పెళ్లికో, విందుకో వెళ్లామనుకోండి. అక్కడ వేడి వేడిగా వడ్డించే కల్యాణ రసం చాలు కడుపునిండిపోవడానికి. ఆహా అనిపించే రుచితో కూడిన వంటకాన్ని ఇంటిలోనూ సింపుల్‌గా చేసుకోవచ్చు. అప్పడాలు, వడియాలు కాంబినేషన్‌తో ట్రై చేస్తే సూపర్‌గా ఉంటుంది. మరి తయారీ ఎలాగో తెలుసుకుందామా..?
కావలసినవి..
- పొడికోసం:
కందిపప్పు: టేబుల్‌స్పూను, దనియాలు: టేబుల్‌స్పూను, మిరియాలు: టేబుల్‌స్పూను, జీలకర్ర: ఒకటిన్నర టీస్పూన్లు, ఎండుమిర్చి: రెండు, నూనె: టీస్పూను
- రసం తయారీకోసం:
కందిపప్పు: 3 టేబుల్ స్పూన్లు, టొమాటో: ఒకటి, చింతపండు: నిమ్మకాయంత, వెల్లుల్లి రెబ్బలు: 4, మిరియాలు: టీస్పూను, జీలకర్ర: టీస్పూను, పసుపు: టీస్పూను, ఉప్పు: రుచికి సరిపడా, మంచినీళ్లు: తగినన్ని
- తాలింపుకోసం:
నూనె: ఒకటిన్నర టీస్పూన్లు, ఆవాలు: టీస్పూను, జీలకర్ర: అరటీస్పూను, కరివేపాకు: 4 రెబ్బలు, ఇంగువ: చిటికెడు, కొత్తిమీర: కట్ట
తయారుచేసే విధానం..
- అరకప్పు గోరువెచ్చని నీళ్లలో చింతపండు వేసి నానబెట్టాలి.
- విడిగా ఓ పాన్‌లో టీస్పూను నూనె వేసి పొడి కోసం తీసుకున్నవన్నీ వేసి వేయించాలి. చల్లారాక పొడి చేయాలి.
- టొమాటోను ముక్కలుగా కోసి అరకప్పు నీళ్లు పోసి మెత్తగా పిసికి రసం పిండాలి. కుక్కర్‌లో కందిపప్పు, పసుపు వేసి ఉడికించాలి. తరవాత మెత్తగా మెదిపి టొమాటో రసం, చింతపండు రసం, ఉప్పు వేసి కలపాలి.
- వెల్లుల్లి, మిరియాలు, జీలకర్ర మెత్తగా నూరాలి.
- మందపాటి గిన్నెలో టీస్పూను నూనె వేసి వెల్లుల్లి మిశ్రమం వేసి వేగాక పప్పు, టొమాటో, చింతపండు రసం వేసి సిమ్‌లో మరిగించాలి. తరవాత రసం పొడి వేసి ఉండలు కట్టకుండా కలుపుతూ మరికాసేపు మరిగించాలి.
- చిన్న బాణలిలో నూనె వేసి తాలింపుదినుసులన్నీ వేసి రసంలో కలపాలి. చివరగా కొత్తిమీర వేస్తే కళ్యాణరసం రెడీ. పెళ్లిళ్లలో ఎక్కువగా ఈ పద్ధతిలోనే ఈ వంటకాన్ని చేస్తుంటారు.