ETV Bharat / opinion

న్యాయార్థులకు ఇంకా అన్యాయమే!

జిల్లా సబార్డినేట్​ కోర్టుల్లో మౌలిక వసతుల అధ్వానంగా ఉన్నట్లు ఓ అధ్యయనం చెబుతోంది. మరోవైపు ఈ కోర్టుల్లోనే కేసులు గుట్టలుగుట్టలుగా పోగుపడుతున్నాయి. అయితే మౌలిక వసతుల లేమితో ఇబ్బందులు పడుతున్న కింది కోర్టులకు తగిన సదుపాయాలు కల్పించాలంటూ సర్వోన్నత న్యాయస్థానం జారీ చేసిన ఆదేశాలు అలానే మూలుగుతున్నాయి. మరోవైపు ఖాళీగా ఉన్న జడ్జీల పోస్టులు భర్తీ చేయకపోవడం ఆందోళన కలిగించే విషయం.

courts cases
కోర్టులు, కేసులు
author img

By

Published : Jul 16, 2021, 7:36 AM IST

దేశవ్యాప్తంగా వివిధ అంచెల్లో ఏళ్లతరబడి లెక్కకు మిక్కిలి వ్యాజ్యాలు అపరిష్కృతంగా పోగుపడుతున్నాయి. వాటిలో సింహభాగం వాటా దిగువ న్యాయస్థానాలది. దేశంలోని 25 హైకోర్టుల్లో పెండింగ్‌ కేసుల సంఖ్య 57.5 లక్షలకు చేరగా, జిల్లా సబార్డినేట్‌ కోర్టుల్లో మోక్షానికి నోచక పేరుకుపోయినవి ఎకాయెకి మూడు కోట్ల 81లక్షలుగా లెక్క తేలుతున్నాయి. అసంఖ్యాక కక్షిదారుల జీవితాలను గరిష్ఠంగా ప్రభావితం చేస్తున్నవి దిగువ స్థాయి న్యాయస్థానాలేనని ఈ గణాంకాలు సోదాహరణంగా చాటుతున్నాయి. అంతటి కీలక భూమిక పోషిస్తున్న అంచెలో మౌలిక వసతుల అధ్వాన స్థితిగతులకు రెండేళ్లనాటి విస్తృత అధ్యయనం దర్పణం పట్టింది.

దిల్లీ, కేరళ టాప్​

ఆ సర్వేలో దిల్లీ, కేరళ అత్యుత్తమ ర్యాంకులు పొందగా- బిహార్‌, మణిపూర్‌, నాగాలాండ్‌, పశ్చిమ్‌బంగా, ఝార్ఖండ్‌ ప్రభృత రాష్ట్రాల్లోని దిగువ కోర్టులు అరకొర వసతులతో నెట్టుకొస్తున్నట్లు నిగ్గుతేలింది. అధ్యయన వివరాలు వెలుగు చూడకముందే- కింది కోర్టుల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలంటూ సర్వోన్నత న్యాయస్థానం జారీచేసిన ఆదేశాల స్ఫూర్తికి ఇంకా సరైన మన్నన దక్కనే లేదు. న్యాయపాలిక అన్ని అంచెల్లోనూ కనీస వసతుల పరికల్పన అంశాన్ని గతంలోనే పలుమార్లు లేవనెత్తిన ప్రస్తుత సీజేఐ రమణ మానసపుత్రిక 'నేషనల్‌ జుడీషియల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కార్పొరేషన్‌' క్రియాశీలకమై గుణాత్మక పరివర్తనను కళ్లకు కట్టాల్సి ఉంది.

జిల్లా సబార్డినేట్‌ కోర్టుల్లో మౌలిక వసతుల పెంపుదలను లక్షించిన కేంద్ర ప్రాయోజిత పథకాన్ని 2025-26 సంవత్సరం వరకు పొడిగిస్తూ మోదీ మంత్రిమండలి తాజాగా నిర్ణయం తీసుకుంది. ప్రతిపాదిత వ్యయం తొమ్మిది వేలకోట్ల రూపాయల్లో దాదాపు 60శాతం దాకా కేంద్రమే వెచ్చించి కోర్టుహాళ్లు, నివాస సముదాయాల నిర్మాణం కొనసాగిస్తానంటోంది. వ్యాజ్యాల సంఖ్య ఇంతలంతలవుతుండగా ఆ మేరకు దిగువ కోర్టుల్లో మౌలిక సదుపాయాల విస్తరణ అభిలషణీయమే. దాంతోనే వ్యాజ్యాల పరిష్కరణ వేగవంతం కాబోదన్నది విస్మరించరాని అంశం!

అదో చేదునిజం!

వ్యాజ్యాలు యథార్థం - న్యాయం మిథ్యగా పరిస్థితులు భ్రష్టుపట్టడానికి ఖాళీల భర్తీ వేగం పుంజుకొనకపోవడం ప్రధాన కారణం. జిల్లా సబార్డినేట్‌ కోర్టుల్లో మొత్తం 24,225 మందికిగాను నాలుగు వేలకుపైగా జడ్జీల పోస్టులు భర్తీకాకుండా పడి ఉన్నాయన్నది చేదునిజం. ఎనిమిది ప్రధాన రాష్ట్రాల్లోని సబార్డినేట్‌ కోర్టుల్లో మంజూరైనవాటిలో 20శాతానికి పైగా న్యాయమూర్తుల పదవులు ఖాళీగా ఉండటం, సహజంగానే కేసుల పరిష్కరణ వేగాన్ని కుంగదీస్తోంది. సబార్డినేట్‌ కోర్టుల్లో ప్రతి జడ్జీ సగటున 13వందల పెండింగ్‌ వ్యాజ్యాలతో కుస్తీ పడుతున్నట్లు అధికారిక గణాంకాలు చాటుతున్నా, ఖాళీల భర్తీ ప్రక్రియ వేగం పుంజుకొనకపోవడం దురదృష్టకరం.

రాజ్యాంగంలోని 235 అధికరణ ప్రకారం, దిగువ న్యాయస్థానాలకు చెందినవారిపై సంబంధిత హైకోర్టులదే పాలన నియంత్రణాధికారం. రాష్ట్రప్రభుత్వాన్ని లేదా రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్ను సంప్రతించి దిగువ న్యాయస్థానాల్లో జడ్జీల నియామకాలు చేపట్టాల్సిన బాధ్యత హైకోర్టులకు దఖలుపడింది. కారణాలు ఏమైనప్పటికీ, ఆ కసరత్తు చురుగ్గా సాగడం లేదన్న ఆవేదనతో- దిగువ కోర్టుల్లో న్యాయాధికారుల నియామకానికి కేంద్రీకృత వ్యవస్థ ఉంటే మంచిదని సర్వోన్నత న్యాయస్థానం నాలుగేళ్లక్రితం అభిప్రాయపడింది. నేటికీ ఎక్కడి గొంగడి అక్కడే! కేంద్రం చొరవతో మౌలిక వసతుల పరిపుష్టి, హైకోర్టుల సహేతుక స్పందనతో న్యాయాధికారుల నియామకాల్లో వేగం సాకారమైతే- దిగువ కోర్టులు చాలావరకు తేటపడతాయి. ఎగువ కోర్టుతో డిజిటల్‌ అనుసంధానం, అనవసర వాయిదాలపై వేటు, విచారణ పద్ధతుల ప్రక్షాళన, రికార్డుల శీఘ్రతర కంప్యూటరీకరణ, నిర్ణీత వ్యవధిలో తీర్పుల వెల్లడి శిక్షల అమలు సుసాధ్యమైతే- దేశంలో వ్యాజ్యాల పరిష్కరణ కొత్త పుంతలు తొక్కుతుంది!

ఇదీ చూడండి: Mamata Banerjee: విపక్షాలను ఏకంచేసే దిశగా దీదీ?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.