నాలుగు పదులు దాటిన వయస్సులో సహజంగానే ఆరోగ్య సమస్యలు మొదలవుతాయి. కొందరిలో చర్మం ముడతలు పడటం ప్రారంభమవుతుంది. తింటే ఆయాసం.. తినకపోతే నీరసం.. పడుకుందామంటే నిద్ర పట్టకపోవడం.. ఇలా రకరకాల సమస్యలు చుట్టుముట్టేస్తాయి. మరి నలభైల్లోనూ ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలో తెలుసుకుందామా..!
జుట్టు ఊడుతోందా...!
సహజంగానే చాలామంది పురుషులు, మహిళల్లో నలభై తర్వాత జుట్టు పలచబడటం, ఊడటం మొదలవుతుంది. కాబట్టి మార్పును అంగీకరించాలి.
వ్యాయామం చేయండి...
బాధ్యతలంటూ ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేస్తారు. పోషకాహారాన్ని తీసుకోరు. తగినంత వ్యాయామం చేయరు. దాంతో బరువు పెరుగుతారు. దీనివల్ల మరిన్ని సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి వ్యాయామం మొదలుపెట్టాలి.
విటమిన్లను వీడొద్దు..
విటమిన్ లోపం ఏ వయసులోనైనా రావొచ్చు. నలభైల్లో పడిన తర్వాత విటమిన్ - డి లోపం ఏర్పడితే ఎముక సాంద్రత తగ్గి అది ఆస్టియోపోరోసిస్‌కు దారితీయొచ్చు. అంతేకాదు ఆందోళనా, కాలానుగుణంగా వచ్చే ఇబ్బందులూ ఎదురుకావొచ్చు. అలాగే ఐరన్, రైబోఫ్లావిన్, విటమిన్-బి తక్కువ కాకుండా చూసుకోవాలి.
రాత్రి నిద్రకు ముందు భోజనం వద్దే వద్దు..
పనివేళలు, తీరిక లేకపోవడం, అలవాట్లు... అంటూ కొందరు రాత్రిపూట చాలా ఆలస్యంగా భోజనం చేస్తుంటారు. ఈ సమయంలో శరీరం విశ్రాంతి తీసుకోవాలనుకుంటుంది. అలాంటప్పుడు పిండి పదార్థాలు దండిగా ఉండే ఆహారాన్ని తీసుకుంటే అది అరగడానికి చాలా సమయం పడుతుంది. కొందరిలో అరగదు కూడా. దాంతో బరువు పెరుగుతారు. మరో విషయం.. నలభై దాటిన వారు బరువు తగ్గడం కాస్త కష్టమే.
ఈ వయసులో మానసికంగా వచ్చే ఇబ్బందులను అశ్రద్ధ చేయొద్దు. ఏటా కొన్ని ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం చాలా అవసరం. ముఖ్యంగా మహిళలు రొమ్ముల్లో గడ్డల్లాంటివి ఉన్నాయేమో స్వీయ పరీక్షతోపాటు వైద్యుల సాయమూ తీసుకోవాలి. అలాగే పాప్‌స్మియర్ పరీక్ష కూడా చేయించుకోవాలి.