How to Translate emails on Gmail Mobile App in Telugu : ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది వినియోగించే ఈ-మెయిల్ సర్వీసుల్లో Gmail ముందుంటుంది. యూజర్ ఫ్రెండ్లీ ఫీచర్స్‌తోపాటు సెక్యూరిటీ పరంగా యూజర్లకు భరోసా ఉండటంతో.. ఎక్కువ మంది మెయిల్స్ పంపేందుకు జీమెయిల్‌ను ఉపయోగిస్తున్నారు. అయితే.. ఇటీవల కాలంలో ఇతర భాషల్లో కూడా మెయిల్(email) రావడం సర్వసాధారణమైపోయింది. ఇలా మనకు తెలియన భాషల్లో మెయిల్ రావడం వల్ల సైబర్ ఫ్రాడ్లకు గురై ఆర్థికంగా నష్టపోయిన సందర్భాలున్నాయి. వీటిని దృష్టిలో పెట్టుకుని Gmail సరికొత్త ఫీచర్‌ను యూజర్లకు అందుబాటులోకి తెచ్చింది. అయితే.. ఇది ప్రస్తుతం మొబైల్లో Gmail యాప్ ఉపయోగించే వారికి మాత్రమే అందుబాటులోకి వచ్చింది. ఇంతకీ జీమెయిల్ తీసుకొచ్చిన ఆ కొత్త ఫీచర్ ఏంటి? దానిని ఎలా ఉపయోగించాలి? ఆ ఫీచర్ బెనిఫిట్స్ ఏంటి? అనే వివరాలు ఇప్పుడు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
Translate emails in Gmail : జీమెయిల్ తీసుకొచ్చిన ఆ కొత్త ఫీచరే.. ట్రాన్స్‌లేట్ ఆప్షన్ ఫీచర్. ఈ సదుపాయం ఇప్పటికే వెబ్ జీమెయిల్ వెర్షన్లో అందుబాటులో ఉంది. ఇప్పుడు తీసుకొచ్చిన ఈ ఫీచర్‌ను ఐపోన్ యూజర్లతోపాటు ఆండ్రాయిడ్ యూజర్లూ వినియోగించుకోవచ్చు. దీని ద్వారా జీమెయిల్లోని భాషను ఇతర భాషల్లోకి ట్రాన్స్‌లేట్ చేసుకునే వెసులుబాటును కల్పిస్తూ Google ఒక ప్రకటన చేసింది. ఇకపై వెబ్ వెర్షన్ జీమెయిల్ యూజర్ల మాదిరిగానే మొబైల్ జీమెయిల్ యాప్ మీకు వచ్చిన మెయిల్స్‌ను.. ఒక భాష నుంచి సుమారు 100 భాషల్లోకి ట్రాన్స్‌లేట్ చేసుకోవచ్చు. ఉదాహరణకు మీకు రష్యన్ భాషలో ఏదైనా మెయిల్ వచ్చినప్పటికీ మన భాషలోకి దానిని ట్రాన్స్‌లేట్ చేసుకుని దాని సారాంశాన్ని తెలుసుకోవచ్చు. ఈ ఫీచర్ ద్వారా ఇకపై సైబర్ ఫ్రాడ్ మెయిల్స్ బారి నుంచి రక్షించుకోగలుగుతాము.
Gmail యాప్‌లో ఈ ఫీచర్‌ను ఎలా ఉపయోగించాలంటే..
- ముందుగా మీరు Gmail యాప్‌ని ఓపెన్ చేసి.. మీరు ట్రాన్స్‌లేట్ చేయాలనుకుంటున్న ఈమెయిల్‌ను సెలక్ట్ చేసుకొని ఓపెన్ చేయాలి.
- ఆ తర్వాత ఈమెయిల్ రైట్ సైడ్ టాప్ కార్నర్‌లో ఉన్న మూడు చుక్కలపై నొక్కాలి.
- అప్పుడు అందులో ట్రాన్స్‌లేట్ ఆప్షన్ని ఎంచుకోవాలి.
- ఇప్పుడు సెట్టింగ్స్ సింబల్ కనిపిస్తుంది.
- దానిపై క్లిక్ చేయగానే డిటెక్ట్ లాంగ్వేజ్ ఆప్షన్ కనిపిస్తుంది.
- దానిపై క్లిక్ చేసి.. ఆ మెయిల్‌ను ఏ భాషలోకి ట్రాన్స్‌లేట్ కావాలనుకుంటున్నారో.. ఆ భాషను సెలెక్ట్ చేసుకోవాలి.
- అంతే.. ఈమెయిల్ ట్రాన్స్‌లేట్ అయి మీరు ఎంచుకున్న భాషలో స్క్రీన్‌పై కనిపిస్తుంది.
మీరు ఈ ఫీచర్‌ని ఉపయోగిస్తున్నప్పుడు గుర్తుంచుకోవలసిన కొన్ని విషయాలు..
- ట్రాన్స్‌లేట్ కార్యాచరణ ప్రస్తుతం బీటా దశలో ఉంది. అంటే.. ట్రాన్స్‌లేట్ కంటెంట్‌లో కొన్ని తప్పులు ఉండే అవకాశం ఉంది.
- ఈ ఫీచర్ ద్వారా.. ఒకసారి ఒక ఈమెయిల్‌ను మాత్రమే ట్రాన్స్‌లేట్ చేయడానికి అవకాశం ఉంది.
- ఒకవేళ మీకు విదేశీ భాషలో మల్టీ ఈమెయిల్‌లు వచ్చి ఉంటే.. మీరు వాటిని ఒక్కొక్కటిగా ట్రాన్స్‌లేట్ చేసుకోవాల్సి ఉంటుంది.
- అలాగే జీమెయిల్ ఈ కొత్త ఫీచర్ క్రమంగా వినియోగదారులకు అందుబాటులోకి వస్తోంది. మీకు Gmail యాప్‌లో ఫీచర్ కనిపించకపోతే యాప్‌ను అప్‌డేట్ చేయండి.
Gmail Tips : ఈ సింపుల్ టిప్స్ & ట్రిక్స్ తెలుసా?.. వీటితో మీ పనులు మరింత ఈజీగా!