భళారే... ఏం మానవత్వం! ఎంత గొప్ప జీవకారుణ్యం! అంజనం వేసి చూసినా ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ లాంటి కరుణామయులు ఈ భూమ్మీద వేరొకరు దర్శనమివ్వరు. లేకుంటే ఏమిటండీ! కరోనా వైరస్‌కీ జీవించే హక్కు ఉందట! దీన్ని ఇప్పటిదాకా ఎవరైనా గుర్తించారా? కనీసం కలలోనైనా తలచారా? ఈ విషయాన్ని వెలుగులోకి తీసుకురావడం ద్వారా రావత్ మహాశయులు మానవత్వంలోని కొత్త కోణాన్ని ఆవిష్కరించారు! ఈ మాటలకు మురిసిపోయో ఏమో ఈసారి నైరుతి రుతుపవనాలు ముందుగానే వచ్చేస్తున్నట్టున్నాయి. కానీ, ఆగకుండా ఎగసి పడుతున్న చితుల వేడి సెగల్ని చల్చార్చడం వాటికైనా సాధ్యమయ్యే పనేనా?
అలనాటి గాంధారిలా.!
అరటిపండు వలిచినట్లు తాత్విక అంశాలను తేలిగ్గా వివరించడంలో విశ్వవిద్యాలయ ఆచార్యులకు త్రివేంద్ర సింగ్ ఏమాత్రం తీసిపోరు. 'తాత్వికంగా చూస్తే.. కొవిడ్-19 కూడా ఒక జీవే. అదీ జీవించాలనుకుంటోంది. మనుషుల్లాగే దానికీ జీవించే హక్కు ఉంది. కానీ, మిగిలిన అన్ని జీవులకన్నా మనం తెలివైన వాళ్లమని అనుకుంటాం. ఇప్పుడు దాన్నుంచి కాపాడుకోవటానికి పాట్లు పడుతున్నాం. అదేమో రూపం మార్చుకుంటోంది' అంటూ అలనాడు దుర్యోధనుడి దృఢకాయాన్ని చూసి మురిసిపోయిన గాంధారిలా, వైరస్ జీవన సమరాన్ని శ్లాఘించారు త్రివేంద్రులు! దేశాన్ని కన్నీటిసంద్రం చేస్తున్న రక్కసి మీద ఇంత ప్రేమ చూపించడం నరమానవుల ఊహకందని అద్భుతం! ఇంతటి మానవతామూర్తిని ముఖ్యమంత్రి పదవి నుంచి అమాంతం ఊడబీకేసి పార్టీపెద్దలు ఎంత పాపం మూటగట్టుకున్నారో కదా!
ఏలికలే బాధ్యులు..
వైరస్‌కి బతికే హక్కు ఉంది సరే! మరి జనాల సంగతేంటీ? మనిషే లేకుంటే ఈ హక్కుల ప్రస్తావన ఎక్కడిదీ అన్న అనుమానం వచ్చిందా? రావాల్సిందే.. తప్పులేదు. సృష్టిలో బతకడానికి ప్రతి జీవీ మరొక దానితో పోటీపడుతుందన్నది తెలిసిందే. కానీ, ఈ సిద్ధాంతాన్ని ప్రాణాంతక వైరస్‌కూ ఆపాదించి కరోనాతో పోటీలో మనిషి ఓడిపోతున్నాడోయ్ అని నాలుక చప్పరించడం రావత్ అయ్యవారికే చెల్లింది. ఆయన చెప్పింది సబబే అనుకున్నా సరే.. అసలు ఈ ఓటమికి బాధ్యులు ఏలికలు కాదా? ముందుండి నడిపించాల్సిన నేతలు నిమ్మకునీరెత్తినట్టు ఉండిపోవడం వల్ల కాదూ ఈ వైరస్ ఇంతగా వికటాట్టహాసం చేస్తోంది! త్రివేంద్రుల స్వరాష్ట్రం ఉత్తరాఖండ్‌లోనే కరోనా ఇప్పటిదాకా నాలుగు వేల పైచిలుకు మందిని బలి తీసుకుంది. దేశం మొత్తం మీద రెండున్నర లక్షల మంది ఊపిరి ఆపేసింది. చాలా రాష్ట్రాలు రెండోసారి లాక్‌డౌన్ బాటపట్టాయి. దేశమంతా రావణ కాష్ఠంలా రగులుతున్న సమయంలో ఆ వెలుగుల్లో కరోనా వైరస్ జీవన పోరాట వైవిధ్య కోణాన్ని చూసిన త్రివేంద్ర పేరును వాడవాడలా శిలాఫలకాల మీద చెక్కించాల్సిందే!
ఆవు మూత్రం, పేడతో..
అన్నట్టు, ప్రాణవాయువును పీల్చుకుని దాన్నే వదిలే ఏకైక జంతువు ఆవు ఒక్కటే అంటూ తివేంద్రవర్యులు అప్పట్లో ప్రవచించారు! కొవిడ్ రెండో దశలో ఆక్సిజన్ అందక ఎన్నో ప్రాణాలు అనంత వాయువుల్లో కలుస్తున్నాయి కదా.. మరి ప్రాణవాయువు కోసం గోవుల్ని నమ్ముకొమ్మని ప్రభుత్వాలకు త్రివేంద్ర గట్టిగా ఎందుకు చెప్పలేకపోతున్నారో ఏమో! ఆవు మూత్రం, పాలల్లోనూ గొప్ప ఔషధ గుణాలున్నాయని కాకలు తీరిన నేతలెందరో సత్యప్రమాణికంగా సెలవిస్తున్నారు. కరోనా నుంచి బయటపడటానికి చాలా చోట్ల వారి అనుయాయులు ఆవు మూత్రం, పేడను ఒంటి నిండా రాసుకుంటున్నారు. స్వయానా భోపాల్ ఎంపీ ప్రగ్యా ఠాకూర్ సైతం కొవిడ్-19 యాంటీ డోట్‌గా ఆవు మూత్రాన్ని కళ్లకద్దుకుని సేవించమని పార్టీ కార్యకర్తలకు పిలుపిచ్చారు. అదేంటమ్మా అని కొందరు అమాయకంగా అడిగితే, అదంతే నేను చెప్పినట్టు చెయ్యండంతే అని అభయహస్తం చూపించారు.
మధ్యవర్తిత్వానకి ఒప్పిస్తే..
ఆ వైరస్ ఏదో నానా తంటాలు పడి దాని బతుకు అది బతకడానికి పోరాటం చేస్తుంటే, ఆ స్ఫూర్తి మరచిపోయి ఆవు మూత్రం, గోమయాలతో దానికి చరమ గీతం పాడేస్తారా ఏమిటి అని లోలోన కుమిలిపోతున్నారో ఏమో త్రివేంద్రవర్యులు! ఏది ఏమైనా, ఇంత పెద్ద మనసున్న ఈయన్ని కరోనా వైరస్‌తో మధ్యవర్తిత్వానికి ఒప్పిస్తే దేశానికి ఎంతో మేలు. పిశాచి అని తెలిసినా ఇంత ప్రేమ చూపిస్తున్న ఈయన చెబితే ఆ వైరస్ వినకుండా ఉంటుందా! నీ బతుకేదో నువ్వు బతుకు, జనాల జీవితాలతో ఆడుకోకు అని కరోనాను ఆమాత్రం ఆయన బుజ్జగించలేరా! ఆవు ఆక్సిజన్‌నే వదులుతుందని గుర్తించగలిగిన మేధావికి ఇది పెద్ద కష్టమా ఏమిటి? మహమ్మారితో మహా పోరాటం చేస్తూ అలసిపోతున్న ప్రభుత్వాలు ఈ దిశగా ఓ ప్రయత్నం చేసి చూస్తే ఏమవుతుందంటారు?
- వేణుబాబు మన్నం, రచయిత
ఇదీ చదవండి: కేంద్రం తీరుపై 'సీరం' మండిపాటు- కారణమదే