దేశ ఆర్థికానికి అవసరమయ్యే నిధులలో ఏటా నాలుగో వంతు భాగాన్ని సమకూరుస్తున్న ఎల్‌ఐసీలో వాటాల విక్రయంవైపు పడుతున్న అడుగులు ఆందోళన కలిగిస్తున్నాయి. ఏ ప్రభుత్వ రంగ సంస్థకైనా ప్రభుత్వమే పెట్టుబడి పెట్టాలి. కానీ ఎల్‌ఐసీ ప్రత్యేకత ఏమిటంటే, అది ప్రభుత్వాలకే పెట్టుబడులు అందిస్తోంది! ఎవరైనా సంస్థల ఆస్తుల్ని ఎందుకు అమ్ముకుంటారు? మూలధనం పెంచడానికో, నిర్వహణ పెట్టుబడి అవసరాలకోసమో లేక వ్యాపార విస్తరణకు కావాల్సిన నిధులు సమకూర్చుకోవడానికో సంస్థల్లో వాటాలు విక్రయిస్తారు. అదీ కాకపోతే చట్టపరమైన నిబంధనలకు కట్టుబడో లేదా నియంత్రణ సంస్థల ఆదేశాల మేరకు 'సాల్వెన్సీ మార్జిన్'లు పెంచుకునేందుకో- ప్రభుత్వాలుగానీ, సంబంధిత సంస్థలుగానీ స్వయంగా నిధులను సమకూర్చుకోలేని పరిస్థితుల్లో ఎంతో కొంత వాటా వదిలించుకొని గండం గట్టెక్కుదామని ఆస్తులను విక్రయానికి పెడతారు. ఎల్‌ఐసీ విషయంలో విచిత్రమేమిటంటే పైన చెప్పిన ఏ కారణమూ లేకుండానే కేవలం బడ్జెట్ లోటును పూడ్చుకోవడం కోసం వాటాల విక్రయానికి ప్రభుత్వం పూనుకొంటోంది!
ప్రభుత్వానికే నిధులు..
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఎప్పుడంటే అప్పుడు, ఎంత కావలసి వస్తే అంత మొత్తంలో నిధులు సమకూర్చి పెడుతున్న కామధేనువు వంటి సంస్థ ఇది. రైల్వేలకు రూ.1.50 లక్షల కోట్లు, భారత్ మాల హైవే ప్రాజెక్ట్‌కు రూ.1.25 లక్షల కోట్ల పెట్టుబడులను ఎల్‌ఐసీ సమకూరుస్తోంది. పంచవర్ష ప్రణాళికలు మొదలైన నాటి నుంచి నేటి వరకూ- అంటే పన్నెండో పంచవర్ష ప్రణాళిక అంతమయ్యే 2017 నాటివరకు రూ.20లక్షల కోట్లను ప్రభుత్వాలకు పెట్టుబడులుగా అందించింది ఎల్‌ఐసీ.
ప్రస్తుతం నడుస్తున్న 13వ పంచవర్ష ప్రణాళికకుగాను- తొలి రెండేళ్ల కాలానికే ఏడు రూ.7 లక్షల కోట్లను ఇప్పటికే అందించింది ఎల్‌ఐసీ. గడచిన ఆర్థిక సంవత్సరంలో రూ.4లక్షల కోట్లను ప్రభుత్వానికి పెట్టుబడుల రూపంలో అందించింది ఎల్‌ఐసీ. ఇవే కాకుండా ఎప్పుడు స్టాక్ మార్కెట్ కుప్పకూలితే అప్పుడు, ప్రభుత్వ ఆదేశాల మేరకు తక్షణమే రంగంలోకి దూకి వేల కోట్ల రూపాయలు గుమ్మరించి మార్కెట్లు తిరిగి పుంజుకునేలా చేసే సంస్థ అది.
పార్లమెంటులో 2020-21 బడ్జెట్ సందర్భంగా ఆర్థికమంత్రి ఎల్‌ఐసీలో వాటాల విక్రయానికి మూడు ముఖ్య కారణాలు పేర్కొన్నారు.
మొదటిది: 'లిస్టింగ్'వల్ల ఎల్‌ఐసీ నిబిడీకృత విలువ బయటకు వస్తుంది.
రెండు:చిన్న మదుపరులకూ ఎల్‌ఐసీ లాభాల్లో భాగం పంచుకునే అవకాశం కలుగుతుంది.
మూడు:ఎల్‌ఐసీకి క్రమశిక్షణ నేర్పించడం కోసం. ఈ కారణాల్లోని హేతుబద్ధతను పరిశీలిద్దాం.
ఎల్‌ఐసీ ఆస్తుల విలువ
2019-20 సంవత్సరానికి ఎల్‌ఐసీ దగ్గర రూ.32లక్షల కోట్ల ఆస్తులు, రూ.31లక్షల కోట్ల 'లైఫ్ ఫండ్' ఉన్నాయి. ఇక్కడ ఉదాహరించిన ఆస్తుల విలువ కేవలం 'బుక్ వాల్యూ' మాత్రమే! వాటి మార్కెట్ విలువను అంచనా వెయ్యడం అంత సులభం కాదు. ఉదాహరణకు ముంబయి, కోల్‌కతా, చెన్నై, హైదరాబాద్, దిల్లీ, బెంగళూరు వంటి నగరాల్లో ఎల్‌ఐసీకి అపారమైన స్థిరాస్తులు పోగుపడ్డాయి. పెరుగుతున్న స్థిరాస్తి రంగ లెక్కల ప్రాతిపదికన వీటి విలువ చాలా ఎక్కువ!
వీటి విలువ మదింపు కోసం రెండు సంస్థలను ఏర్పాటు చేశారు. విలువ ఎంతో తెలిసేవరకూ ఆగకుండా- రూ.8లక్షల కోట్ల నుంచి రూ.10 లక్షల కోట్ల మేరకు ఉన్న విలువలో 10శాతం లేక 25శాతం వాటాలు విక్రయిస్తామని వివిధ రంగాల అధికారుల పేరిట పత్రికా ప్రకటనలు జారీ అవుతున్నాయి!
సమాంతరంగా విదేశాల్లోనూ ఎల్‌ఐసీని 'లిస్టింగ్' చేయాలనే వాదనలు ఊపందుకుంటున్నాయి. అంటే ఎంత వాటా విక్రయించాలి, ఎల్‌ఐసీ విలువను ఎంతకు మదింపు చేయాలి అనే విషయాలపై బీమా గణకుల మదింపుతో నిమిత్తం లేకుండానే- ప్రభుత్వం ఒక అంచనాకు వచ్చినట్లు అర్థమవుతోంది.
స్థాపిత లక్ష్యానికి నీళ్లు వదులుకోవాల్సిందే!
గడచిన ఆర్థిక సంవత్సరం పూర్తయ్యే సరికి ఎల్‌ఐసీ 40కోట్ల పాలసీదారులతో అలరారుతోంది. బీమా చట్టం-1956 ప్రకారం ఎల్‌ఐసీ ఈ 40కోట్ల పాలసీదారులకు ధర్మకర్త మాత్రమే! అందుకే ఎల్‌ఐసీని ఒక బీమా సంస్థలా కాకుండా పరస్పర ప్రయోజనదాయక కంపెనీలా తీర్చిదిద్దారు. ఇప్పటివరకు ఎల్‌ఐసీ తాను సంపాదించిన ప్రతి రూపాయి మిగులులో 95శాతం పాలసీదారులకు, అయిదు శాతం ప్రభుత్వ వాటాపై 'డివిడెండ్'గా చెల్లిస్తోంది. ఒకసారి 'లిస్టింగ్' జరిగాక పాలసీదారుల సంక్షేమం కాకుండా మదుపరుల ప్రయోజనమే ముఖ్యమై కూర్చుంటుంది! విధాన నిర్ణయాలు అన్నీ తదనుగుణంగా మారిపోతాయి. అంటే 'ప్రజల సొమ్ము ప్రజల కోసమే' అనే స్థాపిత లక్ష్యానికి సంస్థ నీళ్లు వదులుకోవాల్సిందే!
ఈ నిర్ణయం ఎంత వరకు సహేతుకం?
లక్షల్లో ఉండే చిన్న మదుపరులు అనే పడికట్టు పదాన్ని అడ్డంపెట్టుకుని, నలభై కోట్ల పాలసీదారుల ప్రయోజనాన్ని ప్రత్యక్షంగా, 130కోట్ల జనాభా సంక్షేమాన్ని పరోక్షంగా చావుదెబ్బ కొడుతోంది ఈ వాటాల విక్రయం! రూ.లక్ష లేక రెండు లక్షల కోట్ల బడ్జెట్ లోటును పూడ్చుకోవడానికి ఏటా నాలుగు నుంచి ఆరులక్షల కోట్ల రూపాయలు ఇచ్చే ప్రభుత్వ రంగ సంస్థను తెగనమ్మాలని ప్రయత్నించడం ఏ రకంగా సహేతుకం?
మచ్చలేని సంస్థ
దేశం మొత్తంలో అవినీతి మచ్చ లేని సంస్థ ఏదైనా ఉందంటే అది ఎల్‌ఐసీ మాత్రమే! ఐఆర్‌డీఏఐ (ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్‌మెంట్ అథారిటీ ఇండియా) నిబంధనల ప్రకారం మూడు నెలలకొకసారి రిటర్నులను సమర్పించి- ఏటా పార్లమెంటుకు బ్యాలెన్స్ షీట్‌ను ఇచ్చే దేశీయ బీమా కంపెనీ ఎల్‌ఐసీ!
ఏ బీమా సంస్థ పనితీరుకైనా కొలమానం దాని క్లైయిముల చెల్లింపుల రికార్డు! ఐఆర్‌డీఏఐ వార్షిక నివేదిక 2018-19 ప్రకారం, 99.7శాతం క్లెయిముల పరిష్కారంతో- ప్రపంచంలోనే అగ్రగామి బీమా సంస్థగా నిలిచిన ఎల్‌ఐసీకి ఇంకా ఏ రకమైన క్రమశిక్షణ నేర్పించాలి? ఇదే నివేదిక ప్రకారం ప్రైవేటు బీమా కంపెనీలు తిరస్కరిస్తున్న క్లెయిములు అనూహ్యంగా ఉన్నాయి. చిన్నపాటి బీమా మొత్తాలు మాత్రమే చెల్లిస్తూ, పెద్ద మొత్తాలను ప్రైవేటు సంస్థలు నిర్ద్వంద్వంగా తిరస్కరిస్తున్నాయి. ఈ కంపెనీలన్నింటికీ ఎవరూ క్రమశిక్షణను ఎందుకు నేర్పించడం లేదు? ప్రభుత్వరంగ బ్యాంకులకు ఉద్దేశపూర్వకంగా వేల కోట్ల రూపాయలు ఎగగొట్టి విదేశాలకు పారిపోతున్న ఎగవేతదారులు ఒకవైపు; ఏటా సుమారు రూ.50వేల కోట్ల నుంచి రూ.60వేల కోట్లు పారు బాకీల పేరిట కొట్టిపారేస్తున్న (రైట్ ఆఫ్) ప్రభుత్వరంగ బ్యాంకులు మరోవైపు- వీరందరూ క్రమ శిక్షణ చట్రంలోకి ఎందుకని, ఎవరివల్ల ఇమడటం లేదు?
స్వల్ప కాలిక ప్రయోజనాలు ఆశించి..
అగ్రశ్రేణి జాబితాలోని 50మంది ఎగవేతదారులు నిరుడు బ్యాంకులకు ఎగ్గొట్టిన సొమ్ము రూ.68,600 కోట్లు. ఒక పక్క ప్రభుత్వానికి, బ్యాంకులకు రావలసిన సొమ్ములు మాఫీ చేస్తూ, మరోవైపు నుంచి రెవిన్యూలోటు పేరుతో బ్రహ్మాండంగా ఉన్న ఎల్‌ఐసీలో వాటాలు అమ్మడాన్ని ఏమనాలి? ఎలా అర్థం చేసుకోవాలి? స్వల్ప కాలిక ప్రయోజనాలు ఆశించి ఎల్‌ఐసీలో వాటాలు అమ్మడమంటే- పిల్లలకు పప్పుబెల్లాలు కొనిపెట్టడం కోసం ఇంట్లో బంగారం అమ్ముకున్న చందమే!
1956లో పెట్టిన రూ.5 కోట్ల పెట్టుబడిపై రూ.2,660 కోట్ల 'డివిడెండ్' రూపంలో చెల్లించిన ఎల్‌ఐసీలో- చిన్న మదుపరుల లాభం పేరిట వాటాలు అమ్మకానికి పెట్టడం అన్యాయం. దేశ ఆర్థికానికి పాడి ఆవు వంటి ఈ సంస్థను పరిరక్షించడం అందరి బాధ్యత!
-రచయిత:ఎం.ఎస్.ఆర్.ఎ.శ్రీహరి