LIVE : చంద్రబాబు క్వాష్ పిటిషన్​పై తీర్పు - ప్రత్యక్ష ప్రసారం - SC Judgment on CBN Quash Petition

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telangana Team

Published : Jan 16, 2024, 1:25 PM IST

Updated : Jan 16, 2024, 2:08 PM IST

Supreme Court Judgment on CBN Quash Petition Live : స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో ఉత్కంఠ రేపుతున్న చంద్రబాబు క్వాష్‌ పిటిషన్‌పై కాసేపట్లో నిర్ణయం వెలువడనుంది. ఈకేసులో కీలకంగా మారిన అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్‌ 17Aపై గతంలోనే తీర్పు రిజర్వ్‌ చేసిన సుప్రీంకోర్టు వెలువరించనుంది. జస్టిస్ అనిరుద్ద బోస్, జస్టిస్ బేలా త్రివేదితో కూడిన ప్రత్యేక ధర్మాసనం నిర్ణయాన్నిప్రకటించనుంది. ఇప్పటికే హైకోర్టులో పలుకేసుల్లో చంద్రబాబుకు సాధారణ బెయిల్‌ లభించింది. ఒకవేళ సుప్రీంకోర్టు తీర్పు చంద్రబాబుకు అనుకూలంగా వస్తే మొత్తం కేసు ఎలాంటి పరిమాణామాలకు దారితీస్తోందన్న అంశంపై తీవ్ర ఉత్కంఠ ఉంది. చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్‌పిటిషన్‌ అనుమతిస్తే ఇప్పటి వరకు ఆయనపై ఆంధ్రప్రదేశ్‌ సీఐడీ నమోదు చేసిన కేసులన్నీ కొట్టివేసినట్లు అవుతుంది.

తెలుగుదేశం అధినేత చంద్రబాబును వైకాపా ప్రభుత్వం జైలుకు పంపిన స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో ఎన్నాళ్లుగానో ఉత్కంఠ రేపుతున్న సెక్షన్‌ 17A వ్యవహారం నేడు తేలనుంది. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్-17A ప్రకారం గవర్నర్‌ అనుమతి లేకుండా తనపై కేసు నమోదు చేయడం చెల్లదని, దాన్ని కొట్టేయాలని చంద్రబాబు న్యాయపోరాటానికి దిగారు. ఐతే.. క్వాష్‌ పిటిషన్‌ను గతేడాది సెప్టెంబరు 22న హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ శ్రీనివాసరెడ్డి తోసిపుచ్చింది.

Chandra Babu Naidu Quash Petition : చంద్రబాబు ఆ మరుసటి రోజే సుప్రీంకోర్టులో స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ వేశారు. సుప్రీంలో అనేక మలుపులు తిరిగిన చంద్రబాబు పిటిషన్‌ గతేడాది అక్టోబరు 3కు తొలిసారి జస్టిస్‌ అనిరుద్ధబోస్‌, జస్టిస్‌ బేలా త్రివేదిలతో కూడిన ధర్మాసనం ముందుకు విచారణకు వచ్చింది. ఆ తర్వాత అనేక దఫాలు వాయిదాల పడింది. అక్టోబర్‌ 13న స్కిల్‌ కేసులో వేసిన క్వాష్‌ పిటిషన్‌తో పాటు ఫైబర్‌గ్రిడ్‌ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్‌ పిటిషన్‌నూ ఇదే ధర్మాసనం విచారించింది. రెండు కేసుల విచారణను అక్టోబరు 17కి వాయిదా వేసింది. దసరా, దీపావళి, శీతాకాల సెలవుల వల్ల తీర్పు వాయిదా పడుతూ వచ్చింది. ఈ మధ్యాహ్నం ఒంటి గంటకు 17-Aపై నిర్ణయాన్ని ద్విసభ్య ధర్మాసనం వెల్లడించనుంది. ఫైబర్‌నెట్ కేసులో ముందస్తు బెయిల్‌ కోసం చంద్రబాబు వేసిన పిటిషన్‌, స్కిల్‌ కేసులో హైకోర్టు చంద్రబాబుకు ఇచ్చిన బెయిల్‌ను సవాల్‌ చేస్తూ ఏపీ ప్రభుత్వం వేసిన కేసుఈ నెల 17, 19వ తేదీల్లో విచారణకు రానున్నాయి. ఈ రెండు కేసుల విచారణ కూడా సెక్షన్‌-17Aతో ముడిపడి ఉండడంతో వాటికన్నా ముందే సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వనుంది.

Last Updated : Jan 16, 2024, 2:08 PM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.