ETV Bharat / opinion

జీవ వ్యర్థాలతో ముప్పు-కలగాలి కనువిప్పు!

ఓ వైపు లక్షల ప్రాణాలను బలిదీసుకుంటున్న కరోనా మహమ్మారి.. మరోవైపు జీవ వ్యర్థాల రూపంలో తీరని నష్టం మిగుల్చుతోంది. శాస్త్రీయ పద్ధతిలో జీవ వ్యర్థాలను శుద్ధి చేయకపోవడం, వాటిని నిర్మూలించడంలో ఉదాసీనంగా వ్యవహరించడం వల్ల సమస్త జీవజాలానికి వ్యాధులు, కొవిడ్ తీవ్రత ముప్పు పెరుగుతోంది. వ్యర్థాల శుద్ధికి అవసరమైన సంపత్తి ప్రభుత్వ యంత్రంగాల వద్ద లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది.

bio waste
కరోనా
author img

By

Published : Jul 12, 2021, 7:37 AM IST

కొవిడ్‌ రెండో ఉద్ధృతి దేశంలో సృష్టించిన ఆరోగ్య సంక్షోభం ప్రభావం అంతా ఇంతా కాదు. పెద్దయెత్తున కొవిడ్‌ కేసుల్ని, మరణాల్ని మిగిల్చిన మహమ్మారి- ఇంకోవైపు జీవ వైద్య వ్యర్థాల్ని గుట్టలుగా పోగేసింది. ఈ వ్యర్థాల ముప్పు- ఎప్పుడు పేలుతుందో తెలియని టైంబాంబులా కొత్త కష్టాలు తెచ్చిపెడుతుందేమోననే ఆందోళన పెరుగుతోంది. భారత్‌లో ఇప్పటికీ 12 శాతం ఆస్పత్రి వ్యర్థాలను ఎలాంటి శుద్ధి లేకుండా పారేస్తున్నారు. చాలా ఆస్పత్రులు వ్యర్థాల నిర్వహణపై ప్రభుత్వ మార్గదర్శకాల విషయంలో ఉదాసీనంగా వ్యవహరిస్తున్నాయనే ఆరోపణలున్నాయి. 2020 జూన్‌ నుంచి 2021 మే 10 మధ్య దేశంలో 45,308 టన్నుల కొవిడ్‌ సంబంధ జీవవైద్య వ్యర్థాల ఉత్పత్తి జరిగినట్లు కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ) పేర్కొంది. దేశంలో కొవిడ్‌ ఉదంతంకన్నా ముందు సగటున రోజుకు 7.22 లక్షల కిలోల జీవ వైద్య వ్యర్థాలు ఉత్పత్తి కాగా, రెండో ఉద్ధృతి వేళ అది రెట్టింపై రోజుకు సుమారు 14 లక్షల కిలోలు పోగుపడినట్లు చెబుతున్న భారత వైద్య సంఘం (ఐఎంఏ) అంచనాలు పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతున్నాయి. మే నెలలో మొత్తం జీవవైద్య వ్యర్థాల ఉత్పత్తిలో సగం వాటా కేరళ, గుజరాత్‌, మహారాష్ట్ర, దిల్లీ, కర్ణాటకలదే. రెండో ఉద్ధృతిలో ఈ రాష్ట్రాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. జీవవైద్య వ్యర్థాల పరిమాణం- తొలి దశ కన్నా రెండో ఉద్ధృతిలో భారీగా ఉన్నట్లు ప్రైవేట్‌ ఆస్పత్రులు, నర్సింగ్‌హోమ్‌ల సంఘం స్పష్టంచేస్తోంది.

ప్రమాదం ముంగిట్లో ప్రజారోగ్యం

జీవవైద్య వ్యర్థాలను శాస్త్రీయ పద్ధతిలో నిర్మూలించాల్సి ఉండగా, పారిశ్రామిక విష వ్యర్థాలతో కలిపేస్తున్న ఉదంతాలు చోటు చేసుకుంటున్నట్లు భారత జాతీయ ఘనవ్యర్థాల సంఘం (ఎన్‌ఎస్‌డబ్ల్యూఏఐ) ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ విషయంలో కాలుష్య నియంత్రణ మండళ్లు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తోంది. ఆస్పత్రుల నుంచే కాకుండా గృహాలు, సాధారణ ప్రజానీకం నుంచి కూడా పెద్దయెత్తున మాస్కులు, పీపీఈ కిట్లు, చేతితొడుగుల వినియోగంతో వ్యర్థాలు పెరుగుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు. ఇది కూడా సమస్యను పెంచుతోంది. రహదారుల పక్కన, జలవనరులు, బీచులు వంటి చోట్ల పెద్ద సంఖ్యలో మాస్కులు తదితరాలు కనిపిస్తుండటమే ఇందుకు నిదర్శనం. లాక్‌డౌన్లు, ఇంటి నుంచి పనితో ఇళ్లలో ఉండిపోయిన ప్రజలు నిత్యావసరాలు, ఇతరత్రా సరకులను ఇంటివద్దకే తెప్పించుకోవడం సహా ఆయా పార్సిళ్ల కోసం వినియోగించే ప్లాస్టిక్‌ కారణంగా వ్యర్థాలూ పెరుగుతున్నాయి. ఎప్పటికప్పుడు వ్యర్థాలను తొలగించే సరైన యంత్రాంగం లేకపోవడం కూడా అవి పెద్దయెత్తున పోగుపడటానికి కారణమవుతోంది. జీవ వైద్య వ్యర్థాల్లోని ప్లాస్టిక్‌ అవశేషాలు ప్రజారోగ్యానికి ప్రమాదకరంగా మారుతున్నాయి. జీవవైద్య వ్యర్థాలను సక్రమంగా వేరు చేసి, శుద్ధి చేయకపోతే అవి మనుషులు, జంతువులు, జలవనరులకు ప్రమాదకరంగా మారతాయి. పీపీఈ కిట్లు, సిరంజీలు, చేతితొడుగులు, ఇతర వస్తువులు మట్టిలో కలిసిపోయేందుకు చాలా సంవత్సరాలు పడుతుంది. అవి మన పర్యావరణంలోకి టన్నులకొద్దీ మైక్రోప్లాస్టిక్‌లను పంపిస్తాయి. భూగర్భ జలవనరులు కలుషితమవుతాయి. గాలి, నీరు, మట్టిలో చేరే కాలుష్య కారకాలు ఆహార గొలుసులో చేరతాయి. ఆ కాలుష్యం తిరిగి ప్రజలు, జంతువులను వ్యాధుల బారిన పడేస్తుంది. జీవ వైద్య వ్యర్థాలను పక్షులు, ఎలుకలు, సంరక్షణలేని జంతువులు, మనుషులకు దూరంగా ఉంచకపోతే- గాలి, మట్టి, నీటి ద్వారా వ్యాధులు సోకే ముప్పుంది. శుద్ధి ప్రక్రియ సరిగ్గా చేపట్టకపోతే, గాలిలో విషతుల్య రేణువుల ద్వారా వ్యాధులు వ్యాపించే ముప్పు పెరుగుతుంది.

కాగితాలకే పరిమితం

వ్యర్థాల శుద్ధి, సురక్షిత నిర్మూలన, రీసైక్లింగ్‌ వంటి ప్రక్రియల్లో నిబంధనల్ని సరిగ్గా పాటించకపోవడం వల్ల కొన్ని రాష్ట్రాల్లో కొవిడ్‌ ముప్పు తీవ్రత పెరిగినట్లు 'ఇంటర్నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పాపులేషన్‌ సైన్సెస్‌' అధ్యయనం పేర్కొంది. 23 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఇప్పటికీ వ్యర్థాల తొలగింపునకు లోతైన గోతులు తీసి పూడ్చే ప్రక్రియనే అనుసరిస్తున్నటు తెలుస్తోంది. ప్రస్తుత ప్రభుత్వ నిబంధనల ప్రకారం- ఆస్పత్రుల నుంచి వెలువడే జీవవైద్య వ్యర్థాలను తప్పనిసరిగా ఉమ్మడి జీవవైద్య వ్యర్థాల శుద్ధి కేంద్రాల్లో (సీబీడబ్ల్యూటీఎఫ్‌) శుద్ధి చేసి, నిర్మూలించాలి. అయితే, 70 శాతం రాష్ట్రాల్లో సీబీడబ్ల్యూటీఎఫ్‌లపై పర్యవేక్షణకు తగిన వ్యవస్థ లేదు. కొత్త నిబంధనల ప్రకారం కేవలం 12 రాష్ట్రాలే సౌకర్యాలను మెరుగుపరచుకున్నాయి. దేశవ్యాప్తంగా 200 శుద్ధి కేంద్రాలు ఉన్నా, పెద్దయెత్తున పోగుపడుతున్న వ్యర్థాల నిర్మూలనకు అవెంతమాత్రం చాలవు. వ్యర్థాల శుద్ధి, నిర్మూలనలో పెరిగిన వ్యయాలు భారంగా మారినట్లు చెబుతున్నా అదెంత మాత్రం అంగీకారయోగ్యమైన సాకు కాబోదు. జీవవైద్య వ్యర్థాలు, చేతి తొడుగులు, మాస్కుల తొలగింపునకు సీపీసీబీ పలు మార్గదర్శకాలను నిర్దేశించినా, అవన్నీ కాగితాలకే పరిమితం అవుతున్నాయి. వ్యర్థాల సేకరణ, తొలగింపు విషయంలో పురపాలక సంఘాలు ఇష్టారీతిన వ్యవహరిస్తున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వ్యర్థాల శుద్ధికి అవసరమయ్యే సాధన సంపత్తి స్థానిక సంస్థల వద్ద లేకపోవడం కూడా పెద్ద సమస్యగా మారుతోంది. మరోవైపు, వ్యర్థాల విషయంలో సాధారణ ప్రజానీకానికీ సరైన అవగాహన ఉండటం లేదు. ఇందుకోసం ప్రభుత్వం విస్తృత ప్రాతిపదికన జన చైతన్య కార్యక్రమాలు నిర్వహించడం నేడెంతో అవసరం.

- శ్రీనివాస్‌ దరెగోని

ఇదీ చూడండి: ఈ-వ్యర్థాల పునర్వినియోగమే మానవాళికి క్షేమం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.