ETV Bharat / opinion

మూగజీవాల పొట్ట నిండా ప్లాస్టిక్‌ వ్యర్థాలే!

నగర వీధుల్లో తిరుగాడే మూగజీవాలు.. ఆకలి తీర్చేవని భ్రమించి ప్లాస్టిక్‌ వ్యర్థాలు ఆరగించి, వాటిని జీర్ణం చేసుకోలేక తీవ్ర అవస్థల పాలవుతున్నాయి. పలుచోట్ల వరద బీభత్సాలకు ఈ ప్లాస్టిక్ వ్యర్థాలు కారణమవు తున్నాయి. జలాశయాల్ని విష కలుషితం చేస్తున్నాయి. జనజీవనంలో విడదీయలేని అంతర్భాగమై పోయిందంటున్న ప్లాస్టిక్‌ ఉత్పత్తులకు సరైన ప్రత్యామ్నాయాలు అందుబాటులోకి తేవాలి.

plastic usage in india
మూగజీవాల పొట్ట నిండా ప్లాస్టిక్‌ వ్యర్థాలే!
author img

By

Published : Feb 28, 2021, 6:32 AM IST

తేలిగ్గా తీసిపారేసే వట్టి ప్లాస్టిక్‌ వ్యర్థాలే కదా అనుకుంటాం వాటిని. విలువలో బరువులో అవి అల్పమే అయినా అనల్పమైన అనర్థాన్ని వాటిల్లజేయడంలో ముందుంటు న్నాయి. ఆ విధ్వంస కశక్తితో పెచ్చరిల్లుతున్న ప్లాస్టిక్‌ భూతం రెచ్చిపోయి జీవావరణం పీక నులుముతోంది. నగర వీధుల్లో తిరుగాడే మూగజీవాల దుర్భర మరణ యాతనే అందుకు ప్రబల సాక్షీభూతం. మనదేశంలో చనిపోతున్న ప్రతి ఆవు, గేదె పొట్టలో కనీసం 30 కిలోల ప్లాస్టిక్‌ ఉంటున్నదని ఆరేళ్లనాడు కేంద్రమంత్రి ప్రకాశ్‌ జావడేకర్‌ వ్యాఖ్యానించారు. ఇన్ని సంవత్సరాల్లో మార్పేమీ లేదా అంటే, నిస్సంశయంగా ఉంది! మళ్ళీ కొత్తగా లెక్కలు కడితే ఆ సగటు కచ్చితంగా పెరిగితీరుతుందని ఢంకా బజాయించే ఘటనలెన్నో వెలుగుచూస్తున్నాయి.

వైద్య సిబ్బంది దిమ్మెరపోయేలా..

ఆమధ్య చెన్నైలో తమిళనాడు పశు వైద్య జంతు విజ్ఞాన విశ్వవిద్యాలయ సిబ్బంది సుమారు అయిదు గంటలపాటు శస్త్ర చికిత్స నిర్వహించి ఒక ఆవు ఉదరం నుంచి 52 కిలోల ప్లాస్టిక్‌ వ్యర్థాలను వెలికితీయడం సంచలనం సృష్టించింది. తాజాగా ఫరీదాబాద్‌లో కారు ఢీకొని గాయపడ్డ ఆవు పొట్టనుంచి బయటపడ్డ ప్లాస్టిక్‌ పదార్థాలు, సూదులు, నాణాలు, స్క్రూలు, పిన్నుల బరువు 71 కేజీలుగా లెక్క తేలింది. ఇది అసాధారణ ఉదంతమని అక్కడి వైద్య సిబ్బంది దిమ్మెరపోయినా, అంతకుమించిన రికార్డు మొన్న అక్టోబరులో జీహెచ్‌ఎమ్‌సీ పరిధిలోనే నమోదైంది. భాగ్యనగర వీధుల్లో సంచరిస్తున్న రెండు ఆవుల్ని అధికారులు ఓ గోశాలకు అప్పగించిన కొన్నాళ్లకే అందులో ఒకటి అనారోగ్యంతో బాధపడుతూ చనిపోయింది. దొరికిందల్లా తినడం వల్లనే అలా జరిగిందని గుర్తించి, రెండో ఆవును పరిశీలించి పశువైద్యాధికారి శస్త్ర చికిత్స చేయగా ఎకాయెకి 80 కిలోల ప్లాస్టిక్‌ బయటపడింది. వెలుగు చూడని అటువంటి ఉదంతాలు మరెన్నో ఎవరికెరుక!

ఆకలి తీర్చేవని భ్రమించి..

దేశవ్యాప్తంగా రోజూ కొన్ని వేల టన్నుల ప్లాస్టిక్‌ వ్యర్థాలు పోగుపడుతుండగా, అందులో 40 శాతాన్నే సేకరిస్తున్నట్లు గణాంకాలు సూచిస్తున్నాయి. పురపాలక సంస్థల తరఫున సేకరణ జరగక వీధుల్లో వ్యర్థాలు పేరుకుపోతున్న నగరాల జాబితాలో దిల్లీ, చెన్నై, కోల్‌కతా, ముంబై, బెంగళూరు, అహ్మదాబాద్‌, హైదరాబాద్‌, సూరత్‌ ముందున్నట్లు కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి చెబుతోంది. కడుపులోకి చేరిన అనర్థక ప్లాస్టిక్‌ను ఎలా వదిలించుకోవాలో తెలియక యమయాతనకు గురయ్యే మూగజీవాల సంఖ్య పరంగా సరికొత్త రికార్డు నెలకొల్పే అవకాశం ఆయా నగరాలకు దండిగా అందుబాటులో ఉన్నట్లే! ఆకలి తీర్చేవని భ్రమించి ప్లాస్టిక్‌ వ్యర్థాలు ఆరగించి వాటిని జీర్ణం చేసుకోలేక తీవ్ర అవస్థల పాలవుతున్న జీవాలపై జంతు కారుణ్యంతో చేటు సంచుల్ని నిషేధించాల్సిందిగా రాష్ట్రప్రభుత్వాలకు సర్వోన్నత న్యాయస్థానమే పిలుపిచ్చి ఏళ్లు గడుస్తున్నా- పరిస్థితి ఎక్కడా కుదుటపడనేలేదు!

మట్టిలో కలిసిపోవడానికి వెయ్యేళ్లు..

పుట్టినది ఏదైనా గిట్టక తప్పదన్న సాధారణ తత్వచింతన ప్లాస్టిక్‌ వ్యర్థాల విషయంలో వర్తించదు. అరటితొక్క, కాగితం, చెరకు పిప్పి లాంటివి కొన్ని వారాలూ నెలల వ్యవధిలో శిథిలమై మట్టిలో కలిసిపోతాయి. అదే పాలిథీన్‌ ఉత్పత్తులు ఆ స్థితికి చేరడానికి వెయ్యేళ్లు పడుతుంది. దేశంలో ఏటా ఉత్పత్తవుతున్న ఆరు కోట్ల 20 లక్షల టన్నుల ప్లాస్టిక్‌ చెత్తలో శుద్ధీకరణకు నోచుకుంటున్నది 22-28 శాతమేనని, వ్యర్థాల్లో సింహభాగాన్ని ఎక్కడ వీలైతే అక్కడ కుప్పలు పోస్తున్నారని క్షేత్రస్థాయి కథనాలు చాటుతున్నాయి. అంత విరివిగా చేరువలో ఉన్న సరకును తిండిగా భ్రమించి మూగజీవాలు అంతిమంగా ప్రాణాలే కోల్పోతున్నాయి. ఒక పట్టాన చివికిపోని ప్లాస్టిక్‌ వ్యర్థాలు వాననీటిని భూమిలోకి ఇంకకుండా అడ్డుకుని దేశంలో పలుచోట్ల వరద బీభత్సాలకు కారణమవు తున్నాయి. జలాశయాల్ని విష కలుషితం చేస్తున్నాయి. ఎన్నో ప్రాంతాల్లో పెద్దయెత్తున పక్షులు, చేపలు, సముద్ర తాబేళ్ల సామూహిక హననానికి పుణ్యం కట్టు కుంటున్నది ప్లాస్టిక్‌ వ్యర్థాలే. నష్టం అక్కడికే పరిమితం కాలేదు. గాలిలో కలిసిన ప్లాస్టిక్‌ ధూళి కణాల మూలాన వివిధ క్యాన్సర్లు ప్రజ్వరిల్లుతున్నాయి.

అంతర్జాతీయంగా ప్లాస్టిక్​పై పోరు..

సంక్షోభ తీవ్రతలో, నష్ట నివారణ చర్యల్లో భారత్‌కు, అభివృద్ధి చెందిన దేశాలకు మధ్య భారీ అంతరానికి కారణమేమిటి? ప్లాస్టిక్‌పై దేశవ్యాప్త యుద్ధాన్ని ఫ్రాన్స్‌ కొనసాగిస్తోంది. జర్మనీ, ఇంగ్లాండ్‌ తదితర దేశాలు ఉత్పత్తి, వినియోగాల మీద ఆంక్షల్ని తు.చ. తప్పకుండా అమలుపరుస్తున్నాయి. ఆస్ట్రేలియా, థాయ్‌లాండ్‌ లాంటివి ప్రణాళికా బద్ధంగా ప్లాస్టిక్‌ వ్యర్థాల నియంత్రణోద్యమాన్ని చురుకెత్తిస్తున్నాయి. ప్లాస్టిక్‌ నిషేధాన్ని ప్రస్తావించకుండానే వ్యర్థాల నుంచి కొత్త ఉత్పాదనలు సృష్టించే బలీయ పునశ్శుద్ధి వ్యవస్థతో స్వీడన్‌ రాణిస్తోంది.

ఆచరణలోకి రావాలి..

దేశీయంగా చట్టాలు, నిబంధనలు, నిషేధపుటుత్తర్వులు లెక్కకు మిక్కిలి అయినా అడుగడుగునా కంతలు నిక్షేపంగా వర్ధిల్లుతున్నాయి. ఇలా వాడి అలా పారేసే ప్లాస్టిక్‌ ఉత్పాదనలేవీ 2022 సంవత్సరం నాటికి కానరాకుండా చేయాలని కేంద్రం లక్షిస్తోంది. అందులో భాగంగా చిన్నకప్పులు, ప్లేట్లు తదితరాల ఉత్పత్తిని నిలిపేయాలంటూ రాష్ట్రాలకు కేంద్రపాలిత ప్రాంతాలకు సూచనలు జారీ అయ్యాయి. రాష్ట్రాలవారీగా ప్లాస్టిక్‌ సంచుల ఉత్పత్తి, తయారీ, వినియోగం, పంపిణీ, నిల్వ, విక్రయం, దిగుమతిపై ఉత్తర్వులనేకం దస్త్రాలకు పరిమితమైనట్లే- దిల్లీ మార్గదర్శకాల అమలూ ఎండమావిని తలపిస్తోంది. రహదారుల నిర్మాణంలో, విద్యుత్‌ జనరేటర్లలో ప్లాస్టిక్‌ వ్యర్థాలు వాడుతున్న ఉదంతాలు అరుదుగా వినిపిస్తున్నా- ప్లాస్టిక్‌పై ఉమ్మడి యుద్ధం గట్టి ఆచరణకు నోచుకోని సంకల్పాన్నే తలపిస్తోంది.

ప్రత్యామ్నాయాలు వచ్చినప్పుడే..

జనజీవనంలో విడదీయలేని అంతర్భాగమై పోయిందంటున్న ప్లాస్టిక్‌ ఉత్పత్తులకు సరైన ప్రత్యామ్నాయాలు అందుబాటులోకి తేవాలి. జనపనార, గుడ్డసంచుల వినియోగాన్ని ప్రోత్సహించాలి. పునశ్శుద్ధికి మళ్ళించే వ్యర్థాల రాశి గణనీయంగా పెరగాలి. మానవాళి భవితవ్యాన్ని ముంచేసే ప్రబల శత్రువుల్లో ఒకదానిగా ప్లాస్టిక్‌ను గుర్తించి- ప్రభుత్వాలు నిర్ణాయక చొరవ కనబరచి, ప్రజలూ చురుగ్గా స్పందిస్తేనే.. మార్పు సాధ్యపడుతుంది. ప్రాణాంతక ప్లాస్టిక్‌ వ్యర్థాల మహోత్పాతం నుంచి జాతికి సాంత్వన దక్కే అవకాశం ఏర్పడుతుంది. ఏమంటారు?

- బాలు

ఇదీ చదవండి:సాంకేతికతే ఆలంబనగా.. సదావకాశాలతో సాగిపోగా..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.