ETV Bharat / opinion

ప్రతి 8 నిమిషాలకు ఓ చిన్నారి అదృశ్యం! - చిన్నారులు అదృశ్యం

దేశవ్యాప్తంగా ఏటా సగటున 65-70 వేల మంది చిన్నారులు తప్పిపోతున్నారు. వారిలో 40-50 శాతానికి సంబంధించి ఆచూకీ కనుక్కోలేని దుస్థితి నెలకొంది. బిహార్‌, పంజాబ్‌, ఉత్తర్‌ప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌ తదితర రాష్ట్రాల్లో ఇలాంటి ఘటనలు చాలా ఎక్కువగా చోటుచేసుకుంటున్నాయి. ఈ సమస్య తీవ్రతపై ప్రభుత్వాల్లో, సమాజంలో అవగాహన కల్పించడానికి అంతర్జాతీయంగా ఏటా మే 25వ తేదీన 'మిస్సింగ్‌ చిల్డ్రన్‌ డే' నిర్వహించడం ఆనవాయితీ.

children missing cases
బాలల అదృశ్యం
author img

By

Published : May 25, 2021, 7:51 AM IST

భారత్‌లో ప్రతి ఎనిమిది నిమిషాలకు ఓ చిన్నారి తప్పిపోతున్నట్టు అంచనా! 2015-19 మధ్య బాలల అదృశ్యం ఘటనలు 16 శాతానికి పైగా పెరిగాయి. దేశవ్యాప్తంగా ఏటా సగటున 65-70 వేల మంది చిన్నారులు తప్పిపోతున్నారు. వారిలో 40-50 శాతానికి సంబంధించి ఆచూకీ కనుక్కోలేని దుస్థితి నెలకొంది. ఇది బాధిత కుటుంబాలకు తీరని మానసిక వేదన మిగిలుస్తోంది. వ్యవస్థల వైఫల్యాల్ని ఎత్తిచూపుతోంది. అదృశ్యమవుతున్న వారిలో దాదాపు 70 శాతం బాలికలే ఉంటున్నారు. బిహార్‌, పంజాబ్‌, ఉత్తర్‌ప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌ తదితర రాష్ట్రాల్లో ఇలాంటి ఘటనలు చాలా ఎక్కువగా చోటుచేసుకుంటున్నాయి. బిహార్‌లో తప్పిపోతున్న పిల్లల సంఖ్య అయిదేళ్లలో 252 శాతానికి, పంజాబ్‌లో 142 శాతానికి పెరగడం పరిస్థితి తీవ్రతకు అద్దంపడుతోంది.

మరోవైపు, ఎక్కువ మంది బాలలు అదృశ్యమవుతున్న రాష్ట్రాల జాబితాలో తెలంగాణ ఏడో స్థానంలో, ఆంధ్రప్రదేశ్‌ పన్నెండో స్థానంలో ఉన్నాయి. 2019లో సగటున రోజుకు ఏపీలో ఏడుగురు, తెలంగాణలో తొమ్మిది మంది బాలలు అదృశ్యమైనట్లు జాతీయ నేర గణాంక సంస్థ లెక్కలు చెబుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోనూ ఆచూకీ లభ్యమవుతున్న వారి శాతం మెరుగ్గానే ఉన్నా, ఇప్పటికీ వేల మంది బాలలు ఏమయ్యారో అంతుచిక్కని పరిస్థితి దిగ్భ్రాంత పరుస్తోంది! ఈ సమస్య తీవ్రతపై ప్రభుత్వాల్లో, సమాజంలో అవగాహన కల్పించడానికి అంతర్జాతీయంగా ఏటా మే 25వ తేదీన 'మిస్సింగ్‌ చిల్డ్రన్‌ డే' నిర్వహించడం ఆనవాయితీ.

వ్యవస్థీకృత నేరసామ్రాజ్యం

దేశవ్యాప్తంగా 2019లో అదృశ్యమైన 73,138 మంది బాలల్లో 52,049 మంది (71.16 శాతం), అంతకు ముందు ఏడాదిలో కనిపించకుండా పోయిన 67,134 మందిలో 47,191 మంది (70.29 శాతం) మంది బాలికలే! వీళ్లలో కనీసం 40 శాతం బాలికల ఆచూకీ లభ్యం కావట్లేదు. ఈ చిన్నారుల్లో కొందరు మానవ అక్రమ రవాణా ముఠాల చేతిలో చిక్కుతుండగా, ఇంకొందరు లైంగిక దోపిడీ బారిన పడి వ్యభిచార కూపాల్లో మగ్గిపోతున్నారు. మరికొందరు దుర్మార్గుల దాష్టీకానికి ప్రాణాలు కోల్పోతున్నారు. తెలిసీ తెలియని వయసు, ఎదురుతిరగలేని నిస్సహాయతల నేపథ్యంలో ముఠాలు వీరిని లక్ష్యంగా చేసుకుంటున్నాయి.

children missing cases
జాతీయ నేర గణాంక సంస్థ

రెండేళ్ల కిందట తెలంగాణలోని యాదగిరిగుట్టలో పోలీసులు వ్యభిచార ముఠా గుట్టు రట్టు చేశారు. వాళ్లకు చిన్నారుల్ని అక్రమంగా తరలించే ముఠాలతో సంబంధాలు ఉన్నట్లు తేలింది. పిల్లల్ని అపహరించే వారి నుంచి బాలికల్ని కొని పడుపు వృత్తిలోకి దింపుతున్నట్లు వెల్లడైంది. పసిపిల్లలకు హార్మోన్‌ ఇంజెక్షన్లు ఇచ్చి, ఎనిమిదేళ్ల వయసు నుంచే ఈ రొంపిలోకి నెడుతున్నట్టు తెలిసింది. ఆ సమయంలో రెండు తెలుగు రాష్ట్రాల నుంచి అనేక మంది తల్లిదండ్రులు గతంలో తప్పిపోయిన తమ పిల్లల ఆచూకీ కోసం ఆరా తీశారు. బాలికల అదృశ్యం, వారి ఆచూకీ లభించకపోవటం వెనుక దాగున్న చీకటి కోణాలకు ఈ ఉదంతం ఒక తార్కాణంగా నిలుస్తోంది. తప్పిపోయిన బాలుర్ని కొన్ని ముఠాలు చేరదీసి వారితో బలవంతంగా వెట్టిచాకిరీ చేయిస్తున్నాయి. మరికొందర్ని యాచకులుగా మార్చేస్తున్నాయి. లైంగిక దాడులకూ పాల్పడుతున్నాయి. మాదకద్రవ్యాల అక్రమ రవాణాదారుల చేతిలో చిక్కుకుపోయిన వారూ ఉన్నారు. ఎదిరించే వారిని హతమార్చేస్తున్న ఘటనలూ ఉంటున్నాయి. అదృశ్య ఘటనల వెనుక ఉన్న నేర సామ్రాజ్యాన్ని నిర్వీర్యం చేయాల్సిన అవసరాన్ని ఈ ఉదంతాలు స్పష్టం చేస్తున్నాయి.

నామమాత్రంగా స్పందన..

అదృశ్యం కేసుల్లో అత్యధిక సందర్భాల్లో పోలీసుల సత్వర స్పందన నామమాత్రంగా ఉంటోంది. ఫిర్యాదు స్వీకరణకే నిరాసక్తత కనబరిచే పరిస్థితి క్షేత్రస్థాయిలో ఎంతోమంది తల్లిదండ్రులకు అనుభవమే! కౌమార దశలో ఉన్న బాలికలు తప్పిపోయారని తల్లిదండ్రులు ఫిర్యాదు ఇవ్వడానికి వెళితే పోలీసుల నుంచి సూటిపోటి మాటల్ని ఎదుర్కోవాల్సి వస్తున్న ఘటనలూ అనేకం. మీడియాలో సంచలనమైతేనో, ఉన్నతాధికారుల ఒత్తిడి ఉంటేనో తప్పితే, క్షేత్రస్థాయి సిబ్బంది సత్వర దర్యాప్తు మొదలుపెట్టని పరిస్థితి ఉంటోంది. ఎక్కువ సందర్భాల్లో బాధితులు వారంతట వారే ఇళ్లకి చేరుకోవడం లేదా కుటుంబ సభ్యులు, బంధువులు శ్రమించి ఆచూకీ గుర్తిస్తున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. కొన్ని సందర్భాల్లో మాత్రమే పోలీసులు వెతికి పట్టుకుంటున్నారు. ఫిర్యాదు ఇవ్వగానే కేసు నమోదు చేసి, వెంటనే దర్యాప్తు చేపట్టకపోవటం వల్ల ఆధారాలు లభించక కేసుల పరిష్కారం మరింత జటిలమైపోతోంది. ప్రధాన కేసుల దర్యాప్తు, శాంతిభద్రతల పరిరక్షణ, బందోబస్తు విధుల్లో బిజీగా ఉంటున్నామనే కారణం చూపుతూ, క్షేత్రస్థాయిలో ఈ కేసుల పరిష్కారంపై దృష్టిపెట్టడం లేదు.

ముఠాలపై ఉక్కుపాదం

లాక్‌డౌన్‌ కారణంగా నెలకొన్న పరిస్థితులతో 2020లో బాలల అదృశ్యం కేసులు ఇంకా పెరిగి ఉంటాయనే ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది. ఇలాంటి ఘటనల్ని బాధిత కుటుంబాల వ్యక్తిగత సమస్యగా చూసే పోలీసుల ధోరణి మారితేనే తల్లిదండ్రులకు న్యాయం జరుగుతుంది. ఆయా అదృశ్యాల వెనుక దాగి ఉన్న వ్యవస్థీకృత నేరాన్ని, ఆ ముఠాల్ని బయటికి లాగే కోణంలో దర్యాప్తు సాగించాల్సి ఉంది. పిల్లలు తప్పిపోవడానికీ మానవ అక్రమ రవాణా ముఠాల మధ్య ఉన్న సంబంధాల్ని ఛేదించాలి. కేవలం అదృశ్యం కేసుల పరిష్కారం కోసమే జిల్లా లేదా డివిజన్‌ స్థాయిలో ఓ ప్రత్యేక విభాగాల్ని ఏర్పాటు చేయాలి. వాటికి అవసరమైన వనరులను సమకూర్చాలి. దిల్లీ పోలీసులు అమలు చేస్తున్నట్టు తప్పిపోయిన చిన్నారులను గుర్తించి తల్లిదండ్రులకు అప్పగించే సిబ్బందికి ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇవ్వాలి. తప్పిపోయిన బాలల్ని గుర్తించేందుకు నిర్వహించే ఆపరేషన్‌ ముస్కాన్‌ తరహా కార్యక్రమాల్ని మరింత విస్తృతంగా అమలు చేయాలి. దర్యాప్తులో అత్యాధునిక సాంకేతికత వినియోగంపై దృష్టిసారించాలి. ట్రాక్‌ ఛైల్డ్‌ పోర్టల్‌ వంటి వాటి సేవల్ని విస్తృతం చేయాలి. సామాజిక మాధ్యమాల్ని మరింతగా వినియోగించుకోవాలి. ఫిర్యాదుల స్వీకరణకు ఎల్లవేళలా పనిచేసే ప్రత్యేక వ్యవస్థ అవసరమూ ఉంది. అదృశ్యమవుతున్న వారు, ఆచూకీ లభ్యం కానివారి వివరాలతో సమగ్ర డేటాబేస్‌ రూపొందించి అన్ని రాష్ట్రాల యంత్రాంగాలకు అందుబాటులో ఉంచాలి. కేసుల పురోగతిని ఉన్నతాధికారులు నిరంతరం పర్యవేక్షించాలి. నేర ముఠాల్ని గుర్తించి సకాలంలో కఠిన శిక్షలు పడేలా చేస్తేనే సమస్యకు కొంతయినా పరిష్కారం లభిస్తుంది.

చిన్నారుల అదృశ్యంపై యంత్రాంగం అనుసరించాల్సిన విధివిధానాలను 2013లోనే సుప్రీంకోర్టు నిర్దేశించింది. బచ్‌పన్‌ బచావో ఆందోళన్‌ వర్సెస్‌ భారత ప్రభుత్వం కేసులో ఈమేరకు ఆదేశాలిచ్చింది. బాలల అదృశ్యంపై ఫిర్యాదు రాగానే ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి వెంటనే విచారణ ప్రారంభించాలని న్యాయస్థానం స్పష్టంగా చెప్పింది. కానీ, దీనిపై క్షేత్రస్థాయి యంత్రాంగం ప్రదర్శిస్తున్న ఉదాసీనత ఏటా వేల మంది చిన్నారుల బంగారు బాల్యాన్ని చిదిమేస్తోంది.

- గేదెల భరత్‌ కుమార్‌

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.