ఏటా రుతుపవన వర్షాల మూలంగా కొండచరియలు విరిగిపడటం సర్వసాధారణంగా జరిగేదే. ఇటీవలి కాలంలో వర్షాల కారణంగా విజయవాడ ఇంద్రకీలాద్రితోపాటు, ఇతర ప్రాంతాల్లో రాళ్లు జారిపడ్డాయి. భారీ వర్షపాతం, భూకంపాలు వంటి సహజ కారణాలతో ప్రేరేపితమైన రాళ్లు, శిథిలాల భారీ కదలికలతో కొండచరియలు విరిగిపడే ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. రోడ్లు, భవనాలు, రైల్వే నిర్మాణాలు, గనుల తవ్వకం, క్వారీ, జలశక్తి ప్రాజెక్టుల వంటి మానవ కార్యకలాపాల వల్ల కూడా కొండవాలు ప్రదేశాలు ప్రమాదకర స్థాయిలో దెబ్బతిని జారిపడుతున్నాయి.
పలు వ్యవస్థలపై ప్రభావం
ఇతర ప్రకృతి వైపరీత్యాల మాదిరిగా కాకుండా కొండచరియల మూలంగా రాళ్ల స్థానభ్రంశం, అడవుల క్షీణత, ఆస్తినష్టం, ప్రాణనష్టం, పొలాలు, రోడ్లు దెబ్బతినడం, నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడటం తదితర సమస్యలతో స్థానిక ఆర్థిక వ్యవస్థలపై తీవ్ర ప్రభావం పడుతోంది. షెఫీల్డ్ విశ్వవిద్యాలయం పరిశోధన (2018) ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 2014-16 మధ్యకాలంలో మానవ ప్రేరేపిత కొండచరియల ఘటనలతో ప్రభావితమైన దేశాల్లో భారత్ ఒకటి. ఆ సమయంలో మొత్తం 5,031 కొండచరియలు పడిన ఘటనలు చోటుచేసుకోగా, 829 వరకు భారత్‌లోనే జరిగాయి. ప్రపంచవ్యాప్తంగా ఘటనల్లో 16శాతం భారత్‌లోనే సంభవించాయి. భారత్‌లో 4,20,000 చ.కి.మీ. (12.6శాతం) విస్తీర్ణ ప్రాంతం కొండచరియలు పడేందుకు అనుకూలంగా ఉన్నట్లు తేలింది. భూవిజ్ఞాన శాస్త్రం ప్రకారం- భారత్ భూఫలకం చాలా నెమ్మదిగా ఏటా అయిదు సెం.మీ. చొప్పున ఈశాన్య దిశగా కదులుతోంది. దీని ప్రభావంతో అక్కడుండే రాళ్లు ఒత్తిళ్లకు లోనై బలహీనపడి కొండచరియలు జారి పడటానికి, భూకంపాలకు కారణమవుతున్నాయి. ఏటవాలు, పెళుసైన రాళ్లు ఎక్కువగా ఉండే హిమాలయ (భారత్, నేపాల్, చైనా), పశ్చిమ కనుమలు (కేరళ), నీలగిరి (తమిళనాడు), తూర్పు కనుమలు (ఆంధ్రప్రదేశ్, ఒడిశా), వింధ్య (గుజరాత్, మధ్యప్రదేశ్) తదితర ప్రాంతాల్లో కొండచరియల ఘటనలు ఎక్కువగా చోటుచేసుకుంటున్నాయి. జాతీయ నేర రికార్డుల బ్యూరో (2019) నివేదిక ప్రకారం గత ఏడాది భారత్‌లో కొండచరియలు విరిగిపడిన ఘటనల్లో మొత్తం 264 మంది మృత్యువాత పడ్డారు. జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ (2011) లెక్కల ప్రకారం భారత్‌లో కొండచరియల ఘటనల మూలంగా ఏటా రూ.150-రూ.200 కోట్ల నష్టం వాటిల్లుతోంది.
వాతావరణంలో చోటుచేసుకుంటున్న మార్పుల ప్రభావం వర్షపాతంపైనా పడుతోంది. వర్షాలు పడే రోజుల సంఖ్య తగ్గి, అదే వర్షపాతం తక్కువ రోజుల్లో పడటమో లేదా భారీ స్థాయిలో వర్షాలు కురవడమో జరుగుతోంది. సాధారణంగా జూన్‌లో వచ్చే వర్షాలకు భూమి సాధ్యమైనంత వరకు సంతృప్త స్థితికి చేరి ఉంటుంది. ఆ తరవాత కురిసే వర్షాలు- పెళుసైన రాళ్లు ఉండే ఏటవాలు ప్రాంతాల్లో కొండచరియలు విరగడానికి కారణమవుతున్నాయి. రాళ్లు నిరంతరం సహజ, కృత్రిమ ఒత్తిళ్లకు గురవుతూ ఉంటాయి. వాతావరణంలో మార్పులవల్ల రాళ్లు నిరంతరం నెమ్మదిగా రసాయనిక చర్యలకు లోనవుతాయి. దాంతో రాళ్లలో ఉన్న అల్యూమినియం ఆక్సైడ్ మట్టి పదార్థంగా రూపాంతరం చెందుతుంది. గాలికి, వర్షాలకు రాళ్లపైనుండే మట్టి పదార్థం తేలిగ్గా కొట్టుకొనిపోతుంది. పగుళ్లు ఉన్న చోట మాత్రం మట్టి వాటి మధ్యనే ఉంటుంది. పడిన వర్షపు నీటికి పగుళ్ల మధ్య ఉన్న మట్టి ఆముదంమాదిరి జిగటగా మారి బరువైన రాళ్లు సులభంగా కిందికి జారిపోవడానికి దోహదం చేస్తుంది.
ముందు జాగ్రత్తలతోనే రక్షణ
కొండలున్న ప్రతిచోటా అదేవిధంగా జరగాలనేమీ లేదు. తెలంగాణలో గ్రానైట్ రాళ్లలో సిలికా ఎక్కువగా, అల్యూమినియం ఆక్సైడ్ తక్కువగా ఉండటం వల్ల అవి గట్టిగా, దృఢంగా ఉండి పగుళ్లుబారవు. రసాయనిక చర్యలు ఎక్కువగా జరగవు. అదే విశాఖపట్నం, విజయవాడ ప్రాంతాల్లో కనిపించే రాళ్లలో సిలికా తక్కువగా, అల్యూమినియం ఆక్సైడ్ ఎక్కువగా ఉండటం వల్ల వాటికి గట్టితనం, దృఢత్వం తక్కువ. ఫలితంగా పగుళ్లుబారడం, రసాయనిక చర్యలకు లోనై కొండచరియలు విరిగిపడటం వంటి ఘటనలు చోటుచేసుకుంటాయి. ఇలాంటి పరిస్థితులు ఏటవాలు కొండలున్న ప్రాంతాల్లో అధికంగా కనిపిస్తాయి. కొండ ప్రాంతాల్లో భూవినియోగాన్ని సాధ్యమైనంత వరకు అరికట్టాలి. కొండచుట్టూ గోడను నిర్మిస్తే- కిందపడిన రాళ్లు ఎక్కువ దూరం విస్తరించకుండా రక్షణ కవచంగా పనిచేస్తుంది. స్థానిక వర్షపాతం, నేల లోపల భూగర్భ జలపీడనం, కంపనాల కదలికలు, ఏటవాలు అస్థిరతల్ని విశ్లేషించే సెన్సార్ ఆధారిత వ్యవస్థలు అందుబాటులో ఉండాలి. ప్రమాదాలు జరిగే ప్రాంతాల్లో ప్రమాద పటాలను తయారు చేసి ప్రదర్శించాలి. కొండచరియలు విరిగి పడటానికి కారణమయ్యే అంశాలపై అవగాహన పెంచితే ప్రజలూ జాగ్రత్తలు తీసుకుంటారు.
రచయిత- ఆచార్య నందిపాటి సుబ్బారావు, భూగర్భ రంగ నిపుణులు