ETV Bharat / opinion

సంస్కరణలకే పెద్దపీట- తక్షణ ఉపశమనానికి చోటేదీ?

కేంద్రం ప్రకటించిన రూ.21 లక్షల కోట్ల కరోనా ప్యాకేజీలో మూడు లక్షల నుంచి నుంచి 3.5 లక్షల  కోట్ల రూపాయలే ప్రజలకు తక్షణం ప్రత్యక్షంగా అందుతాయి. ఈ ప్యాకేజీని రెండుగా వర్గీకరించి ఒకటి ఉద్దీపనకోసం, రెండు సంస్కరణలకోసం ఉద్దేశించారు. గతంలో ప్రకటించిన రూ.10 లక్షల కోట్లను లెక్కలోకి తీసుకోవడం, ప్యాకేజీలో ప్రధానంగా ద్రవ్య లభ్యతపైనే చర్చించడం, నేరుగా ప్రజల జేబుల్లోకి డబ్బులు వచ్చే పథకాలు చాలా తక్కువగా ఉండటం గమనించాల్సిన అంశాలు.

author img

By

Published : May 25, 2020, 7:51 AM IST

ATMA NIRBHAR PACKAGE IS ONLY FOR REFORMS
సంస్కరణలకే పెద్దపీట- తక్షణ ఉపశమనానికి చోటేదీ?

కరోనా కట్టడి విషయంలో కేంద్ర ప్రభుత్వానికి నూటికి 90 శాతం మంది మద్దతు లభించినా 21 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీ దగ్గరకు వచ్చేసరికి భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఒకవైపు వలస కార్మికుల సమస్య యావద్దేశాన్ని కలచివేస్తోంది. మరోవైపు లాక్‌డౌన్‌తో కుదేలైనచిరు వ్యాపారస్తుల, అసంఘటిత కార్మికుల భవిష్యత్తు అగమ్యగోచరంగా వుంది. అలాగని పెద్ద పరిశ్రమల పరిస్థితి ఏమీ బాగాలేదు. ఆటో, విమానయాన, ఆతిథ్య, పర్యాటక, ఆసుపత్రి రంగాలు కోలుకోలేనంతగా దెబ్బతిన్నాయి. ఇంత విపత్కర పరిస్థితిని దేశం ఎప్పుడూ ఎదుర్కోలేదు.

కేంద్ర ప్రభుత్వం ఈ ప్యాకేజీని రెండుగా వర్గీకరించింది. ఒకటి ఉద్దీపనకోసం, రెండు సంస్కరణలకోసం ఉద్దేశించారు. వీటిని విడి విడిగా చూడాల్సి ఉంది. మోదీ ప్రభుత్వం ఈ సంక్షోభాన్ని అవకాశంగా మలుచుకొని ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న భారీ సంస్కరణలకు తెరలేపింది. 1991లో సరళీకృత విధానాలను ఆవిష్కరించిన అనంతరం ఇవే అతి పెద్ద సంస్కరణలు. మౌలిక రంగాలైన విద్యుత్తు, బొగ్గు, ఖనిజం, విమానయానంతోపాటు కీలక రంగాలైన రక్షణ, అంతరిక్షం, అణు శక్తి, ప్రభుత్వ రంగ సంస్థల్లో పెద్దయెత్తున ప్రైవేటు రంగానికి చోటు కల్పిస్తూ పాలన సంస్కరణలకు ఆరంభవాక్యం పలికారు. వీటితోపాటు వ్యవసాయ సంస్కరణలకూ పచ్చ జండా ఊపారు. విద్యుత్తు పంపిణీ సంస్థలకు రూ.90వేల కోట్ల రుణ సదుపాయం కల్పిస్తూనే కేంద్రం మరోవైపు సంస్కరణలకు షరతులు విధించింది. దీనితోపాటు కొత్త 'టారిఫ్‌' విధానం, విద్యుత్తు రంగంలో ఒప్పందాలపై నియంత్రణాధికారం, సబ్సిడీల హేతుబద్ధత లాంటి అనేక అంశాలతో కూడిన ముసాయిదా బిల్లును తీసుకొచ్చారు. ఇది తమ అధికారాలకు కోతపెడుతుందని రాష్ట్ర ప్రభుత్వాలు వ్యతిరేకిస్తున్నాయి. అలాగే ప్రభుత్వ రంగ సంస్థల గేట్లు ప్రైవేటు రంగానికి బార్లా తెరిచారు. కీలకమైన రక్షణ రంగంలో సంస్కరణలపై చాలా మందిలో సందేహాలున్నాయి. రక్షణ రంగం దేశ భద్రతకు సంబంధించినది కాబట్టి అది ప్రభుత్వరంగ ఆధ్వర్యంలో ఉంటేనే మంచిదనే అభిప్రాయం ఉంది.

ప్యాకేజీలో 21 లక్షల కోట్ల రూపాయలు చెప్పినా అందులో గతంలో ప్రకటించిన 10 లక్షల కోట్ల రూపాయలనూ లెక్కలోకి తీసుకోవడం, ప్యాకేజీలో ప్రధానంగా ద్రవ్య లభ్యతపైనే చర్చించడం, నేరుగా ప్రజల జేబుల్లోకి డబ్బులు వచ్చే పథకాలు చాలా తక్కువగా ఉండటం గమనించాల్సిన అంశాలు. మొత్తం ప్యాకేజీలో మూడు లక్షలనుంచి నుంచి 3.5 లక్షల కోట్ల రూపాయలే ప్రజలకు తక్షణం ప్రత్యక్షంగా అందుతాయి. మిగతావి సులభ రుణాలు, తాత్కాలిక ఉపశమనాల రూపంలోనో, ఆర్థిక సంస్థలకు ద్రవ్య లభ్యత రూపంలోనో ఉన్నాయి. ఇవి ఆర్థిక కార్యకలాపాలు పుంజుకోవడానికి, మధ్యకాలిక అవసరాలకు ఉపయోగపడతాయే తప్ప.. తక్షణ గిరాకీ పెరగటానికి అక్కరకు రావు. గడచిన ఫిబ్రవరిలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌ అంచనాలలో ప్రత్యక్ష, పరోక్ష పన్నుల ఆదాయం రూ.24.23 లక్షల కోట్లుగా చూపించారు. కరోనా మహమ్మారి నేపథ్యంలో ఇందులో ఎంత వస్తుందో చెప్పలేని పరిస్థితి. సగానికి సగం పడిపోయినా ఆశ్చర్యం లేదు. ఈ పరిస్థితుల్లో ద్రవ్యలోటు 3.5 శాతం నుంచి అయిదు శాతానికి పెరగవచ్చని ఒక అంచనా. అందుకే ప్రభుత్వం మధ్యే మార్గం అవలంబించిందని తెలుస్తుంది.

ద్రవ్య లభ్యతకు ప్రాధాన్యం

ద్రవ్యలోటుపై ఒత్తిడి పెరిగితే బయట మార్కెట్‌నుంచి వనరుల సేకరణ కష్టం. అప్పుడు నోట్ల ముద్రణ పైనే ఎక్కువ ఆధారపడాల్సి ఉంటుంది. ఇది అధిక ద్రవ్యోల్బణానికి దారి తీస్తుంది. గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా అట్టడుగు ఆదాయ వర్గాలకు దన్నుగా నిలిచేందుకు గతంలో కేటాయించిన రూ.61 వేల కోట్లకు అదనంగా మరో రూ.40 వేల కోట్లు కేటాయించడం ముదావహం. కొత్తగా వలస కార్మికులు సైతం వీరికి జత చేరటంతో ఈ నిధులతో కొంతమేర చాలామందికి ఉపాధి దొరకవచ్చు. ఇక పట్టణ అట్టడుగు ఆదాయ వర్గాలకు సంబంధించి పెద్దగా ఉద్దీపన ప్యాకేజీలు లేవు. ఏమైనా ఉన్నా అవి రుణాల రూపంలోనే కనిపిస్తున్నాయి. 'ఎంఎస్‌ఎంఈ' నిర్వచనం మార్చడంతో ఎందరికి అదనంగా మేలు చేకూరుతుందో చూడాలి. ప్రస్తుతం ఆర్థిక వ్యవస్థ, సమాజం ఎదుర్కొంటున్న పరిస్థితి మునుపెన్నడూ కనీవినీ ఎరుగనిది. కాబట్టి అసాధారణ సందర్భాల్లో అసాధారణ నిర్ణయాలు అవసరపడతాయి. తక్షణ ఉపశమనంతోనే ప్రజలకు కొంతైనా సాంత్వన దక్కుతుంది. అందుబాటులో ఉన్న సాంకేతిక విజ్ఞానం సాయంతో వీలైనంతమందికి నగదు ఇవ్వడం మేలు. రుణాల విషయమే చూస్తే- బ్యాంకులు రుణ వితరణను ఎంతమేరకు సమర్థంగా చేపట్టగలవన్నది ప్రశ్నార్థకం. మొత్తంగా ఈ ఆర్థిక ప్యాకేజి మిశ్రమ ఫలితాలను ఇచ్చిందని చెప్పవచ్చు. సంస్కరణల విషయంలో సాహసోపేత నిర్ణయాలు తీసుకున్న ప్రభుత్వం, ఉద్దీపన ప్యాకేజి ఇవ్వడంలో ఉదారంగా వ్యవహరించలేకపోయింది. దీని ప్రభావం దేశ ఆర్థిక పునరుజ్జీవంపడే అవకాశాలు కొట్టిపారేయలేనివి.

రచయిత: కె.రామకోటేశ్వరరావు (ఆర్థిక, సామాజిక విశ్లేషకులు)

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.