ETV Bharat / opinion

మాల్దీవుల్లో భారత్‌పై విషప్రచారం - భారత్ మాల్దీవుల సంబంధాలు

మాల్దీవుల్లో భారత వ్యతిరేక శక్తులు పెరిగిపోతున్నాయి. భారత్‌ తమ దేశంలో నిఘాపెడుతోందన్న విద్వేష ప్రచారాన్ని కొందరు ప్రారంభించారు. భారత ప్రాదేశిక జలాలకు అత్యంత సమీపంగా ఉన్న ఆ ద్వీపదేశంలో ఇటువంటి అలజడి రేగడం ఆందోళన కలిగించే అంశం. ఇరుదేశాల మధ్య సన్నిహిత సంబంధాల కొనసాగింపునకు దీవుల్లో అతివాదాన్ని అరికట్టడం అత్యవసరమని దిల్లీ ఆశిస్తోంది. ఈ మేరకు అక్కడి ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరిస్తే- ఇరుదేశాలకూ ఉభయతారకమవుతుంది.

india relations with maldives
భారత్ మాల్దీవుల సంబంధాలు
author img

By

Published : Jul 27, 2021, 5:10 AM IST

హిందూ మహాసముద్రంలోని మాల్దీవుల్లోని అతివాదులు ఈమధ్య ఇండియా పట్ల పూర్తి వ్యతిరేకత ప్రదర్శిస్తున్నారు. భారత ప్రాదేశిక జలాలకు అత్యంత సమీపంగా ఉన్న ఆ ద్వీపదేశంలో ఇటువంటి అలజడి రేగడం ఆందోళన కలిగిస్తోంది. 1988లో కొందరు వ్యాపారవేత్తలు శ్రీలంక తీవ్రవాదుల సాయంతో అప్పటి మాల్దీవుల అధ్యక్షుడు అబ్దుల్‌ గయూమ్‌ను గద్దె దించేందుకు యత్నించారు. భారత్‌ దళాలు 'ఆపరేషన్‌ కాక్టస్‌' పేరుతో ఆ కుట్రను భగ్నం చేశాయి. అక్కడ ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాయి. ఈ ఏడాది ఐరాస సర్వసభ్య సమావేశాలకు అధ్యక్షుడిగా మాల్దీవుల విదేశాంగమంత్రి అబ్దుల్లా షహీద్‌ ఎన్నికయ్యారు. ఆయన గెలుపు వెనక ఇండియా కృషి ఎంతో ఉంది. మరో మిత్రదేశమైన అఫ్గాన్‌ విదేశాంగమంత్రి జైమై రసూల్‌ బరిలో ఉన్నా, షహీద్‌కే భారత్‌ మద్దతు ప్రకటించింది. మాల్దీవులకు లక్షకుపైగా కొవిడ్‌ టీకాలనూ అందించింది. ఇలా అన్నివేళలా అండగా ఉంటున్న ఇండియాపై మాల్దీవుల్లో వ్యతిరేక ప్రచారం ఉద్ధృతమవుతుండటం బాధాకరం!

విద్వేష ప్రచారంతో..

మాల్దీవుల్లోని ఒక ప్రచురణ సంస్థ కొన్నాళ్లుగా ఇండియాపై విషంకక్కుతోంది. భారత వ్యతిరేక శక్తులు కొన్ని ఈ సంస్థకు భారీగా నిధులు సమకూరుస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి తోడు మాజీ అధ్యక్షుడు యామీన్‌ గయూమ్‌ చైనాకు అనుకూలంగా వ్యవహరించారు. 2018 ఎన్నికల్లో ఇబ్రహీం సోలిహ్‌ అధ్యక్షుడిగా నియమితులయ్యారు. ఈయన హయాములో భారత్‌తో ద్వైపాక్షిక సంబంధాలు గాడిన పడతాయని ఆశించారు. అతివాదుల ప్రభావంతో అది సాధ్యంకావడం లేదు. మాల్దీవులకు గతంలో ఇండియా రెండు ధ్రువ్‌ హెలికాప్టర్లను అందించింది. సముద్ర అన్వేషణ, సహాయ కార్యక్రమాలతో పాటు అత్యవసర పరిస్థితుల్లో రోగులను సత్వరం తరలించేందుకు వీటిని ఉదారంగా సమకూర్చింది. ఈ హెలికాప్టర్ల ద్వారా భారత్‌ తమ దేశంలో నిఘాపెడుతోందన్న విద్వేష ప్రచారాన్ని కొందరు ప్రారంభించారు. యామీన్‌ గయూమ్‌ ప్రభుత్వం సైతం ఆ హెలికాప్టర్లను భారత్‌ వెనక్కు తీసుకోవాలని కోరింది. యామీన్‌ పార్టీ పరాజయం పాలయ్యాక పగ్గాలు చేపట్టిన ఇబ్రహీం సర్కారు హెలికాప్టర్లను మరికొంతకాలం వినియోగించాలని నిర్ణయం తీసుకుంది. మరోవైపు, అక్కడి 'అడ్డు' నగరంలో మరో కాన్సులేట్‌ కార్యాలయాన్ని ప్రారంభించబోతున్నట్లు భారత్‌ ప్రకటించింది. దీనిపై ఆందోళనలు తలెత్తాయి. ఆ కార్యాలయంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని ఇబ్రహీం ప్రభుత్వం ప్రకటించాకే అవి తగ్గుముఖం పట్టాయి.

అతివాదుల ఆగడాలు

దేశ మాజీ అధ్యక్షుడు, స్పీకర్‌ మహమ్మద్‌ నషీద్‌ లక్ష్యంగా ఈ ఏడాది మే ఆరున బాంబు దాడి జరిగింది. ప్రశాంత దీవుల్లో ఇటువంటి ఉగ్రఘటన జరగడంపై ఆందోళన వ్యక్తమైంది. మాల్దీవుల నుంచి అనేకమంది యువకులు ఐసిస్‌ ప్రభావంతో సిరియా, ఇరాక్‌లకు వెళ్లారు. ప్రస్తుతం వారు తిరిగి వచ్చి స్వదేశంలో జిహాదీ ప్రచారాన్ని కొనసాగిస్తున్నట్టు తెలుస్తోంది. అతివాదానికి అడ్డంకిగా ఉన్నందుకే నషీద్‌ను వారు లక్ష్యం చేసుకున్నారు. ఈ దాడిలో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. అధ్యక్షుడు ఇబ్రహీం సోలిహ్‌, స్పీకర్‌ నషీద్‌లు ఒకే పార్టీకి చెందినవారు. తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఇద్దరి మధ్య అభిప్రాయభేదాలు తలెత్తాయి. లౌకికవాదాన్ని సంపూర్ణంగా సమర్థించే నషీద్‌- ఇండియాతో స్నేహసంబంధాలు మాల్దీవులకు భద్రతాపరంగా మేలు చేస్తాయంటారు. మత విద్వేషపూరిత నేరాలకు అడ్డుకట్ట వేయడానికి ఉద్దేశించిన బిల్లును వెనక్కి తీసుకోవడంపై ప్రభుత్వాన్ని నషీద్‌ ప్రశ్నించారు. ఈ ఘటన ఆయనకు, అధ్యక్షుడికి మధ్య దూరాన్ని పెంచింది. ఈ పరిస్థితుల్లో నషీద్‌పై దాడి జరగడం గమనార్హం. మాజీ అధ్యక్షుడు యామీన్‌ పూర్తిగా భారత వ్యతిరేక వైఖరితో వ్యవహరిస్తూ, చైనాకు దగ్గరయ్యారు. ఆ పరిస్థితి మళ్లీ తలెత్తకుండా ఇండియా అప్రమత్తం కావాల్సిన అవసరం ఉంది.

మాల్దీవులకు పర్యాటక రంగమే ప్రధాన ఆదాయ వనరు. కొవిడ్‌ దాన్ని తీవ్రంగా దెబ్బతీసింది. ఈమధ్యకాలంలో భారత పర్యాటకుల సంఖ్య పెరగడంతో ఇప్పుడిప్పుడే ఆ రంగం గాడినపడుతోంది. దీనిపై స్థానికులూ హర్షం వ్యక్తంచేస్తున్నారు. ఉభయదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు ఇదే రీతిలో సాగాలని వారు ఆశిస్తున్నారు. ఇటీవల భారత్‌లో పర్యటించిన మాల్దీవుల విదేశాంగమంత్రి అబ్దుల్లా షహీద్‌ పలు ఒప్పందాలను కుదుర్చుకున్నారు. అక్కడి అభివృద్ధి కార్యక్రమాలకు మూడు వేల కోట్ల రూపాయలకు పైగా ఇండియా ఆర్థిక సాయం చేయనుంది. ఈ సన్నిహిత సంబంధాల కొనసాగింపునకు స్థానికంగా అతివాదాన్ని అరికట్టడం అత్యవసరమని దిల్లీ ఆశిస్తోంది. ఈ విషయంలో మాల్దీవుల ప్రభుత్వం చొరవ తీసుకోవాలని సూచిస్తోంది. అధ్యక్షుడు ఇబ్రహీం ఈ మేరకు చిత్తశుద్ధితో వ్యవహరిస్తే- ఇరుదేశాలకూ అది ఉభయతారకమవుతుంది.

- కొలకలూరి శ్రీధర్‌

ఇదీ చదవండి:

అసోం-మిజోరం సరిహద్దు ఘర్షణలో ఆరుగురు పోలీసులు మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.