ETV Bharat / opinion

భాషా పౌరుషం మనకు లేదేం? - తెలుగు భాషపై పౌరుషం లేదెందుకు

భాషా సంస్కృతి విషయంలో తమిళనాడు రాజకీయ పార్టీల వైఖరి స్ఫూర్తిదాయకం. ఈ విషయంలో వైరి పక్షాలన్నీ ఒక్కమాటమీదే ఉంటాయి. ఇది ఆ జాతి జీవనాడికి చెందిన అంశం. ఇదొక కట్టుబాటు. మన తెలుగునాట బొత్తిగా కనపడని మంచి అలవాటు!

FOR SUB FEATURE
భాషా పౌరుషం మనకు లేదేం?
author img

By

Published : Mar 21, 2021, 7:37 AM IST

కౌరవ పాండవులది ఆజన్మ విరోధం. జ్ఞాతివైరం. ఒకరంటే ఒకరికి పొసగనంత విద్వేషం. అయినా వారిమధ్య ఏదో తెలియని బలమైన రక్తసంబంధం! పరాయి వారెవరైనా వారిపైకి పోరుకు దిగితే- పాండవులు వేరు, కౌరవులు వేరు కాదు... మొత్తం వారు నూట అయిదుగురు. ఇది మహాభారతం స్పష్టం చేసిన మహత్తరమైన అంశం. భాషా సంస్కృతుల విషయంలో తమిళనాట రాజకీయ నాయకుల తీరు అచ్చంగా అదే! బద్ధశత్రువులే అయినా, వైరి పక్షాలన్నీ ఆ విషయంలో ఒక్కమాట మీద నిలుస్తాయి. ఒక్కబాటలో నడుస్తాయి. పెరియార్‌ అన్నాదురై వంటి ముందుతరం సిద్ధాంతకర్తలు సంస్కృతి నిర్మాతలు ఏనాడో నిర్దేశించిన జాతి మౌలిక సూత్రాలను అన్ని రాజకీయపక్షాలూ ఇప్పటికీ అక్షరాలా అమలు చేస్తాయి. ప్రజలకు హామీలిస్తాయి. అచ్చమైన తమిళదనం తమదేనని, అసలుసిసలు తమిళరక్తానికి తామే వారసులమని చెప్పుకోడానికి తహతహలాడిపోతాయి. ఇది ఆ జాతి జీవనాడికి చెందిన అంశం. ఇదొక కట్టుబాటు. మన తెలుగునాట బొత్తిగా కనపడని మంచి అలవాటు.

యథాప్రజా తథారాజ

తమిళుల మాతృభాషాభిమానం ఎంతటిదంటే- ప్రాచీన తమిళకవి తిరువళ్లువర్‌ ద్విపదకావ్యం తిరుక్కురల్‌ను జాతీయగ్రంథంగా ప్రకటించేందుకు తీవ్రంగా కృషి చేస్తామన్న వాగ్దానాన్ని తమిళనాట ప్రతిపార్టీ ఈసారి తమ ఎన్నికల మ్యానిఫెస్టోలో ప్రముఖంగా ప్రకటించింది. ఈ ఆకాంక్ష నిజానికి సంస్థాగతమైనది మాత్రమేకాదు, వ్యక్తిగతమైనది కూడా. ఈమధ్యనే కరూర్‌కు చెందిన పెట్రోల్‌బంక్‌ యజమాని ఒకరు- అదే తిరుక్కురల్‌లోని 20 పద్యాలు అప్పగించిన ప్రతి విద్యార్థి వాహనంలోను లీటర్‌ పెట్రోల్‌ను ఉచితంగా పోశాడు. బండిలో ఇంధనం నెపంతో గుండెలో భాషాభిమానాన్ని నింపాడు. ఇలాంటి ఉదంతాన్ని తెలుగు రాష్ట్రాల్లో మనం ఊహించలేం.

ఇదీ చదవండి: కఠిన నిర్ణయాలతోనే మాతృభాషకు కొత్త వెలుగు

మాతృభాషపట్ల ప్రజల నిబద్ధతను, తమిళభాష రాజసాన్ని అంచనా వేయాలంటే మనం ఆ నిసర్గ మూలాలను అధ్యయనం చేయాలి. హైకోర్టు సహా న్యాయస్థానాలన్నింటా తమిళాన్ని వాదోపవాదాల్లో వ్యాజ్యభాషగా చేస్తామని, కేంద్ర రాష్ట్రప్రభుత్వాల అనుబంధ సంస్థలు జారీచేస్తున్న ప్రకటనలన్నీ తమిళంలో ఉండేలా చూస్తామని పార్టీలన్నీ నేడు వాగ్దానం చేస్తున్నాయి. తమిళభాషను కేంద్రప్రభుత్వం అధికారభాషగా సైతం ఆమోదించాలని పార్టీలన్నీ పట్టుపడుతున్నాయి. ఈ పూనిక వెనక అద్భుత సమైక్య స్వరాన్ని మనం గుర్తించాలి. ఈ ఐక్యతకు కారణం- మాతృభాష వారి దృష్టిలో తల్లిప్రేవు కనుక! తమ సంస్కృతి, సంప్రదాయం, అలవాట్లు కట్టుబాట్లు ఆచారాలు ఆఖరికి తమ ఉనికి... అన్నీ అమ్మభాషతోనే ముడిపడి ఉన్నాయని వారంతా మనసావాచా విశ్వసిస్తున్నారు కనుక! తెలుగుజాతి ముఖ్యంగా అలవరుచుకోవాల్సింది- ఆ కట్టుబాటునే! ఆత్మవిమర్శ చేసుకోవలసింది ఆ విషయంలోనే!

మనం అలా కాదుగా!

తమ భాషకు ఏ విషయంలో లోటు జరిగినా తమిళ ప్రజల మనసు చివుక్కుమంటుంది. చెరువులో రాయేస్తే చెరువంతా కంపించినట్లు ఏ మూలో భాషకు కించిత్‌ అపచారం జరిగినా, లేక ఎవరి మనోభావమో ఆ విషయంలో దెబ్బతిన్నా చాలు- అది తీవ్ర ప్రజాందోళనలకు సైతం దారితీస్తుంది. ఆ తాపత్రయం ఆ పట్టుదల ఆ భావసమైక్యత మనకు మొదట్నించీ లేనే లేవు. రైలు పెట్టెలపై మన తెలుగు పేర్లు చదివినా మనకు వెంటనే నమ్మకం కుదరదు. ఇంగ్లీషు బోర్డు వచ్చేదాకా ఆగి, చదివి- ఆ తరవాతే, అవునిది మనం ఎక్కవలసిన రైలేనని తేల్చుకొంటాం.

ఇదీ చదవండి: తల్లిపాలు వంటిదే అమ్మభాష.. ఎంతో మధురం

రిజర్వేషన్‌పత్రాన్ని తెలుగులో నింపే వీలున్నా- వెనక్కి తిప్పి ఆంగ్లంలో పూర్తిచేయడమే మనకు సులువుగా తోస్తుంది. మాతృభాషలో మధురంగా మాట్లాడేకన్నా తప్పులు దొర్లినా ఇంగ్లీషులో మాట్లాడటమే గొప్ప అని మన నిశ్చితాభిప్రాయం. కాబట్టే అన్ని రాజకీయపక్షాలూ ఎన్నికల వాగ్దానాల్లో తమిళభాష గురించి అంతగా పట్టించుకోవడం మనకు వింతగా అనిపిస్తోంది. రాజకీయ రణరంగంలో ఇవీ బలమైన ఆయుధాలేనా... అని ఆశ్చర్యం కలుగుతోంది.

జనాభీష్టమే లక్ష్మణరేఖ

ఇలాంటివి చదివినప్పుడు విన్నప్పుడు మనలో కొంత బెంగ మరికొంత ఆవేశం కమ్ముకొస్తుంటాయి. ఉన్నట్లుండి మాతృభాషపై మమకారం పొంగి వస్తుంది. ఏదైనా చేయాలనిపిస్తుంది. మర్నాటికి పొంగు చల్లారి పోతుంది. చివరకది 'ఆరంభ శూరత్వం'గానే మిగిలిపోతూ ఉంటుంది. 1999లో భాజపా ప్రభుత్వం సంస్కృతభాషకు రాజ సత్కారం తలపెడితే- మా తమిళం సంగతి ఏమిటని జనం పెద్దయెత్తున ఆందోళన చేపట్టారు. ప్రభుత్వం స్వయంగా భారీ బంద్‌ నిర్వహించింది. ప్రజలు స్వచ్ఛందంగా హర్తాళ్‌ పాటించారు. భాష విషయంలోనేకాదు... పల్లెపట్టుల జల్లికట్టు వేడుకల్లాంటి ద్రవిడ మూలాల విషయంలోనూ ప్రజలు అలాగే వ్యవహరిస్తారు. పరభాషా నాయికలు తమిళ చిత్రాల్లో నటించడానికి ప్రజలకు అభ్యంతరం లేదు- కాకపోతే వారు తమిళభాష నేర్చి సంభాషణలు స్వయంగా పలికితీరాలన్నది తమిళ ప్రజల మనోభావం. ఆఖరికి చలన చిత్రాల గోడ పత్రాలు (వాల్‌పోస్టర్లు) సైతం తమిళంలోనే ముద్రించాలి. అదంతే! మాతృభాషపట్ల, తమిళ సంప్రదాయాల పట్ల ప్రజలకింత ప్రచండమైన, రక్తనిష్ఠమైన నిబద్ధత, దృఢవైఖరి ఉన్నాయి కాబట్టే రాజకీయ పక్షాలూ ఆ దారినే తూ.చ. తప్పక నడుస్తున్నాయి. ప్రజాభిప్రాయాలను తమ స్వీయ వాగ్దానాలుగా మలుస్తున్నాయి. 1999 ఆందోళనల్లో రాజకీయనేతలు వందలాదిగా జైళ్లకు వెళ్లారు. భాషా సంస్కృతుల విషయమై ప్రజలకు గల బలమైన వైఖరి కారణంగానే 'మీరు గీచిన గీటు దాటం' అన్నట్లుగా ఇప్పటికీ పార్టీలు వ్యవహరిస్తున్నాయి. నాయకులపై ప్రజల ఆధిపత్యానికి, పార్టీల మేనిఫెస్టోల్లో సైతం ప్రజల మనోభావాలదే పై చేయి కావడానికి ఆ కట్టుబాట్లు, భాషా సంస్కృతులు సాధనాలవుతున్నాయి. అది మనమంతా గుర్తించవలసిన గొప్ప విషయం. అందుకోదగిన విలువైన సందేశం.

-ఎర్రాప్రగడ రామకృష్ణ

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.