భారతీయ సమాజంలో దశాబ్దాలుగా మహిళలపై దుర్విచక్షణ కొనసాగుతూనే ఉంది. కొవిడ్ మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో ఉపాధి కరవై ఆర్థిక సమస్యలు చుట్టుముట్టిన వేళ- భ్రూణ హత్యలు, బాల్య వివాహాలు, గృహహింస, అమ్మాయిల చదువు భారమనుకునే వరకూ పరిస్థితులు దిగజారుతున్నాయి. సామాజిక రుగ్మతలు మళ్ళీ పడగ విప్పుతున్నాయి. ముఖ్యంగా బాల్య వివాహాలు పెచ్చరిల్లుతున్నాయన్న ఐక్యరాజ్య సమితి తాజా అధ్యయనాలు దిగ్భ్రాంతి కలిగిస్తున్నాయి. తలెత్తుతున్న పోకడలు మరీ ఆందోళన కలిగిస్తున్నాయి.
బాల్యవివాహ దురాచారం 2030నాటికల్లా సమసిపోయేలా చేయాలన్న తమ లక్ష్యానికి కొవిడ్ మహమ్మారి తూట్లు పొడుస్తోందని ఐక్యరాజ్య సమితి తాజా అధ్యయనం వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా ఏటా 1.20 కోట్ల బాల్య వివాహాలు జరుగుతున్నాయి. రానున్న పదేళ్లలో ఈ సగటు ఏటా 1.30 కోట్లు మించిపోతుందని ఐరాస ఆందోళన వ్యక్తీకరించింది. ప్రస్తుతం ప్రపంచంలో 18 ఏళ్లు రాకుండానే పెళ్లి చేసుకున్న బాలికలు ఆరున్నర కోట్లదాకా ఉన్నారన్న చేదునిజాన్ని ఐరాస చిన్న పిల్లల విభాగం యునిసెఫ్ బయటపెట్టింది. గడచిన ఆరునెలలుగా కొవిడ్ పడగనీడలో భారత్ రోజులు వెళ్లదీస్తోంది. ఐరాస భయాలకు తగ్గట్లుగానే భారత్‌లో బాల్యవివాహాలు పెరుగుతున్నాయంటున్న వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఆర్థికంగా చతికిలబడి, భయం భయంగా బతుకుబండి లాగుతున్న బడుగు జీవులు, దిగువ తరగతి వర్గాలు తమ గుండెలమీద బరువుగా భావిస్తూ ఆడపిల్లలకు త్వరగా పెళ్లి చేసి పంపించడానికి సిద్ధపడుతున్న పరిస్థితులు ముసురుకుంటున్నాయి. మహారాష్ట్రలోని బీడ్ జిల్లా; తమిళనాడులోని వేలూరు, తిరువణ్ణామలై జిలాల్లో; కర్ణాటకలోని మైసూర్ జిల్లాలో బాల్య వివాహాల ఉద్ధృతి పెరిగినట్లు వార్తలు వస్తున్నాయి. పాఠశాలలు లేకపోవడం, గాడి తప్పిన కుటుంబ ఆర్థిక స్థితిగతులు, అధికారుల నిఘా కొరవడటం, అన్నింటినీ మించి తక్కువ ఖర్చుతో పెళ్ళి తంతు ముగుస్తుందన్న ఆలోచనలు బాల్య వివాహాలకు కారణమవుతున్నట్లు తెలుస్తోంది. పెళ్ళి చేసి త్వరగా పంపించేస్తే కూతుళ్ల భారం తగ్గుతుందని అమ్మాయిల తల్లిదండ్రులు భావిస్తుండటం దురదృష్టకరం.
దేశంలో ప్రతి 1,000 మంది బాలురకు 924 మంది మాత్రమే బాలికలు ఉన్నారు. బాల్యవివాహాలవల్ల బాలికలు చిన్న వయసులోనే అనారోగ్యం బారినపడుతున్నారు. ఆరోగ్యకరమైన సంతానం పొందే అవకాశాలు అంతంత మాత్రంగా ఉంటాయి. బాల్యవివాహ దురాచారం ఒకరకంగా అనారోగ్య సమస్యలతో తల్లడిల్లే భావితరానికీ పురుడు పోస్తోంది. అందుకే బాల్య వివాహాలను అడ్డుకోవాలంటే విస్తృత సామాజిక భాగస్వామ్యం తప్పని సరి. బాల్య వివాహాల నిర్మూలనకు రాజా రామ్మోహన్ రాయ్, కందుకూరి వీరేశలింగం పంతులు వంటి సంఘసంస్కర్తలు ఎంతో కృషి చేశారు. ఈ పరిస్థితుల్లో ఎవరో వస్తారు, ఏదో చేస్తారంటూ మరో రాజా రామ్మోహన్ రాయ్, ఇంకో కందుకూరి కోసం ఎదురు చూడకుండా కుటుంబంలో జరిగే బాల్య వివాహాన్ని గట్టిగా ఎదిరించి నిలువరించిన ఉత్తర్ ప్రదేశ్‌కు చెందిన 13ఏళ్ల వన్షికా గౌతమ్ అందరికీ ఆదర్శం కావాలి. మహిళా దినోత్సవం సందర్భంగా ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ నుంచి ఆమె సన్మానం అందుకుంది. స్త్రీ విద్య కోసం చిన్నతనంనుంచి పాటుపడుతూ నోబెల్ శాంతి పురస్కారం అందుకున్న పాకిస్థాన్‌కు చెందిన చైతన్య కెరటం మలాలా యూసఫ్ జాయ్, పర్యావరణ పరిరక్షణ కోసం తమ దేశ పార్లమెంట్ ముందు ధర్నా చేసిన స్వీడన్ బాలిక గ్రెట థున్బెర్గ్ వంటి వారందరూ బాలికలకు స్ఫూర్తి ప్రదాతలు. బాలికలే పూనుకొని తమ హక్కుల కోసం పోరాడుతున్న తరుణంలో ఈ స్ఫూర్తి మరింత విస్తరించాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం చట్టాలను అమలు పరచడంతోనే సరిపెట్టకుండా- సమాజంలో అవగాహన విస్తరించేందుకు ‘కౌన్సెలింగ్’ కేంద్రాలు నెలకొల్పాలి. 'చైల్డ్ లైన్ నంబర్' 1098 సేవలను విస్తృతపరచాలి. 108 మాదిరిగా పిల్లల రక్షణకు ఉద్దేశించిన 1098 నెంబరుకూ విస్తృత ప్రాచుర్యం కల్పించాలి. ఇప్పటికే జరిగిన బాల్య వివాహాలను గుర్తించి- వాటిని చట్టవిరుద్ధమని తేల్చి, రద్దు చేయాలి. బాలికలకు తగిన విద్య అందించి, వారికి యుక్త వయసు వచ్చిన తరవాత పూర్వవివాహ బంధాన్ని తిరిగి కోరుకుంటే ఏం చెయ్యాలి, కాదనుకుంటే ఏం చెయ్యాలనే విషయాలపై స్పష్టమైన నిబంధనలు రూపొందించాలి. కాలగర్భంలో కలిసిపోతున్నాయనుకున్న దురాచారాలు కొవిడ్ నేపథ్యంలో పడగ విప్పుతుండటం ఆందోళన కలిగిస్తున్న పరిణామం. ప్రభుత్వాలు, అధికారులు, సామాజికవేత్తలు, మహిళా సంఘాలు పూనుకొని ప్రస్తుతం నెలకొన్న పరిస్థితిని సమీక్షించాలి. నిర్మాణాత్మక పరిష్కారాలను అన్వేషించాలి. దురాచారం వేళ్లూనుకుని బలంగా పాతుకుపోకముందే దాన్ని సమూలంగా నిర్మూలించాలి!
- షణ్మితా రాణి
(బెంగళూరు నిమ్‌హాన్స్‌లో కౌన్సెలింగ్ సైకాలజిస్ట్)