సగానికిపైగా నదుల్లో నీరు తాగడానికి పనికిరాని దేశం మనది. ఇక్కడి నదులే కాదు- అసంఖ్యాకంగా చెరువులు, కుంటలతోపాటు భూగర్భ జలాలూ పోనుపోను విష కలుషితమవుతున్నాయి. హైదరాబాద్ మహానగర పరిధిలోనే రసాయన వ్యర్థాల ఉరవడి మొత్తం 185కుగాను వంద చెరువులకు అక్షరాలా మరణశాసనం లిఖిస్తోంది. ఇటీవల లాక్‌డౌన్ సమయంలో జల, వాయు నాణ్యత కొంత మెరుగుపడినప్పటికీ- వర్షాల మాటున గుట్టుచప్పుడు కాకుండా వ్యర్థాల విడుదల మళ్ళీ మొదటికొచ్చి పరిసర ప్రాంతాలు దుర్గంధ భూయిష్ఠమవుతున్నాయి. రూ.400కోట్లకుపైగా నిధుల్ని ప్రక్షాళన పేరిట వెచ్చించిన హుస్సేన్‌సాగర్ సహా జల వనరులెన్నింటికో టన్నులకొద్దీ రసాయన వ్యర్థాలు ఉచ్చు బిగిస్తున్నాయి. చెరువుల్లో అక్రమ నిర్మాణాలు వెలుస్తున్నా అధికారులు నిద్రపోతున్నారంటూ ఈసడించిన తెలంగాణ హైకోర్టు- 'హైదరాబాదును జైసల్మేర్‌లా మార్చేస్తారా' అని మొన్న జనవరిలో యంత్రాంగానికి గట్టిగా తలంటేసింది. ఆ మరుసటి నెలలోనే మున్నేరువాగులో వందల సంఖ్యలో బాతులు మృతి చెందిన ఘటన కలకలం రేకెత్తించింది. అంతకుమునుపు గండిగూడెం, గడ్డపోతారం పెద్దచెరువుల్లో భారీయెత్తున చేపలు చచ్చి గుట్టలుగా పోగుపడటం వెనక క్లోరోమీథేన్ వంటి రసాయన వ్యర్థాల పాత్రపై లోతైన కథనాలు వెలుగుచూశాయి. ఇప్పటికీ పరిస్థితి ఏమాత్రం కుదురుకోనేలేదని క్షేత్రస్థాయి విశ్లేషణలు ధ్రువీకరిస్తున్నాయి. ఇది ఏ ఒక్క ప్రాంతానికో, కొన్ని రాష్ట్రాలకో పరిమితమైన సమస్య కాదు. దేశవ్యాప్తంగా 80శాతం మేర ఉపరితల జలాలు కలుషితమయ్యాయన్న 'వాటర్ ఎయిడ్' సంస్థ నిర్ధారణ పరిస్థితి తీవ్రతను చాటుతోంది.
నీటి వనరులకు మరణశాసనం..
అరవై దశకంలో 260కిపైగా సరస్సులతో బెంగళూరు నగరం కళకళలాడుతుండేది. నేడక్కడ అందులో మిగిలినవి కేవలం పదే! రెండు దశాబ్దాలక్రితం 137 తటాకాలు కలిగిన అహ్మదాబాదులో 2012నాటికే సగందాకా నాశనమై నిర్మాణాలు వెలశాయి. గడచిన పన్నెండేళ్లుగా భాగ్యనగరంలో 3200 హైక్టార్లకుపైగా విస్తీర్ణంలో జలవనరులు మాయమైపోయినట్లు అంచనా. ఆరు దశాబ్దాలుగా బిహార్‌లోని పట్నా జిల్లాలో సుమారు 800 చెరువులు, సరస్సులు ఆక్రమణలకు గురయ్యాయని; జలసిరికి మారుపేరైన కేరళలో 73శాతం నీటి వనరులు కలుషితమైపోయాయని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. అంతకంతకు జలవనరుల సంఖ్య కృశించిపోతుండగా- మిగిలినవీ... నిబంధనలు ఉల్లంఘించి పరిశ్రమలు శుద్ధి చేయకుండా వదిలేస్తున్న విష రసాయనాలు, హానికర వ్యర్థాల బారినపడి విలవిల్లాడుతున్నాయి. తక్షణ దిద్దుబాటు చర్యలు చేపట్టకపోతే పరిమిత వనరుల్నీ జాతి శాశ్వతంగా కోల్పోయే ముప్పు పొంచే ఉందన్న ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఆచార్యులు డాక్టర్ రామచంద్ర ప్రభృతుల హెచ్చరికల్ని ప్రజాప్రభుత్వాలు ఇక ఎంతమాత్రం ఉపేక్షించే వీల్లేదు. దేశ జనాభాలో ఇప్పటికే 60కోట్లమంది తీవ్ర నీటిఎద్దడిని ఎదుర్కొంటున్నారు. మూడొంతులకు పైబడి నీటివనరులు కలుషితమైన కారణంగా ఏటా రెండు లక్షలమంది ప్రాణాలు కోల్పోతున్నట్లు 'నీతిఆయోగ్' లెక్కకట్టింది. శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంతో ఎన్నెన్ని అద్భుతాలు చేయగలిగినా, మనిషి నీటిని సృష్టించలేడు. ప్రకృతి ప్రసాదించిన ప్రతి నీటిబొట్టునూ సద్వినియోగపరచుకోవాల్సిన దశలో, పరిమిత జలవనరుల్నీ చేజార్చుకుంటున్న పోకడలు ఆత్మహత్యా సదృశాలు. అంతటి కీలక వనరును కలుషితం చేయడమన్నది గరిష్ఠ శిక్షకు అర్హమైన తీవ్రనేరం. అందుకు తగ్గట్లు విధివిధానాల్ని ప్రక్షాళించి, నీటి యాజమాన్యంలో మేలిమి ప్రమాణాలు నెలకొల్పడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిబద్ధమైనప్పుడే... పౌరుల జీవనహక్కు సురక్షితం!
ఇదీ చూడండి: ఆకాశంలో అద్భుతం.. 21న వలయాకార సూర్యగ్రహణం