దేశాల మధ్య నెలకొనే విశ్వాసమే అంతర్జాతీయ కూటములకు పునాది. ఒక్కసారి అలాంటి నమ్మకం దెబ్బతింటే మళ్ళీ నిర్మించేందుకు దశాబ్దాలు పట్టవచ్చు. ఈ విషయం అమెరికాకు బాగా తెలుసు. అమెరికా ఎన్నికల సమయంలో 'ఇండో-పసిఫిక్' పదాన్ని ఉచ్చరించేందుకూ ఇష్టపడని జో బైడెన్ అధ్యక్షుడిగా గెలిచిన తరవాత మనసు మార్చుకొన్నారు. శ్వేతసౌధంలో అడుగుపెట్టిన నెలలోపే ఇండో-పసిఫిక్ విషయంలో అమెరికా రాజీలేని వైఖరి అనుసరిస్తుందనే సంకేతాన్ని ఇచ్చారు. ఫిబ్రవరిలో జరిగిన చతుర్భుజ కూటమి (క్వాడ్) దేశాల మంత్రుల స్థాయి మూడో సమావేశంతో అమెరికా వైఖరి తేటతెల్లమైంది. ప్రపంచంలో మూడో వంతుకు పైగా సరకు రవాణా జరిగే జల మార్గం వద్ద రాజీపడే ప్రసక్తే లేదన్న సంకేతాలు ఇచ్చింది. భారత్‌తో వివిధ అంశాల్లో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కొనసాగిస్తామని అమెరికా ప్రకటించింది. మరోపక్క భారత్ తన అధికారిక ప్రకటనలో తొలిసారి 'క్వాడ్' పదాన్ని ప్రస్తావించడం గమనార్హం.
'ఇండో-పసిఫిక్' వ్యూహం
అమెరికా ఎన్నికల సమయంలో కశ్మీర్ విషయంలో డెమొక్రటిక్ పార్టీ తీసుకొన్న వైఖరితో భారత్ కొంత ఇబ్బంది పడింది. కానీ, దశాబ్దాల తరబడి విదేశీ వ్యవహారాలను నడపడంలో తలపండిన బైడెన్‌కు భారత్ ప్రాముఖ్యం తెలుసు. అందుకే తాను శ్వేతసౌధంలోకి రావడం ఖాయం కాగానే ప్రత్యేకంగా 'ఇండో-పసిఫిక్ సమన్వయకర్త' పదవిని సృష్టించి తూర్పు ఆసియా- పసిఫిక్ వ్యవహారాల్లో నిపుణులైన కర్ట్ క్యాంప్‌బెల్‌ను నియమించారు. ఒబామా హయాములో చైనా కట్టడికి అనుసరించిన విధానాన్ని క్యాంప్‌బెల్ వెనకుండి నడిపించారు. ఆ తరవాత కొంతకాలానికి కొన్ని మార్పులతో అదే విధానం ట్రంప్ హయాములో 'ఇండో-పసిఫిక్' వ్యూహంగా రూపాంతరం చెందింది. దీన్ని బైడెన్ ఉచ్చరించకపోవడానికి కారణం దేశ అంతర్గత రాజకీయాలే తప్ప భారత్‌కు ప్రాధాన్యమిచ్చే విషయంలో ఎటువంటి అభ్యంతరాలు లేవనే చెప్పాలి.
ఎందుకంటే పదవీ బాధ్యతలు చేపట్టాక ప్రాధాన్య క్రమంలో బైడెన్ ఫోన్ చేసిన మిత్రదేశాల నేతల్లో భారత ప్రధాని తొమ్మిదో వ్యక్తి. క్వాడ్ దేశాల మంత్రుల స్థాయి సమావేశాలు భవిష్యత్తులో కూడా కొనసాగించాలని ఫిబ్రవరిలో జరిగిన భేటీలో నిర్ణయించడం శుభ పరిణామం. బైడెన్ సర్కారు క్వాడ్‌ను మరింత విస్తరించే ప్రయత్నాలు చేస్తోంది. ఐరోపా మిత్రులను కూడా దీనిలోకి తీసుకొచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే బ్రిటన్ దీనిపై ఆసక్తి చూపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. బైడెన్ సర్కారు పూర్తిగా కుదురుకొని చైనాపై కార్యాచరణ మొదలుపెట్టేసరికి కొంత సమయం పట్టే అవకాశం ఉంది. ఎందుకంటే ఆయన కార్యవర్గంలోని క్యాంప్‌బెల్, విదేశాంగ మంత్రి బ్లింకన్, ఎన్‌ఎస్‌ఏ జాక్ సలేవన్‌ల నుంచి కఠినమైన ప్రకటనలు వస్తున్నా... అధ్యక్షుడు బైడెన్ మాత్రం వేచి చూసే వైఖరినే అవలంబిస్తున్నారు.
గతంలో ఒబామా అమెరికా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో భవిష్యత్తు ఆసియా-పసిఫిక్ ప్రాంతాల్లో ఉందన్న విషయాన్ని గ్రహించారు. ఐరోపా, మధ్య ప్రాచ్యాల నుంచి అమెరికా వనరులను ఈ ప్రాంతాలకు తరలించి క్రమంగా చైనాను కట్టడి చేయాలని భావించారు. ఈ ప్రాంతంలో అమెరికా జోక్యం పెరుగుతుండటంతో అప్రమత్తమైన డ్రాగన్ సైనిక దళాలను వేగంగా ఆధునికీకరించడం మొదలుపెట్టింది. అదే సమయంలో రష్యా దళాలు ఉక్రెయిన్ అధీనంలోని క్రిమియాలోకి ప్రవేశించాయి. సిరియాలో అంతర్యుద్ధంతో ఇరాక్‌లో పరిస్థితి దిగజారింది. దీంతో మిత్రులను కాపాడుకొనేందుకు అమెరికా మరోసారి అటువైపు దృష్టి కేంద్రీకరించింది. ఈ క్రమంలో ఆసియా-పసిఫిక్‌ను నిర్లక్ష్యం చేసింది. ఆ తరవాత ట్రంప్ సర్కారు వచ్చి కార్యాచరణ చేపట్టేనాటికి దక్షిణ చైనా సముద్రంలో డ్రాగన్ బలమైన శక్తిగా అవతరించింది.
చైనాను హిందూ మహాసముద్రంలో కట్టడి చేయడమే లక్ష్యంగా భారత్ క్వాడ్‌లో భాగస్వామిగా మారింది. ఇండో-పసిఫిక్‌పై ఐరోపా దేశాలూ ఆసక్తి చూపిస్తున్నాయి. క్వాడ్ దేశాలతోపాటు ఫ్రాన్స్, బ్రిటన్, జర్మనీ, దక్షిణ కొరియా, ఆసియాన్ దేశాలతో కలిసి స్వేచ్ఛా నౌకాయానం కోసం కృషి చేయాలి. భారత్ హిందూ మహాసముద్రంలోని మారిషస్, సీషెల్స్, మాల్దీవుల్లో అవసరమైన నిఘా కేంద్రాలను అభివృద్ధి చేసుకోవాలి. మారిషస్‌లో ఇప్పటికే దీనికి సంబంధించిన పనులు వేగంగా జరుగుతున్నాయి. ఇక ఈ ప్రాంతంలో ఫ్రాన్స్ పాలనలోని రీయూనియన్ ద్వీపం భారత్‌కు అదనపు బలాన్ని అందిస్తుంది. ఆస్ట్రేలియాను డ్రాగన్ ఆర్థికంగా వేధించడం చూశాక ఇండో-పసిఫిక్‌లో ఉమ్మడి లక్ష్యం కోసం పనిచేసే దేశాలు కేవలం సైనిక సహకారానికే కాకుండా వాణిజ్య సహకారానికి బాటలు వేసుకోవాలన్న విషయం తేటతెల్లం అవుతోంది. అప్పుడే చైనాను సమర్థంగా ఎదుర్కొనే అవకాశం ఉంది.
- లక్ష్మీ తులసి