సోమ సారా యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లండన్ విద్యార్థిని. గత ఏడాది జూన్‌లో లైంగిక వేధింపులను ఎదుర్కొంది. దాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. తన పోస్ట్‌ను చూసి ఎంతోమంది తమ అనుభవాలూ, వేదనలనూ మెసేజ్‌ల రూపంలో పంచుకున్నారు. వారం వ్యవధిలోనే 300కుపైగా మెసేజ్‌లు రావడం, అవి క్రమేణా పెరుగుతుండటం విద్యాలయాల్లో రేప్ కల్చర్ ఎంతగా వేళ్లూనుకుపోయిందో అర్థం చేసుకునేలా చేసింది. దీనిపై అవగాహన, మార్పు తీసుకురావాలనే ఉద్దేశంతో సారా ‘ఎవ్రీవన్స్ ఇన్‌వైటెడ్’ పేరిట ఒక వెబ్‌సైట్‌ను ఏర్పాటు చేసింది.
బాధితుల్లో బాలికలు..
బాధితులు తమ అనుభవాన్ని, ఆవేదనను పేరు, వివరాలను తెలియజేయకుండానే దీనిలో పంచుకోవచ్చు. యూకేవ్యాప్తంగా ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల్లో చదువుతున్నవారే కాకుండా బహిరంగ ప్రదేశాలు, కుటుంబ సభ్యుల నుంచి ఎదుర్కొన్న సంఘటనలనూ బాధితులు దానిలో వివరంగా పొందుపరచడం ప్రారంభించారు. వీరిలో యువతులతోపాటు బాలికలూ ఉన్నారు. సంఘటన కారణంగా ఏర్పడిన సంక్షోభం నుంచి బయటపడటానికి అవసరమైన సాయం చేయడం, ఫిర్యాదు చేయడానికి హెల్ప్‌లైన్ నంబర్లను అందించడం వంటి సేవలనూ అందించసాగింది.
మార్పు మొదలైందిలా..
తాజాగా ఈ ఏడాది మార్చిలో ఒక మహిళ అదృశ్యమై, విగతజీవిగా కనిపించింది. దీంతో దేశవ్యాప్తంగా మహిళలపై జరుగుతున్న హింసపై నిరసనలు ప్రారంభమయ్యాయి. ఎంతోమంది విద్యార్థులు ఈ సందర్భంగా ఈ విషసంస్కృతికి వ్యతిరేకంగా నడుస్తున్న సోమ వెబ్‌సైట్‌ను తెర మీదకు తెచ్చారు. చివరికి ప్రభుత్వమే స్పందించి, బాధితులకు సాయమందించడంతోపాటు దోషులపై విచారణకూ ఆదేశించింది. ఇందుకుగానూ ప్రత్యేకంగా హెల్ప్‌లైన్ సెంటర్‌నూ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. కొన్ని కళాశాలలూ ఈ అంశాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతోపాటు క్యాంపస్‌లో ఇలాంటి చర్యలకు పాల్పడినవారిపై కఠిన చర్యలు తీసుకునేలా ఆదేశాలూ జారీ చేశాయి.
మనదేశంలో..
నిజానికి ఈ దుస్థితి సోమ సారా లేదా ఏ ఒక్క దేశానికో పరిమితం కాలేదు. మన దేశంలోనూ ఈ పరిస్థితి ఉంది. సమాజానికో, ఇంట్లో వారికో భయపడి బయటకు రానివారే ఎక్కువ. బాధితుల్లో మూడొంతులమంది మౌనంగానే ఉంటున్నట్లు కొన్ని సర్వేలు చెబుతున్నాయి. ‘సెంటర్ ఫర్ ఎకనమిక్ అండ్ సోషల్ స్టడీస్ (సెస్)’ గత డిసెంబరులో మన రాష్ట్రంలో చేసిన సర్వే ఈ విషయాన్ని రుజువు చేస్తోంది. ఫిర్యాదుతో సమస్య మరింత క్లిష్టతరమవుతుందని భావించేవారు కొందరైతే, ఎక్కడ ఫిర్యాదు చేయాలో తెలియకపోవడం, ఫిర్యాదు చేయడానికి భయపడుతుండటం, చేసినా ఫలితం ఉండదని అనుకోవడం, ఎలా సంప్రదించాలో తెలియకపోవడం.. ఇలా రకరకాల కారణాలతో పంటి బిగువున క్షోభను భరిస్తున్నారు.
సోమ సారా వేసిన ముందడుగు ఇప్పుడు పెద్ద మార్పు దిశగా సాగుతోంది. అందుకే.. ఏదైనా జరిగినపుడు మాట్లాడటానికి సిగ్గుపడటమో, బాధతో కుంగిపోవడమో చేయకుండా ధైర్యంగా ఎదురు నిలబడితేనే నిజమైన మార్పు ప్రారంభమవుతుందంటుంది సోమ సారా.
ఇదీ చూడండి: 'ఆడపిల్లలకు సాధికారత ఇంట్లో నుండే ప్రారంభం కావాలి'