ETV Bharat / opinion

భావితరాలకు దిశానిర్దేశం-‘శాస్త్రీయ సామాజిక బాధ్యత’ - సాంకేతికత

విజ్ఞానశాస్త్రం, సాంకేతికతలను భావితరాలకు అందించే విధంగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. శాస్త్రీయ సామాజిక బాధ్యత (ఎస్‌ఎస్‌ఆర్‌) అనే నూతన ఒరవడికి శ్రీకారం చుట్టింది. సామాజిక ప్రగతికి విజ్ఞానశాస్త్రాన్ని సమర్థంగా వినియోగించేలా శాస్త్రవేత్తలను, శాస్త్రవిజ్ఞాన సంస్థలను ప్రోత్సహించడం ఎస్‌ఎస్‌ఆర్‌ ధ్యేయం.

technology is social responsibility
భావితరాలకు దిశానిర్దేశం-‘శాస్త్రీయ సామాజిక బాధ్యత’
author img

By

Published : Dec 13, 2020, 8:35 AM IST

కార్పొరేట్‌ సామాజిక బాధ్యత మాదిరిగా ‘శాస్త్రీయ సామాజిక బాధ్యత (ఎస్‌ఎస్‌ఆర్‌)’ను తలకెత్తుకోవాలని భారత్‌ సంకల్పించింది. ప్రపంచంలో ఇలాంటి ఉదాత్త కార్యక్రమాన్ని చేపట్టబోతున్న మొట్టమొదటి దేశం మనదే. సామాజిక ప్రగతికి విజ్ఞానశాస్త్రాన్ని సమర్థంగా వినియోగించేలా శాస్త్రవేత్తలను, శాస్త్రవిజ్ఞాన సంస్థలను ప్రోత్సహించడం ఎస్‌ఎస్‌ఆర్‌ ధ్యేయం. ప్రజా సంక్షేమానికి సామాజిక చైతన్యాన్ని, శాస్త్ర విజ్ఞానాన్ని మేళవించడం శాస్త్రీయ సామాజిక బాధ్యత పరమార్థం. ప్రజలు ప్రభుత్వానికి పన్నులు చెల్లించడంవల్ల సమకూరే ఆదాయంలో కొంత శాస్త్ర సాంకేతిక రంగాలకు కేటాయిస్తున్నారు. ఆ నిధులను శాస్త్రజ్ఞులు, సాంకేతిక నిపుణుల శిక్షణకు వెచ్చిస్తున్నారు. శాస్త్రసాంకేతిక రంగాల్లో పనిచేస్తున్న నిపుణులు తమ ఎదుగుదలకు తోడ్పడిన సమాజానికి తమవంతు ప్రతిఫలాన్ని అందించి రుణం తీర్చుకోవడమే ‘శాస్త్రీయ సామాజిక బాధ్యత’ అంతరార్థం. ప్రభుత్వం దీనికి సంబంధించిన ముసాయిదాపై గత ఏడాది సెప్టెంబరులో ప్రజల సలహాలు ఆహ్వానించింది. కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమంపై అవగాహన కల్పించేందుకు వెబినార్‌లు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం అమలులో మొదటి అడుగుగా జాతీయ డిజిటల్‌ పోర్టల్‌ ఏర్పాటు చేశారు. దీనిద్వారా సామాజిక అవసరాలు తీర్చగల శాస్త్రసాంకేతిక పరిష్కారాలను గుర్తిస్తారు.

గతానుభవాలే సోపానాలుగా..

శాస్త్రీయ సామాజిక బాధ్యత ముసాయిదాకు గతంలో విడుదలైన కొన్ని విధానాలు, తీర్మానాలే ప్రాతిపదిక. వాటిలో 1958నాటి శాస్త్ర విధాన తీర్మానం, 1983 సాంకేతిక విధాన తీర్మానం, 2003 శాస్త్ర, సాంకేతిక విజ్ఞాన విధానం, 2013 శాస్త్ర, సాంకేతిక నవీకరణ విధానం కీలకమైనవి. సైన్సును సమాజహితం కోసం మరింత విస్తృతంగా ఉపయోగిస్తే- డిజిటల్‌ ఇండియా, మేకిన్‌ ఇండియా, స్వచ్ఛ భారత్‌, అభివృద్ధి కేంద్రాలుగా జిల్లాల రూపాంతరం వంటి పథకాలు ఆశించినదానికన్నా ఎక్కువగా విజయం సాధిస్తాయని కేంద్రం భావిస్తోంది. ఎస్‌ఎస్‌ఆర్‌ మరింతమంది సామాజికాభ్యుదయ సంస్థల వ్యవస్థాపకులను, శాస్త్ర, సాంకేతిక అంకుర పరిశ్రమలను ప్రోత్సహించగలదు. ఎస్‌ఎస్‌ఆర్‌ ముసాయిదా అనేక కార్యక్రమాలను ప్రతిపాదిస్తోంది. శాస్త్ర సాంకేతిక ప్రదర్శనల నిర్వహణ, శిక్షణలకు మార్గదర్శకత్వం వంటి కార్యక్రమాలు సైతం ఇందులో భాగమే. పరిశోధన సంస్థలు తమ మౌలిక సదుపాయాలను పాఠశాల, కళాశాల విద్యార్థులకు అందుబాటులోకి తేవాలని, శిక్షణ కార్యక్రమాలు, కార్యశాలలను నిర్వహించి విద్యార్థుల్లో నైపుణ్యాలను పెంచాలని ఎస్‌ఎస్‌ఆర్‌ ఉద్దేశిస్తోంది. ఆరోగ్యం, పారిశుద్ధ్యం, పర్యావరణ రక్షణకు శాస్త్రీయ ఆవిష్కరణలను ప్రోత్సహిస్తోంది. ప్రజల ఆదాయాలు పెంచడానికి, స్థానిక సమస్యలకు శాస్త్రసాంకేతిక నిపుణులు డిజిటల్‌ పరిష్కారాలతో ముందుకు రావాలంటోంది.

కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రతి శాస్త్ర సాంకేతిక సంస్థ తమ వ్యూహాలను రూపొందించుకుని ఎస్‌ఎస్‌ఆర్‌ను అమలు చేస్తాయి. తమ ఛత్రం కింద పనిచేస్తున్న విజ్ఞానాధార సిబ్బందికి సామాజిక హితం కోసం పాటుపడటానికి స్ఫూర్తినిస్తాయి. ప్రతి ఉద్యోగీ ఏడాదికి కనీసం పది రోజులపాటు ఎస్‌ఎస్‌ఆర్‌ బాధ్యతలు నిర్వహించాలి. ప్రతి ప్రభుత్వ శాఖ, శాస్త్ర సాంకేతిక సంస్థ తమ సిబ్బంది ఎస్‌ఎస్‌ఆర్‌ విధుల నిర్వహణను పర్యవేక్షిస్తాయి. వ్యక్తిగత ఎస్‌ఎస్‌ఆర్‌ కార్యకలాపాలకు తగిన నిధులు కేటాయిస్తారు. సిబ్బంది వార్షిక పనితీరు నివేదికలో ఎస్‌ఎస్‌ఆర్‌ బాధ్యతలకు తగిన వెయిటేజి ఇస్తారు. ఎస్‌ఎస్‌ఆర్‌ బాధ్యతల నిర్వహణకు నిధులతోపాటు, సిబ్బంది, మౌలిక వసతులు అవసరమవుతాయి. వీటిని అందించడానికి వివిధ పద్ధతులు అనుసరించనున్నారు. ఒకటి- పార్లమెంటు చట్టం ద్వారా ఉనికిలోకి వచ్చిన సైన్స్‌, ఇంజినీరింగ్‌ రీసెర్చ్‌ బోర్డు (సెర్బ్‌) నమూనాలో ఎస్‌ఎస్‌ఆర్‌కు ప్రాజెక్టుల వారీగా నిధులు, వసతులు, సిబ్బందిని కేటాయించడం. రెండు- ప్రాజెక్టు బడ్జెట్‌లో నిర్ణీత మొత్తాన్ని కేటాయించడం. మూడు- మూల్యాంకన సంఘం తగిన నిధులను సిఫార్సు చేయడం.

బహుళ ప్రయోజనాలు

ఎస్‌ఎస్‌ఆర్‌ అమలు వల్ల బలహీన వర్గాల సంక్షేమానికి శాస్త్ర సాంకేతిక విజ్ఞానాలను సమర్థంగా వినియోగించవచ్చు. సమాజంలో అత్యధిక సంఖ్యాకులకు లబ్ధి చేకూర్చగల వీలుంది. విజ్ఞానశాస్త్రం, సాంకేతికతలను సమాజ హితం కోసం ఉపయోగించడమెలా గన్నది విద్యార్థులకు ఆచరణపూర్వకంగా నేర్పవచ్చు. శాస్త్రీయంగా అభివృద్ధి సాధించడానికి కావలసిన నైపుణ్యాలను సిబ్బందికి, విద్యార్థులకు అందించవచ్చు. ఈ క్రమంలో శాస్త్రసాంకేతిక విజ్ఞానం ఆచరణాత్మక కోణాన్ని సంతరించుకుని మరింత అభివృద్ధి చెందుతుంది. ఎస్‌ఎస్‌ఆర్‌ ప్రాజెక్టులు సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల రంగానికీ ఊతమిస్తాయి. అంకుర పరిశ్రమలు, అసంఘటిత రంగ యూనిట్లు ఉత్పాదకత పెంచుకోవడానికి తోడ్పడతాయి. గ్రామీణ సమస్యలకు శాస్త్రసాంకేతిక పరిష్కారాలు చూపుతాయి. విజయవంతమైన ఎస్‌ఎస్‌ఆర్‌ ప్రాజెక్టుల నుంచి నేర్చిన పాఠాలను, గడించిన అనుభవాన్ని మహిళా సాధికారతకు, బలహీన వర్గాల స్వావలంబనకు ఉపయోగించవచ్చు. 2035 సాంకేతిక విజన్‌, ఐక్యరాజ్యసమితి సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనకూ ఎస్‌ఎస్‌ఆర్‌ ప్రాజెక్టులు ఉపకరిస్తాయి. తాగునీరు, ఆరోగ్యం, పర్యావరణం, జీవనోపాధికి ఎదురవుతున్న అడ్డంకులను శాస్త్రసాంకేతికతల సాయంతో అధిగమించడానికి తోడ్పడతాయి. భారత్‌లో దైనందిన జీవితంలో శాస్త్రసాంకేతికతల ప్రభావం ఆశించిన స్థాయిలో లేదు. శాస్త్రీయ సామాజిక బాధ్యత ఈ పరిస్థితిని సరిదిద్దగలుగుతుంది. అయితే ఈ కార్యక్రమం ఆర్భాటంలా మిగిలిపోకూడదు.

- వి.రఘునాథన్‌

(కెనడాలోని యార్క్‌ విశ్వవిద్యాలయంలో అనుబంధ ఆచార్యులు)

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.