స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి భారతదేశం సామాజికంగా, ఆర్థికంగా ఎంతో పురోగమించినా- నల్లధనం (black money) దేశ ప్రగతికి గుదిబండగా మారింది. భారత్ 75వ స్వాతంత్య్ర వార్షికోత్సవం జరుపుకొంటున్న సందర్భంలో నల్లధన సమస్య మూలాలను శోధించి, తగిన పరిష్కారాలను సాధించాలి. ప్రధానంగా అవినీతి, పన్నుల ఎగవేత, గుప్తధన అక్రమ చలామణీ, నేర కార్యకలాపాలు, దొంగ రవాణా ద్వారా నల్లధనం ఉత్పన్నమవుతోంది. కొనుగోళ్లకు బిల్లులు ఇవ్వకపోవడం ద్వారా వ్యాపారులు నల్లధన సృష్టికి కారకులవుతున్నారు. బంగారం అక్రమ దిగుమతులు, స్థిరాస్తి రంగంలో విలువలను తక్కువ చేసి చూపడం నల్లధన వ్యాప్తికి తోడ్పడుతున్నాయి. బ్యాంకులతో పని లేకుండా హవాలా మార్గంలో డబ్బు చేతులు మారడం, బోగస్ కంపెనీల పేరిట వ్యాపార సంస్థలు లావాదావీలు జరపడమూ నల్లధన జాడ్యానికి ముఖ్య కారణాలే.
అక్కడే అధికం!
విదేశీయులు ఎలాంటి పన్నులు చెల్లించకుండానే బ్యాంకు ఖాతాలు తెరచి లావాదేవీలు జరపడానికి కొన్ని దేశాలు అనుమతించడం- నల్లధనం సులువుగా సరిహద్దులు దాటడానికి దోహదం చేస్తోంది. భారత్‌లో నల్లధన పరిమాణంపై ఎప్పటికప్పుడు అంచనాలు వెలువడుతుంటాయి. 1956లో ఇది భారత జీడీపీలో 4.5శాతమని కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయ ఆర్థిక వేత్త నికొలస్ కాల్డర్ లెక్కగట్టారు. 1980-83 మధ్య ఇది 18 నుంచి 21శాతానికి పెరిగిందని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్ అండ్ పాలసీ సంస్థ అంచనా వేసింది. 1951లో దేశ జీడీపీలో కేవలం రెండు శాతంగా ఉన్న నల్లధనం 2012 కల్లా 62శాతానికి పెరిగిందని జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయానికి చెందిన అరుణ్ కుమార్ లెక్కగట్టారు. 2012లో భారత్‌లో మొత్తం నల్లధన పరిమాణం రూ.63 లక్షల కోట్లని ఆయన అధ్యయనం నిగ్గుతేల్చింది. పన్నుల నుంచి మినహాయింపునిచ్చే ఇతర దేశాల్లో భారతీయులు అక్రమంగా 50,000 కోట్ల డాలర్లు దాచుకున్నారని, మరే దేశాలవారూ ఇంత భారీ మొత్తంలో గుప్తధనాన్ని నిల్వచేయలేదని 2012 ఫిబ్రవరిలో సీబీఐ సంచాలకులు వెల్లడించారు. ప్రస్తుతం స్విట్జర్లాండ్ తదితర దేశాల బ్యాంకుల్లో భారతీయుల చట్ట విరుద్ధ ధన పరిమాణం లక్షన్నర కోట్ల డాలర్లకు చేరింది. 1991 ఆర్థిక సంస్కరణల తరవాత భారత్‌లో నల్లధనం తగ్గిపోతుందన్న ఆశలు వ్యక్తమైనా అవి అడియాసలయ్యాయి. రాజకీయ పెద్దల అనుగ్రహంతో ఆశ్రిత పెట్టుబడిదారీ విధానం విజృంభించి నల్లధనం వటవృక్షంలా విస్తరించింది. సంస్కరణల తరవాత స్టాక్ మార్కెట్ కుంభకోణాలు, బ్యాంకు మోసాలు పేట్రేగాయి. హర్షద్ మెహతా, కేతన్ పరేఖ్, విజయ్ మాల్యా, సత్యం రామలింగ రాజు, సహారా సుబ్రత రాయ్, నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీలను ఇక్కడ ఉదాహరించాలి.
సమాచార మాధ్యమాలకు స్వేచ్ఛనిచ్చే ఉదారవాద ప్రజాస్వామ్యాల్లో అవినీతికి పగ్గాలు పడతాయి. అనేక అల్పాదాయ దేశాల్లో నిరంకుశ పోకడల కారణంగా పత్రికాస్వేచ్ఛ లోపించినందువల్ల అక్కడ నల్లధన వ్యాప్తి, అవినీతి చాలా అధికం. అవినీతికి అడ్డుకట్ట వేయగల ప్రజాస్వామ్య పద్ధతులను పటిష్ఠంగా అమలుపరచాలి. కొంతమంది వ్యవసాయంపై ఆదాయపన్ను విధించాలని డిమాండ్ చేస్తారు. ఈ రంగంలో ఆదాయాలు అంతంతమాత్రం. దానికన్నా జీడీపీకి 85శాతం వాటా సమకూర్చే పారిశ్రామిక, సేవా రంగాల నుంచి సక్రమంగా పన్నులు వసూలు చేస్తే ఆర్థిక వ్యవస్థకు అధిక మేలు జరుగుతుంది. ఈ రంగాల్లో పన్ను ఎగవేతలను అరికట్టాలి. బ్యాంకుల నుంచి లక్ష రూపాయలకన్నా ఎక్కువ డబ్బు విత్‌డ్రా చేస్తే, నగదు లావాదేవీ పన్ను వసూలు చేయాలి. ఇదీ ప్రభుత్వ ఆదాయం పెంచుకోవడానికి తోడ్పడుతుంది. చిన్న వ్యాపారులకు ఈ తరహా పన్ను నుంచి వెసులుబాటు కల్పించాలి. పన్ను ఎగవేతదారులకు, కుంభకోణాలకు పాల్పడేవారికి సకాలంలో సరైన శిక్షలు పడకపోవడం వల్లా అవినీతికి పట్టపగ్గాలు లేకుండా పోతోంది. ఈ పరిస్థితిని తక్షణం సరిదిద్దాలి.
నేతల్లో నిజాయతీ కీలకం
నల్లధన నిరోధంలో ఇతర దేశాల అనుభవాల నుంచి నేర్చుకోవలసింది చాలా ఉంది. ప్రపంచంలో 2020లో అవినీతి చాలా తక్కువగా ఉన్న దేశాలుగా న్యూజిలాండ్, డెన్మార్క్, ఫిన్లాండ్, స్విట్జర్లాండ్, సింగపూర్, స్వీడన్, నార్వేలు నిలిచాయి. మోసాలు, అవినీతిని స్వీడిష్ సమాజం అస్సలు సహించదు. అక్కడ ప్రభుత్వ రంగం ఎంతో సమర్థంగా పనిచేస్తోంది. బస్సు డ్రైవర్లు రవాణా రద్దీ వల్ల అయిదు నిమిషాలు ఆలస్యంగా వస్తే ప్రయాణికులకు క్షమాపణ చెబుతారు. కొందరు వ్యక్తులు తాము చెల్లించాల్సిన దానికన్నా ఎక్కువ పన్నులను తమకు తామే చెల్లిస్తారు. ప్రభుత్వం తమకు అందిస్తున్న సేవలకు మెచ్చి అలా ప్రతిఫలం చెల్లిస్తారన్నమాట. స్వీడిష్ చట్టాలు, వ్యవస్థలు అవినీతిని సమర్థంగా కట్టడిచేస్తాయి. ప్రభుత్వరంగ సంస్థలు పారదర్శకంగా, నిజాయతీ, జవాబుదారీతనాలతో పనిచేస్తాయి. స్వీడన్‌తో పాటు ఇతర స్కాండినేవియా దేశాలైన నార్వే, ఫిన్లాండ్, డెన్మార్క్‌లలో అవినీతి, నేరాలు, నిరుద్యోగిత, అసమానతలు చాలా తక్కువ. రాజకీయ నాయకులు నిజాయతీపరులైనప్పుడు అవినీతికి తావుండదు. స్కాండినేవియా దేశాల్లో మేలైన ప్రజా జీవనం నెలకొనడానికి కారణమిదే. డెన్మార్క్‌లో పత్రికా స్వేచ్ఛ నిరుపమానమైంది.
సమూల సంస్కరణలు అవసరం
ప్రభుత్వమే అన్నీ చేయాలంటూ కూర్చోకుండా వ్యాపార వర్గం, పౌర సమాజం, సమాచార సాధనాలు అవినీతి నిరోధానికి తమంతట తామే చర్యలు తీసుకోవాలని ప్రిన్స్‌టన్ విశ్వవిద్యాలయానికి చెందిన అవినాశ్ దీక్షిత్ సూచిస్తున్నారు. ఉదాహరణకు, లంచాలిచ్చే వ్యాపార సంస్థలతో లావాదేవీలు పెట్టుకోకుండా వెలివేయడం ఒక పద్ధతి. ఈ రకమైన నియమాన్ని వ్యాపార సమాజం స్వచ్ఛందంగా పాటించాలి. లంచాలు ఇచ్చేవారికన్నా లంచాలు పుచ్చుకొనేవారిని కఠినంగా శిక్షిస్తే అవినీతికి పగ్గాలు పడతాయని విఖ్యాత ఆర్థికవేత్త కౌశిక్ బసు సూచించారు. సాంకేతిక పరిజ్ఞాన వినియోగం పెరగడం అవినీతి నిరోధానికి తోడ్పడుతుందని భారతీయ అనుభవాలు నిరూపిస్తున్నాయి. ప్రభుత్వం నుంచి ప్రజలు సేవలు పొందడానికి టెక్నాలజీని ఉపయోగిస్తే, ఉద్యోగులకు లంచాలు ఇవ్వాల్సిన అగత్యం తప్పుతుంది. పాలన, పోలీసు, న్యాయ యంత్రాంగాల్లో సమూల సంస్కరణలు వస్తే తప్ప నల్లధనాన్ని కూకటివేళ్లతో పెకలించలేమని మేధావులు వాదిస్తున్నారు. అన్నా హజారే నడిపిన లోక్‌పాల్ ఉద్యమం వంటివి నల్లధనంపైనా జరగాలి. భారతదేశంలో నల్లధన భూతాన్ని అంతం చేయడానికి ఇలా బహుముఖ వ్యూహాన్ని అనుసరించాలి. నల్లధనాన్ని కేవలం ఆర్థిక, సాంకేతిక సమస్యగానే కాకుండా రాజకీయ, సాంఘిక, నైతిక సమస్యగానూ గుర్తించాలి. నల్లధనం వ్యాపిస్తోందంటే ప్రజాస్వామ్య విలువలు, సంస్థలు క్షీణిస్తున్నాయని అర్థం. నల్లధనం సమాజంలో ఉన్నత వర్గాలకు తాత్కాలికంగా లబ్ధి చేకూర్చినా, దీర్ఘకాలంలో వారికీ తీరని హాని కలిగిస్తుంది. ఈ వాస్తవాన్ని గమనించి పై అంచెల వాళ్లు చిత్తశుద్ధిగా నల్లధనాన్ని నశింపజేయడానికి నడుంకట్టాలి. నల్లధన నిర్మూలన దేశంలో న్యాయపాలనను పునఃప్రతిష్ఠించి, ప్రజలంతా హుందాగా జీవించడానికి తోడ్పడుతుంది. 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేళ ఈ వాస్తవాన్ని అందరూ గమనించి నల్లధన భూతాన్ని తరిమికొట్టడానికి పునరంకితం కావాలి.
ఫలితం శూన్యం
నల్లధన వ్యాప్తి ఆర్థిక వ్యవస్థ సుస్థిరతను దెబ్బతీస్తుంది. పెట్టుబడులు చట్టవిరుద్ధ బాటలు పట్టి ప్రభుత్వ ఆదాయం దెబ్బతింటుంది. ఆర్థిక అంతరాలు పెరిగి సామాజిక కల్లోలానికి దారితీస్తుంది. స్వాతంత్య్రం వచ్చిన తరవాత నల్లధనాన్ని చట్టబద్ధ మార్గాలు పట్టించడానికి ప్రభుత్వాలు పలు రకాలుగా చొరవ తీసుకున్నాయి. స్వచ్ఛంద వెల్లడి పథకం, క్షమాభిక్షలు, పన్ను తగ్గింపులు, విలువ తక్కువగా చూపిన స్థిరాస్తుల స్వాధీనం, పెద్ద నోట్ల రద్దు వంటివి ఆ కోవలోకి వస్తాయి. 1988నాటి అవినీతి నిరోధక చట్టం, బినామీ లావాదేవీల నిషేధ చట్టం, 2002నాటి అక్రమ ధన చలామణీ నిరోధక చట్టం, లోక్‌పాల్, లోకాయుక్త చట్టాల వంటి వాటినీ పాలకులు ప్రయోగించారు. అయినా నల్లధనాన్ని అంతగా కట్టడి చేయలేకపోయారు. పెద్ద నోట్ల రద్దు నిర్ణయమూ ఆశించిన ఫలితాలను ఇవ్వలేకపోయింది. ఈ నిర్ణయం నల్లధన వ్యాప్తిని నిరోధిస్తుందని, మాదకద్రవ్య వ్యాపారానికి, ఉగ్రవాదానికి ఆర్థిక దన్ను ఇచ్చే నకిలీనోట్లను అరికడుతుందని ఆశించారు. ఆ లక్ష్యాలేవీ నెరవేరలేదు. ద్రవ్య చలామణీ మళ్లీ పెద్ద నోట్ల రద్దుకు ముందున్న స్థాయికి చేరింది.
లంచాల మేట
భారత్‌లో ఉన్నత పదవులను వ్యక్తి స్వార్థంకోసం దుర్వినియోగం చేయడం ఎక్కువ. అదే అవినీతికి మూలం. భారతీయ పాలన, ఆరోగ్య, న్యాయ యంత్రాంగాల్లో కింది నుంచి పైవరకు అన్ని స్థాయుల్లో లంచగొండితనం పాతుకుపోయింది. దీనికి రాజకీయ నాయకులు, ఉన్నతాధికారులు, వ్యాపారుల అవినీతి ప్రధాన కారణం. ఖనిజ వనరుల తవ్వకం, టెలికమ్యూనికేషన్లు, మౌలిక వసతుల రంగాల్లో ప్రభుత్వ కాంట్రాక్టులు పొందడానికి భారీగా ముడుపులు చెల్లించడం భారత్‌లో సర్వసాధారణం. కొత్త పరిశ్రమల స్థాపనకు అనుమతులు పొందడంలోనూ అవినీతి ఉరకలెత్తుతోంది. ఆశ్రిత పెట్టుబడిదారీ విధానానికి ఇదే పునాది. సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు, పేదరిక నిర్మూలన పథకాలు, నీటిపారుదల ప్రాజెక్టులు, రహదారి నిర్మాణ ప్రాజెక్టులకు కేటాయించే నిధులు దారిమళ్లడం ఇండియాలో సర్వసాధారణం. దీన్ని అరికట్టడానికి పారదర్శకత, పకడ్బందీ నిఘా కీలకం. రాజకీయ పార్టీల ఎన్నికల నిధుల సేకరణ తీరు భారీ అవినీతికి దారితీస్తోంది. కాంట్రాక్టులు, అనుమతులు పొందిన వ్యాపారవేత్తలు దానికి ప్రతిగా రాజకీయ పార్టీలకు సక్రమ, అక్రమ మార్గాల్లో ఎన్నికల విరాళాలు ఇస్తుంటారు. దీన్ని అరికట్టనిదే అవినీతి నిర్మూలన సాధ్యపడదు.
ఇదీ చూడండి: 'ఆ సంస్థలో రూ.880 కోట్ల బ్లాక్ మనీ!'