ETV Bharat / opinion

నేపాల్‌ పార్లమెంటుపై 'ఖడ్గ' చాలనం - special story on Nepal Parliament suspension

నేపాల్​లో అధికార ఎన్​సీపీలోని అంతర్గత విభేదాలు ఆ దేశ పార్లమెంట్​ రద్దుకు దారితీశాయి. ఇండియాతో మూడు దిక్కులా, చైనాతో మరోవంక భౌగోళిక సరిహద్దులు గల నేపాల్‌ ఉన్నట్లుండి ఇలా రాజకీయ సంక్షోభంలో కూరుకుపోవడం భారత్‌ ప్రయోజనాలకు మంచిది కాదు. కమ్యూనిస్ట్‌ భావజాల బంధంతో నేపాల్‌లో పాగా వెయ్యడానికి చైనా దూకుడుగా వ్యవహరిస్తోంది. ఈ నేపథ్యంలో పొరుగు దేశంతో భారత్​ సంబంధాలు బలోపేతం చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.

A special story on Nepal Parliament suspension
నేపాల్‌ పార్లమెంటుపై 'ఖడ్గ' చాలనం
author img

By

Published : Dec 22, 2020, 7:04 AM IST

రాచరికానికి పాతరేసి, సమాఖ్య ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా 2008లో ఆవిర్భవించిన నేపాల్‌ 2017 దాకా పదిమంది ప్రధానమంత్రుల కుర్చీలాటలతో రాజకీయ అస్థిరతకు పర్యాయ పదంగా భ్రష్టుపట్టిపోయింది. గణతంత్ర రాజ్యాంగం పరిధిలో మొట్టమొదటిసారిగా మూడేళ్లక్రితం జరిగిన కీలక ఎన్నికల్లో నేపాలీ జనవాహిని సుస్థిరతకే ఓటేయడంతో వామపక్ష కూటమి అప్రతిహత విజయం సాధించింది. ఖడ్గప్రసాద్‌ శర్మ ఓలీ సారథ్యంలోని కమ్యూనిస్ట్‌ పార్టీ ఆఫ్‌ నేపాల్‌ (యూఎంఎల్‌), దహాల్‌ నేతృత్వంలోని కమ్యూనిస్ట్‌ పార్టీ ఆఫ్‌ నేపాల్‌ (మావోయిస్ట్‌ సెంటర్‌) చైనా కోరిక మేరకు నాటి ఎన్నికల్లో కూటమిగా పోటీ చేసి దాదాపు మూడింట రెండొంతుల మెజారిటీ సాధించాయి.

బీజింగ్‌ అభిలాష మేరకే ఆ రెండు పక్షాలూ విలీనమై నేపాల్‌ కమ్యూనిస్ట్‌ పార్టీగా ఆవిర్భవించి- ఏడు ప్రాదేశిక ప్రభుత్వాల్లో ఆరింటిని, 753 స్థానిక ప్రభుత్వాల్లో 60 శాతాన్ని అనుశాసిస్తున్నాయి. ఓలీ, దహాల్‌ మధ్య పలు అంశాలపై అభిప్రాయ భేదాలున్నా ప్రధానమంత్రిత్వాన్ని చెరి రెండున్నరేళ్లు పంచుకోవడం; కీలక నిర్ణయాలు, నియామకాలపై సంప్రదింపులతో ముందుకు సాగడం- విలీన అజెండాలో కీలకాంశంగా ఉంది. దాన్ని ఖాతరు చెయ్యకుండా స్వీయ ఒంటెత్తు నిర్ణయాలతో రాజుకున్న అసంతృప్తి, అసమ్మతిగా జ్వలించి, పాలక పక్షం పుట్టిముంచుతున్న వేళ- పార్లమెంటు రద్దుకు, మళ్లీ ఎన్నికల నిర్వహణకు ప్రధాని ఓలీ పావులు కదిపారు. దాన్ని రాజ్యాంగ కుట్రగా ఈసడిస్తున్న అసమ్మతి గళాలు సుప్రీంకోర్టును ఆశ్రయిస్తున్నా- ప్రధానికే అనుకూలంగా తీర్పు వచ్చే అవకాశాలు ఉన్నాయంటున్నాయి ఖాట్మండూ కథనాలు!

భారత్ అప్రమత్తం కావాలి

ఇండియాతో మూడు దిక్కులా, చైనాతో మరోవంక భౌగోళిక సరిహద్దులు గల నేపాల్‌ ఉన్నట్లుండి ఇలా రాజకీయ సంక్షోభంలో కూరుకుపోవడం భారత్‌ ప్రయోజనాలకు మంచిది కాదు. కమ్యూనిస్ట్‌ భావజాల బంధంతో నేపాల్‌లో పాగా వెయ్యడానికి చైనా దూకుడుగా సాగుతున్న వేళ ఇండియా వ్యూహాత్మకంగా వ్యవహరించాలిప్పుడు! దాదాపు మూడుకోట్ల జనాభా గల హిమాలయ రాజ్యానికి దశాబ్దాలుగా పెద్ద దిక్కు ఇండియాయే. తమ అంతర్గత వ్యవహారాల్లో భారత్‌ రాజకీయ జోక్యం పెచ్చుమీరుతోందన్న దుర్భ్రమల్ని రేకెత్తించి, ఇండియా వ్యతిరేకతే సైద్ధాంతిక పునాదిగా యూఎంఎల్‌ వంటివి నయా జాతీయవాదాన్ని రెచ్చగొట్టి రాజకీయంగా లబ్ధిపొందాయి. 'ఒకే ఒక్క పొరుగు దేశంపై ఆధారపడే దురవస్థ నుంచి నేపాల్‌కు విముక్తి' అంటూ ఎన్నికల సభల్లోనే ఎలుగెత్తిన ఓలీ- ఎన్నడూ లేని విధంగా ఇండియాతో సరిహద్దు వివాదాన్ని సృష్టించిన ఘనాపాటి. జమ్ముకశ్మీర్‌లో 370 అధికరణ రద్దు దరిమిలా భారత్‌ లిపులేక్‌ సమీపంలోని కాలాపానీ పరగణాను యథాపూర్వం ఇండియా ప్రాంతంగా సూచిస్తూ నిరుడు రాజకీయ చిత్రపటం వెలువరించడంపై నేపాల్‌ అధికారికంగా నిరసన తెలిపింది. ఈ ఏడాది జూన్‌లో కాలాపానీ, లిపులేక్‌, లింపియాధురా ప్రాంతాలు తమవేనంటూ రాజ్యాంగ సవరణ బిల్లునూ నేపాల్‌ ఆమోదించేసింది!

తనను అధికారం నుంచి కూలదోయడానికి ఇండియా ప్రయత్నిస్తోందంటూ ఓలీ చేసిన ఆరోపణలకు ఆయన పార్టీలోనే మద్దతు కొరవడినా- లేని స్పర్ధను రాజేసి రాజకీయంగా చలికాగే కౌటిల్యం అక్కడ రెక్కవిచ్చుకొంది. భారత్‌ సరిహద్దుల్లో ఉద్రిక్తతల చిచ్చు ఎగదోస్తున్న చైనా- బెల్ట్‌అండ్‌ రోడ్‌ పథకం కింద నేపాల్‌ అభివృద్ధికి భరోసా ఇస్తూ దాన్ని తన గూటి చిలుకగా మార్చేందుకు ప్రయత్నిస్తోంది. దాంతోపాటు బంగ్లాదేశ్‌, భూటాన్‌, శ్రీలంకలపైనా పట్టు సాధించి ఇండియాను అష్టదిగ్బంధం చేసేందుకు డ్రాగన్‌ ప్రయత్నిస్తున్న తరుణంలో- భారత్‌ దౌత్యం మరింతగా పదును తేలాలి. ఇరుగు పొరుగుతో గల చారిత్రక సాంస్కృతిక పౌర సంబంధాలే ఆలంబనగా, సాటి సార్వభౌమ దేశాలుగా వాటి ఎదుగుదలకు దోహదపడటం ద్వారా పరస్పర విశ్వాసాన్ని పునరుద్ధరించి, చైనా కుయుక్తుల్ని తిప్పికొట్టాలి!

ఇదీ చూడండి: కరోనా టీకా తీసుకున్న జో బైడెన్‌

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.