దేశంలో ఒకప్పుడు వద్దనుకొని మూసిపెట్టిన అభివృద్ధి బ్యాంకులూ రుణ సంస్థల భావనను కేంద్ర ప్రభుత్వమిప్పుడు అనివార్య పరిస్థితుల్లో ముద్దు చేస్తోంది. మౌలిక సదుపాయాల పరికల్పనకు పెద్దయెత్తున తోడ్పడటంతోపాటు మొండిబాకీల పీడకూ సరైన విరుగుడుగా అక్కరకొస్తుందంటూ డీఎఫ్‌ఐ (డెవలప్‌మెంట్ ఫైనాన్స్ ఇన్‌స్టిట్యూషన్) ఆవిర్భావానికి రంగం సిద్ధమవుతోంది. దేశీయ రుణ విపణిని విదేశీ సంస్థాగత మదుపుదారులకు ఆకర్షణీయంగా మలచగలదన్న అంచనాతో, విత్తమంత్రి నిర్మలా సీతారామన్ ఇటీవలి బడ్జెట్ సమర్పణ ఘట్టంలో డీఎఫ్‌ఐ అవతరణ ఆవశ్యకతను ప్రస్తావించగా- దానికి కేంద్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది.
అప్పుడు రద్దు..ఇప్పుడు ముద్దు
కొవిడ్ మహాసంక్షోభం పాలబడి అనూహ్యంగా కుంగిన దేశార్థికానికి నూతన వ్యవస్థ ప్రాణవాయువులు ఊదగలదంటూ ప్రవేశపెట్టిన బిల్లు, దీర్ఘకాలిక పెట్టుబడులను ప్రోత్సహించే నిమిత్తం పదేళ్లపాటు పన్ను చెల్లింపు బాదరబందీలేమీ ఉండవంటోంది. తాజా చొరవతో 2024 సంవత్సరం నాటికి 7671 మౌలిక ప్రాజెక్టుల్లోకి 111 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు ప్రవహిస్తాయని కేంద్రం అంచనా వేస్తోంది. ఇప్పటికే చైనా, బ్రెజిల్, సింగపూర్, దక్షిణ కొరియా, జపాన్, జర్మనీ వంటిచోట్ల ఆర్థిక పునరుత్తేజ సాధనలో ముఖ్యభూమిక పోషిస్తున్న అభివృద్ధి బ్యాంకుల వ్యవస్థ దేశీయంగానూ సంక్లిష్టతల్ని గడ్డుసవాళ్లను అధిగమించడంలో సమర్థంగా తోడ్పడగలదన్న దిలాసా- కేంద్ర ప్రభుత్వంలో వ్యక్తమవుతోంది. 1964నాటి భారత దేశ మౌలిక సదుపాయాల అభివృద్ధి బ్యాంకు (ఐడీబీఐ) చట్టం రద్దుకావడంతో 2003లో ఇక్కడ డీఎఫ్‌ఐల శకం ముగిసింది. మునుపటి చేదు అనుభవాలు పునరావృతం కాకుండా తీసుకునే జాగ్రత్తలే, ఇకమీదట అభివృద్ధి బ్యాంకు గెలుపోటముల్ని నిర్దేశిస్తాయి!
రాజకీయ శాపం
విస్తృత పారిశ్రామికీకరణను అభివృద్ధి బ్యాంకులు శీఘ్ర ప్రాతిపదికన సాకారం చేయగలవన్న విశ్వాసం, దేశంలో దశాబ్దాల క్రితమే మొగ్గ తొడిగింది. అదే దన్నుగా జాతీయ స్థాయిలో ఐఎఫ్‌సీఐ (1948), ఐసీఐసీఐ (1955), ఐడీబీఐ (1964), రాష్ట్రస్థాయిలో ఎస్‌ఎఫ్‌సీ, ఎస్‌ఐడీసీ అవతరించాయి. ప్రభుత్వమే ప్రధాన ఆర్థిక వనరుగా ఉండటంవల్ల స్వతంత్ర సంస్థలుగా వ్యవహరించలేకపోవడం, క్రమేపీ రాజకీయ జోక్యం పెచ్చరిల్లడం- డీఎఫ్‌ఐల మనుగడను కుంగదీశాయి. ఆయా సంస్థల విధాన నిర్ణయాల్లో బాధ్యతారాహిత్యం జోరెత్తి వాటి నడక, లాభదాయకత దెబ్బతిన్నాయి. నిరర్థక రుణా(ఎన్‌పీఏ)లలో అవి వాణిజ్య బ్యాంకుల్ని తలదన్నే దురవస్థ దాపురించింది.
అందుకే మొండిబాకీలు
దీర్ఘకాలిక రుణాల పంపిణీలో డీఎఫ్‌ఐల ఏకచ్ఛత్రాధిపత్యానికి తెరదించి అన్నిరకాల రుణ వితరణ అవకాశాన్ని సాధారణ వాణిజ్య బ్యాంకులకు కల్పించాలన్న ఉన్నత స్థాయి కమిటీల సిఫార్సుల దరిమిలా- విరివిగా సంస్కరణలు చోటుచేసుకున్నాయి. ఐసీఐసీఐ లాంటివి కొన్ని వాణిజ్య బ్యాంకులుగా రూపాంతరం చెందాయి. అనంతర కాలంలో చిన్నాచితకా బ్యాంకులూ కూటములుగా ఏర్పడి పోటాపోటీగా దీర్ఘకాలిక రుణాలివ్వడం, అనుకున్న సమయానికి భూసేకరణ సాధ్యపడక ఇతరత్రా అవాంతరాలతో మౌలిక సదుపాయ సంస్థలు చతికిలపడి మొండిబాకీలు ఇంతలంతలు కావడం తెలిసిందే.
డీఎఫ్‌ఐకి తిరుగులేని రక్షణ ఛత్రం
మూడు దశాబ్దాలక్రితం ఆర్థిక సంస్కరణలతో ప్రపంచీకరణ గవాక్షాలు తెరిచినా, మౌలిక సదుపాయాల పరంగా నేటికీ ఇండియా ఈసురోమనే దుస్థితిని చెదరగొట్టేందుకంటూ- డీఎఫ్‌ఐ యోచన మళ్లీ తెరపైకి వచ్చింది. అభివృద్ధి బ్యాంకు తీసుకునే ఏ నిర్ణయాన్నీ చట్టబద్ధంగా సవాలు చేసే అవకాశంగాని, బాధ్యుల్ని ప్రశ్నించే వెసులుబాటుగాని ఉండవంటున్న తాజా బిల్లు- డీఎఫ్‌ఐకి తిరుగులేని రక్షణ ఛత్రం ప్రసాదిస్తామంటోంది. రుణాల మంజూరులో పక్షపాత ధోరణులే గతంలో అభివృద్ధి బ్యాంకుల పుట్టి ముంచాయన్న వాస్తవిక స్పృహతో కేంద్రం వ్యవహరించాలి. అడుగడుగునా జవాబుదారీతనం ప్రస్ఫుటమయ్యే పటిష్ఠ దిద్దుబాటు చర్యలే అభివృద్ధి బ్యాంకును రుణసంజీవనిగా నిలబెట్టగలిగేది!
ఇదీ చదవండి: భారత్ ఆశలకు కరోనా గండి- లక్ష్య సాధన మూడేళ్లు ఆలస్యం!