బిల్డర్ల దోపిడి నుంచి కొనుగోలుదారులను రక్షించడానికి కేంద్ర ప్రభుత్వం ఒక ఏకీకృత నమూనాతో 'బిల్డర్-కొనుగోలుదారు ఒప్పంద పత్రాన్ని' రూపొందించవలసిన ఆవశ్యకత ఉందని దేశ సర్వోన్నత న్యాయస్థానం ఇటీవల స్పష్టం చేసింది. నమూనా ఒప్పంద పత్ర రూపకల్పనపై కేంద్ర ప్రభుత్వ స్పందనకోసం నోటీసు జారీ చేసింది. లక్షలాది గృహ కొనుగోలుదారుల కష్టనష్టాల నివారణకు ఒక నమూనా బిల్డర్-కొనుగోలుదారు ఒప్పంద పత్ర రూపకల్పనకు కేంద్రాన్ని, రాష్ట్రాలను ఆదేశించవలసిందిగా అశ్వినీ ఉపాధ్యాయ అనే సామాజిక కార్యకర్త సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. దాని విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఈ మేరకు స్పందించింది. ప్రస్తుతం అమలులో ఉన్న ఒప్పంద పత్రాల్లోని నిబంధనలు బిల్డర్లకు అనుకూలంగా ఏకపక్షంగా ఉన్నాయని పిటిషన్‌దారు పేర్కొన్నారు. ఆ వాదనతో ఏకీభవించిన సుప్రీంకోర్టు లక్షలాది గృహ కొనుగోలుదారుల ప్రయోజనాలను రక్షించడానికి ఏకీకృత బిల్డర్ కొనుగోలుదారు నమూనా ఒప్పంద పత్రం అవసరమని అభిప్రాయపడింది. కేంద్ర ప్రభుత్వం అటువంటి ఒప్పంద పత్రాన్ని రూపొందిస్తే దాని అమలుకు రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశిస్తానని అత్యున్నత న్యాయస్థానం వెల్లడించింది.
ఏకపక్షంగా షరతులు
గృహ కొనుగోలుదారుల ప్రయోజనాలే పరమావధిగా కేంద్రం 2016లో 'రెరా' చట్టాన్ని రూపొందించింది. రెరా చట్టం సెక్షన్ 13 బిల్డర్ కొనుగోలుదారుల ఒప్పంద పత్రంలో ఏయే అంశాలుండాలో విపులంగా విశదీకరించింది.ఉల్లంఘనలకు శిక్షల్నీ ప్రస్తావించింది. ఆ చట్టం అమలులోకి రావడానికి ముందు కూడా పలు కేసుల్లో సుప్రీంకోర్టు, జాతీయ వినియోగదారుల ఫిర్యాదుల పరిష్కార సంస్థ కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా గృహ అమ్మకపు పత్రాల్లోని ఏకపక్ష నిబంధనలను కొట్టివేస్తూ తీర్పులిచ్చాయి. బిల్డర్లు వినియోగదారులకు
గృహాల అప్పగింతలో చేస్తున్న జాప్యాన్ని లెక్కగట్టి పరిహారాన్ని కూడా వడ్డీతో సహా నిర్దేశించాయి. జాప్యానికి పరిహారం సూపర్ ఏరియాలో చదరపు అడుగుకు అయిదు రూపాయలుగా చాలా ఒప్పంద పత్రాలు పేర్కొంటున్నాయి. ఒప్పందంలో ఉన్నంత మాత్రాన అయిదు రూపాయలకంటే ఎక్కువ పరిహారాన్ని నిరాకరించడానికి వీల్లేదని డీఎల్‌పీ సదరన్ హెూమ్స్ కేసుల్లో జాతీయ వినియోగదారుల ఫిర్యాదుల పరిష్కార సంస్థ తీర్పు వెలువరించింది. అమ్మకపు ఒప్పంద పత్రం అంతిమం కాదని కోర్టులు పేర్కొన్నాయి. తమ ప్రయోజనాలకు భంగం కలిగించే విధంగా ఏకపక్షంగా ఉన్న షరతులకు వినియోగదారులు కట్టుబడవలసిన అవసరం లేదని కూడా కోర్టులు తీర్పులను వెలువరించాయి.
ఒప్పంద పత్రాల్లో దుర్విచక్షణతో కూడిన ఒక నిబంధన ఏమిటంటే- కొనుగోలుదారు చెల్లింపులు ఆలస్యం చేస్తే, వాయిదా మొత్తాన్ని 18-24శాతం చక్ర వడ్డీతో చెల్లించాలనేది. బిల్డర్ మాత్రం నిర్మాణంలో తన ఆలస్యానికి ఒప్పందం రద్దుకు రెండు శాతం వడ్డీ మాత్రమే చెల్లిస్తాడు. తాను నిర్మిస్తున్న గృహాల విస్తీర్ణాన్ని ఎప్పుడైనా మార్చే వెసులుబాటును బిల్డర్‌కు కొన్ని ఒప్పంద పత్రాలు కల్పించాయి. కొనుగోలుదారు సమ్మతి లేకుండా బిల్డింగ్ ప్రణాళిక మార్చడానికీ కొన్ని ఒప్పంద పత్రాలు బిల్డర్‌కు అధికారమిచ్చాయి. అవిభాజితమైన స్థలాన్ని కొనుగోలుదారులందరి పేరిట రిజిస్టర్ చేసి దానిలో తలా ఒక ఫ్లాట్ నిర్మించి ఇస్తామని ఒప్పందాలు చేసుకుంటున్నారు. ఏళ్లు గడుస్తున్నా ప్రాజెక్టులు పూర్తికాక పోవడంతో కొనుగోలుదారులు ఆందోళన చెందుతున్నారు. ఇటువంటి ఒప్పంద పత్రాలకు చట్టబద్ధత లేదని, ఈ ఒప్పందాలు కుట్ర, మోసం వంటి నేరాల కోవలోకి వస్తాయని నిపుణులు చెబుతున్నారు.
విప్లవాత్మక మార్పులకు నాంది
గృహ కొనుగోలుదారుల ప్రయోజనాల పరిరక్షణకు ఏర్పడిన రెరా చట్టం అమ్మకపు ఒప్పంద పత్రంలో ఏ అంశాలుండాలో సమగ్రంగా వివరించింది. రెరా చట్టం సెక్షన్ 13(1) ప్రకారం ఒప్పంద సమయంలో అడ్వాన్సుగా గృహం ధర మొత్తంలో 10శాతం కంటే ఎక్కువగా బిల్డర్ తీసుకోరాదు. అమ్మకపు ఒప్పంద పత్రంలో ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని విషయాలు వివరించాలి. ప్రభుత్వ, స్థానిక సంస్థల అనుమతుల వివరాలుండాలి. చట్టం ప్రకారం అమ్మకపు ఒప్పంద పత్రం ఆయా అంశాలను ప్రతిఫలించేదిగా ఉండాలి. 'రెరా' చట్టం అమలుకు రాష్ట్రాలు అంతగా ఆసక్తి చూపడం లేదు. చాలా రాష్ట్రాలు రెరా చట్టంలోని నిబంధనలను నీరుగార్చాయని కేంద్ర గృహ మంత్రిత్వశాఖ ప్రకటించింది. తెలుగు రాష్ట్రాల్లో 'రెరా'లో రిజిస్ట్రేషన్ చేసుకున్న ప్రాజెక్టుల సంఖ్య చాలా స్వల్పంగా ఉంది. నిబంధనలను ఉల్లంఘిస్తున్న యజమానులపై చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వాలు వెనకాడుతున్నాయి. అందువల్ల రెరా చట్టం లక్ష్యాలు నెరవేరడం లేదు. ఇటువంటి పరిస్థితుల్లో సుప్రీంకోర్టు నిర్దేశించిన విధంగా దేశమంతటికీ వర్తించే ఏకీకృత నమూనా ఒప్పంద పత్రం గృహ కొనుగోలుదారులకు అత్యంత ఉపకారిగా ఉండటమే కాక, వారి ప్రయోజనాల పరిరక్షణలో కీలకపాత్ర నిర్వహిస్తుంది. రెరా చట్టంలోని నిబంధనలకు అనుగుణంగా ఒప్పంద పత్రం ఉంటే సరిపోతుందని, ఏకీకృత ఒప్పంద పత్రం అవసరం లేదని కొందరు భావిస్తున్నారు. ఏకీకృత ఒప్పందం వల్ల నిరక్షరాస్యులకు మేలు జరుగుతుంది. నమూనా ఒప్పంద పత్రం రూపకల్పన అమలుతో స్థిరాస్తి రంగంలో గిరాకీ అధికమై ఆదాయం గణనీయంగా పెరిగి ఉపాధి అవకాశాలు మెరుగవుతాయి. రెరా లక్ష్యాలు పూర్తి స్థాయిలో నెరవేరుతాయి. సుప్రీంకోర్టు నిర్ణయం స్థిరాస్తి రంగంలో విప్లవాత్మక మార్పులకు నాంది అవుతుందని వినియోగదారుల సంఘాలు అభివర్ణిస్తున్నాయి.
వేధిస్తున్న జాప్యం
బిల్డర్ గృహాలను పూర్తి స్థాయిలో నిర్మించి, కొనుగోలుదారుడికి స్వాధీనం చేయడానికి సాధారణంగా 36-48 నెలల సమయాన్ని ఒప్పంద పత్రాలు నిర్దేశిస్తున్నాయి. ఆ సమయాన్ని 'కమిట్‌మెంట్ పీరియడ్' అంటారు. నిర్మాణం ప్రారంభమైన నాటి నుంచి అది మొదలవుతుందని కొన్ని ఒప్పంద పత్రాలు పేర్కొంటున్నాయి. పత్రాల్లో ఎక్కడా ఇందుకు సంబంధించిన నిబంధన లేకపోవడం బిల్డర్‌కు వరంగా మారుతోంది. జాప్యానికి పరిహారం 9.1శాతం వడ్డీతో చెల్లించాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన మిల్ జైన్ వర్సెస్ వేవ్ సిటీ సెంటర్ కేసులో నిర్మాణ సంస్థ వినియోగదారుడికి గృహాన్ని అప్పగించడానికి తొమ్మిదేళ్లు తీసుకుంది. ఇటువంటి పరిస్థితుల్లో సొంత ఇంట్లో నివసించాలని కలలుకంటున్న ఎంతోమంది కొనుగోలుదారులు ఆ సమయం ఎప్పుడు వస్తుందో తెలియక నిరాశ, నిస్పృహల్లో కూరుకుపోతున్నారు. అమ్మకపు ఒప్పంద పత్రం రాసుకున్న తేదీనుంచే కమిట్‌మెంట్ పీరియడ్ ప్రారంభమవుతుందని సుప్రీంకోర్టు ఓ కేసులో చెప్పింది.
-పుల్లూరు సుధాకర్
ఇదీ చూడండి: 'న్యాయ వృత్తి లాభం కోసం కాదు.. సమాజ సేవకే'