- సుమిత్ కోపిష్టి అని తెలిసినా పెళ్లయ్యాక మారతాడులే అని వివాహం చేసుకుంది సువిధ. అతను మారకపోగా వీళ్ల వైవాహిక బంధంలో రోజూ కలతలే!
- తమకు నప్పకపోయినా ఫ్రెండ్స్ ప్రభావం వల్లో, సినిమాల్లో చూపించారనో కొత్త కొత్త ఫ్యాషన్లను అనుసరించడం కొంతమంది అమ్మాయిలకు అలవాటు. తీరా ఆ డ్రస్ కొని వేసుకున్నాక.. ఎదుటివారు చూసే వెకిలి చూపులకు ఇబ్బంది పడిపోతూ ఉంటారు.
- కుటుంబ సంతోషమే నా సంతోషం అంటూ కొన్నింటిని త్యాగం చేస్తుంటారు మరికొంతమంది మహిళలు. దీనివల్ల తమ జీవితంలో విలువైన క్షణాల్ని కోల్పోతున్నామన్న సంగతే గ్రహించరు.
నప్పిందే వేసుకుందాం..!
‘అందమంటే ఇలానే ఉండాలి.. కొత్త కొత్త ఫ్యాషన్లను ప్రయత్నించాలి..’ యుక్త వయసులో ఉండే చాలామంది అమ్మాయిల్లో ఇలాంటి ధోరణిని మనం చూస్తుంటాం. ఈ క్రమంలోనే ఇతరుల్లా అందంగా కనిపించడానికి తాము మేకప్ వేసుకోవడం, వివిధ రకాల సౌందర్య ఉత్పత్తుల్ని ప్రయత్నించడం, ఇతరులకు నప్పింది కదా.. తమకూ నప్పుతుందన్న ఉద్దేశంతో కొత్త ఫ్యాషన్లను ప్రయత్నించడం.. వంటివి చేస్తుంటారు. నిజానికి ఒక్కోసారి ఇవి వారికి నప్పకపోగా మరింత ఎబ్బెట్టుగా కనిపిస్తుంటాయి. దాంతో ఇతరులు తమవైపు చూసే అదో రకమైన చూపులతో ఇబ్బంది పడడం ఖాయం. ఇక పడని సౌందర్య ఉత్పత్తులైతే చర్మ సమస్యలూ వస్తుంటాయి. మరి, ఇలా తెలిసి తెలిసి ఇబ్బంది పడే బదులు.. మన శరీరతత్వానికి, చర్మఛాయకు నప్పే దుస్తులు, చర్మతత్వానికి సరిపడే సౌందర్య ఉత్పత్తులు ప్రయత్నిస్తే సౌకర్యంగా ఉండడంతో పాటు మీ ఆత్మగౌరవాన్నీ(low self esteem in women) నిలబెట్టుకున్న వారవుతారని చెబుతున్నారు నిపుణులు.
మారతాడనుకోవడం పొరపాటే!
పెళ్లికి ముందు తమకు కాబోయే భర్తకు మద్యపానం/ధూమపానం/చిన్న చిన్న విషయాలకే చిరాకు పడడం.. వంటి దురలవాట్లు ఉన్నా కూడా పెళ్లయ్యాక ఆయనే మారతాడులే అని అడుగు ముందుకేస్తుంటారు కొందరు మహిళలు. ఇదే ఆలోచనతో పెద్దవాళ్లు కూడా తమ పిల్లలకు పెళ్లిళ్లు చేయడం సినిమాల్లో/సీరియల్స్‌లోనే కాదు.. నిజ జీవితంలోనూ చూస్తుంటాం. అయితే ఇది అందరి విషయంలో వర్కవుట్ కాకపోవచ్చంటున్నారు నిపుణులు. కొంతమంది పెళ్లయ్యాక ఆటోమేటిక్‌గా మారితే.. మరికొందరికి నిపుణులతో కౌన్సెలింగ్ ఇప్పించచ్చు. అదే ఇంకొందరు మారకపోగా.. మితిమీరి ప్రవర్తిస్తుంటారు. ఫలితంగా నష్టపోయేది పెళ్లి చేసుకున్న అమ్మాయే! కాబట్టి నిండు నూరేళ్ల జీవితం గురించి ఇలా తమకు తామే జోస్యం చెప్పుకొని ముందుకెళ్లి ఊబిలో పడే బదులు.. బాగా ఆలోచించి(think before doing) నిర్ణయం తీసుకోవడం మంచిదంటున్నారు నిపుణులు.
కండోమ్స్ తగ్గి పిల్స్ పెరిగాయట!
అప్పుడే పిల్లలు వద్దనుకునే దంపతుల కోసం ప్రస్తుతం ఎన్నో రకాల గర్భనిరోధక పద్ధతులు/సాధనాలు అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ క్రమంలో భార్యాభర్తలిద్దరి బాధ్యత సమంగా ఉన్నప్పటికీ.. చాలామంది మహిళలే ఈ బాధ్యతను తమ భుజాలపై వేసుకుంటున్నారని పలు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. అందుకే గత ఎనిమిదేళ్లలో కండోమ్స్(condoms) ఉపయోగం సుమారు 52 శాతం తగ్గిందని, వాసెక్టమీ (పురుషుల కుటుంబ నియంత్రణ ఆపరేషన్) శాతం 73 కు పడిపోయిందని.. ఒక నివేదికలో వెల్లడైంది. ఇదే సమయంలో గర్భనిరోధక మాత్రలు ఉపయోగించే మహిళల సంఖ్య క్రమంగా పెరుగుతోందని నిపుణులు చెబుతున్నారు. మరికొంతమందైతే వీటిని క్యాండీస్‌లా వాడేస్తున్నారని, దాని ద్వారా హార్మోన్ల అసమతుల్యత, పిరియడ్స్ సమయంలో అధిక బ్లీడింగ్, కొంతమందిలో ఒవేరియన్ సిస్టులు.. వంటి లేనిపోని అనారోగ్యాలు తలెత్తే ప్రమాదం ఉందంటున్నారు. అందుకే వీటిని పేరుకు తగ్గట్లే మరీ అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే, అది కూడా నిపుణుల సలహా మేరకే వాడమని సూచిస్తున్నారు. అలాగే ఈ క్రమంలో మహిళలే పూర్తి బాధ్యత వహించి అనారోగ్యాల బారిన పడడం కంటే.. పురుషులూ నిపుణుల సలహా మేరకు తగిన గర్భనిరోధక పద్ధతుల్ని అనుసరించడం మేలంటున్నారు.
త్యాగానికీ ఓ హద్దుంటుంది!
మహిళలంటేనే త్యాగాని(sacrifice)కి మరో పేరు. తామెంత కష్టంలో ఉన్నా తమ కుటుంబం సంతోషంగా ఉంటే చాలనుకునే తత్వం వారిది. అయితే ఇలా ఇతరుల సంక్షేమం కోరుకోవడంలో తప్పు లేదు.. కానీ ప్రతి విషయంలోనూ ఇతరుల గురించి ఆలోచించి మిమ్మల్ని మీరు మోసం చేసుకోవద్దని చెబుతున్నారు నిపుణులు. ఇలాంటి అలవాటు అప్పటికప్పుడు మీ మనసుకు ఆనందం కలిగించినా.. ఒక్కసారి రియలైజ్ అయ్యి వెనక్కి తిరిగి చూసుకుంటే మాత్రం మీరు సాధించిందేమీ ఉండదు. అంతేకాదు.. మీరు కోల్పోయినవేంటో అర్థం చేసుకొని బాధపడడం తప్ప మరే ప్రయోజనం ఉండదు. కాబట్టి ఇతరుల సంతోషం కోసం మీ లక్ష్యాలను మార్చుకోకుండా ముందుకు సాగడం ఉత్తమం అంటున్నారు నిపుణులు. తద్వారా స్వీయ ప్రేమ పెరిగి.. మనసుకు ప్రశాంతంగా ఉంటుంది. ఇలాంటి సంతృప్తి మరెందులోనూ దొరకదనడంలో సందేహం లేదు.
ఈ సిండ్రోమ్ మీలోనూ ఉందా?!
‘ఈ పని నా వల్ల కాదు.. నాకంత సీన్ లేదు..’, ‘ఐఏఎస్ పరీక్షా?.. నాతో అవుతుందా?’.. ఇలా చాలామంది తమ నైపుణ్యాలు, తమలోని ప్రతిభపై స్వీయ సందేహం వ్యక్తం చేస్తుంటారు. దీన్నే ఇంపోస్టర్ సిండ్రోమ్ (Imposter Syndrome) గా పేర్కొంటున్నారు నిపుణులు. నిజానికి ఒక రకంగా చూస్తే ఇదీ మనల్ని మనం తక్కువ చేసుకున్నట్లే లెక్క! ఇతరులతో పోల్చుకోవడం, ఏదైనా ‘వాళ్లకుంది.. నాకు లేద’న్న అసూయ.. వల్లే చాలామంది తమలోని ప్రతిభను గుర్తించలేకపోతున్నారంటున్నారు నిపుణులు. ఈ ఆలోచనే వారిని అన్నింట్లోనూ వెనకబడేలా చేస్తుందట! అందుకే ఇతరులతో పోలిక లేకుండా.. ఎవరికి వారు తమలోని ప్రతిభను గుర్తించి.. ఓసారి ప్రయత్నించడంలో తప్పు లేదంటున్నారు. నిజంగానే మీలో నైపుణ్యాలుంటే కచ్చితంగా విజయం సాధిస్తారు.. ఒకవేళ ఓడిపోయినా దాన్నుంచి పాఠాలు నేర్చుకొని మరింత ముందుకు సాగే అవకాశం ఉంటుంది. ఇలాంటి వ్యక్తిత్వం మిమ్మల్ని ఎప్పుడూ సానుకూల దృక్పథం వైపే నడిపిస్తుంది.
ఇవన్నీ చదువుతుంటే ఏమనిపిస్తోంది? ఏ విషయంలోనైనా సరే.. ముందు మనకు మనం ప్రాధాన్యమివ్వాలి.. ఆ తర్వాతే ఏదైనా! ఇలా మనల్ని మనం ప్రేమించుకున్నప్పుడే, గౌరవించుకున్నప్పుడే మనలో ఆత్మవిశ్వాసం రెట్టింపవుతుంది. మరి, ఈ విషయంలో మీరేమంటారు?