గత ఆరు సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా కృశించిపోవడానికి కారణాలేమిటో ఆత్మశోధన చేసుకుని, పార్టీ పునరుజ్జీవానికి పటిష్ఠ ప్రణాళికను చేపడదామని 23మంది సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఒక లేఖలో నిజాయతీగా చేసిన సూచనను సోనియాగాంధీ కుటుంబం పెడచెవిన పెట్టింది. ఇది దేశాన్ని సుదీర్ఘకాలం పాలించిన కాంగ్రెస్ భవిష్యత్తుకు ఏ మాత్రం మంచిది కాదు. గతంలో కూడా కాంగ్రెస్ ఎన్నో ఆటుపోట్లను చవిచూసినా, మళ్ళీ కోలుకుని పగ్గాలు చేపట్టిన సందర్భాలున్నాయి. ఇప్పుడు ఆ పార్టీ చుక్కాని లేని నావలా తయారై- కాంగ్రెస్ నాయకులు, సభ్యులు, కార్యకర్తలను నిరాశామయ స్థితిలోకి నెడుతోంది.
ఇటీవలి కాంగ్రెస్ కార్యవర్గ సమావేశంలో సీనియర్ నాయకుల వాణిని తొక్కిపెట్టిన తీరును పరికిస్తే, ఆ పార్టీ సోనియా కుటుంబ ప్రైవేట్ లిమిటెడ్‌గా తయారైందని, కాంగ్రెస్ స్థితిగతులపై నిజాయతీగా సింహావలోకనం జరగకుండా కుటుంబ భజనపరులు అడ్డుపడతారని మళ్లీ రూఢి అయింది. నెహ్రూ కుటుంబ సభ్యుల చేతిలో పార్టీ పగ్గాలు ఉంటే, సమష్టి నాయకత్వాన్ని, నిజాయతీగా చర్చను కోరడానికి ఎవరూ సాహసించరు. ఆత్మశోధన, సింహావలోకనం అనే పదాలను ఉచ్ఛరించడాన్ని తిరుగుబాటుగా... సమష్టి నాయకత్వం, సంస్థాగత ఎన్నికలను కోరడాన్ని తప్పుగా పరిగణించడం కాంగ్రెస్‌కు పరిపాటి. ఇందిర కుటుంబానికి చెందని వారెవరైనా కాంగ్రెస్ నాయకత్వ స్థానంలో ఉంటే మాత్రం, కుటుంబ ప్రోద్బలంతో ఈ డిమాండ్లు తలెత్తుతూ ఉంటాయి. పీవీ నరసింహారావు, సీతారాం కేసరి హయాములో జరిగింది ఇదే.
కంటగింపుగా 'అంతర్గత చర్చ'
ఇప్పుడు కాంగ్రెస్ పగ్గాలు సోనియాగాంధీ చేతిలో ఉన్నాయి. ఇలాంటి సమయంలో పార్టీ స్థితిగతులపై అంతర్గత చర్చ జరగాలని, ఆంతరంగిక ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పాలని పిలుపు ఇవ్వడంకన్నా అపచారం మరొకటి ఉంటుందా? సీనియర్ నేతలు డొంకతిరుగుడు మాటలు కట్టిపెట్టి, తక్షణం పార్టీ పరిస్థితిని చక్కదిద్దుకోవాలని సూటిగా, నిక్కచ్చిగా సూచించడం- సోనియా అంతేవాసులకు కంటగింపు అయింది. 2014, 2019 లోక్‌సభ ఎన్నికల్లో, పలు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పరాజయం పాలవడం, పార్టీ బలం నానాటికీ క్షీణించిపోవడం చూసిన సీనియర్ నాయకులు- ఈ దుస్థితికి కారణాలేమిటో శోధించి, శీఘ్రమే దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించకపోతే, కాంగ్రెస్ మళ్లీ కోలుకోవడం కష్టమని పేర్కొన్నారు.
లేఖలో వివరించినా..
అనేక రాష్ట్రాల్లో బలహీనపడిపోయిన పార్టీ, కేంద్రంలోనూ అప్రధానంగా మిగిలే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఓటర్లలో కాంగ్రెస్‌కు ఆదరణ కొరవడటం ఏమాత్రం మంచిది కాదన్నారు. 2014 ఎన్నికల తరవాత, గడచిన ఆరేళ్లలో దేశంలో కొత్తగా 18.7 కోట్లమంది ఓటర్లుగా నమోదయ్యారు. ఈ యువకులు అత్యధికంగా నరేంద్ర మోదీ నాయకత్వంలోని భాజపాకు ఓటు వేశారే తప్ప, కాంగ్రెస్ వైపు చూడలేదు. ఇది ఆందోళనకరమని సీనియర్ నేతలు లేఖలో వివరించారు. 2009 లోక్‌సభ ఎన్నికల్లో 7.84 కోట్ల ఓట్లు సంపాదించిన భాజపా, తన ఓట్లను 2014కల్లా 17.60 కోట్లకు, 2019లో 22.90 కోట్లకు పెంచుకుంది. 2009లో 12.30 కోట్ల ఓట్లు సంపాదించిన కాంగ్రెస్, 2019లో 11.94 కోట్ల ఓట్లతో సరిపెట్టుకోవలసి వచ్చింది. కాంగ్రెస్ పట్ల ఓటర్ల ఆదరణ ఇంతగా క్షీణించడానికి కారణాలేమిటో ఆత్మశోధన చేసుకోవాలని ఆ నేతలు సూచించారు. కనీసం 2019 ఎన్నికల్లో దారుణ పరాజయం తరవాతనైనా ఈ పని చేయకపోవడం సమంజసం కాదన్నారు.
అరణ్య రోదనేనా?
ఎంతటి వీరవిధేయులైనా పార్టీలో అంతర్గత చర్చ జరగాలని కోరితే మాత్రం నెహ్రూ కుటుంబానికి చిర్రెత్తుకొస్తుంది. 1999లో కాంగ్రెస్ కార్యవర్గ సమావేశంలో పూర్నో సంగ్మా, శరద్ పవార్, తారిక్ అన్వర్ ఇప్పటిలాగే కొన్ని కీలక ప్రశ్నలు లేవనెత్తారు. అప్పటి లోక్‌సభ ఎన్నికల్లో సోనియాగాంధీ ద్వంద్వ పౌరసత్వం ప్రధానంగా చర్చకు వచ్చేది. కార్యవర్గ సమావేశంలో సంగ్మా... ‘మీకు ఇండియా, ఇటలీ పౌరసత్వాలు రెండూ ఉన్నాయా’ అని సోనియాను నేరుగా అడిగేశారు. కాంగ్రెస్ ప్రత్యర్థులు ఈ విషయమై చేస్తున్న ఆరోపణలను తిప్పికొట్టడానికే తాను ఇలా ప్రశ్నిస్తున్నానని, వారి ఆరోపణలు నిజం కాదని తేలితే పార్టీ యంత్రాంగం ఉత్సాహంగా ఎన్నికల పోరు జరుపుతుందని సంగ్మా వివరించారు. సోనియా ఈ ప్రశ్నకు జవాబివ్వడానికి నిరాకరించడమే కాదు, పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. ఆపై సంగ్మా, పవార్, తారిక్‌లను పార్టీ నుంచి బహిష్కరించారు. 1999 ఎన్నికల్లో వాజ్‌పేయీ నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఆ ఎన్నికల్లో 28.30 శాతంగా ఉన్న కాంగ్రెస్ ఓట్ల శాతం, 2019 ఎన్నికలకు వచ్చేసరికి 19.50 శాతానికి పడిపోయింది.
వారు లేకపోతే ఇక దిక్కెవరు.?
ఇప్పుడు పార్టీ స్థితిగతులపై లేఖ రాసిన 23మంది సీనియర్ నాయకులనూ ఒకవేళ పక్కన పెట్టేస్తే, కాంగ్రెస్‌కు ఇక దిక్కెవరు? లేఖపై సంతకాలు చేసినవారు మామూలు నాయకులు కారు. వారిలో గులాంనబీ ఆజాద్, వీరప్ప మొయిలీ, పి.జె. కురియన్, ఆనంద్ శర్మ, భూపిందర్ సింగ్ హూడా, కపిల్ సిబల్, పృథ్వీరాజ్ చవాన్ వంటి హేమాహేమీలు ఉన్నారు. కురియన్‌కు పార్టీతో 60 ఏళ్ల అనుబంధం ఉంది. ఇక గులాంనబీ ఆజాద్ 1973లో బ్లాకు కాంగ్రెస్ కార్యదర్శి పదవితో మొదలుపెట్టి అంచెలంచెలుగా ఎదిగారు. 1972లో కర్ణాటకలో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఎన్నికైన మొయిలీ 50 ఏళ్ళ నుంచి పార్టీకి పరమ విధేయుడిగా ఉంటున్నారు. ఇలా జీవితకాలం పార్టీకే అంకితమైన దిగ్గజాల చిత్తశుద్ధి, విధేయతలను శంకించడం పార్టీకి మేలు చేస్తుందా? వీరి వేదన అరణ్య రోదనగా మిగిలి కాంగ్రెస్‌కు కాస్తో కూస్తో ఉన్న పునాదులూ హరించుకుపోయేలా ఉన్నాయి. తాజా పరిణామాలపై సోనియా, రాహుల్, ప్రియాంకల వైఖరి కాంగ్రెస్ పునరుజ్జీవానికి ఏమాత్రం తోడ్పడేదిగా లేదు. కాంగ్రెస్ నానాటికీ క్షీణించి కనుమరుగైపోతే- అది భారత ప్రజాస్వామ్యానికీ మంచిది కాదు.
పార్టీ బాగు కోసమే...
కాంగ్రెస్‌ను మళ్లీ బలోపేతం చేయడానికి సీనియర్ నేతలు విలువైన సూచనలు చేశారు. మొదట దేశమంతటా కాంగ్రెస్‌లోకి కొత్త సభ్యులను చేర్పించే కార్యక్రమాన్ని ఉద్యమంలా చేపట్టాలన్నారు. పార్టీలో అన్ని అంచెల్లో సంస్థాగత ఎన్నికలు జరపాలని, పార్టీ పునరుజ్జీవన కార్యక్రమాన్ని సమష్టి నాయకత్వ మార్గదర్శకత్వంలో నిర్వహించాలని సిఫార్సు చేశారు. ఈ లేఖ రాసిన నాయకులు చిరకాలంగా పార్టీని అంటిపెట్టుకున్నవారే. పార్టీ బాగోగుల కోసమే అధినాయకత్వానికి లేఖ రాశారు తప్ప వారికి స్వార్థ ప్రయోజనాలు, దురుద్దేశాలూ లేవు. అలాంటప్పుడు ఆ లేఖను అధిష్ఠానం తప్పుపట్టడమెందుకు? వీరంతా భాజపాకు అనుకూలురని ఆరోపించడం సరికాదు. వీరిలో ఏ ఒక్కరికీ ఎన్నడూ భాజపాపట్ల కానీ, మోదీపట్ల కానీ సానుకూలత వ్యక్తీకరించిన చరిత్ర లేదు.
- ఎ. సూర్యప్రకాశ్, రచయిత - ప్రసార భారతి మాజీ ఛైర్మన్
ఇదీ చదవండి: లోక్‌సభలో వ్యవసాయదారులే అధికం