ETV Bharat / opinion

రాజ్యాంగ రక్షకులా? భక్షకులా?

రాష్ట్రాల్లో రాజ్యాంగబద్ధ పాలనకు దన్నుగా నిలవాల్సిన రాజ్‌భవన్లు... సంకుచిత రాజకీయ క్రీడాంగణాలుగా భ్రష్టుపడుతున్నాయి. ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వాలను.. అడ్డుదారుల్లో కూల్చి అందలమెక్కాలనే రాజకీయ కుట్రలకు... గవర్నర్ వ్యవస్థ కొమ్ము కాస్తుండడం దారుణం. ఇది ప్రజాస్వామ్యానికే తీరని కళంకమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Politics that corrupts the governor system
రాజ్యాంగ భక్షకులా?
author img

By

Published : Jul 29, 2020, 8:07 AM IST

'రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడేలా చూడటమే గాని, ప్రభుత్వ ఏర్పాటుకు ప్రయత్నించడం గవర్నర్ల బాధ్యత కాదని' సర్కారియా కమిషన్‌ స్పష్టీకరించి మూడు దశాబ్దాలవుతోంది. రాష్ట్రాల్లో రాజ్యాంగబద్ధ పాలనకు దన్నుగా నిలవాల్సిన రాజ్‌భవన్లు సంకుచిత రాజకీయ క్రీడాంగణాలుగా భ్రష్టుపడుతున్న వైనం ఇప్పటికీ పలుచోట్ల కళ్లకు కడుతూనే ఉంది. మొన్న మార్చిలో జ్యోతిరాదిత్య సింధియా పార్టీ ఫిరాయింపు మధ్యప్రదేశ్‌లో కమల్‌నాథ్‌ సర్కారు పుట్టి ముంచే క్రమంలో- అక్కడి గవర్నర్‌ సత్వర బలపరీక్షకు తొందర పెట్టడం తెలిసిందే. కరోనా కారణంగా శాసనసభను సత్వరం కొలువు తీర్చడం సాధ్యపడదన్న కుంటిసాకులు ఫలించక కమల్‌నాథ్‌ ప్రభుత్వం తట్టాబుట్టా సర్దుకోవడం ఇటీవలి ముచ్చటే! అందుకు పూర్తి భిన్నంగా భారత రాజకీయ చరిత్రలోనే విడ్డూరమనదగ్గ రీతిగా రాజకీయ డ్రామా రాజస్థాన్‌లో రక్తికడుతోంది. 18మంది అనుచరులతో ఉపముఖ్యమంత్రి సచిన్‌ పైలట్‌ రాజేసిన అసమ్మతి కుంపటి- అశోక్‌ గెహ్లోత్‌ ప్రభుతను బొటాబొటీ మెజారిటీకి దిగలాగింది. మధ్యప్రదేశ్‌ అంత సాఫీగా ప్రభుత్వం చేతులు మారే వాతావరణం లేకపోవడంతో- కోర్టుల్లో పడ్డ కేసులు సరికొత్త న్యాయ సమీక్షకు అంటుకట్టాయి. అవి ఎప్పటికి తెమిలేదీ తెలియదు కాబట్టి, విధానసభలో మెజారిటీ నిరూపణకు అశోక్‌ గెహ్లోత్‌ చేస్తున్న యత్నాలకు గవర్నర్‌ కల్‌రాజ్‌ మిశ్రా గండికొడుతున్న తీరు నిశ్చేష్టపరుస్తోంది. విశ్వాస పరీక్షకు కాని పక్షంలో శాసనసభను కొలువు తీర్చడానికి 21రోజుల ముందస్తు నోటీసు ఇవ్వాలన్న గవర్నర్‌- కొవిడ్‌ నేపథ్యంలో ఎమ్మెల్యేలు, సిబ్బంది భద్రత రీత్యా భౌతిక దూర నిబంధనల్ని ఎలా పాటిస్తారో వెల్లడించాలంటున్నారు. సభలో మాన్య సభ్యుల భద్రత గౌరవ సభాపతి పరిధిలోని అంశం. మంత్రిమండలి సలహా మేరకే నడుచుకోవాల్సిన విధివిహిత బాధ్యత గల గవర్నర్‌- బలపరీక్షకు సైంధవుడిలా అడ్డుపడుతున్న తీరు ప్రజాస్వామ్యానికే కళంకం!

తాబేదురు వ్యవస్థ!

భయ పక్షపాతాలు గాని, రాగద్వేషాలు గాని లేకుండా రాజ్యాంగబద్ధంగా పాలన సాగిస్తామంటూ ముఖ్యమంత్రుల చేత పదవీ ప్రమాణాలు చేయించే గవర్నర్లే ఆ జాడ్యాల పాలబడటం ప్రజాస్వామ్య భారతి ప్రారబ్ధం. కేంద్రంలోని పెద్దల తాబేదార్లుగా రాజ్‌భవన్లలో తిష్ఠ వేసి, 'తస్మదీయ' ప్రభుత్వాల తలకొట్టి మొలేసే దుష్ట రాజకీయ గవర్నర్లు సృష్టిస్తున్న రాజ్యాంగ సంక్షోభాలు అనేకం. 'చట్టసభను సమావేశపరచడం ప్రభుత్వాలకే ఉన్న ప్రత్యేక హక్కు... మంత్రిమండలి సలహా పాటించడమే గాని అందులో గవర్నర్‌ విచక్షణకు తావే లేదు'- అని లోక్‌సభ మాజీ సెక్రటరీ జనరల్‌ ఆచార్య చెబుతున్నారు. అధికార పార్టీ మెజారిటీ సందేహాస్పదమైనప్పుడు సాధ్యమైనంత త్వరగా సభలో బలపరీక్ష జరగాలని 2016నాటి ఉత్తరాఖండ్‌ కేసులోనూ 'సుప్రీం' సూచించిన సంగతి విస్మరించకూడదు. సభను కొలువు తీర్చడం కేవలం గవర్నర్‌ ఇష్టానికే పరిమితమై లేదని అరుణాచల్‌ ప్రదేశ్‌ అసెంబ్లీ కేసులో రాజ్యాంగ ధర్మాసనం తీర్పు ఇచ్చింది. చట్టసభను సమావేశపరచడం, రద్దు చెయ్యడం వంటి అంశాల్లో రాజ్యాంగ ముసాయిదా గవర్నర్లకు విచక్షణాధికారం కట్టబెట్టినా, చర్చోపచర్చల తరవాత రాజ్యాంగ నిర్మాతలు నిర్దిష్ట నిబంధనల్ని తొలగించిన అంశాన్ని ధర్మాసనం విశ్లేషించింది. సభ సమావేశం, నిరవధిక వాయిదా, రద్దు అంశాల్లో ముఖ్యమంత్రి నేతృత్వంలోని మంత్రిమండలి సలహా మేరకే నడుచుకోవాలిగాని, గవర్నర్ల సొంత పెత్తనమేదీ లేదని తేల్చి చెప్పింది. నాలుగేళ్ల నాటి ఈ 'సుప్రీం' తీర్పు చాలు- గవర్నర్‌ కల్‌రాజ్‌ మిశ్రా రాజ్యాంగ పరిధి మీరి ప్రవర్తిస్తున్నారనడానికి! రాజ్యాంగ పరిరక్షకుడిగా ఉండీ, కంచే చేను మేసిన చందంగా ఉన్న మిశ్రా వ్యవహార సరళి- రాజ్యాంగ విలువల పట్ల విశ్వాస పరీక్షలో గవర్నర్‌ వైఫల్యానికే అద్దం పడుతోంది!

ఇదీ చూడండి: అయోధ్యలో ఉగ్రదాడులకు భారీ కుట్ర!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.