దేశ జనాభాలో 65 శాతానికి ఆవాసమైన గ్రామసీమలు ముంచుకొచ్చిన కొవిడ్ ముప్పుతో బేజారెత్తిపోతున్నాయి. నిరుడు నగరాల్లో నమోదైన అయిదు నెలలకు గానీ పల్లెపట్టుల్లో పొడగట్టని కరోనా కేసులు ఈసారి రెండు నెలల వ్యవధిలోనే కోర సాచడం మొదలుపెట్టాయి. కొవిడ్ పరీక్షల్లో పాజిటివ్ నిర్ధారణ పదిశాతం, ఆ పైగా నమోదవుతున్న జిల్లాలు దేశవ్యాప్తంగా 490 ఉన్నాయని, వాటిలో గ్రామీణ జిల్లాల వాటా మార్చి నాటికే 36.8శాతం, ఏప్రిల్‌లో 45.5, ఈ నెలలో 48.5శాతంగా లెక్క తేలుతోందని అధ్యయనాలు చాటుతున్నాయి.
పటిష్ఠ చర్యలేవి..
గత నెలలోనే గ్రామీణ భారతం 44శాతానికి పైగా కొవిడ్ కేసులతో పట్టణాల్ని అధిగమించిందని వార్తాకథనాలు వెల్లడిస్తున్నాయి. కొంపలంటుకొన్నాక నుయ్యి తవ్వే వెర్రి వెంగళాయితనం ఒలకబోస్తూ కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ రాష్ట్రాలకు తాజాగా ఉచిత సలహాలు దయ చేసింది. పట్టణ శివార్లు, గ్రామాలు, గిరిజన ప్రాంతాలపై రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణం దృష్టి సారించి కొవిడ్ లక్షణాలున్నవారికి వైద్యసేవలందించాలన్నది సరికొత్త మార్గదర్శకాల నిర్దేశం. వైద్య ఆరోగ్య సదుపాయాల్లో మూడింట రెండొంతులకు పైగా నెలకొన్న నగరాల్లోనే కొవిడ్ కేసుల తాకిడికి స్వస్థ సేవల యంత్రాంగం కుదేలైపోతుంటే, గ్రామాలకు మహమ్మారి మళ్లకుండా పటిష్ఠ రక్షణ చర్యలు చేపట్టడం- ముందుచూపు గల ప్రజా ప్రభుత్వాల కర్తవ్యం. ఆ బాధ్యతను గాలికొదిలేసిన కేంద్రం- ర్యాపిడ్ యాంటిజెన్ పరీక్షలు నిర్వహించేలా కమ్యూనిటీ వైద్యాధికారి, ఏఎన్‌ఎమ్‌లకు శిక్షణ ఇవ్వాలంటోంది.
ఆ గ్రామంలో విలయం
ఉత్తరాఖండ్‌లోని లిబ్బర్‌హెరి గ్రామంలో 30 మంది కొవిడ్ లక్షణాలతో కన్ను మూయగా, అసలు కారణం కనిపెట్టడానికి జిల్లా యంత్రాంగం తీరిగ్గా బయలుదేరుతోంది! ప్రాథమిక ఆరోగ్య సదుపాయాలే నామమాత్రా వశిష్టమైన పల్లె సీమల్లో కొవిడ్ మహమ్మారి సృష్టించగల విలయాన్ని తాజా మార్గదర్శకాలు నిలువరించగలవని కేంద్రం భావించడమే నిశ్చేష్టపరుస్తోంది!.
మెరమెచ్చు మాటలా?
'కరోనాపై పోరులో భారతావనిలో గ్రామాలు, వాటికి నాయకత్వం వహిస్తున్నవారే తొలి విజేతలుగా నిలుస్తారన్నది నా విశ్వాసం.. విజయపథంలో ఎలా సాగాలో గ్రామీణులే దేశానికి ప్రపంచానికి మార్గ నిర్దేశం చేస్తారు'- ఏప్రిల్ 24న పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ సందేశమిది. మహమ్మారి నుంచి పల్లెపట్టుల్ని కాచుకొనే ముందస్తు వ్యూహంతో సన్నద్ధం కాకుండా, మెరమెచ్చు మాటలతో నేతాగణాలు పొద్దుపుచ్చబట్టే- గ్రామ సీమల్లో మరణ మృదంగం మోగుతోంది.
ఆ రాష్ట్రాల్లో..
మధ్యప్రదేశ్, రాజస్థాన్, మహారాష్ట్ర, ఉత్తర్ ప్రదేశ్, పశ్చిమ్ బంగ వంటి రాష్ట్రాల్లో కొవిడ్ ప్రభావం భీతిల్లజేస్తోంది. దేశవ్యాప్తంగా గల ఉప, ప్రాథమిక, సామాజిక ఆరోగ్య కేంద్రాలన్నీ కొరతల కోమాలో కొట్టుమిట్టాడుతున్నట్లు నెల రోజుల క్రితం వెల్లడించిన కేంద్ర సర్కారు- నేడు వాటి దన్నుతోనే కొవిడ్ వెన్ను విరవాలనుకొంటోంది. ఒక్కో ఆరోగ్య ఉపకేంద్రం పరిధిలో నాలుగు, ప్రాథమిక కేంద్రం పరిధిలో 27, సామాజిక కేంద్రం పరిధిలో ఏకంగా 127 గ్రామాలు ఉన్నాయి. ఆయా కేంద్రాల్లో దేశవ్యాప్తంగా 80,600 వైద్య సిబ్బంది ఖాళీలున్నాయని, వాటిలో దాదాపు 4,700 ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెందినవని సర్కారీ లెక్కలే చాటుతున్నాయి.
76శాతానికి పైగా స్పెషలిస్టు వైద్యుల కొరత ఎదుర్కొంటున్న ఆరోగ్య కేంద్రాలు- కొవిడ్ నుంచి గ్రామాల్ని కాపాడగలవా? కరోనా రోగులకు నిరంతర వైద్య సేవలతో నగరాల్లోని వైద్య సిబ్బందే డస్సిపోయి తల వేలాడేసే పరిస్థితి దాపురిస్తున్నప్పుడు- ఆరోగ్య కేంద్రాలు నిలబడగలవా? ఇంత సంక్షుభిత వాతావరణంలోనూ కొన్ని గ్రామాలు కొవిడ్ రక్షణ చర్యల్ని సామాజిక కట్టుబాటుగా అమలు చేస్తూ మహమ్మారిని నిలువరించడంలో ఆదర్శవంతంగా వ్యవహరిస్తున్నాయి. అలాంటి జాగృత జనచేతనే కొవిడ్ ముట్టడి నుంచి గ్రామాల్ని కాపాడేది!