కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ.. పార్లమెంట్‌కు దూరం కానున్నారా? ఆయనపై అనర్హత వేటు పడనుందా? అంటే అవుననే సమాధానం వస్తోంది. నిబంధనల ప్రకారం ఆయనపై వేటు ఖాయమని తెలుస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ ఇంటి పేరుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో రాహుల్ గాంధీని గుజరాత్‌లోని సూరత్ న్యాయస్థానం గురువారం దోషిగా తేల్చింది. నేరపూరిత పరువునష్టం కేసులో ఆయనకు రెండేళ్ల శిక్ష సైతం విధించింది. ఇలా ఏదైనా నేరానికి రెండేళ్ల శిక్ష పడితే.. ఆ ప్రజా ప్రతినిధి అనర్హతకు గురవుతారు. కోర్టు తీర్పు వచ్చిన క్షణం నుంచే ఆ ప్రజాప్రతినిధి అనర్హులు అవుతారు. 1951 ప్రజాప్రతినిధుల చట్టంలోని నిబంధనలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి.
దోషిగా తేలిన ప్రజాప్రతినిధులపై అనర్హత వేటు వేసే ముందు గతంలో మూడు నెలల సమయం ఇచ్చేవారు. ఆలోపు పై కోర్టులలో అప్పీల్ చేసుకోవచ్చు. న్యాయపరమైన అవకాశాలన్నీ వినియోగించుకునే వరకు వారిపై వేటు పడేది కాదు. కానీ, లిలీ థామస్ అనే న్యాయవాది ఈ నిబంధనకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో పోరాడారు. ఆ నిబంధన రాజ్యాంగ విరుద్ధమని ఆమె పిటిషన్ వేశారు. దీనిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. 2013లో ఆ నిబంధనను కొట్టివేసింది. ప్రజాప్రతినిధులు దోషులుగా తేలిన వెంటనే అనర్హులుగా పరిగణించాలని స్పష్టం చేసింది. సుప్రీం తీర్పు ప్రకారం చూసుకుంటే.. రాహుల్ గాంధీపై అనర్హత కత్తి వేలాడుతోంది. ప్రస్తుతం కేరళలోని వయనాడ్ లోక్‌సభ నియోజకవర్గానికి రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయనపై అనర్హత వేస్తూ లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లా అధికారిక ప్రకటన చేస్తే.. రాహుల్ గాంధీ తన సభ్యత్వాన్ని కోల్పోతారు. వయనాడ్ స్థానం ఖాళీ అయిపోతుంది. ఆ నియోజకవర్గానికి ఉపఎన్నిక నిర్వహిస్తారు.
ఎనిమిదేళ్లు దూరం!
అనర్హత వేటు పడితే రాహుల్ గాంధీ రాజకీయ భవిష్యత్ అగమ్యగోచరంగా మారుతుంది. ఆయన వచ్చే ఎనిమిదేళ్ల పాటు ఏ ఎన్నికల్లోనూ పాల్గొనే అవకాశం లేదు. ప్రజాప్రాతినిధ్య చట్టంలోని నిబంధనల ప్రకారం.. జైలు శిక్షకాలంతో పాటు మరో ఆరేళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనర్హులు అవుతారు. రాహుల్ గాంధీకి తాజా కేసులో రెండేళ్లు శిక్ష పడింది. ఆయనపై అనర్హత వేటు పడితే.. ఆ శిక్ష అనుభవించిన తర్వాత మరో ఆరేళ్లు ఎన్నికలకు రాహుల్ దూరం అవుతారు. దీంతో ఆయన ఎనిమిదేళ్ల పాటు ప్రజాప్రతినిధి జీవితానికి దూరం కావాల్సి ఉంటుంది.
ఇంకో దారి లేదా?
అయితే, అనర్హత తప్పించుకునేందుకు రాహుల్ గాంధీకి ఓ మార్గం ఉంది. సూరత్ కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ పై కోర్టును ఆశ్రయించవచ్చు. ఆ తీర్పు అమలును నిలిపివేయాలని కోరవచ్చు. అందుకు పై కోర్టు అనుమతిస్తే.. అనర్హత వేటు నుంచి ఆయనకు తాత్కాలికంగా ఊరట లభిస్తుంది. కోర్టు తీర్పు అమలును పైకోర్టు నిలిపివేయకపోతే.. సుప్రీంకోర్టు వరకు వెళ్లే అవకాశం ఉంది. సుప్రీం సైతం.. సూరత్ కోర్టు తీర్పును సమర్థిస్తే.. రాహుల్‌పై అనర్హత వేటు తప్పదు. రాహుల్ గాంధీ న్యాయవాదులు ప్రస్తుతం ఇదే పనుల్లో ఉన్నారు. ఈ తీర్పుపై అప్పీల్‌కు వెళ్తున్నట్లు తెలిపారు.
కేసు ఏంటంటే?
రాహుల్ గాంధీ దోషిగా తేలిన ఈ కేసు 2019 నాటిది. లోక్‌సభ ఎన్నికల సందర్భంగా ఆ ఏడాది ఏప్రిల్ 13న కర్ణాటకలోని కోలార్‌లో పర్యటించిన రాహుల్.. 'మోదీ' అనే ఇంటి పేరుపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనిపై గుజరాత్‌కు చెందిన భాజపా ఎమ్మెల్యే పూర్ణేశ్ మోదీ.. పరువు నష్టం కేసు దాఖలు చేశారు. మోదీ కుటుంబాన్ని అవమానపర్చారని ఆరోపించారు. రాహుల్ గాంధీ మాత్రం తన వ్యాఖ్యలను సమర్థించుకున్నారు. భావప్రకటనా స్వేచ్ఛతోనే ఆ వ్యాఖ్యలు చేశానని వాదించారు.
ప్రస్తుతం రాహుల్ గాంధీ కేసుపై రాజకీయ వర్గాలతో పాటు న్యాయవర్గాల్లో చర్చనీయాంశమవుతోంది. ఐపీసీ సెక్షన్ 499 ప్రకారం రాహుల్ గాంధీ దోషిగా తేలారు. ఈ సెక్షన్ కింద రెండేళ్ల శిక్ష పడటం చాలా అరుదు అని న్యాయ నిపుణులు చెబుతున్నారు. కేంద్ర ప్రభుత్వం.. న్యాయ వ్యవస్థను ఉపయోగించుకొని విపక్షాల నోరు మూయిస్తోందని కాంగ్రెస్ ఆరోపిస్తుండగా.. రాహుల్ చేసిన వ్యాఖ్యలు అత్యంత నిర్లక్ష్యపూరితమైనవని మరికొందరు విమర్శిస్తున్నారు.