దుక్కి దున్ని తాము విత్తింది విత్తో పెను విపత్తో అంతుచిక్కని అనిశ్చితిలో రైతాంగం కూరుకుపోయే దుస్థితి, వ్యవసాయ ప్రధాన దేశంలో సేద్యం ఎంత నష్టదాయకంగా పరిణమిస్తున్నదో ఎప్పటికప్పుడు చాటుతోంది. అన్నదాతను చెండుకుతింటున్న దారుణ అవ్యవస్థలో, అరకొర బీమా రక్షణా తనవంతు ప్రతినాయక పాత్ర పోషిస్తోంది. సంక్షోభ సమయంలో రైతన్నకు ఆసరా అవసరమన్న ఆచార్య దండేకర్ సిఫార్సుల మేరకు తొలుత 1979లో ప్రవేశపెట్టింది లగాయతు, దేశంలో పంటల బీమా ఎన్నో మార్పులకు లోనయింది. నాలుగేళ్లనాడు తెరపైకి వచ్చిన 'ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన' వరకు సేద్య రక్షణ అనేక మలుపులు తిరిగినా, సమగ్ర బీమా ఇప్పటికీ ఎండమావినే తలపిస్తోంది.
వాస్తవం వేరు..
దశాబ్దాలుగా బీమా పరిధిలో పంట విస్తీర్ణం గరిష్ఠంగా 23 శాతానికే పరిమితమైందన్న వ్యవసాయశాఖ, మోదీ యోజనతో రెండు మూడేళ్లలోనే సగానికిపైగా రైతుల్ని రక్షణ పరిధిలోకి చేరుస్తామని ఘనంగా ప్రకటించింది. వాస్తవంలో జరిగింది వేరు. రెండు పంటకాలాలు ముగిసినా వేలకోట్ల రూపాయల మేర చెల్లింపుల్ని పేరబెట్టే ధోరణులు పథకం మౌలిక స్ఫూర్తికే తూట్లు పొడుస్తున్నాయి. సకాలంలో బీమా కిస్తులు కట్టినా, క్లిష్ట పరిస్థితులు దాపురించినప్పుడు నామమాత్ర పరిహారం చెల్లింపుల్లోనూ విపరీత జాప్యం సహజంగానే రైతుల్ని కుపితుల్ని చేస్తోంది. నిరుటి వరకు బ్యాంకులిచ్చే పంట రుణంనుంచి నిర్బంధంగా కిస్తులు బిగపట్టేవారు. బీమాపథకంలో చేరాలో వద్దో రైతులే నిర్ణయించుకోవాలంటూ నిబంధనలు సడలించిన దరిమిలా, యోజన పరిధిలోనివారి సంఖ్య కుంచించుకుపోతోంది. సేద్యం పూర్తిగా గాలిలో దీపమైపోతే, విపత్కాలంలో వారికి దిక్కేముంటుంది?
బహిరంగ రహస్యం..
సుమారు నాలుగు దశాబ్దాలుగా దేశంలో పంటల బీమాను ప్రహసనప్రాయంగా దిగజార్చిన అంశాలేమిటో బహిరంగ రహస్యం. రుణాలు తీసుకున్నవారికే పథకం వర్తింపులాంటి అసంబద్ధ షరతులు, నష్టం వాటిల్లిన ప్రాంత విస్తీర్ణం సగటు వార్షిక ప్రామాణిక ఉత్పత్తి మదింపు వంటి తలతిక్క నిబంధనలు- బీమా తాలూకు నికర ప్రయోజనాన్ని లక్షలమందికి దక్కనివ్వకుండా అడ్డుపడ్డాయి. బ్యాంకు రుణాలు పొందినవారికే బీమా సౌకర్యం వర్తింపజేయడంవల్ల సన్న చిన్నకారు రైతుల్లో మూడొంతులకుపైగా రక్షణకు దూరమవుతున్నట్లు ఆ మధ్య 'కాగ్' నివేదికే తూర్పారపట్టింది. పథకంలో చేరినా- ఝార్ఖండ్, కర్ణాటక, మధ్యప్రదేశ్ ప్రభృత రాష్ట్రాల్లో ఈసారి ఇప్పటికీ రూపాయైనా పరిహారం చెల్లించకపోవడం- రైతుల్ని కుంగదీస్తోంది.
బ్రెజిల్‌ది ఆదర్శప్రాయమైన ఒరవడి..
కంతల్ని పూడ్చే బదులు యోజనలో చేరికను స్వచ్ఛందంగా మార్చి బాధ్యత దులపరించుకున్న ఇక్కడి ధోరణులకు భిన్నంగా- జపాన్, సైప్రస్, కెనడా వంటిచోట్ల పటిష్ఠ పథకాల్ని అమలుపరుస్తున్నారు. ఎటువంటి ప్రకృతి ఉత్పాతాలు సంభవించినా సాగుదారులకు తక్షణ సాయం అందిస్తున్నారు. భీకర వర్షాలు, కరవు కాటకాలనుంచి పంటలకు రక్షణ కల్పించడంలో బ్రెజిల్‌ది ఆదర్శప్రాయమైన ఒరవడి. దేశంలో అన్ని పంటలకూ అన్ని జిల్లాలకూ వర్తించేలా బీమాను పరిపుష్టీకరించాలన్న స్వామినాథన్ మేలిమి సిఫార్సుకు నేటికీ సరైన మన్నన కొరవడింది. రైతాంగాన్ని కడగండ్లపాలు చేస్తున్న సేద్యాన్ని అన్నిందాలా లాభదాయకంగా తీర్చిదిద్దే విస్తృత కార్యాచరణను రాష్ట్రాల అర్థవంతమైన తోడ్పాటుతో కేంద్రమే పట్టాలకు ఎక్కించాలి. ఇండియాలో ఏ నేల ఏయే పంటలకు అనుకూలమో, దేశీయావసరాలు పోను విదేశీ విపణుల్లో గిరాకీని ఎలా నిభాయించగల వీలుందో మదింపువేయాలి. ఆ ప్రణాళిక అమలులో భాగస్వాములయ్యే రైతులకు అన్నిరకాల రాయితీలు, ప్రోత్సాహకాలతోపాటు పంటల సమగ్ర బీమాను వర్తింపజేయాలి. దేశ ఆహార భద్రతకు ఏ ఢోకా లేకుండా కాచుకునే రాజమార్గమది!
ఇదీ చూడండి: 'చైనీయులకు గదులివ్వం.. భోజనం పెట్టం'