‘నీకేమైనా పిచ్చా? సడన్‌గా ఇలా మాట్లాడుతున్నావేంటి?’ తన్వి మాటలకి షాక్ అవుతూ అడిగాన్నేను. ‘ఔను.. మన మధ్యలో ఎవరూ ఉండకూడదు. ఈ అత్తగారు, పెత్తనాలు నాకు నచ్చవు’ అంతే నిర్లక్ష్యంగా జవాబు చెప్పింది తను. ‘మా అమ్మ గురించి తెలిసీ ఇలా మాట్లాడితే ఎలా? తనకి నేనొక్కణ్నే కొడుకుని. టెన్త్‌లో నాన్న చనిపోతే, చిన్న చిన్న పనులు చేస్తూ ఎంతో కష్టపడి చదివించింది. పెళ్లి తర్వాత మనతో కాకుంటే ఎక్కడుంటుంది?’ అరుస్తున్నట్టే వచ్చాయి నా మాటలు.
‘వేరేగా ఉంచుదాం. ఇద్దరం బాగానే సంపాదిస్తున్నాం. కావాలంటే ఆ రెంట్ నేనే పే చేస్తాను...’ తన మాటల్లో పొగరు. నాకు కోపం ఆగలేదు. ‘జస్ట్ షటప్’ అని విసురుగా వచ్చేశాను.
తనది మూర్ఖత్వమో, అమాయకత్వమో నాకు అర్థంకాలేదు. ఇంజనీరింగ్‌లో తన్వి నా జూనియర్. కాలేజీ ఫెస్ట్‌లో తన డ్యాన్స్ చూసి ఫిదా అయిపోయా. వారం రోజులు దూరం నుంచే అబ్జర్వ్ చేశా. చాలా చలాకీ పిల్ల. నేను కాలేజీ టాపర్‌ని కాబట్టి తనతో పరిచయానికి పెద్దగా కష్టపడాల్సిన అవసరం రాలేదు. లంచ్ టైంలో మొదలైన కబుర్లు మెల్లగా ఫోన్ ఛాటింగ్ దాకా వచ్చాయి. థర్డ్ ఇయర్ మొదట్లో తనని మా ఇంటికి తీసుకెళ్లి ఫ్రెండ్‌గా అమ్మకి పరిచయం చేశా. అమ్మని చూడగానే కాళ్లకి నమస్కారం చేసింది. అప్పుడే నాకర్థమైంది, తన మనసులో నేనున్నానని. ఇక ఆలస్యం చెయ్యకూడదని తర్వాత రోజే ఐలవ్యూ చెప్పేశా. ‘ఫూల్, ఇంత లేట్‌గానా...’ అంటూ నెత్తిమీద ఒక్కటిచ్చింది.
తన్విని నేను ఇష్టపడుతున్నట్టు అమ్మ త్వరగానే గ్రహించింది. నా సంతోషం కంటే తనకేం ఎక్కువ కాదని, ప్రేమ మత్తులో చదువుని నిర్లక్ష్యం చెయ్యొద్దని హెచ్చరించింది. ఆ తర్వాత తన్వి చాలాసార్లు మా ఇంటికొచ్చేది. చాలా చనువుగా ఉండేది.
క్యాంపస్ ప్లేస్‌మెంట్లో నాకు, తర్వాత కొన్నాళ్లకి తనకీ ఉద్యోగాలొచ్చాయి. కొన్నాళ్లయ్యాక పెళ్లి చేసుకోవాలనుకున్నాం. విషయం వాళ్ల అన్నయ్యకి తెలిసి నా గురించి ఎంక్వైరీ చేశాడట. వాళ్లదీ మధ్యతరగతి కుటుంబమే. అంతా నచ్చి చెల్లికి ఓకే చెప్పాడట. వాళ్ల అమ్మానాన్నల్ని కూడా ఒప్పిస్తానన్నాడట. తన్వి సంబరంగా చెప్పింది. అంతలోనే తనలో మార్పు.
తన క్లోజ్ ఫ్రెండ్ ద్వారా తెలిసిన విషయం ఏమంటే, తన్వికి వాళ్ల అత్తయ్య బ్రెయిన్ వాష్ చేసిందట. పెళ్లయ్యాక అత్తగారి అజమాయిషీ తట్టుకోవటం కష్టమని చెప్పిందట. తనవల్ల మీకు గొడవలు వస్తాయని ఏవేవో నూరిపోసిందట. నాకు నవ్వాలో ఏడవాలో అర్థం కాలేదు.
మేం దూరమైన మూడు నెలలకే లాక్‌డౌన్ వచ్చింది. మళ్లీ ఇప్పుడు కరోనా సెకండ్ వేవ్. అమ్మ మా పెళ్లి సంగతి అడిగితే, ‘కరోనా కదా. అంతా సర్దుకున్నాక చూద్దాంలే’ అని చెబుతూ వస్తున్నా. తనని తప్ప నా జీవితంలోకి మరొకరిని ఆహ్వానించటానికి నేను సిద్ధంగా లేను. తనూ పెళ్లి సంబంధాలని రిజక్ట్ చేస్తోందట. అంటే, ఇప్పటికీ తన మనసులో నేనున్నట్టే కదా. పెళ్లంటే రెండు కుటుంబాల కలయిక అని అర్థం చేసుకుని, ఎప్పటికైనా తన మనసు మార్చుకుంటుందని, నాకు అమ్మను మించి మరెవరు లేరని అర్థం చేసుకుంటుందని ఎదురుచూస్తున్నాను.