వ్యవసాయానికి సంబంధించి రెండు అత్యంత కీలకమైన బిల్లులపై కనీస చర్చ లేకుండా పార్లమెంటు ఇటీవల ఆమోద ముద్ర వేసింది. తాజాగా వాటికి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆమోదం తెలిపారు. దీంతో బిల్లులు చట్టరూపం దాల్చాయి. అవి... రైతు ఉత్పత్తుల వ్యాపార ప్రోత్సాహక బిల్లు; ధరల భరోసా-వ్యవసాయ సేవలకు సంబంధించి రైతులకు సాధికారత కల్పించే బిల్లు. వీటిలో మొదటిదాన్ని ఉత్పత్తి-వ్యాపార బిల్లుగా, రెండోదాన్ని రైతుల ఒప్పంద బిల్లుగా పరిగణించవచ్ఛు ఈ రెండు బిల్లుల వల్ల మున్ముందు ఆర్థికపరంగా, న్యాయపరంగా చిక్కు పరిస్థితులు ఎదురవుతాయి. పార్లమెంటులో చర్చ జరిగి ఉంటే- అది భావి వివాదాల్లో, తీర్పు చెప్పడానికి న్యాయవ్యవస్థకు తోవ చూపేది. చర్చలో నిగ్గుతేలిన అంశాలు బిల్లు రూపకల్పనకు తోడ్పడి ఉండేవి. చర్చ జరగకపోవడం వల్ల బిల్లు రకరకాల లొసుగులతో అమలులోకి వచ్చే ప్రమాదం ఉంది.
అడ్డదారిలో అధికారం
రాజ్యాంగంలో ఇంతవరకు రాష్ట్రాల జాబితాలో ఉన్న అంశాలను కేంద్రం తన పరిధిలోకి లాక్కోవడానికి వ్యవసాయ బిల్లులు వీలు కల్పిస్తున్నాయి. మన ఫెడరల్ రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా అధికారాలన్నీ కేంద్ర ప్రభుత్వ చేతిలో కేంద్రీకృతం కావడానికి దోహదం చేస్తున్నాయి. పార్లమెంటు ఆమోదించిన రెండు వ్యవసాయ బిల్లుల ముందు రాష్ట్రాల బిల్లులు దిగదుడుపే అవుతాయి. కేంద్ర బిల్లులకన్నా చాలా ముందు నుంచి రాష్ట్రాల బిల్లులు అమలులో ఉన్నాసరే అవి పక్కకు తొలగవలసిందే. ఆ బిల్లుల మీద కేంద్ర బిల్లులదే పైచేయి అవుతుంది. కేంద్ర వ్యవసాయ బిల్లుల్లో పొందుపరచిన అంశాలపై రాష్ట్రాలు ఇక ఎలాంటి చట్టాలూ చేయలేవు. కేంద్ర జాబితాలో, ఉమ్మడి జాబితాలో ఉన్న అంశాలకే ఎక్కువ ప్రాధాన్యం లభిస్తుంది. రాష్ట్ర జాబితాలోని అంశాలపైన చట్టాలు చేసే అధికారాన్ని కైవసం చేసుకోవడానికి ప్రజా ప్రయోజనాల పేరిట కేంద్రం ఈ రెండు జాబితాలను ప్రయోగించగలుగుతుంది. గతంలో చెరకు, ఆహార పదార్థాలకు సంబంధించి చట్టం చేయడానికి కేంద్రం ఈ దొడ్డి దోవనే ఎంచుకుంది. రాష్ట్రాల మధ్య వ్యాపారంపై పర్యవేక్షణ అధికారాన్ని రాజ్యాంగం కేంద్రానికి కట్టబెట్టింది. ఇప్పుడు అదే అధికారం వ్యవసాయ బిల్లులు తీసుకురావడానికి ప్రాతిపదికను ఇస్తోంది. జీఎస్టీ బిల్లు వల్ల పన్నుల విషయంలో రాష్ట్రాలు తమ అధికారాలను కేంద్రానికి జారవిడుచుకున్నాయి. ఇప్పుడు వ్యవసాయం విషయంలోనూ అదే జరుగుతోంది. వ్యవసాయ బిల్లులపై కూలంకషంగా చర్చ జరిపి ఉంటే, రాజ్యాంగం రాష్ట్రాలకు ప్రసాదించిన అధికారాలకు భంగంకలగని రీతిలో వాటిని ఆమోదించే అవకాశం ఉండేది. నిజానికి రాజ్యాంగ రూపకల్పన సమయంలోనే రాష్ట్రాల గురించి చర్చోపచర్చలు జరిగాయి. 1946-49 మధ్య జరిగిన ఈ చర్చల్లో రాష్ట్రాలకు అసలు ఆర్థికంగా కానీ, ఇతరత్రా కానీ అధికారాలే ఉండకూడదని, అవి కేంద్రం చేసే విధానాలు, నిర్ణయాలను అమలు చేయడంతో సరిపుచ్చుకోవాలనే వాదం బలంగా వినిపించింది. బలమైన కేంద్రీకృత పాలనా వ్యవస్థ కింద కేంద్రమే సర్వం సహాధిపత్యం చలాయించాలని గట్టిగా వాదించినవారు ఉన్నారు. అయితే, దీన్ని రాజ్యాంగ నిర్మాణ సభలో అత్యధికులు తోసిపుచ్చారు. అన్ని రాష్ట్రాలూ అభివృద్ధి సాధనలో భాగస్వాములుగా ఉండాలని, అందుకు ఫెడరల్ వ్యవస్తే ఉత్తమమైనదని నిశ్చయించారు.
రైతుల ఒప్పంద బిల్లు వల్ల చిన్న, సన్నకారు రైతులకు నష్టం జరిగే ప్రమాదం ఉంది. ఈ బిల్లులోని కొన్ని సెక్షన్లు పంట నాణ్యత, గ్రేడింగ్, ప్రమాణాల పాటింపు గురించి ప్రస్తావిస్తున్నాయి. ఈ సేవలకు ప్రత్యేక సంస్థలు పుట్టుకొచ్చి, పేద రైతుల నుంచి భారీ రుసుములు వసూలు చేయకమానవు. దీనివల్ల రైతులకు ఖర్చులు మరింత పెరిగి చేతిలో మిగిలే మొత్తాలు కోసుకుపోతాయి. మన రైతాంగంలో 86.08 శాతం చిన్న, సన్నకారు రైతులేనని గుర్తుంచుకోవాలి. వీరికి వ్యవసాయ బిల్లులు, అవి నిర్దేశిస్తున్న కాంట్రాక్టుల గురించి కానీ, ఆ కాంట్రాక్టుల్లోని నియమనిబంధనల గురించి కానీ బొత్తిగా అర్థం కాదు. వారికి తెలిసినా తెలియకపోయినా నాణ్యత, ప్రమాణాలకు సంబంధించిన ఖర్చులు చెల్లించాల్సిందే.
వివాద పరిష్కార ప్రక్రియపై ఆందోళన
రైతులకు, వ్యాపారులకు మధ్య కుదిరిన కాంట్రాక్టు నియమాలపై వివాదం తలెత్తినప్పుడు ఎలా పరిష్కరించుకోవాలో రైతుల ఒప్పంద బిల్లులో నిర్దేశించారు. ఆ ప్రక్రియ విఫలమైతే సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్(ఎస్‌డీఎం)ను ఆశ్రయించాలన్నారు. ఎస్‌డీఎం తీర్పుపై జిల్లా కలెక్టర్‌కు అప్పీలు చేసుకోవచ్ఛు అక్కడా సమస్య పరిష్కారం కాకపోతే రాష్ట్ర ప్రభుత్వ సంయుక్త కార్యదర్శి హోదాలో ఉన్న అధికారికి ఫిర్యాదు చేయాలి. దీన్ని బట్టి వివాద పరిష్కార ప్రక్రియలో న్యాయ వ్యవస్థకు ఏమాత్రం ప్రమేయం లేదని తేలుతోంది. ఇది చాలా ఆందోళనకరం. శాసన, ప్రభుత్వ, న్యాయవ్యవస్థల అధికారాలపై రాజ్యాంగ సూత్రాలకు ఈ ప్రక్రియ పూర్తి విరుద్ధం. అంతిమంగా రాజ్యాంగ మౌలిక స్వరూపానికీ భంగకరం.
సాధారణంగా ఒక రైతు తనకు అన్యాయం జరిగిందనుకుంటే 226వ రాజ్యాంగ అధికరణ కింద హైకోర్టుకు, 32వ అధికరణ కింద సుప్రీంకోర్టుకూ వెళ్లవచ్ఛు కానీ, ఇది ఎంతో వ్యయప్రయాసలతో కూడుకున్నది. చిన్న రైతులకు అలవి కాని పని. కాబట్టి తన పంటను కొనే వ్యక్తి లేక సంస్థతో రాజీపడిపోక తప్పదు. ఇది పేద రైతాంగానికి అన్యాయం చేయడమవుతుంది. అలాగే కొత్త బిల్లు కింద కుదిరిన కాంట్రాక్టును ఉల్లంఘించడం జరిగిందా లేదా అని నిర్ణయించడానికి అవసరమైన న్యాయపరిజ్ఞానం ఎస్‌డీఎంకు కానీ, జిల్లా కలెక్టరుకు కానీ ఉండకపోవచ్ఛు వారు పైనుంచి వచ్చే ఒత్తిళ్లను తట్టుకుని పేద రైతులకు న్యాయం చేయగలుగుతారా?
సమాఖ్య వ్యవస్థకు తూట్లు
ప్రాంతీయ వైవిధ్యాన్ని సంరక్షించడానికి, సమర్థ భూ వినియోగానికి రాష్ట్రాలకు అధికారాలు ఇవ్వడం చాలా అవసరమని రాజ్యాంగ ముసాయిదా రూపొందిస్తున్నవారు, రాజ్యాంగ నిర్మాణ సభ సభ్యులు నిర్ణయించారు. ప్రతిదీ దిల్లీ చేతుల్లో పెట్టడం మంచిది కాదన్నారు. కానీ, వ్యవసాయ బిల్లులు ఇప్పుడు సరిగ్గా అదే పని చేయబోతున్నాయి. వ్యవసాయంలోనూ లిఖిత కాంట్రాక్టుకు అగ్రాసనం వేస్తూ సేద్యం స్వరూపస్వభావాలను మార్చేయబోతున్నాయి. బిల్లు అందిస్తున్న వివాద పరిష్కార ప్రక్రియను ఉపయోగించుకోవడానికి లిఖిత కాంట్రాక్టును తప్పనిసరి చేశారు. 1872నాటి భారతీయ కాంట్రాక్టు చట్టం అలిఖిత మౌఖిక ఒప్పందాలనూ గౌరవిస్తుందని ఇక్కడ గుర్తుంచుకోవాలి. వ్యవసాయ బిల్లుల సమర్థకులు గ్రహించని అంశమేమంటే- ఒకసారి కనుక ఒప్పందంపై సంతకాలు జరిగాయీ అంటే, ఇక వ్యవసాయ విధానాలు, సంప్రదాయాల మీద కాంట్రాక్టులోని అంశాలే ప్రాధాన్యం వహిస్తాయని. కొన్ని అవాంతరాల వల్ల కాంట్రాక్టును గౌరవించలేకపోయిన రైతులు కూడా కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుంది.
--- డా. ఎస్ అనంత్, ఆర్థిక, సామాజిక రంగ నిపుణులు