ఉపాధి కోసం వివిధ దేశాలకు వలస వెళ్లినవారు ప్రపంచవ్యాప్తంగా 28.9 కోట్లమంది ఉంటారని అంతర్జాతీయ వలస వ్యవహారాల సంస్థ తాజా నివేదిక వెల్లడించింది. ఇప్పుడు వీరంతా కరోనా వైరస్ పదఘట్టనల కింద నలిగిపోతున్నారు. ప్రస్తుతం 2 కోట్ల 82 లక్షలమందికి పైగా భారతీయులు విదేశాల్లో వృత్తిఉద్యోగాలు చేస్తున్నారని విదేశాంగ శాఖ గణాంకాలు తెలుపుతున్నాయి. వీరిలో 1.56 కోట్లమంది తరాలనాడే విదేశాలకు వెళ్లి అక్కడే స్థిరపడిన భారత సంతతివారైతే, మిగిలిన 1.26 కోట్లమంది ఇటీవలి దశాబ్దాలలో వలస వెళ్లిన ప్రవాస భారతీయు(ఎన్నారై)లు. నేడు అమెరికాలో నివసిస్తున్న 45 లక్షలమంది భారతీయుల్లో 35 లక్షలమంది ఎన్నారైలే. 1970లలో భారతీయులు పెద్ద సంఖ్యలో గల్ఫ్ దేశాలకు వలసవెళ్లారు. ఆ దేశాల్లో చమురు, సహజవాయువు పరిశ్రమల్లోనూ, భవన నిర్మాణం, ఇతర సేవా రంగాల్లోనూ అప్పట్లో పుష్కలంగా లభ్యమైన ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకోవడానికి దక్షిణ భారత రాష్ట్రాలైన కేరళ, తమిళనాడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ల నుంచి భారీగా వలసలు సాగాయి. ఈ రాష్ట్రాలకు గల్ప్ దేశాలతో చారిత్రక సంబంధాలు ఉన్నాయి.
ఉపాధి కోసం విదేశీ బాట
భారత్‌లో 1970లలో నిరుద్యోగం తీవ్రంగా ఉండేది. సరిగ్గా అదే సమయంలో గల్ఫ్‌లో చమురు పరిశ్రమ దేదీప్యమానంగా వెలుగుతూ ఉపాధి అవకాశాలు పరిఢవిల్లుతూ భారతీయ నిపుణులు, సాధారణ కార్మికులను పెద్దఎత్తున ఆకర్షిందించి. గల్ఫ్‌కు వెళ్లినవారు స్వరాష్ట్రాలకు పంపే సొమ్ముతో ఇక్కడ వారి కుటుంబాలు కళకళలాడేవి. వీరిని ఆదర్శంగా తీసుకుని మరింతమంది గల్ఫ్‌కు వలసవెళ్లారు. మొదట్లో ఎక్కువగా సాధారణ కార్మికులే రెండు నుంచి అయిదేళ్ల కాంట్రాక్టుపై వెళ్లేవారు. అది ముగియగానే స్వదేశానికి తిరిగివచ్చి మళ్లీ కొత్త కాంట్రాక్టు మీద గల్ఫ్‌కు పయనమయ్యేవారు. కుటుంబసమేత వలసలకు పెద్దగా అవకాశాలు ఉండేవి కావు. విదేశీయులు తమ గడ్డపై భూమి కొనకూడదని పశ్చిమాసియా దేశాల చట్టాలు నిర్దేశించడం దీనికి ప్రధాన కారణం. దీనివల్ల మనవాళ్లకు గల్ఫ్ దేశాల్లో శాశ్వత నివాస హక్కులు కానీ, పౌరసత్వం కానీ లభించే ప్రసక్తే లేకుండా పోయింది. 1983 భారత వలస చట్టం మన కార్మికుల పని హక్కులకు, వారి యోగక్షేమాలకు కొంత పూచీకత్తు ఇచ్చే ప్రయత్నం చేసింది. గల్ఫ్ సహకార మండలి (జీసీసీ)లో సౌదీ అరేబియా, ఇరాక్, ఒమన్, ఖతార్, యూఏఈ, బహ్రెయిన్, కువైట్ సభ్యులుగా ఉన్నాయి. ఈ జీసీసీ దేశాల్లో 85 లక్షలమంది భారతీయులు పనిచేస్తున్నారని విదేశాంగ శాఖ పేర్కొంది. 2019నాటికి వీరిలో 45 శాతం సౌదీ అరేబియాలో, 22 శాతం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో, 13 శాతం కువైట్‌లో, తొమ్మిది శాతం ఖతార్‌లో, ఎనిమిది శాతం ఒమన్‌లో, మూడు శాతం బహ్రెయిన్‌లో ఉన్నారు. గల్ఫ్‌లోని భారతీయుల్లో 20 శాతం తెల్లచొక్కా ఉద్యోగులైతే, 10 శాతం వివిధ వృత్తి నిపుణులని అధికార గణాంకాలు తెలుపుతున్నాయి. 1999లో 1,60,000మంది భారతీయులు గల్ఫ్‌కు వెళ్లగా 2007నాటికి వారి సంఖ్య 7,77,000కు పెరిగింది.
వైరస్ వ్యాప్తిని అడ్డుకోవడానికి దాదాపు అన్ని గల్ఫ్ దేశాలు పూర్తి లాక్‌డౌన్, ప్రయాణాలపై ఆంక్షలు, సరిహద్దుల మూసివేత వంటి కఠిన చర్యలు చేపట్టాయి. అసలే ఏజెంట్ల మోసాలతో సతమతమయ్యే భారతీయ కార్మికులకు వైరస్ బెడద గోరుచుట్టుపై రోకటి పోటైంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) జనాభాలో 30శాతం... అంటే 33 లక్షలమంది భారతీయ కార్మికులే. తమవాళ్లను వెనక్కు తీసుకెళ్లడానికి నిరాకరించే దేశాలపై తీవ్ర చర్యలు ఉంటాయని యూఏఈ ఇటీవల హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఖతార్‌లో 2022లో ఫిఫా ప్రపంచ కప్ పోటీలు నిర్వహించనున్నందున అక్కడ జోరుగా నిర్మాణాలు చేపట్టారు. ఆ పనుల్లో పాల్గొంటున్న ఇంజినీర్లు, కార్మికులలో అత్యధికులు భారతీయులే. లాక్‌డౌన్ పూర్తిగా ఎత్తివేసేంతవరకు విదేశాల నుంచి భారతీయులను వెనక్కురానిచ్చేది లేదని భారత ప్రభుత్వం స్పష్టం చేయడంతో ఎక్కడివారు అక్కడే ఆగిపోయారు. ఈ విధంగా కరోనా వైరస్- కార్మికులు వలస వెళ్లిన దేశానికే కాకుండా మాతృదేశానికీ సంకట స్థితి కల్పిస్తోంది.
చుట్టుముట్టిన సమస్యలు
వివిధ దేశాల నుంచి గల్ఫ్‌కు వచ్చిన కార్మికులలో అత్యధికులకు అరబిక్ భాష తెలియదు. తమ మాతృభాషల్లోనైనా చదవగల, రాయగలవారు చాలా తక్కువ. వలస కూలీల్లో ఎటువంటి నైపుణ్యాలు లేనివారే ఎక్కువ. కొందరికి ఏవైనా నైపుణ్యాలు ఉన్నా అవి అంతంతమాత్రం. ఈ కూలీలు నగరాలకు దూరంగా నిర్మించిన ఇరుకు భవనాలు లేదా శయనశాలల్లో మూకుమ్మడిగా నివసిస్తారు. ఆ ఇరుకు స్థలాల్లో కరోనా వైరస్ తేలిగ్గా వ్యాపిస్తుంది. అక్కడ ఉమ్మడి వంటశాలలు, పారిశుద్ధ్య సౌకర్యాలను అంతా వాడుకోవాలి. కొవిడ్ సంక్షోభం విరుచుకుపడినప్పటి నుంచి కూలీల కదలికలపై జీసీసీ దేశాల ప్రభుత్వాలు ఆంక్షలు పెట్టాయి. పరిశ్రమలు, వ్యాపారాలు, నిర్మాణాలు నిలిచిపోవడంతో వలస కార్మికులు ఆర్థిక కడగండ్లకు గురవుతున్నారు. అయితే, కూలీల నివాస వాడల్లో జీసీసీ ప్రభుత్వాలు భౌతిక దూరం పాటింపును తప్పనిసరి చేశాయి. క్వారంటైన్ వసతులూ నిర్మించాయి. మరి అక్కడ ఆరోగ్య సంరక్షణ, పారిశుద్ధ్య వసతులు, తాగునీరు, భోజన వసతులు ఎలా ఉన్నాయో ఇంకా తెలియరాలేదు. లాక్‌డౌన్ మూలంగా వలస కార్మికులు బయటకువెళ్లి కూరగాయలు, కిరాణా సరకులు కొనుక్కొనే అవకాశమూ లేకుండాపోయింది. ఏతావతా ఆకలి బాధ, పారిశుద్ధ్య లేమి, యజమానుల నిర్లక్ష్యం, ఆర్థిక ఇక్కట్లతో భారతీయ వలస కూలీలు గల్ఫ్‌లో అష్టకష్టాలు పడుతున్నారు. భారత్‌లో లాక్‌డౌన్ కారణంగా విదేశాల్లో ఇరుక్కుపోయిన భారతీయులను ఈ నెల ఏడో తేదీ నుంచి దశలవారీగా విమానాలు, నౌకాదళ ఓడల ద్వారా స్వదేశానికి రప్పించేందుకు కేంద్రం సిద్ధమయింది. ఇది వలస కార్మికులకు ఎంతో ఊరట కలిగించే విషయం.
వైరస్ సోకినవారెందరో...
ఏప్రిల్ మధ్యనాటికి 53 దేశాల్లో కరోనా బారినపడినవారిలో 3,336 మంది భారతీయులు ఉన్నారని విదేశాంగ శాఖ తెలిపింది. వీరిలో అత్యధికులు- అంటే 2,061 మంది గల్ఫ్ దేశాల్లో ఉన్నారు. కువైట్‌లోని కరోనా పాజిటివ్ కేసుల్లో 530 మంది భారతీయులుకాగా, దుబాయ్, ఖతార్‌లలో తలా 500 మంది లెక్కతేలారు. ఏప్రిల్ 17నాటికి జీసీసీ దేశాల్లో 20,601 కొవిడ్ కేసులు నమోదు కాగా 140మంది మరణించారని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెబ్‌సైట్ వెల్లడించింది. జీసీసీ దేశాల జనాభాలో అసలు సిసలు స్థానిక పౌరులకన్నా వలసవచ్చినవారే అత్యధికమని అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్‌ఓ) తెలిపింది. ఇక్కడ పనిచేసేవారిలో స్థానికేతరులు 70 శాతానికిపైనే. కొన్ని దేశాల్లో వీరు 56 నుంచి 93 శాతం వరకు ఉన్నారని వెల్లడించింది. జీసీసీ దేశాల జనాభాలో 70 శాతం స్థానికేతరులు కాబట్టి, అక్కడ మొత్తం 20,601 కొవిడ్ కేసుల్లో 14,503 మంది వలస కార్మికులేనని భావించాలి. ఈ దేశాల జనాభాలో భారతీయులు 21 శాతంగా ఉన్నారు కనుక, వారిలో 4,326 మంది కరోనా పాజిటివ్ అని పరిగణించవచ్చు.
--- పరిటాల పురుషోత్తం, సామాజిక ఆర్థిక విశ్లేషకులు