వాతావరణ మార్పుల ప్రభావంతో రాబోయే 30 ఏళ్లలో దాదాపు 22 కోట్ల మంది నిరాశ్రయులుగా మారతారని ప్రపంచబ్యాంకు నివేదిక హెచ్చరించింది. అభివృద్ధి చెందిన దేశాల్లో విచ్చలవిడిగా వాహనాలు, ఏసీలు, రిఫ్రిజిరేటర్ల వాడకం, ఇతరత్రా కారణాల వల్ల భూతాపం విపరీతంగా పెరుగుతోంది. దీని దుష్ప్రభావాలు ఇప్పటికే కళ్లెదుట కనిపిస్తున్నాయి. భూతాపాన్ని వీలైనంత వరకూ తగ్గించడానికి ప్రయత్నించాలని, హరితవాయు ఉద్గారాలను అదుపులోకి తేవాలని ప్రపంచ దేశాలన్నీ సదస్సులు నిర్వహించి తీర్మానాలు చేసుకుంటున్నా, తగిన కార్యాచరణ కనిపించడం లేదు. నీటి కొరత ఏర్పడటం, పంట ఉత్పత్తులు గణనీయంగా తగ్గడం, సముద్ర మట్టాలు పెరగడం వంటివన్నీ ఒకదానితో మరొకటి ముడివడి ఉన్నాయి. వీటన్నింటి ఫలితంగా ప్రపంచంలోని పలు ప్రాంతాలు నివాసయోగ్యానికి పనికిరాకుండా పోతున్నాయి. ఫలితంగా అక్కడ ఉండేవారు నిరాశ్రయులు అవుతున్నారు. తాగునీరు, ఆహార అన్వేషణలో దేశాలు పట్టుకుని పోతున్నారు. ఇలాంటి వలసలు 2030తో మొదలై, 2050 నాటికి భారీగా పెరుగుతాయన్నది వాతావరణ నిపుణుల అంచనా.
అంచనాలకన్నా ఎక్కువే..
ఆఫ్రికాలాంటి ప్రాంతాలు ఎడారులుగా మారిపోతున్నాయి. అక్కడి జనాభా చాలావరకు వ్యవసాయం మీదే ఆధారపడటం, క్రమంగా పంటలు పండని పరిస్థితులు ఏర్పడటంతో వలసల ప్రభావం అధికంగా ఉంటోంది. ఉత్తర ఆఫ్రికాలోని మొత్తం జనాభాలో తొమ్మిదిశాతం వాతావరణ కారణాలతో వలసబాట పడతారని అంచనా. వాతావరణ పరిస్థితులు మెరుగుపడితే ప్రపంచవ్యాప్త వలసలు, నిరాశ్రయుల సంఖ్య నాలుగున్నర కోట్లకు పరిమితం కావచ్చని వాతావరణ నిపుణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచబ్యాంకు గతంలో విడుదల చేసిన తొలి నివేదికలో ప్రధానంగా ఆఫ్రికా, దక్షిణాసియా, లాటిన్ అమెరికా ప్రాంతాలపై దృష్టిపెట్టగా- తాజాగా తూర్పు, మధ్య ఆసియా, పసిఫిక్, ఉత్తర ఆఫ్రికా, తూర్పు ఐరోపా ప్రాంతాల్లో పరిస్థితిని విశ్లేషించారు. ఈ ప్రాంతాల్లో మూడొంతుల జనాభా నిరాశ్రయులై, వలస వెళ్ళాల్సి వస్తుందని పర్యావరణ వ్యవహారాల నిపుణులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. వలసల విషయంలో వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్న దానికన్నా వాస్తవ సంఖ్య చాలా ఎక్కువగా ఉండవచ్చని భావిస్తున్నారు. ఎందుకంటే, ఆ అంచనాల్లో ఐరోపాలోని కొన్ని ప్రాంతాలతో పాటు ఉత్తర అమెరికా, మధ్య ప్రాచ్యం, ఇతర చిన్న దేశాలను పరిగణనలోకి తీసుకోలేదు. వాటినీ కలిపితే పరిస్థితి మరింత తీవ్రంగా ఉంటుంది. మొత్తం ఉద్గారాలు వెలువడే ప్రాంతాల్లో అగ్రస్థానంలో అమెరికా, ఆ తరవాత చైనా, రష్యా, జర్మనీ ఉన్నాయి. భారతదేశానిది అయిదోస్థానం. తరవాత వరసగా ఇంగ్లాండ్, జపాన్, ఫ్రాన్స్, ఉక్రెయిన్, కెనడా నిలిచాయి. వీటి ప్రభావం మిగిలిన ప్రపంచం మొత్తమ్మీద పడుతోంది. అయినప్పటికీ అగ్రరాజ్యాలు ఉద్గారాల నియంత్రణ బాధ్యతను మొత్తం అభివృద్ధి చెందుతున్న దేశాల మీదకే నెడుతున్నాయి. గడచిన దశాబ్ద కాలంలో హింస, సంఘర్షణలకన్నా వాతావరణ మార్పుల వల్ల తలెత్తిన సంక్షోభంతో రెట్టింపు సంఖ్యలో ప్రజలు నిరాశ్రయులయ్యారని ఐక్యరాజ్యసమితి శరణార్థుల సంస్థ (యూఎన్‌హెచ్‌సీఆర్) వెల్లడించింది. వాతావరణ మార్పుల వల్ల సంభవించే విపత్తుల కారణంగా పేదరికం, ఆకలి, ప్రకృతి వనరుల అందుబాటు బాగా తగ్గిపోయాయి. తద్వారా అస్థిరత, హింస పెరిగిపోయి వలసలకు దారితీశాయని ఆ సంస్థ తన నివేదికలో తెలిపింది. పలు దేశాల్లో అన్నిచోట్లా కరవు, వరదలు, ఇతర వాతావరణ దుష్పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వీటివల్ల కోట్ల సంఖ్యలో ప్రజలు వలసబాట పట్టక తప్పని పరిస్థితి తలెత్తుతోంది.
ఆచరణలో పెడితేనే ఫలితాలు
వాతావరణ విపత్తుల వల్ల 2010 నుంచి ఇటీవలి వరకు ఏడాదికి సగటున రెండు కోట్లకు పైగా ప్రజలు తమ సొంత ప్రాంతాలను వీడి వెళ్ళారు. వాతావరణ మార్పుల ప్రభావాన్ని ఎదుర్కోవడానికి సంసిద్ధంగా లేని దేశాల నుంచే 90శాతం వలసలు ఉంటున్నాయన్నది యూఎన్‌హెచ్‌సీఆర్ మాట. ప్రపంచంలోనే విపత్తులు ఎక్కువగా సంభవించే దేశం అఫ్గానిస్థాన్. అక్కడ గత 30 ఏళ్లలో పలు రాష్ట్రాలు ఏదో ఒక విపత్తుకు గురయ్యాయి. 2021 తొలి త్రైమాసికంలో అఫ్గాన్ జనాభాలో కనీసం సగం మందికి తగినంత ఆహారం అందలేదు. 2020 మధ్యనాటికి 26 లక్షల మంది అఫ్గాన్లు వలస వెళ్ళగా- మరో 27 లక్షల మంది పాకిస్థాన్, ఇరాన్ లాంటి దేశాలకు శరణార్థులుగా తరలిపోయారు. మొజాంబిక్‌లోనూ సంఘర్షణలు, విపత్తులు లక్షల సంఖ్యలో ప్రజల వలసలకు కారణమయ్యాయి. తరచూ తుపానులు, వరదలు సంభవించే బంగ్లాదేశ్‌లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం భారత్ లాంటి దేశాల్లో విద్యుత్ వాహనాలకు ఆదరణ క్రమంగా పెరుగుతుండటంతో వాహనాల ద్వారా వెలువడే వాయువులు కొంతవరకు తగ్గే అవకాశం కనిపిస్తోంది. వీటితోపాటు పరిశ్రమలు, విద్యుదుత్పత్తిలో సంప్రదాయేతర ఇంధన వనరులను ఉపయోగించడం ద్వారా ఉద్గారాలను గణనీయంగా నియంత్రించగలిగితే సమస్య చాలావరకు తగ్గుతుంది. ఐక్యరాజ్యసమితి పర్యావరణ మార్పు సదస్సు (కాప్-26) నేపథ్యంలో ఈ అంశంపై ఇప్పటికే విస్తృతమైన చర్చ మొదలైంది. దీన్ని అర్థవంతంగా ముందుకు తీసుకెళ్ళి, ఆచరణలో పెడితేనే సత్ఫలితాలు సాధ్యమవుతాయి.
- రఘురామ్
ఇదీ చదవండి:corona vaccination: వచ్చే నెలలో మరో 30 కోట్ల డోసులు