ETV Bharat / opinion

అమెరికా చట్టం- చైనాకు 'టిబెట్​' సంకటం - Buddhist Successor

కరోనా మహమ్మారి పట్ల చైనాపై ప్రతికూల వైఖరి కనబరుస్తోన్న అమెరికా.. రాజకీయంగానూ అదే పద్ధతిని అనుసరిస్తోంది. ఇప్పటికే హాంకాంగ్​, షింజియాంగ్​, తైవాన్​, లద్దాఖ్​లలో చైనా దూకుడుకు కళ్లెం వేసిన అగ్రరాజ్యం.. ఇప్పుడు టిబెట్​లోనూ ఆ దేశానికి అడ్డుకట్ట వేసే ప్రయత్నాలను ముమ్మరం చేస్తోంది. ఈ మేరకు టిబెట్​ బౌద్ధమత అధినేత దలైలామా వారసుడి ఎంపికపై చైనా జోక్యం అవసరం లేని సంబంధిత బిల్లుపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ సంతకం చేశారు. ఈ నేపథ్యంలో అమెరికాలో ట్రంప్‌ సర్కారు టిబెటన్లకు వత్తాసుగా నూతన చట్టం తీసుకురావడం సరికొత్త మలుపుగా మారింది. భవిష్యత్తులో జో బైడెన్‌ ప్రభుత్వం కూడా ఇదే పంథా కొనసాగిస్తుందనడంలో సందేహం లేదు!

US PRESIDENT DONALD TRUMP SIGNED A BILL BELONGS TO ENSURE THE TIBETAN BUDDHIST DALAILAMA SUCCESSOR
టిబెట్‌పై పదునెక్కిన పంథా
author img

By

Published : Jan 2, 2021, 7:04 AM IST

చైనా పట్ల ఇంతవరకు వాణిజ్య, సాంకేతిక, సైనిక వ్యూహపరంగా కఠిన విధానాలు అనుసరించిన అమెరికా ఇక రాజకీయంగానూ కరకు వైఖరి అవలంబిస్తోంది. హాంకాంగ్‌, షింజియాంగ్‌, తైవాన్‌, లదాఖ్‌లలో చైనా దూకుడును తెగనాడిన వాషింగ్టన్‌ నాయకత్వం- తాజాగా టిబెట్‌లో చైనాకు చెక్‌ పెట్టే యత్నాలు మొదలుపెట్టింది. టిబెట్‌ బౌద్ధమతాధినేత దలైలామా వారసుడి ఎంపిక చైనా జోక్యం లేకుండా జరిగేట్లు చూడటానికి అంతర్జాతీయ సంకీర్ణాన్ని నిర్మించాలంటున్న బిల్లుపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సంతకం చేశారు. టిబెట్‌ రాజధాని లాసాలో అమెరికా దౌత్య కార్యాలయాన్ని తెరవడానికి చైనా అనుమతించనంతవరకు అమెరికాలో బీజింగ్‌ కొత్త దౌత్యాలయాలను తెరవడానికి ఒప్పుకొనేది లేదని కొత్త చట్టం పేర్కొంటోంది. టిబెట్‌లో, భారత్‌లో నివసిస్తున్న టిబెటన్‌ ప్రజలకు ఆర్థిక సహాయాన్ని అందించడానికి ఈ చట్టం ఏర్పాట్లు చేసింది. కొత్త దలైలామా ఎంపికకు అడ్డుపడే చైనా ప్రభుత్వాధికారులు, కమ్యూనిస్టు పార్టీ అధికారులు అమెరికాలో పర్యటించకుండా ఆంక్షలు విధించడానికీ ఈ చట్టం అధికారమిస్తోంది.

ఆక్రమణ వ్యూహాలు

ఇంతకాలం టిబెట్‌ పట్ల చూసీచూడనట్లు వ్యవహరిస్తూ వచ్చిన అమెరికా ఎట్టకేలకు ఇలా స్పందించడం విశేష పరిణామం. నిజానికి బ్రిటిష్‌ వలస పాలకులు కూడా టిబెట్‌ పట్ల ఉదాసీన వైఖరి అవలంబించేవారు. అందుకే, టిబెట్‌తో స్పష్టమైన సరిహద్దు రేఖనూ గుర్తించకుండా ఉపేక్షించారు. చైనాలో 1949లో ఏర్పడిన కమ్యూనిస్టు ప్రభుత్వం 1950లో టిబెట్‌ను ఆక్రమించడం, చైనాపై 1959లో టిబెటన్లు తిరగబడటం, దలైలామా భారత్‌కు శరణార్థిగా వలస రావడం వెంటవెంటనే జరిగిపోయాయి. టిబెట్‌కు అప్పుడూ ఇప్పుడూ కూడా మిగతా ప్రపంచంతో రవాణా సంబంధాలు లేవు. లాసాకూ చైనాకూ మధ్య కొన్ని రోడ్లు ఉండగా, నేపాల్‌తో హిమాలయాల మీదుగా ఒకే ఒక్క రహదారి ఉంది. ఇది వినా దక్షిణాసియాకూ టిబెట్‌కూ మధ్య మరే ఇతర రహదారీ లేదు. రోడ్లు లేకపోతే సైన్యాలు రాలేవు, సైన్యాలు రాకుంటే యుద్ధాలూ జరగవు.

చైనా ఆక్రమణలో అక్సాయ్​ చిన్​

కమ్యూనిస్టు చైనా 1951లో లదాఖ్‌లోని అక్సాయ్‌ చిన్‌ మీదుగా షింజియాంగ్‌ను టిబెట్‌ను కలుపుతూ ఒక రోడ్డు నిర్మాణం చేపట్టిన వెంటనే పరిస్థితి మారిపోయింది. స్కై రోడ్‌గా పిలిచే ఈ రోడ్డు భారత భూభాగమైన లదాఖ్‌లో 100 మైళ్ల దూరం సాగుతుంది. ఈ రోడ్డు చైనా మ్యాపులలో కనిపించేంతవరకు దాని గురించి భారత్‌లో ఎవరికీ తెలియదు. 1962లో రోడ్డు గురించి తెలిసిన వెంటనే యుద్ధం జరిగింది. అక్సాయ్‌ చిన్‌ చైనా ఆక్రమణలోకి వెళ్లింది. 55ఏళ్ల తరవాత ఆగ్నేయ టిబెట్‌ పొలిమేరల్లోని డోక్లామ్‌లో తిరిగి రహదారి నిర్మాణాన్ని చైనా చేపట్టింది. ఈసారి భారత్‌ అప్రమత్తమై ఆ యత్నాలను అడ్డుకుంది. నిర్మానుష్య, దుర్గమ హిమాలయాల్లో రహదారుల నిర్మాణాన్ని చేపట్టడానికి చైనా ఇంతలా తహతహలాడటమెందుకని ప్రశ్నించుకుంటే, టిబెట్‌ను శాశ్వతంగా తన గుప్పిట్లో ఉంచుకోవడానికన్న జవాబు వస్తుంది. షింజియాంగ్‌, టిబెట్‌ స్వయంపాలిత ప్రాంతాలను శాశ్వతంగా చైనాలో కలిపేసుకోవడానికే బీజింగ్‌- రోడ్లు, ఇతర మౌలిక వసతుల నిర్మాణాన్ని వేగిరం చేసింది. దక్షిణాఫ్రికా అంత వైశాల్యం ఉన్న టిబెట్‌ స్వయంపాలిత ప్రాంతంలో కేవలం 30 లక్షలమంది నివసిస్తున్నారు.

జాతి సమైక్యతా చట్టంతో..

చైనాలోని వివిధ రాష్ట్రాలు కైంకర్యం చేసిన టిబెట్‌ భూభాగాల్లో మరో 30 లక్షల మంది నివసిస్తున్నారు. ఆధునిక చైనా భూభాగంలో 25 శాతం టిబెట్‌దే అయినా, చైనా జనాభాలో టిబెటన్ల వాటా కేవలం 0.5శాతం. చైనాతో టిబెట్‌కు రోడ్డు, రైలు మార్గాలు విస్తరిస్తున్న కొద్దీ; చైనీయుల వలసలు పెరిగిపోతున్నాయి. 2020 జనవరిలో చైనా గుట్టుగా తెచ్చిన టిబెట్‌ జాతి సమైక్యతా చట్టం వేర్పాటువాదాన్ని గట్టిగా ప్రతిఘటించి మాతృభూమి చైనాతో మమేకం కావాలని టిబెటన్లకు ప్రబోధిస్తోంది. చైనీయులు టిబెట్‌లో స్థిర నివాసం ఏర్పరచుకోవడానికి ఈ చట్టం వీలు కల్పిస్తోంది. 2019 చివర్లో టిబెట్‌ స్వాతంత్య్రం, భారత్‌ నుంచి దలైలామా పునరాగమనాలను కోరుతూ పెద్దయెత్తున రేగిన నిరసనలను అణచివేయడానికే చైనా కొత్త చట్టం తీసుకొచ్చింది. ఇంతవరకు టిబెట్‌, భారత్‌లమధ్య ఉన్న 'బఫర్‌' మండలంలో ట్రక్కులు, రైళ్లు తిరగడానికి వీలులేకపోయినా- జడల బర్రెలు, గొర్రెల కాపరులు, యాత్రికులు మాత్రమే స్వేచ్ఛగా రాకపోకలు సాగించగలిగేవారు. ప్రజల రాకపోకలతోపాటు ఆన్‌లైన్‌ సంబంధాలను సైతం నిరోధించాలని చైనా ఆరాటపడుతోంది. వాస్తవాధీన రేఖ వెంబడి భారత్‌తో తాజా సంఘర్షణల పరమార్థమిదే.

కొత్త మలుపు

దీనితోపాటు నేపాల్‌, భూటాన్‌లతో సంబంధాలు బలపరచుకోవడం ద్వారా ఆ దేశాలను భారత్‌కు దూరం చేయాలని చైనా ప్రయత్నిస్తోంది. దలైలామా టిబెట్‌ స్వాతంత్య్రాన్ని కాకుండా చైనాలోనే స్వయంపాలనను కోరుతున్నారు. ప్రస్తుతానికి భారత్‌లోని టిబెట్‌ ప్రవాస ప్రభుత్వం ఈ మధ్యేమార్గాన్ని సమర్థిస్తున్నా, భావి ప్రవాస ప్రభుత్వాలు కూడా ఇదే పంథా అనుసరిస్తాయనే హామీ లేదు. ప్రవాస ప్రభుత్వానికి దలైలామా నాయకత్వం వహించడం లేదు. అది ప్రజాస్వామికంగా ఏర్పడే ప్రభుత్వం. అది రేపు సొంత నిర్ణయాలు తీసుకోవచ్చు. షింజియాంగ్‌లో వీగర్లను అణచివేసినట్లే టిబెటన్ల అణచివేతకూ చైనా సమాయత్తమవుతోంది. తదనుగుణంగా టిబెట్‌లో పోలీసు రాజ్యాన్ని ఏర్పరచి, బయటి ప్రపంచంతో- ముఖ్యంగా భారత్‌తో టిబెటన్లకు ఎలాంటి సంబంధాలూ లేకుండా చూడటానికి సరిహద్దు ఘర్షణలకు దిగింది. ఈ నేపథ్యంలో అమెరికాలో ట్రంప్‌ సర్కారు టిబెటన్లకు వత్తాసుగా నూతన చట్టం తీసుకురావడం సరికొత్త మలుపని చెప్పాలి. రేపు జో బైడెన్‌ ప్రభుత్వం కూడా ఇదే పంథా కొనసాగిస్తుందనడంలో సందేహం లేదు!

- ఆర్య, రచయిత

ఇదీ చదవండి: యూఎన్​ఎస్​సీలో భారత్​ సరికొత్త అధ్యాయం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.