ETV Bharat / opinion

'భారత్‌నెట్‌ పథకం' మందగమనం.. లక్ష్యం చేరేదెప్పుడో? - ఇంటర్నెట్​

ప్రతి గ్రామానికి ఇంటర్నెట్ అందించాలన్న లక్ష్యంతో కేంద్రం తీసుకొచ్చిన భారత్​ నెట్​ పథకం.. నత్తనడకన సాగుతోంది. 2019 మార్చి నాటికి దేశంలోని 2.5 లక్షల గ్రామ పంచాయతీల్లో(మొత్తం ఆరు లక్షలకు పైగా పల్లెలకు) అంతర్జాలాన్ని అందుబాటులోకి తీసుకురావాలన్నది దీని లక్ష్యం. గడువు దాటి రెండేళ్లు గడిచిపోయినా పథకం అమలులో పురోగతి పెద్దగా లేదు.

rural internet
భారత్‌నెట్‌ పథకం
author img

By

Published : Jul 20, 2021, 7:21 AM IST

దేశవ్యాప్తంగా బ్రాడ్‌బ్యాండ్‌ సేవలు విస్తరించాలనే సంకల్పంతో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన భారత్‌నెట్‌ పథకం బాలారిష్టాలను అధిగమించలేకపోతోంది. 2019 మార్చి నాటికి దేశంలోని 2.5 లక్షల గ్రామ పంచాయతీలకు(మొత్తం ఆరు లక్షలకు పైగా పల్లెలకు) అధిక వేగంతో కూడిన అంతర్జాలాన్ని అందుబాటులోకి తీసుకురావాలన్నది దీని లక్ష్యం. గడువు దాటి రెండేళ్లు గడిచిపోయినా పథకం అమలులో పురోగతి పెద్దగా లేదు.

డిజిటల్‌ ఇండియా స్వప్నం సాకారం కావాలంటే గ్రామాలకు అంతర్జాల సౌకర్యాన్ని కల్పించడం తప్పనిసరి కావడంతో, కేంద్రం భారత్‌నెట్‌ను ప్రాధాన్య కార్యక్రమాల జాబితాలో చేర్చింది. ప్రపంచంలో అతిపెద్ద బ్రాడ్‌బ్యాండ్‌ నెట్‌వర్కింగ్‌ కార్యక్రమంగా పేరొందిన ఈ ప్రాజెక్టును తొలుత ప్రభుత్వ రంగ సంస్థలకే అప్పగించారు. లక్ష్యాల సాధనలో అవి ఆశించినంత మేరకు సఫలం కాకపోవడంతో ప్రైవేటు సంస్థలనూ ఇందులో భాగస్వాములను చేయాలని కేంద్రం నిర్ణయించింది. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో ఈ ప్రాజెక్టును గట్టెక్కించేందుకు ఇటీవల ఆమోదం తెలిపింది.

ఆధిపత్యపోరుతో అనర్థం

బ్రాడ్‌బ్యాండ్‌ అనుసంధానత పది శాతం పెరిగితే జాతీయ స్థూల ఉత్పత్తి 1.38 శాతం మెరుగవుతుందని ప్రపంచబ్యాంకు అధ్యయనం ఏనాడో స్పష్టీకరించింది. భారత్‌లో ఈ అనుసంధానత రెండు శాతం లోపే ఉంది. భారతీయుల్లో 65 శాతానికి ఆవాసాలైన గ్రామాలు ఈ తరహా అంతర్జాల సౌకర్యానికి సుదూరంగా ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో 2.5 లక్షల గ్రామ పంచాయతీలకు బ్రాడ్‌బ్యాండ్‌ సౌకర్యం కల్పించాలనే లక్ష్యంతో 2011 అక్టోబర్‌ 25న నేషనల్‌ ఆప్టికల్‌ ఫైబర్‌ నెట్‌వర్క్‌(ఎన్‌ఓఎఫ్‌ఎన్‌) ఏర్పాటుకు యూపీఏ ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. ఈ లక్ష్యసాధన కోసం ప్రత్యేక వాహక సంస్థగా భారత్‌ బ్రాడ్‌బ్యాండ్‌ నెట్‌వర్క్‌ లిమిటెడ్‌(బీబీఎన్‌ఎల్‌)ను కేంద్ర టెలికాం శాఖ ఏర్పాటు చేసింది. ఎన్డీయే ప్రభుత్వం వచ్చాక 2015లో ఈ పథకానికి 'భారత్‌నెట్‌' అని కొత్తగా నామకరణం చేశారు. పేరు మారిందే గానీ, ఆ తరవాతా పథకం అమలు తీరు మాత్రం మారలేదు! తొలివిడతలో లక్ష, రెండో దశలో 1.5 లక్షల పంచాయతీల్లో బ్రాడ్‌బ్యాండ్‌ సౌకర్యం కల్పించాలన్న నిర్దేశిత లక్ష్యాలను సాధించలేకపోయారు.

ఈ ఏడాది జూన్‌ 25 నాటికి 1.60 లక్షల గ్రామ పంచాయతీల్లో మాత్రమే బ్రాడ్‌బ్యాండ్‌ సేవలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. అంతర్జాల సౌకర్యాన్ని ప్రతి పల్లె గడపకూ చేర్చే ఈ ప్రాజెక్టు నత్తనడకన సాగడానికి అనేక కారణాలు ఉన్నాయి. గ్రామాలకు ఫైబర్‌ కేబుళ్ల ద్వారా బ్రాడ్‌బ్యాండ్‌ అందించేందుకు దేశీయ టెలికాం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్‌తోపాటు నోడల్‌ ఏజెన్సీ అయిన బీబీఎన్‌ఎల్‌కు ప్రభుత్వం బాధ్యతలు అప్పగించింది. ఆ రెండు సంస్థల మధ్య సమన్వయం లేకపోవడం, ఎవరికి వారు ఆధిపత్య ధోరణి ప్రదర్శిస్తుండటంతో పని ముందుకు సాగడంలేదని కేంద్రం రెండేళ్ల కిందటే గుర్తించింది.

8 రాష్ట్రాల్లో..

ప్రధాని మానసపుత్రిక అయిన ప్రాజెక్టుపై అంత నిర్లక్ష్యమేమిటని బీఎస్‌ఎన్‌ఎల్‌, బీబీఎన్‌ఎల్‌లను టెలికాం కార్యదర్శి ఎన్నిసార్లు హెచ్చరించినా పరిస్థితిలో మార్పు రాలేదు. మరోవైపు, బీబీఎన్‌ఎల్‌తో సంబంధం లేకుండా భారత్‌నెట్‌ ప్రాజెక్టును తామే సొంతంగా చేపడతామంటూ ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, తమిళనాడు, గుజరాత్‌, ఒడిశా, మహారాష్ట్ర, ఝార్ఖండ్‌, ఛత్తీస్‌గఢ్‌ ముందుకొచ్చాయి. ఈ ఎనిమిది రాష్ట్రాల వ్యవహారశైలి సైతం ప్రాజెక్టు పురోగతిపై తీవ్ర ప్రభావం చూపింది. బ్రాడ్‌బాండ్‌ అనుసంధానతలో ఉభయ తెలుగు రాష్ట్రాలూ చాలా వెనకబడ్డాయి. రెండు రాష్ట్రాల్లో కలిపి 22 వేలకు పైగా గ్రామపంచాయతీలకు ఈ సౌకర్యం కల్పించాల్సి ఉన్నా వంద చోట్ల కూడా పనులు పూర్తికాలేదు. తమిళనాడు అయితే అసలు పనులే ప్రారంభించకపోవడం గమనార్హం! ప్రాజెక్టు కోసం అదనపు నిధులివ్వాలని ఈ రాష్ట్రాలు కోరినా టెలికాం శాఖ స్పందించకపోవడానికి ఇదే కారణం. కొవిడ్‌ సంక్షోభం సైతం భారత్‌నెట్‌ ప్రాజెక్టు మందగమనానికి కారణమైంది. ఫైబర్‌ తీగలు వేయడానికి లోతైన గుంతలు తవ్వాల్సి ఉంటుంది. లాక్‌డౌన్‌తో కార్మికులు సొంతూళ్లకు వెళ్ళిపోవడంతో చాలా రాష్ట్రాల్లో పనులు అర్ధాంతరంగా నిలిచిపోయాయి. ఇప్పటికీ వారిలో ఎక్కువ మంది తిరిగి రాకపోవడంతో పనులు నత్తనడకనే సాగుతున్నాయి. గడచిన దశాబ్ద కాలంలో భారత్‌నెట్‌ ప్రాజెక్టు గడువును పలుమార్లు పొడిగించారు. తాజాగా ఈ ఏడాది ఆగస్టు నాటికి పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్ణయించారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆ గడువులోగా ప్రాజెక్టు పూర్తికావడం అసాధ్యంగానే కనిపిస్తోంది.

ప్రైవేటుకు అప్పగింత

రాబోయే వెయ్యి రోజుల్లో దేశంలోని ప్రతి గ్రామానికీ అంతర్జాల సౌకర్యం కల్పిస్తామని నిరుడు స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో ప్రధాని మోదీ ప్రకటించారు. పల్లెపల్లెకూ అంతర్జాలం గురించి అంతకు ముందు ఆ తరవాత సైతం వివిధ సందర్భాల్లో ప్రభుత్వ వర్గాలు ప్రస్తావిస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలో తాజాగా 16 రాష్ట్రాల్లోని 3.60 లక్షల గ్రామాలకు బ్రాడ్‌బ్యాండ్‌ సౌకర్యం కల్పించే ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్య (పీపీపీ) పథకానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. బ్రాడ్‌బ్యాండ్‌ సౌకర్యం కల్పన, కనెక్షన్లు ఇవ్వడం, నిర్వహణ, కాలానుగుణంగా ఆధునికీకరించడం తదితర బాధ్యతలన్నింటినీ ప్రైవేట్‌ సంస్థలకే అప్పగించనున్నారు. రూ.29,436 కోట్లు ఖర్చయ్యే ఈ ప్రాజెక్టులో వయబులిటీ గ్యాప్‌ ఫండింగ్‌ కింద రూ.19,041 కోట్లను కేంద్రమే సమకూర్చబోతోంది. 2017 నాటికి ఆమోదం తెలిపిన రూ.42,068 కోట్లతో కలిపితే భారత్‌నెట్‌పై కేంద్రం వ్యయం రూ.61 వేల కోట్లను దాటుతుంది. కొవిడ్‌తో ఆర్థిక పరిస్థితి సంక్లిష్టంగా మారినా ప్రభుత్వం ఇంత మొత్తాన్ని ప్రత్యేకించడం ప్రాజెక్టు ప్రాధాన్యానికి అద్దంపడుతోంది. మరోవైపు, భారత్‌నెట్‌ ప్రాజెక్టు పనుల నాణ్యతను తాజాగా కాగ్‌ తూర్పారబట్టింది. తీగలు, ఇతర మౌలిక సదుపాయాల నిర్వహణ సమర్థంగా లేదని ఆక్షేపించింది. దీనికి బాధ్యులెవరో తేల్చడంతో బాటు ఇకమీదట ఆ లోపాలు తలెత్తకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. క్షేత్రస్థాయిలో పటిష్ఠ ప్రణాళికలతో పనులను పట్టాలెక్కిస్తూ, నిరంతర పర్యవేక్షణతో పకడ్బందీగా వాటిని పూర్తిచేస్తేనే పల్లెభారతానికి ప్రగతిఫలాలు అందుతాయి.

ఎందుకంత అవసరం?

విద్య, వైద్య, వాణిజ్యం, బ్యాంకింగ్‌, పౌరసేవలు... ఇలా ప్రస్తుతం అన్నీ ఆన్‌లైన్‌లో అందుబాటులోకి వచ్చాయి. కొవిడ్‌ దృష్ట్యా ఆన్‌లైన్‌ సేవలకు మరింత గిరాకీ పెరిగింది. ఈ పరిస్థితుల్లో గ్రామసీమల వరకు ఈ సౌకర్యాలను విస్తరించాలంటే అధిక వేగం, స్థిరత్వంతో కూడిన అంతర్జాల సదుపాయం అత్యవసరం. మొబైల్‌ ఇంటర్నెట్‌ కంటే బ్రాడ్‌బ్యాండ్‌ మాత్రమే ఈ అవసరాలన్నింటినీ తీర్చగలదనే ఉద్దేశంతో భారత్‌నెట్‌ ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వం చేపట్టింది. ప్రస్తుత వేగంతోనే పనులను కొనసాగిస్తూ వెళ్తే ప్రాజెక్టు పూర్తవడానికి చాలాకాలం పడుతుందని టెలికాం రంగ నిపుణులు పేర్కొంటున్నారు.

- శ్యాంప్రసాద్‌ ముఖర్జీ కొండవీటి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.