Omicron News: కొవిడ్-19 వ్యాధికారక కరోనా వైరస్ కొత్త రూపాంతరమైన బి.1.1.529కు ప్రపంచ ఆరోగ్యసంస్థ ఒమిక్రాన్‌గా నామకరణం చేసింది. ఈ సూపర్ వైరస్‌లో 32 మార్పులను కనిపెట్టారు. ఒమిక్రాన్ అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతోంది. భారత ప్రభుత్వం 37 ఒమిక్రాన్ జీనోమ్ సీక్వెన్సింగ్ ప్రయోగశాలలను నెలకొల్పి కొత్త వైరస్‌పై పరిశోధనలు చేస్తోంది. ఆ ఫలితాలు ఇంకా వెలువడాల్సి ఉంది. కొవిడ్ కారక కరోనా వైరస్‌లు ప్రధానంగా శ్వాసకోశంపై దాడిచేస్తాయి. దీర్ఘకాల వ్యాధులతో బాధపడుతున్నవారిపై మరింత ప్రభావం చూపుతాయి. కొవిడ్, ఫ్లూ వ్యాధులు వేర్వేరు రకాల కరోనా వైరస్‌లవల్ల కలుగుతాయి. ఫ్లూ వైరస్ సోకిన తరవాత ఒకటి నుంచి నాలుగు రోజుల్లో లక్షణాలు బయటపడతాయి. కొవిడ్ వైరస్ సోకిన తరవాత రెండు నుంచి 14 రోజుల్లో రోగ లక్షణాలు వెలుగుచూస్తాయి. సుదీర్ఘ కాలంగా కొవిడ్‌తో బాధపడుతున్నవారి రక్తంలో ఆటో యాంటీబాడీలను కనిపెట్టే పరీక్షను లండన్‌లోని ఇంపీరియల్ కాలేజీ పరిశోధకులు రూపొందిస్తున్నారు. కొవిడ్ వైరస్‌ను కనిపెట్టడానికి ఉపకరించే కొత్త సాధనాలను బ్రిటన్‌కు చెందిన రోబో సైంటిఫిక్ లిమిటెడ్ కంపెనీ రూపొందించింది. వాటి సామర్థ్యాన్ని బ్రిటన్‌లోని డరం విశ్వవిద్యాలయం, లండన్‌లోని ఉష్ణ మండల వ్యాధుల పరిశోధన కేంద్రం కలిసి పరీక్షిస్తున్నాయి. వ్యక్తుల చెమట, శరీర వాసనను బట్టి కొవిడ్ సోకినవారిని నూరు శాతం కచ్చితంగా కనిపెట్టడానికి అవి తోడ్పడే అవకాశం ఉంది. నెదర్లాండ్స్ ప్రజారోగ్య శాఖ శ్వాస విశ్లేషిణి (బ్రెథలైజర్)లను ఉపయోగించి వ్యక్తుల శ్వాసలో కొవిడ్ ఉనికిని పసిగట్టడానికి ప్రయోగాలు జరుపుతోంది.
ఒక మహమ్మారిని కనుగొన్న వెంటనే రోగ నిర్ధారణ పరీక్షలు, టీకాలు, వైరస్‌పై పోరాడే మందులు, ఇతర ఔషధాలను వేగంగా తయారు చేయడం కొవిడ్ విషయంలోనే జరిగింది. ఇంతటి వేగవంతమైన స్పందన మానవ చరిత్రలో మునుపెన్నడూ కనిపించదు. ముక్కు ద్వారా పంపడానికి వీలైన యాంటీబాడీలను అమెరికాలో టెక్సస్ విశ్వవిద్యాలయ పరిశోధకులు రూపొందిస్తున్నారు. ప్లాస్మా కణాల నుంచి ఉత్పత్తి అయ్యే గ్లైకోప్రొటీన్ అణువుల (ఇమ్యునోగ్లోబులిన్ యాంటీబాడీల)పైనా ప్రయోగాలు జరుగుతున్నాయి. కొవిడ్‌వల్ల ప్రాణాపాయం తలెత్తే ప్రమాదాన్ని మోనోక్లోనల్ యాంటీబాడీలు గణనీయంగా తగ్గిస్తున్నాయి. కొవిడ్‌పై ఎజిత్రోమైసిన్, ఫావిపిరావిర్, లోపినావిర్, కోర్టికోస్టెరాయిడ్, వాపును తగ్గించే మందులు, ఐఎల్ 6 యాంటగొనిస్ట్, నైట్రిక్ ఆక్సైడ్ తదితర ఔషధాలు ఎలా పనిచేస్తున్నాయన్నదానిపైనా ప్రయోగాలు చేస్తున్నారు. ఒమిక్రాన్‌ను అవి సమర్థంగా ఎదుర్కోగలవని ఇప్పటిదాకా కచ్చితంగా నిర్ధారణ కాలేదు.
ప్రస్తుతం విరివిగా అందుబాటులో ఉన్న పలు రకాల వ్యాక్సిన్లు ఒమిక్రాన్‌ను అడ్డుకోగలవని నిర్ధారణ అయింది. అయితే, వాటి సామర్థ్యంపై కొంత సందేహం ఉంది. రెండు రకాల (మిశ్రమ) వ్యాక్సిన్లను తీసుకున్నప్పుడు కొవిడ్‌ను నిరోధించే శక్తి గణనీయంగా పెరిగినట్లు స్పెయిన్‌లో పరిశోధకులు కనుగొన్నారు. మొదట ఆస్ట్రాజెనెకా (కొవిషీల్డ్), తరవాత రెండో డోసుగా ఫైజర్‌ను ఇచ్చి ప్రయోగాలు జరిపినప్పుడు రోగనిరోధక శక్తి గణనీయంగా పెరిగినట్లు తేలింది. కొవిడ్ టీకాలు తీసుకున్న తరవాత తల్లిపాలలో ఎటువంటి దుష్ఫలితాలూ కనబడలేదని తేలడం ప్రపంచవ్యాప్తంగా 10కోట్ల మంది చంటిబిడ్డ తల్లులకు ఊరట కలిగించే అంశం. కొవిడ్ బారినపడిన తరవాత ఒక మోతాదు టీకా తీసుకున్నవారిలో రోగ నిరోధక వ్యవస్థ శక్తిమంతంగా ఉన్నట్లు అధ్యయనాల్లో తేలింది. ఏదిఏమైనా రెండు మోతాదుల టీకాలు తీసుకున్న తరవాతా చేతులు శుభ్రం చేసుకోవడం, భౌతిక దూరం పాటించడం, మాస్కులు ధరించడం తప్పనిసరి.
- ప్రొఫెసర్ ఎం.వి.రాఘవేంద్రరావు
(వైద్య పరిశోధనారంగ నిపుణులు)
ఇదీ చూడండి: Vaccination for Children: జనవరి 3 నుంచి పిల్లలకు టీకా