సాధారణంగా మీ భాగస్వామికి మీపై కోపం రావడానికి రెండు కారణాలు ఉండొచ్చు. మొదటిది.. తను అడిగింది మీరు ఇవ్వకపోవడం లేదా చేయకపోవడం. రెండోది.. మీరు తనపై కోపం చూపించడం. మొదటి విషయానికొస్తే.. తను మీ నుంచి ఏదైనా విలువైన బహుమతి అందుకోవాలనుకున్నారనుకోండి.. కానీ మీరు అందించలేకపోయారు. లేదా వారు చెప్పిన మరేదో పని చేయలేకపోయారు. అప్పుడు అందుకు గల కారణమేంటో తనకు స్పష్టంగా వివరించాలి. దీంతో వారు మిమ్మల్ని కాస్త అర్థం చేసుకుని మీపై అలక మానే అవకాశం ఉంటుంది. అలాగే రెండో కారణంలో చెప్పినట్లుగా మీ ఒత్తిడిని తనపై చూపించి తనను కోపగించుకున్నట్లయితే.. మీ కోపం కాస్త తగ్గాక తన దగ్గరకు వెళ్లి.. వారిని దగ్గరకు తీసుకుని 'సారీ రా.. ఈ రోజు నా మనసేం బాగోలేదు.. అప్పుడే నువ్వొచ్చి మాట్లాడుతుంటే కోపం వచ్చేసింది.. మరోసారి ఇలా చేయను..' అంటూ వారిని దగ్గరకు తీసుకోండి. దీంతో మీ భాగస్వామికి మీపై ఎంత కోపం ఉన్నా ఇట్టే కరిగిపోతారు.
అలా మెప్పించండి!
భాగస్వామి అలక తీర్చడానికి చాలామంది ఎంచుకునే మార్గం.. వారిని ఏదో ఒక విధంగా సర్‌ప్రైజ్ చేయడం. ఉదాహరణకు.. వారికిష్టమైన పదార్థాలు వండి పెట్టడం, వారి దగ్గరకు తీసుకెళ్లి ప్రేమగా నోట్లో పెడుతూ.. 'ఇంకా నాపై కోపం తగ్గలేదా? ఈసారికి మన్నించొచ్చు కదా!' అని పశ్చాత్తాపపడుతున్నట్లుగా అడగడం, అలాగే వారికి నచ్చే పనులు చేయడం, వారితో సమయం గడపడం.. ఇలా వివిధ రూపాల్లో వారిపై మీకున్న ప్రేమను తెలియపరచండి. దీంతో వారి అలకను నెమ్మదిగా తగ్గించచ్చు.
తప్పు ఒప్పుకోండి..
మీ భాగస్వామి అలకకు మీరే కారణమైతే.. వారిని బతిమాలి అలక తీర్చాల్సిన బాధ్యత కూడా మీదే.. మీరు వారిపై కాస్త తీవ్రస్థాయిలోనే కోప్పడి ఉంటే.. వాళ్లు కాస్త ఎక్కువ సమయం తీసుకునే అవకాశం ఉంటుంది. ఇలాంటి సందర్భాల్లో మామూలుగా సారీ చెప్పడమో, బుజ్జగించడమో చేస్తే వారు అస్సలు సంతృప్తి చెందరు. కాబట్టి వారిని ముద్దుపేర్లతో పిలుస్తూ.. 'నా బుజ్జి కదూ, నా బంగారు కొండ, ఈ ఒక్కసారికి క్షమించొచ్చు కదా..' అంటూ మీ పరిస్థితిని వివరించండి. దాంతో వారి కోపం తాటాకు మంటలా చల్లారిపోతుంది.
గుర్తు చేసుకోకండి..
మీ భాగస్వామి అలక తీర్చే క్రమంలో మీరు వారి మనసును నొప్పించేలా ప్రవర్తించిన విషయమైనా, ఇతర పాత విషయాలైనా వారి దగ్గర ప్రస్తావించడం, బాధపెట్టే మాటలను గుర్తుచేయడం, పదే పదే ఆ విషయాన్ని నొక్కి చెప్పడం.. వంటివి చేయకూడదు. దీనివల్ల వారి కోపం మరింతగా పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి విషయాలేవీ గుర్తుచేయకుండా మీ భాగస్వామి అలక తీర్చే ప్రయత్నం చేస్తే వారు అన్నీ మర్చిపోయి మిమ్మల్ని త్వరగా క్షమించేస్తారు.
వెంటనే వద్దు..
అలక తీర్చమన్నాం కదా.. అని అలిగిన వెంటనే వెళ్లి ఈ చిట్కాలన్నీ ప్రయత్నిస్తారా ఏంటి? ఇలా చేస్తే మీకు చేదు అనుభవం ఎదురవ్వచ్చు. ఎందుకంటే అలిగిన వెంటనే అయితే వారు కాస్త కోపంగా ఉంటారు కాబట్టి ఆ క్షణంలోనే వారిని సముదాయించాలంటే కుదరకపోవచ్చు. పైగా వాళ్లు ఆ కోపాన్ని, చిరాకుని మీపై ప్రదర్శించే అవకాశం ఉంటుంది. కాబట్టి మీ భాగస్వామి అలక తీర్చాలనే ఆలోచన బాగానే ఉంది కానీ అందుకు కాస్త సమయం ఆగండి. ముందుగా వారిని కాసేపు ఒంటరిగా వదిలేయండి. వారి కోపం కాస్త తగ్గితే ఆ తర్వాత మీరెలాగైనా ప్రయత్నించి మీ భాగస్వామిని తిరిగి దగ్గరికి తీసుకోవచ్చు.
భాగస్వామి అలక తీర్చడంలో భాగంగా ఎలాంటి నియమాలు పాటించాలో తెలుసుకున్నారు కదా! అయితే ఈ క్రమంలో మీరే బెట్టు చేయడం, వారిపై విరుచుకుపడడం.. వంటివి చేయకూడదు. తద్వారా ఎదుటి వారికి కోపం పెరిగి, ఇద్దరి మధ్య లేనిపోని కొత్త గొడవలకు దారితీసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలా చేయకుండా మీ తప్పు ఒప్పుకొని క్షమాపణ చెప్పడం, ఒకవేళ మీరే అలిగితే తొందరగా క్షమించేయడం వంటివి చేస్తే ఇద్దరి మధ్యా ఉండే పొరపొచ్చాలు తొలగిపోయి తిరిగి మరింత ప్రేమగా మమేకమయ్యే అవకాశం ఉంటుంది.