Eggless Rava Cake Recipe in Telugu : మనలో చాలా మంది కేక్‌ను ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. ఇక చిన్నపిల్లలైతే మరీ ఇష్టంగా తింటారు. బేకరీల్లో మనకు రకరకాల రుచుల్లో, ఆకారాల్లో కేక్స్ లభిస్తుంటాయి. అయితే చాలా వరకు కేక్స్ ఎగ్స్‌తో తయారుచేస్తుంటారు. ఇకపోతే కొన్ని రోజుల్లో క్రిస్మస్, నూతన సంవత్సరం రాబోతుంది. ఈ టైమ్‌లో స్వీట్స్ కన్నా కేక్స్కే ఎక్కువ డిమాండ్ ఉంటుంది. అందుకే మీ కోసం తక్కువ ఖర్చులో ఇంట్లోనే చేసుకునేలా అదిరిపోయే టేస్ట్ ఇచ్చే ఎగ్‌లెస్ కేక్(Cake Recipe) రెసిపీని పట్టుకొచ్చాం. దీనిని మీకు, పిల్లలకు నచ్చే విధంగా చాలా సింపుల్‌గా తయారు చేసుకోవచ్చు.
Eggless Rava Cake Recipe Making Process : ఈ కేక్‌ను వంటింట్లో ఉండే వాటితోనే తయారు చేయొచ్చు. దీనిని గోధమ పిండి, రవ్వ, పెరుగు వంటి వాటితో ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు బిగినర్ బేకర్ అయినా సరే.. ఇది బేకింగ్ చేయడంలో మిమ్మల్ని అసలు ఇబ్బందే పెట్టదు. అంతేకాకుండా ఈ కేక్‌ను పర్ఫెక్ట్గా కొలవాల్సిన అవసరం కూడా లేదు. ఇంతకీ ఈ సింపుల్ కేక్ రెసిపీకి కావాల్సిన పదార్థాలేంటి? దీనిని ఎలా తయారు చేసుకోవాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
ఈ కేక్ తయారీకి కావాల్సిన పదార్థాలివే..
- గోధుమ పిండి - అరకప్పు
- రవ్వ - 1 కప్పు ( దీనిని పిండిలాగా గ్రైండ్ చేసుకోవాలి)
- పంచదార - ముప్పావు కప్పు (గ్రైండ్ చేసుకోవాలి)
- ఆలివ్ ఆయిల్ - ముప్పావు కప్పు
- వెనీలా ఎసెన్స్ - అర టీస్పూన్
- ఉప్పు - చిటికెడు
- పెరుగు - 1 కప్పు
- పాలు - అరకప్పు
- బేకింగ్ సోడా - అర టీస్పూన్
- బేకింగ్ పౌడర్ - 1 టీస్పూన్
- పిస్తా - గార్నిష్ కోసం (కట్ చేసి పెట్టుకోవాలి)
పంచదార పాకం కోసం కావాల్సినవి..
- నీరు - అరకప్పు
- పంచదార - 2 టీస్పూన్స్
- నిమ్మరసం - 2 టీస్పూన్స్
బేక్ చేయకుండా కేక్ చేసుకోండిలా...
ఎగ్‌లెస్ రవ్వ కేక్ తయారీ విధానం..
- ముందుగా మీరు ఓవెన్‌ను 180 డిగ్రీల సెల్సియస్‌కు 10 నిమిషాల పాటు ప్రీ హీట్ చేయాలి. ఓవెన్ లేని వారు స్టౌ మీద అడుగు లోతుగా ఉండే ఓ మందపాటి గిన్నె తీసుకుని అందులో కొంచెం ఇసుక లేదా ఉప్పు పోసి.. ఓ చిన్న స్టాండ్ లేదా ప్లేట్ పెట్టుకుని 10 నిమిషాలు ప్రీ హీట్ చేసుకోవాలి.
- ఇప్పుడు ఓ బౌల్ తీసుకుని అందులో జల్లెడ పట్టిన గోధుమ పిండి, రవ్వను పోసుకోవాలి. ఆ తర్వాత దానిలో పంచదార పొడిని కూడా యాడ్ చేసుకుని బాగా కలపాలి.
- ఆపై ఉప్పు, పెరుగు, వెనీలా ఎసెన్స్ వేసి ఆ మిశ్రమాన్ని బాగ్ మిక్స్ చేసుకోవాలి.
- ముద్దలుగా లేకుండా కలిపిన తర్వాత.. ఆ మిశ్రమంలో ఆలివ్ నూనె వేసుకోవాలి. ఇది దానిని మరింత క్రీమీగా చేస్తుంది.
- ఇప్పుడు కొంచెం కొంచెంగా ఆ పిండిలో పాలు పోసుకోని కట్ అండ్ ఫోల్డ్ విధానంలో కలుపుకోవాలి.
- అనంతరం ఆ మిశ్రమంలో బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా వేసి బాగా మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి.
- ఇప్పుడు మీరు కేక్ మౌల్డ్ తీసుకుని దానికి నెయ్యి రాసుకోని.. దానిపైనా కొద్దిగా మైదాపిండి చల్లుకోవాలి.
- ఇప్పుడు మీరు ముందుగా తయారు చేసుకున్న పిండి మిశ్రమాన్ని అందులో వేయాలి. ఎలాంటి గ్యాప్స్ లేకుండా కేక్ టిన్ను మెల్లగా నేలపై టాప్ చేయాలి. ఈ విధంగా చేయడం వల్ల కేక్ సమానంగానూ.. మధ్యలో ఎలాంటి బబుల్స్ లేకుండాను వస్తుంది.
- ఆ తర్వాత బేకింగ్ కోసం ముందుగా ప్రీ హీట్ చేసుకున్న ఓవెన్లో 180 డిగ్రీల సెల్సియస్ వద్ద 45 నిమిషాల పాటు కేక్‌ను బేక్ చేయాలి. ఓవెన్ లేని వారు ముందుగా ప్రీ హీట్ చేసుకున్న గిన్నెలో పెట్టి 45 నిమిషాల పాటు సిమ్‌లో పెట్టి కుక్ చేసుకోవాలి.
- ఈ విధంగా తయారు చేసుకున్న కేక్‌ను ఓవెన్ నుంచి తీసి.. గది ఉష్ణోగ్రతకు చల్లారనివ్వాలి.
- ఆ తర్వాత కేక్‌ను డి-మోల్డ్ చేసి సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవాలి.
- ఇప్పుడు చక్కెర పాకం కోసం.. స్టవ్ వెలిగించి ఓ గిన్నె పెట్టి దానిలో పైన పేర్కొన్న విధంగా నీరు, చక్కెర వేయాలి.
- అది మరగడం ప్రారంభించే వరకు మీడియం మంట మీద హీట్ చేసుకొని.. తర్వాత నిమ్మరసం వేసి బాగా కలిపి స్టౌవ్ ఆఫ్ చేసుకోవాలి.
- ఇప్పుడు ముందుగా సర్వింగ్ ప్లేట్లో ఉంచుకున్న కేక్‌పై ఈ చక్కెర పాకం పోయాలి. కేక్ దీనిని పీల్చుకోవడానికి కొంత సమయం పడుతుంది.
- ఆ తర్వాత మీరు పిస్తాతో లేదా మీకు నచ్చిన డ్రైఫ్రూట్స్‌తో కేక్‌ను గార్నిష్ చేసుకోవచ్చు.
- అంతే పెద్దలకు, పిల్లలకు నచ్చే టేస్టీటేస్టీ ఎగ్‌లెస్ రవ్వ కేక్ రెడీ. ఇంటిల్లీ పాది చక్కగా దీనిని ఆస్వాదించవచ్చు. చక్కెరపాకం లేకుండా కూడా దీనిని తినవచ్చు..