ద్వారా ఛార్జ్ అవుతాయి. యాపిల్, ఆండ్రాయిడ్.. రెండు ఫోన్లు వాడే వారు ప్రతిసారీ రెండు ఛార్జర్లు వెంట ఉంచుకోవాల్సిందే.
అటు ఖర్చు.. ఇటు చెత్త..
ఇప్పుడు అనేక కంపెనీలు కొత్త ఫోన్ కొనుగోలు చేసినా ఛార్జర్‌ను ఇంతకుముందులా ఉచితంగా ఇవ్వడం లేదు. విడిగా కొనుక్కోవాల్సిందే. ఆండ్రాయిడ్ ఫోన్ వాడుతున్న వ్యక్తి ఐఫోన్ కొంటే.. లైట్నింగ్ పోర్ట్ ఛార్జర్ కోసం అదనంగా డబ్బులు ఖర్చు చేయాల్సిందే. ఈ వేర్వేరు ఛార్జర్ల విధానం.. వినియోగదారులకు ఆర్థికంగా భారం కావడమే కాక.. పర్యావరణాన్నీ దెబ్బతీస్తోంది. కోట్లాది ఎలక్ట్రానిక్ డివైజ్‌లు, వాటికి వేర్వేరు ఛార్జల్ కారణంగా ఈ-వ్యర్థాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి.
అక్కడ బంద్.. మరి ఇక్కడ?
Common charger European parliament : ఈ దుష్పరిణామాల దృష్ట్యా.. అమెరికా, ఐరోపా ప్రభుత్వాలు ఇప్పటికే అప్రమత్తం అయ్యాయి. స్మార్ట్ ఫోన్లు, ట్యాబ్‌లకు.. బ్రాండ్లతో సంబంధం లేకుండా ఒకటే ఛార్జర్ ఉండాలని తయారీ సంస్థలకు స్పష్టం చేశాయి. త్వరలోనే ఆ దిశగా సెల్‌ఫోన్ కంపెనీలు మార్పులు చేసే అవకాశముంది. అయితే.. భారత్‌లో ఆ రూల్ లేదు కాబట్టి యాపిల్ వంటి సంస్థలు తాము ప్రత్యేకంగా రూపొందించిన లైట్నింగ్ పోర్ట్ ఛార్జర్లను మన దేశంలో 'డంప్' చేసే ప్రమాదముంది. అంటే.. అమెరికా, ఐరోపా దేశాల్లో తగ్గిన ఈ-వేస్ట్.. భారత్‌లో పోగుపడే ముప్పు పొంచి ఉంది. అందుకే.. కేంద్ర ప్రభుత్వం కూడా సాధ్యమైనంత త్వరగా కామన్ ఛార్జర్ విధానం అమల్లోకి తీసుకురావాలని భావిస్తోంది.