ఇటీవలి కాలంలో ఆంగ్ల మాధ్యమం గురించి తీవ్ర చర్చ జరుగుతోంది. నర్సరీ నుంచి మొదలు, పాఠశాల విద్య దశ మొత్తం ఆంగ్లంలోనే కొనసాగాలని పాలకులు గట్టి పట్టుదలతో ఉండటంతో చర్చ విస్తృతంగా సాగుతోంది. ఇంగ్లిష్ నేర్చుకోవడానికి ఆంగ్ల మాధ్యమమే సరైన పద్ధతేమీ కాదు. చాలా దేశాల్లో ఆంగ్ల మాధ్యమం లేకుండానే సమస్త శాస్త్ర విజ్ఞానాన్నీ నేర్పుతున్నారు. అనేక విద్యల్లో, శాస్త్ర సాంకేతిక రంగాల్లో పురోగతి సాధిస్తున్న దేశాల్లో ఆంగ్లాన్ని కనీసం ఒక సబ్జెక్టుగా కూడా బోధించనివి చాలా ఉన్నాయి. స్థానిక, ప్రాంతీయ మాతృభాషల్లోనే బోధన జరుగుతున్న వైనం చాలా దేశాల్లో ఉంది. ఆంగ్లాన్ని ఒక భాషగా నేర్చుకోవడానికి అంతర్జాతీయంగా అమలులో ఉన్న అనేక పద్ధతులు, మార్గాలు ఉన్నాయి. వాటిని శాస్త్రీయంగా సరైన పద్ధతిలో అవలంబిస్తే, పిల్లలు సంతోషంగా, తేలికగానే ఆ భాషను నేర్చుకోగలుగుతారు.
నైపుణ్యం ప్రశ్నార్థకం
పాఠశాల నుంచి పైస్థాయి వరకు పాఠ్య పుస్తకాలలో పద్యం, గద్యం, నాటకం తదితర ప్రక్రియలను పరిచయం చేస్తారు. సుప్రసిద్ధ కవులు, రచయితల పద్య, గద్య భాగాలను పాఠ్యాంశాలుగా చేరుస్తారు. దీనికి సంబంధించి పాఠ్య పుస్తకాలలో భాషా పరంగా చెప్పే అంశాలు తక్కువే. ఆంగ్లం మాతృభాష కాని వ్యక్తికి, ఆంగ్ల ప్రాంతంలో జీవించని వ్యక్తికి ఆ భాషను నేర్చుకోవడానికి, భాష వ్యక్తీకరణ, సామర్థ్యం పెంచుకోవడానికి అవసరమైన పద్ధతులేవీ అందులో ఉండవు. ఎస్సీఈఆర్టీ ఆంగ్ల వాచకాల రూపకల్పనలో కొంతమేరకు కొత్త దారులు తొక్కిన మాట నిజం. కానీ ఇది విద్యార్థిలో ఎంతమేర నైపుణ్యాన్ని పెంచుతోందనేది ప్రశ్నార్థకం.
ఇలాంటి పాఠ్య పుస్తకాల రూపకల్పన ఎన్నో ఏళ్లుగా జరుగుతూనే ఉంది. ఆంగ్ల విద్యావిధానం మెకాలే ప్రవేశపెట్టినది మొదలు ఇప్పటికీ అదే పరిస్థితి కనపడుతోంది. ఇదంతా ఆంగ్ల పాఠ్యపుస్తకాలలో ఆంగ్ల భాషా సాహిత్యాల పట్ల అభిరుచిని, ఒక రకమైన అభినందనను, అభిమానాన్ని కలిగించేందుకు చేస్తున్న ప్రయత్నంగా చెప్పవచ్చు. షేక్‌స్పియర్, కీట్స్‌లను పరిచయం చేయడం ద్వారా, ఆ నాటకాలు, అక్కడి సంస్కృతులు, జీవన విధానాలు, ఆచారాలు వంటి వాటిని పరిచయం చేశారు. అందులో భాగంగా ఆంగ్లం చాలా గొప్పదనే భావన పెంపొందించేందుకే అప్పట్లో ప్రయత్నం చేశారు.
సామర్థ్యం పెంచేలా..
ప్రతి భాషకూ సాహిత్యపరమైన కావ్య భాష వేరుగా ఉంటుంది. ప్రజా బాహుళ్యంలో ప్రయోగించే సాధారణమైన పదాలతో కూడిన వ్యక్తీకరణ సామర్థ్యాలు అందించే వ్యవహారిక భాష మరొకటి ఉంటుంది. ఈ రెండోదానికి మనం పాఠ్యపుస్తకాలను రూపకల్పన చెయ్యాల్సి ఉంటుంది. ఇందుకోసం అనేక స్థాయుల్లో పాఠ్య పుస్తకాలను రూపొందించాలి. అనేక ప్రక్రియల్ని పరిచయం చెయ్యాలి. ఉదాహరణకు పిల్లవాడికి ఆవు గురించి వర్ణించి చెప్పమన్నప్పుడు- చిన్న చిన్న వాక్యాల ద్వారా చెప్పించడం సహా మరొక జంతువు, చెట్టు, నది వంటివాటి గురించి చెప్పించడం ద్వారా వర్ణించడం నేర్పించాలి. వాటి నుంచి విద్యార్థికి ఆ భాషా పరంగా వ్యక్తీకరణ సామర్థ్యాన్ని పెంచేందుకు కృషి చెయ్యాలి. అంటే చిన్నారి తాను నేర్చుకునే దానిని తిరిగి మాట్లాడుతూ స్పందించేందుకు మరింత ఎక్కువ అవకాశం ఉండాలి. ఆంగ్ల రచనను అర్థవంతంగా చదివే సామర్థ్యం రావాలి. ఏదైనా వింటే దాన్ని స్పష్టంగా అవగాహన చేసుకొని, అందులో ప్రతిపాదించిన మూలభావన ఏమిటి? ఆ భావనకు అనుగుణంగా భాషా ప్రయోగం ఎలా చెయ్యాలనేది నేర్చుకోవాలి. అంటే పిల్లలకు చక్కగా వినడం, మాట్లాడటం, చదవటం వంటి మూడు నైపుణ్యాలూ రావాలి.
వినియోగమే కీలకం
భాషను దైనందిన జీవితంలో వినియోగించేలా పిల్లలకు అనేక ప్రక్రియల్ని పరిచయం చేయాలి. పిల్లలు తమకున్న అనుమానాలను చెప్పడానికి అవకాశం లేక చాలా విషయాల్లో కంగారు పడతారు. అందుకని, పాఠ్యపుస్తకాల రూపకల్పన దశలోనే భాషలో వినియోగ కోణాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. చిన్నారులకు ఆంగ్లం బాగా అబ్బాలి అంటే భాషపై సానుకూల వైఖరి ఏర్పడి సహజమైన రీతిలో అలవాటుపడాలి. అంటే పరస్పర వ్యవహారం ఆంగ్లంలోనే కొనసాగాలి. అందుకే ఎస్సీఈఆర్టీ భాష వినియోగ కోణాన్ని మరింతగా పెంపొందించేలా పాఠ్యాంశాలను నిర్దుష్టంగా రూపొందించాల్సిన అవసరం ఉంది. పరస్పరాధార వ్యవహార పద్ధతిని బలోపేతం చేసినప్పుడే భాషను నేర్వడం, నేర్పడం రెండూ ఫలవంతమవుతాయి. పిల్లలకూ భాషపై పట్టు పెరుగుతుంది.
భాషను నేర్చుకునే వాతావరణం కల్పించకుండా నేర్చుకోవడం సాధ్యం కాదు. భాషాభివృద్ధికి సరైన పాఠ్యపుస్తకాలు, ఉపాధ్యాయులకు మెరుగైన శిక్షణ, తరగతి గది వాతావరణం వంటివన్నీ దృష్టిలో ఉంచుకోవాల్సిన అంశాలు. ఇవి బలోపేతమైతే పిల్లలకు భాష దానంతటదే వస్తుంది. అంతేగానీ ప్రతి సబ్జెక్టును ఆంగ్ల మాధ్యమంలో అభ్యసిస్తేనే ఇంగ్లిష్ వస్తుందనుకోవడం అవివేకం. కీలక భావనలపై మాతృభాషలోనే అవగాహన బాగా పెరుగుతుంది. వాటిని పరాయి భాషలో అర్థం చేసుకోవడం కష్టం. లేనిపక్షంలో పిల్లల భవిష్యత్తు బలవడం, మాతృభాషకు అన్యాయం జరగడం, విద్యావిజ్ఞానాలు వికసించకపోవడం వంటి దుష్ఫలితాలు తప్పవు.
- ముక్తేశ్వరరావు, విశ్రాంత ఐఏఎస్ అధికారి
ఇదీ చదవండి : బాలికపై యాసిడ్ దాడి.. పరిస్థితి విషమం!